డైలీ సీరియల్

అనంతం-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇప్పుడిది మోత్తే పెద్దయినాంక పెద్ద మూటలు మొయ్యొచ్చు.’’
‘‘నీ ఇట్టఁవ్’’అన్నది. వాల్యా నెత్తిమీద పెడుతూ చాందినీ.
నీటికొలను దాపుకు వెళ్ళారు.
‘‘నీలు దాగుదాఁవు’’అన్నాడు వాల్యా.
పండ్లుమూట కొలను గట్టున పెట్టి, కొలను నీళ్ళు తాగారు.
అంతలో-
వాతావరణం అంతలోనే మారిపోయింది. ఆకాశం నిండా మబ్బులు క్రమ్మి చిమ్మచీకెట్లు అలముకున్నాయి.
మెరుపులు మెరుస్తున్నాయి.
ఉరుములు ఉరుముతున్నాయి.
నాగుల్లాంటి సన్నటి చినుకులు కురుస్తున్నాయి.
కొలను గట్టుమీది చెట్టుక్రింద నిలబడి కొలనువైపే వాళ్ళు చూస్తూ నిల్చున్నారు.
చినుకులు రాల్తూన్న నీటికొలను చక్కిలిగింతలు పెట్టిన కనె్నపిల్లలా జల్దరించి పోతోంది!
దృశ్యం హృద్యంగా వుంది.
‘నూగుల వాన’ ఆగిపోయింది.
కారుమబ్బులు అదృశ్యమై అక్కడక్కెడా ఆకాశంలో తెలిమబ్బులు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు మసక చీకెట్లు తొలగిపోయి ప్రకృతి చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి!
జల్దరింపు ఆగిన కొలను నీటి అద్దంమీద సూర్యకాంతి పరావర్తనం చెందుతూ జిగేల్మని మెరుస్తోంది.
‘‘ఇంటికి బోదాఁవా’’ చాంద్‌నీ అడిగింది.
‘‘వొద్దు’’.
‘‘ఏంటి కొద్దు’’
‘‘నెమిళ్ళని సూడాలి.’’
‘‘నెమలి గుట్టకి బోవాల్నంటే నడవాలి.’’
‘‘నడుద్దాఁవు’’అన్నాడు వాల్యా.
జాంపండ్లమూట చాంద్‌నీ పట్టుకోబోతే వాల్యా వొద్దన్నాడు. తానే నెత్తిమీద పెట్టుకొని బయల్దేరాడు.
వేగంగా నడుస్తూ నెమలిగుట్ట వైపుకు వెళ్తున్నారు.
ఈలలు వేస్తూ గాలి బలంగా వీచింది!
వానలో తడిచిన మట్టి వాసన హాయిగా వుంది!
కొంత దూరం నడిచారు. నెమలిగుట్ట చేరారు.
‘నూగుల వాన’ కురిసి వాతావరణం హాయి గొలుపుతూంటే పరవశింపుతో నర్తిస్తున్న పురివిప్పిన నెమళ్ళు వందల సంఖ్యలో కనిపించాయి.
ఆత్మచక్షువులకు మాత్రమే కనిపించే ఏదో దివ్యదర్శనం అప్పుడే జరిగినట్టు, ప్రకృతిలో లీనమై దివ్యత్వంతో లయమై-ప్రపంచాన్ని ఖాతరుచెయ్యనంత నిబ్బరంగా నర్తిస్తున్నాయా నెమళ్ళు.
కొంత సమయం గడిచింది.
తనివితీరా నెమళ్ళను చూసిన ఆనందంలోవున్న వాల్యా ఉన్నట్టుండి ‘‘వరి బువ్వ’’అని పెద్దగా అరిచాడు.
చాంద్‌నీ ఉలిక్కిపడింది!
ముక్కుపుటాలు ఎగురవేస్తూ, గట్టిగా గాలి పీల్చివొదుల్తూ-
‘‘యాడ్నో బువ్వొండుతున్నారు... వరిబువ్వ’’అన్నాడు వాల్యా.
చాంద్‌నీ కూడా బలంగా గాలిపీల్చింది. వాల్యా చెప్పినట్టు దూరంగా ఎక్కడ్నించో గాలివాటుకు వస్తున్నది వంటకాల వాసన!
చాంద్‌నీకి వింతగా వుంది!
అడవిలో అన్నాలు వొండుతున్నారంటేనే అడవి పుత్రులకు భయం!
కొండదేవర జాతరప్పుడు, నాయకుల ఎలక్షనప్పుడూ తప్ప సాధారణంగా అది జరిగే పనికాదు. గతంలో రెండుమూడుసార్లు మాత్రం కూంబింగ్ పార్టీ పోలీసులు వచ్చి గుడారాలువేసికొని బసచేశారు.
ఎవ్వరో వేటాడుతూ అడవి జల్లెడ పట్టారు.
అప్పుడు మాత్రం వాళ్ళ గుడారాల్లో అన్నాలు వొండారు.
మళ్ళీ ఏమొచ్చింది?
మనుష్యుల్ని వేటాడే దళాలొచ్చి బసచేశాయా?
చాంద్‌నీ హడావుడిగా ఓ ఎతె్తైన బండరాయి మీదికి ఎక్కి నిల్చుంది. చూపులు సారించి దూరంగా చూసింది!
నల్లకొండ దగ్గర గుడారాలు కనిపించాయి!
నాగరికుల కదలికలున్నాయి. వాహనాలున్నాయి. కాపలా పోలీసులున్నారు. చాలా గుడారాలున్నాయి.
కూంబింగ్ పార్టీ పోలీసులైతే అన్ని గుడారాలుండవు. అంతమంది సాధారణ పౌరులు వెంట ఉండరు.
అవ్వి పోలీసుపార్టీ గుడారాలు కావనుకుంది చాంద్‌నీ.
మరి, అన్ని గుడారాలు ఎందుకు వేసినట్టు?
అంతమంది ఎందుకు విడిచి చేసినట్టు?
సందేహం లేదు!
వంటకాల వాసన వస్తున్నది అక్కడ్నించే!
‘‘ఎవ్వరో పట్నపోళ్ళు బువ్వొండుతుండారు’’అన్నది చాంద్‌నీ పెద్దగా.
‘‘వరి బువ్వగావాలి’’అన్నాడు వాల్యా.
బండరాయి మీదనుంచి క్రిందికి దిగింది. వాల్యా తలమీద ఆప్యాయంగా చేత్తో నిమిరింది.
ఏంచెయ్యాలి?
‘‘వరిబువ్వ గావాల్నంటే గుడారాల కాడికి బోవాలి. వొండుతుంది. ఆడ్నే, వరి బువ్వ’’ అన్నది చాంద్‌నీ.
‘‘ఆడికి బోదాఁవు’’ అన్నాడు వాల్యా.
‘‘పట్నపోళ్ళు మనకి బువ్వెట్టరు.’’
‘‘బతిఁవాల్దాఁవు’’ అన్నాడు దీనంగా చూస్తూ.
చాంద్‌నీకి ఏంచెయ్యాలో తోచలేదు. ఏంచెప్పినా వినే స్థితిలో లేడు వాల్యా.
ఎందుకు వెనుకాడుతున్నదో గ్రహించే వయసు కాదు వాడికి!
అరణ్యంలో వుండే రక్షణ అడవి పుత్రులకు నాగరిక ప్రపంచంలో ఉండదని ఏం చెప్పాలి వాడికి!
పాముకు కోరల్లో మాత్రమే విషముంటే మనిషికి నిలువెల్లా విషమే అని చెప్పినా వాడికి అర్ధవౌతుందా!?
రాగ్యా ఫారెస్టుగార్డు యాదయ్యతో కలిసి గుడారాల వైపుకు వెళ్ళటం చూసింది. పట్నం వాళ్ళతో రాగ్యాకి సంబంధాలున్నాయి. రాగ్యా తనకోసం మాటువేసిన పులిలా కాచుకొని ఉన్నాడు.
అలాంటప్పుడు గుడారాల దగ్గరికి వెళ్ళటం ఎంత ప్రమాదం!
వాల్యా చాంద్‌నీ చేతిమీద గిల్లుతున్నాడు గోళ్ళతో!
వాడి భావం అర్ధమై జాలిగా చూసింది.
సరిగ్గా అప్పుడే దాపులో ఏదో అలికిడి! ‘్ఠ’క్కున తలెత్తిచూసింది చాంద్‌నీ..
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు