డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా కుమారుడు పురుషుడే. కావాలంటే పరీక్షించుకోండి. ఎవరో అసత్యం చెప్పారు’’. అది విని అందరూ రాజుకు వివరించి చెప్పారు. శిఖండి పురుషుడని చెప్పారు. రాజు కూడా అల్లుడిని పరీక్షించి సంతృప్తి చెందాడు. ఆనందంలో అక్కడే ఉండిపోయాడు. తప్పుడు మాటలు చెప్పినందుకు కూతురును తిట్టి తన నగరానికి వెళ్ళిపోయాడు. శిఖండి కూడా అంతా సవ్యంగా జరిగినందుకు సంతోషించింది.
ఇలా జరిగిన కొంతకాలానికి కుబేరుడు స్థూణాకర్ణుని ఇంటికి వచ్చాడు. అతను యక్షుని భవనంలోకి ప్రవేశిస్తూ ఆ భవన అలంకరణ చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నేను వచ్చానని తెలిసి కూడా ఇతను ఎందుకు బయటకు రావడం లేదు?’’ అని అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న యక్షులు అతనితో ఇలా వివరించారు. ‘‘రాజా! ద్రుపదరాజుకు శిఖండి అనే కూతురు ఉంది. ఒక కారణంచేత ఇతను తన పుంసత్వాన్ని ఆమెకు ఇచ్చి ఆమె స్ర్తీత్వాన్ని తాను గ్రహించాడు. అందుకని ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు ఏది న్యాయమో అది చేయండి’’.
అప్పుడు స్థూణుని పిలిపించి శిక్షిస్తానని అన్నాడు. స్థూణుడు అతని దగ్గరకు వచ్చి నిలబడగా కుబేరుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘నీకు స్ర్తీత్వం శాశ్వతంగా ఉండుగాక’’. ఇంకా ఇలా అన్నాడు ‘‘శిఖండికి పురుషత్వం ఇచ్చి తప్పు చేశావు. ఈ కారణంగా ఇది మొదలు నీవు స్ర్తీగా ఉంటావు.’’
అప్పుడు యక్షులందరూ అతని పక్షాన కుబేరుని ప్రార్థించారు. కుబేరుడు స్థూణునికి శిఖండి చనిపోయిన తర్వాత తన పూర్వరూపం వస్తుందని చెప్పాడు. స్థూణుడు స్ర్తిరూపంలో అక్కడ నివసించాడు. గడువు సమాప్తమయ్యేసరికి శిఖండి యక్షుని దగ్గరకు వచ్చాడు. రాజపుత్రుడు నిజాయితీతో రావడం చూసి యక్షుడు సంతోషించాడు. అతను శిఖండితో ఇలా అన్నాడు. ‘‘రాకుమారా! నీ గురించి నేను కుబేరుని చేత శాపాన్ని పొందాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళు. ఇది నా పురాకృత ప్రారబ్ధం అనుకుంటాను. నీవు ఇక్కడి నుంచి వెళ్ళగానే కుబేరుడు ఇక్కడికి రావడం విధి విలాసం’’.
స్ణూణయక్షుడు ఇలా చెప్పగానే శిఖండి ఆనందంతో రాజభవనానికి తిరిగి వచ్చాడు.
శిఖండి విషయం తెలిసిన ద్రుపదుడు దేవతలను, వృక్షాలను పూజించాడు. ఉత్సవాలు జరిపించాడు. శిఖండిని ధనుర్విద్య కోసం ద్రోణుని దగ్గరకు పంపాడు. అతను దృష్టద్యుమ్నుడితో పాటు ద్రోణుడి దగ్గర విద్యనభ్యసించాడు.ఈ విధంగా శిఖండి స్ర్తీగా పుట్టి పురుషుడయ్యాడు. అతను యుద్ధంలో భీష్ముని వధించాలని ఎదురుచూస్తున్నాడు. కౌరవ పాండవ యుద్ధం ఆరంభమయింది. భీష్ముడు విజృంభించి పాండవసేనను నాశనం చేస్తున్నాడు. పాండవులకు అతన్ని ఎలా వధించాలో తెలియటం లేదు. చివరకు కృష్ణుని సలహాతో పాండవులు రాత్రి సమయంలో భీష్ముని దర్శించి భీష్మునితో ధర్మరాజు ఇలా అడి గాడు. ‘‘తాతా! యుద్ధం లో కోపిం చిన దండధారి వంటి నిన్ను జయించడం ఎలా? తగిన ఉపాయం చెప్పు. నిన్ను దేవతలు కూడా జయించలేరు’’.
అప్పుడు భీష్ముడు వారితో ఇలా అన్నాడు. ‘‘నాయనా యుధిష్ఠిరా! నీవు చెప్పింది నిజం. నన్ను దేవదానవులు జయించలేరు.
కాని నేను ఆయుధాలు క్రిందపడవేసిన వానిని, క్రిందపడిన వానిని, కవచరహితుని, భయపడి యుద్ధ్భూమి నుండి పారిపోయేవాడిని, ఏకపుత్రుడయినవానిని, స్ర్తిని, విధవలయిన వారిని, అమంగళచిహ్నం గల పురుషుని చూసి కూడా యుద్ధం చేయను. ఇది నేను తీసుకున్న నిర్ణయం. మీ సైన్యంలో ద్రుపదపుత్రుడు శిఖండి మహారథుడు. కాని అతను మొదట బాలికగా ఉండి తర్వాత పురుషత్వం పొందాడు. ప్రత్యేకించి అలాంటివారిపై బాణాలు వేయను. ఇది అవకాశంగా తీసుకొని ధనుంజయుడు నన్ను పడగొట్టాలి. కృష్ణుడు, అర్జునుడు తప్ప నన్ను ఎవరూ పడగొట్టలేరు’’.
పాండవులు అతని వద్ద శలవు తీసుకొని తమ శిబిరాలకు వచ్చి మర్నాడు అర్జునుని రథంలో శిఖండిని పెట్టుకొని యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు.
ఆ మరునాడు భీష్ముడు యుద్ధ్భూమికి రాగా అక్కడ శిఖండిని ముందుంచుకొని అనేక రకాలైన బాణాలను ప్రయోగిస్తున్న అర్జునుని చూచాడు. భీష్ముడు వారితో కాక తక్కినవారితో భీకర సమరం చేశాడు. శిఖండి అతని పై బాణవర్షం కురిపించాడు. కాని భీష్ముడు అతనిపై ఏ బాణం వేయలేదు. అప్పుడు శిఖండి ఇలా అన్నాడు - ‘‘్భష్మా! నీవు నాకు బాగా తెలుసు. నీవు పరశు రామునితో యుద్ధం చేశావని తెలుసు. నేను నిన్ను సంహరిస్తాను’’ ఇలా అంటూ అతను భీష్ముణిపై బాణవర్షం కురిపించాడు. ఇదే తగినసమయమని అర్జునుడు అతనితోపాటు భీష్మునితో యుద్ధం చేయసాగాడు. భీష్ముడు కోపంతో లక్షమంది సైనికులను వధించాడు. అప్పుడు అర్జునుడు శిఖండిని భీష్మునిపైకి పొమ్మన్నాడు. శిఖండి అతను చెప్పినట్లుగా గాంగేయునిపైకి పోయాడు.
అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముని మీదకు వెళ్ళాడు. భీష్ముడు అశుభ ధ్వజం గల శిఖండిపై బాణం వెయ్యలేదు. అర్జునుడు విజృంభించి భీష్ముని తీవ్రంగా గాయపరిచాడు. కానీ భీష్ముడు శిఖండివైపు చూడనుకూడా లేదు. భీష్ముడు చేతపట్టిన ప్రతీ ధనుస్సును అర్జునుడు విరిచాడు. అర్జునుడు వేసిన బాణాలకి భీష్ముడు రథం మీద నించి నేలకూలాడు. అది చూసిన దేవతలు తత్తరపాటు చెందారు. శిఖండి పదునైన బాణాలతో భీష్ముని వక్షఃస్థలంపై కొట్టాడు. తర్వాత అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్మునికి ఎదురుగా వెళ్ళి అతన్ని మళ్ళీ గాయపరిచాడు. భీష్ముడు శరీరమంతా బాణాలు దిగబడి నేలకూలాడు. కాని బాణాల కారణంగా అతను నేలను తాకలేదు. అతను శరశయ్య మీద పడి, ఆ సమయం దక్షిణాయనం కనుక పవిత్రమైన ఉత్తరాయణం కోసం నిరీక్షించాడు.
ఈ విధంగా అంబ తీవ్ర తపస్సుతో రెండు జన్మలెత్తి భీష్ముని మరణానికి కారణమై తన పగ సాధించుకుంది!
ఇంకావుంది...