డైలీ సీరియల్

అనంతం-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది సాధించాలంటే గురుడాచలంతో కలిసి వుండాలి. తండావాళ్ళతో సంబంధాలు త్రెంచుకోవాలి. తండాలో గడుపుతున్న నిరుపేద నికృష్ట జీవితం నుంచి బైటపడి పట్నం వెళ్లిపోవాలి.
నోరూ వారుూ లేని పక్షులకూ జంతువులకూ ఆశ్రయం కల్పిస్తున్నవాడు తననెంతగా ఆదరిస్తాడో! తన పట్ల అతనికి చాలా ప్రేమ వుంది. అభిమానం వుంది!
ఆశించినట్టే గొప్ప జీవితం చేతికంది, చాంద్‌నీ తనదైతే ఎంత బాగుంటుంది. స్వర్గంలో జీవిస్తూ అమర సుఖాలు పొందుతూ..
కొత్త శక్తి పుంజుకున్నట్టుంది!
రాగ్యా యింకా వేగంగా పరిగెత్తుతున్నాడు..
ముళ్ళూ కోసురాళ్ళూ నాగజెముడు మట్టలు తగిలి వొళ్ళంతా చీరుకొనిపోతున్నది. దాహం వేస్తున్నది. ఐనా పట్టించుకోవటం లేదు రాగ్యా.
త్వరగా గుడారాలకు వెళ్లాలి. గరుడాచలంతో జరిగిందంతా చెప్పాలి. తన బాధ్యతనంతా అతనిమీద పెట్టాలి.
పొదలు గుట్టలు దాటాడు. కొంచెం దూరంలో వున్న నీటికొలన్ను చూశాడు.
దాహం గుర్తొచ్చింది.
గబగబా కొలను దగ్గరికివెళ్లాడు. దోసిళ్ళతో వొళ్ళంతా నీళ్ళు చల్లుకున్నాడు. కడుపునిండా కొలను నీళ్ళు తాగాడు.
నీటి అద్దం మీద చాంద్‌నీ..
‘‘అడవి నాకేటిచ్చిందా? కొలను నీలిచ్చింది’’ అంటున్నట్టే వుందా చిత్రం!
చేతులు చాపాడు. చాంద్‌నీ చిత్రం చేతికి అందలేదు.
నీళ్ళన్నీ చిందర వందర చేశాడు.
చాంద్‌నీ చెరిగిపోయింది!
విషాదం, కోపం కలగలిసిన ఓ నవ్వు నవ్వాడు. మళ్లీ అక్కడ్నించి బయల్దేరాడు రాగ్యా.
ఒకే పరుగు..
చిన్నపాటి మైదానం దాటాడు. ఓ మలుపు తిరిగి ముందుకు సాగాడు. దట్టంగావున్న పొదలు దాటి నెమలిగుట్ట చేరుకున్నాడు. అలుపు తీర్చుకొంటూ కొంచెం సేపు ఆగాడు!
అల్లంత దూరంలో మైమరిచి నర్తిస్తున్న నెమళ్ళ గుంపుకనిపించింది!
ఎంత స్వేచ్ఛగా ఆనందంతో పరవశిస్తూ అవి నృత్యాలు చేస్తున్నాయో!
రాగ్యామొహం అసూయతో చిటపట్లాడింది!
అదే స్వేచ్ఛ మనుషులకెందుకు లేదు?
ఉంటే తనూ చాంద్‌నీతో జతకలిసి ఆడేవాడు, పాడేవాడు, నృత్యాలు చేసేవాడు.
ప్రపంచాన్ని ఖాతరు చెయ్యకుండా ఆమెతో పెనవేసుకొని పోయేవాడు!
చాంద్‌నీ భయం, తండావాళ్ళ భయం, కట్టుబాట్ల భయం, చెట్టుక్రింద జరిగే పంచాయితీ భయం..
బ్రతుకంతా భయమైతే ఇక స్వేచ్ఛ ఎక్కడున్నట్టు?
ఏదో ఆలోచన తట్టింది!
గురుడాచలం నెమలి మాంసం అంటే చెవి కోసుకుంటాడు! ఫారిన్ విస్కీ చప్పరిస్తూ, నెమలి మాంసం ముక్కలు తింటూ మైమరచిపోతాడు.. వాటికోసం జాతీయ పక్షుల్ని చంపటమే కాదు, యావద్భారత జాతినే అమ్మేసినా అదేమని అనడు!
నెమళ్ళవైపు అదోలా చూశాడు రాగ్యా!
నాకు లేని స్వేచ్ఛ మీకుంటే ఎలా సహిస్తాను? ఇంకెంతసేపులే మీ స్వేచ్ఛ అనుకొంటూ వాటి దగ్గరికి వెళ్లాడు.
నెమళ్లు రాగ్యాని గమనించలేదు.
అడవి పుత్రుడు కనుక అతన్నించి ప్రమాదం శంకించలేదేమో! అవ్వి రాగ్యాని ఖాతరు చెయ్యలేదు. పరవశంతో నర్తిస్తూనే వున్నాయి.
అవ్వి తనను ఖాతరు చెయ్యనందుకు మరింత కోపం వచ్చింది.
రాగ్యా ముందుకు వంగి నేలమీద నుంచి రాళ్ళు అందుకున్నాడు. గురిచూసి బలంగా నెమళ్ళమీదకి విసిరేశాడు.
‘కీచు’మని అరుస్తూ రెండు నెమళ్ళు నేలకొరిగాయి. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వొదిలాయి.
మిగిలిన నెమళ్ళన్నీ భయంతో పరుగులు పెడుతూంటే పగలబడి నవ్వాడు రాగ్యా!
చచ్చిపడున్న నెమళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
చెట్టుతీగతో రెండు నెమళ్ళనూ కలిపి కట్టి, భుజానికి తగిలించుకొని, గుడారాల వైపునకు నడవసాగాడు..
భయంతో పారిపోయిన నెమళ్ళు దూరంగా నిలబడి రాగ్యా వెళ్తోంటే జాలిగా చూస్తున్నాయి.
***
అప్పుడే చీకట్లు ముసుర్తున్నాయి.
లోతట్టు అడవిలోనుంచి క్రూరమృగాల గర్జనలు భీకరంగా వినిపిస్తున్నాయి. వేటకోసం వాటి సంచారం మొదలయ్యింది!
గుడారాల దగ్గర భారీ జనరేటర్ దడ దడా శబ్దిస్తూ విద్యుత్ సరఫరా చేస్తున్నది.
గుడారాల్లో దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. వాటి కాంతి పరిసరాల్లో వ్యాపిస్తూ పట్టపగల్లా వుంది!
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి ఇంకా గుడారానికి చేర్లేదు. కలెక్టర్‌తో మాట్లాడాలని పొద్దునే్న పట్నం వెళ్ళాడు. ఇంకా రాలేదు.
అధికారులతో గుడారంలో కొలుపు తీరి కూర్చున్నాడు గరుడాచలం. రెవిన్యూ వాళ్ళు, పోలీసువాళ్ళు, ఫారెస్టు అధికారులు అక్కడ చేరారు. గుడారం చాలా సందడిగా వుంది.
కాల్చేసిన సిగరెట్టు పీకలు, సోడా సీసాలమూతలు చెల్లాచెదురుగా గుడారంలో పడి వున్నాయి.
అల్లుకున్న సిగరెట్టు పొగలు, మాంసం తినగా మిగిలిన ఎముకలూ.. గుడారం మదపు కంపు కొడుతున్నది. అడవి జంతువులు వేటకు బయలువెళ్ళే వేళయ్యింది.
నరవాసన పసిగట్టి, అవి గుడారాలమీద దాడి చేస్తే ఎంత ప్రమాదం!
విద్యుద్దీప కాంతిలోనే పరిసరాలను సూదికళ్ళతో గమనిస్తూ సాయుధ పోలీసులు అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు!
అప్పటికి ఎన్ని రౌండ్లయ్యాయో! ఇంకా తాగుతూ, తింటూ వాళ్ళంతా సరదాగా మాటల్లో పడ్డారు!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు