డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కాలమహిమ వల్లనే వరదల్లో వస్తువులు నదిలో కొట్టుకొని పోయినట్లుగా కాలప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. నా రాజ్యం కూడా అలాగే పోయింది. ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాను. కనుక దొరికిన దానితోనే జీవిస్తాను’’.
రాజు చెప్పినది విని ముని ఇలా అన్నాడు ‘‘యదార్థం జ్ఞానం యందు స్థిరత్వం కలిగితే జరిగిపోయిన దాని గురించి కాని, జరుగబోయే దానిగురించి కాని విచారించనక్కరలేదు. కనుక నీవు పొందదగిన వస్తువులను పొందు. పొందలేని వాటి గురించి దుఃఖించకు. దైవకృప వలన దొరికిన రాజ్యాన్ని పొంది ఎలా ఉన్నావో, రాజ్యం పోయినప్పుడు కూడా అలాగే ఉండు. అప్పుడు నిర్భాగ్యం వలన దైవాన్ని నిందించకూడదు. నీ దగ్గర ధనం లేకున్నా ఇతరుల దగ్గర ఉన్న ధనాన్ని చూసి ఈర్ష్యపడకు. ఎందుకంటే సంపద ఏ రూపంలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. ధర్మపరులు యోగధర్మవర్తనులు కూడా పుత్రులు పౌత్రులను, సంపదను విడిచిపెట్టిపోతున్నారు. ఎంతో శ్రమపడితే లభించే ఈ ధనం చాలా చంచలమైనది. నీవు ప్రాజ్ఞుడవు అయినప్పటికీ కోరకూడనివి కోరుతూ అస్థిరమైనవాటి కోసం తపిస్తున్నావు. కాని అర్థాలన్నీ అనర్థాలే కనుక నీవే వాటిని పరిత్యజించు’’.
ధనం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్న ఎవరూ ధనాన్ని కోరుకోరు. పుణ్యాత్ముల వంశంలో పుట్టిన వారు అందుకే పరలోక సుఖాలను కోరుకొని దానికోసం ఇహలోక వ్యవహారాలలో విరక్తులుగా ఉంటారు. ధనాన్ని పురుషుడు విడిచిపెట్టకపోతే ఆ ధనమే అతన్ని విడిచిపెడ్తుంది. నీలాగే ఇతరులు నీ మిత్రులనూ, ధనాన్నీ పోగొట్టుకుంటారు. వారి కష్టం కూడా నీకష్టం లాంటిదే. కనుక మనస్సును నియంత్రించు. బ్రహ్మచర్యాన్ని పాటించు. సర్వభూతాల యందు దయకలిగి ఉండు.
ఓ రాజా! నీకు ప్రస్తుతం రాజ్యం లేదు. మంత్రులు లేరు. నీకుప్రస్తుతం దైవం అనుకూలంగా లేదు. నీలో ఏమాత్రమైనా పౌరుషముంటే నేను చెప్పే నీతిని గుర్తుంచుకో. నేను చెప్పినట్లు చేస్తే నీవు మరల రాజ్యాన్ని, సంపదను పొందగలవు. నీకు ఇష్టమైతే చెప్తాను’’.
ముని చెప్పిన మాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న రాజు ఇలా అన్నాడు. ‘‘మహాత్మా! తమరు ఉపదేశించండి. నేను తప్పక ఆచరిస్తాను’’.
అపుడు ముని ఇలా చెప్పాడు ‘‘గర్వాన్ని, హర్ష భయాలను, క్రోధాన్ని విడిచిపెట్టి శత్రువును కూడా సేవించు. విదేహరాజు సత్యప్రతిజ్ఞుడు. మంచి కర్మల ద్వారా అతనికి విశ్వాసం కలిగించు. అతను నీకు ధన సహాయం చేస్తాడు. అప్పుడు నీవు అందరికీ విశ్వాసపాత్రుడివి, రాజుకి కుడిభుజానివి అవుతావు. అప్పుడు నీకు మంచి గుణములున్న ఉత్సాహవంతుల సహాయం లభిస్తుంది. శాస్త్రప్రకారం నడుచుకొనేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు తన్ను తాను ఉద్ధరించుకుంటాడు. ప్రజలను ఉద్ధరిస్తాడు. ధైర్యవంతుడు, సంపన్నుడు అయిన జనకమహారాజు తప్పక నిన్ను ఆదుకుంటాడు. తర్వాత నీవు మిత్రుల సైన్యాన్ని సమకూర్చుకొని, మంచి మిత్రులతో చేరి మంత్రాంగం చేసి, ఆంతరంగికుల ద్వారా శత్రువులలో విభేదాలను సృష్టించి శత్రువుల సహాయంతోనే శత్రువులను నాశనం చేయించు.
ప్రాజ్ఞుల విశ్వాసాన్ని పొంది శత్రువుల రాజ్యం లేకుండా హాయిగా ఉండు. కాని నిరంతరం జాగరూకుడవై విదేహరాజు పట్ల మిత్రధర్మాన్ని నిర్వర్తించు. బలవంతులైనవారితో శత్రువులకు విరోధం కలిగించు. శయనాలు, భోగాలు మొదలైన సుఖాలతో శత్రువు యొక్క కోశాగారం నిండుకొనేలా చేయి. ఉత్తమ వేదపండితుల గురించి విదేహరాజు దగ్గర ప్రశంసించి అతని చేత వారికి యజ్ఞదానాలు ఇప్పించు. వారు నీకు ఉపకారం చేస్తారు. విదేహరాజుని వారు పీక్కుతింటారు. ఆ పుణ్యశీలి పరమగతిని పొందుతాడు. ఏ కార్యం అందైనా మునిగి పోయిన రాజుయొక్క కోశాగారం వట్టిపోతుంది. రాజ్యం శత్రువుల వశవౌతుంది. పంటలు మొదలైనవి నాశనం చేయించాలి. అది దైవ ఘటనగా రాజు వద్ద చెప్పాలి. అతనిచేత విశ్వజిత్ యాగం చేయిస్తే అతను నిర్ధనుడు అవుతాడు. దానితో నీ పని సిద్ధిస్తుంది. యోగధర్మాలు తెలసినవారి గురించి ఆ శతృరాజు దగ్గర ప్రశంసించు. దానితో అతనికి రాజ్యాన్ని త్యజించాలనే కోరిక కలుగుతుంది. అలా కలగక పోతే నీ మనుష్యుల ద్వారా సిద్ధౌషధ ప్రయోగం ద్వారా అతని ఏనుగులను, గుర్రాలను, మనుషులను చంపించు. ఇలాంటి పనుల వల్ల శత్రువు బలహీనుడౌతాడు. రాజ్యం నీ చేతికి వస్తుంది’’.
ముని మాటలు విన్న రాజు ఇలా అన్నాడు. ‘‘బ్రహ్మజ్ఞుడా! నేను మోసంతో కాని, దంభంతో కాని జీవించాలని అనుకోవడం లేదు. అలాగే అధర్మ మార్గంలో సంపాదించే సంపాదన కూడా నాకు అక్కరలేదు. నేను ధర్మాన్ని ఆశ్రయించి బ్రతకాలని కోరుకుంటున్నాను. కనుక ఈ పని చేయలేను. ఇలాంటి సలహా ఇవ్వడం మీకూ తగదు’’.
అతని మాటలు విన్న మహర్షి ఇలా జవాబు చెప్పాడు. ‘‘రాజా! నీ గుణాలు, నీ మాటలకు అనుగుణంగానే ఉన్నాయి. నీకూ, విదేహరాజుకీ ప్రయోజనం కలిగేలా ప్రయత్నిస్తాను. నీవు ఉత్తమ కులంలో జన్మించావు. సకల శాస్త్రాలు చదివావు. నిన్ను ఎవరు ఆమాత్యునిగా నియమించరు? విదేహరాజు నా ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు అతనిని ఆజ్ఞాపిస్తాను. అతను తప్పక చేస్తాడు’’.
తర్వాత ముని విదేహ రాజుని పిలిపించి క్షేమదర్శిని చూపించి ఇలా అన్నాడు. ‘‘ఇతను రాజవంశంలో పుట్టినవాడు. ఇతని గురించి నాకు అంతా తెలుసు. నీవు నన్ను ఎలా నమ్ముతావో అదేవిధంగా ఇతన్నీ నమ్మవచ్చు. ఇతన్ని అమాత్యుని చేసికో. ఇతనికి పరాక్రమం, బుద్ధికుశలత రెండూ ఉన్నాయి. రాజ్యప్రయోజనం కోసం ఇవి చాలా ముఖ్యం.
ధర్మాత్ముతలైన రాజులకు ఇటువంటి అమాత్యులు చాలా అవసరం. తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని పొందాలన్న కోరికతో అతను నీతో యుద్ధం చేసినా అది క్షత్రియ ధర్మమే అవుతుంది. నీకు కూడా జయించాలనే కోర్కెతో యుద్ధం చేస్తావు. కనుక నా ఆదేశాన్ని పాటించి యుద్ధం చేయకుండానే అతన్ని వశపర్చుకో. లోభాన్ని వదలి ధర్మాన్ని ఆచరించు. అందరికీ ఎప్పుడూ విజయమే లభించదు. ఒక్కోసారి అపజయం కూడా కలుగుతుంది. శత్రువుల సంపదను ఇన్న రోజులు నీవు అనుభవించినట్లుగా నీ సంపదను వారు కూడా అనుభవించాలి. ఇతరుల సంపదలను నిర్మూలిస్తే దాని వలన పాపం కలుగుతుంది’’.
మహర్షి మాటలు విన్న విదేహరాజు అతని ఆదేశాన్ని పాటించి ఇలా అన్నాడు. ‘‘మహర్షీ! మీరు ప్రాజ్ఞులు, తాపసులు, మహాపండితులు, మా శ్రేయోభిలాషులు. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. అదే నాకు పరమశ్రేయస్సు. ఇక నేను ఏమీ ఆలోచించను’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి