డైలీ సీరియల్

అనంతం-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రోగ్రెస్ ఎలా వుంది’’ మత్తు కళ్ళతో గరుడాచలాన్ని చూస్తూ ఎవ్వరో అధికారి అడిగాడు.
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’’ అన్నాడు గరుడాచలం.
‘‘నేనడిగింది కలివికోడి ప్రాజెక్టు విషయం’’
‘‘అదా! ప్రగతి ధపంలో ముందుకు పోతోంది’’
‘‘ప్రగతిపథం’’ అనుకుంటానూ?’’
అందరూ గలగలా నవ్వారు. నవ్వులు కూడా మత్తుగా ఉన్నాయి.
‘‘ఆపరేషన్ విషయం అలా వుంచి-నెమళ్ళకొచ్చాయి తిప్పలు’’
‘‘ఏం? ఏమైంది? గరుడాచలం అడిగాడు.
‘‘పొయ్యిలోకి పోతున్నాయి’’
‘‘బాధగా వుందా’’
‘‘నాకెందుకు బాధ’’
‘‘మరెందుకలా అన్నావు?’’
‘‘జాతి అంతరించిపోతుందని’’
‘‘జీవకారుణ్యమా’’ పోలీసు అధికారిని గరుడాచలం అడిగాడు.
‘‘మరోసారి వస్తే దొరకవన్న భయం’’
మళ్లీ అందరూ పగలబడి నవ్వారు.
మరో రౌండు తర్వాత-
‘‘తండా ఖాళీ చెయ్యమని నోటీసులివ్వాలా?’’ అన్నాడు గరుడాచలం.
‘‘నోటీసులా! ఎందుకూ?’’ అడిగాడు పోలీసు అధికారి.
‘‘నోటీసులివ్వకుండానే ఖాళీ చేయిస్తారా’’
‘‘అంతే’’
‘‘చట్టం అనుమతించదు’’
‘‘ప్రభుత్వం అనుమతిస్తే చాలు’’
‘‘అన్యాయం’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఇప్పటి న్యాయం అదే’’
‘‘గవర్నమెంట్ ఫర్ ది పీపుల్- అన్నారు కదా.’’
‘‘వల్లకాడు కాదూ.’’
‘‘ఏఁవంటారేం?’’
‘‘గవర్నమెంట్ ఫర్ ది గవర్నమెంట్- టు ది గవర్నమెంట్- బై ది గవర్నమెంట్’’
‘‘మనది ప్రజాస్వామ్యం కదూ?’’
‘‘అనుకోండి... ఎవరొద్దన్నారూ.’’
‘‘అడివి పుత్రులు ఎదురుతిరిగితే?’’
‘‘లాఠీలున్నాయి. తుపాకులున్నాయి.’’
‘‘బలవంతంగా ఖాళీ చేయిస్తారా.’’
‘‘అవును.’’
‘‘అడవి పుత్రుల రక్షణక్కూడా చట్టాలున్నాయి.’’
‘‘తయారుచేసింది ప్రభుత్వమే.’’
‘‘ఐతే?’’
‘‘ఉల్లంఘించే అధికారమూ ఉంటుంది.’’
అంతలో రాగ్యా లోపలికొచ్చాడు.
మాటలు కనిపెట్టి వాళ్ళు వౌనంగా కూర్చున్నారు.
‘‘రొండు నెమళ్ళని సంపి తెచ్చారు. పొయ్యి కాడ బెట్టి వత్తన్నారు.’’అని, గరుడాచలం వైపు గర్వంగా చూసాడు రాగ్యా.
‘‘రాగ్యా అంటే ఇతనే’’ గరుడాచలం అతన్ని అధికారులకు పరిచయం చేసాడు.
రాగ్యా ఛాతీ ఉబ్బింది!
‘‘నిలబట్టం దేనికీ! కూర్చో రాగ్యా’’అని కుర్చీ చూపించాడు గరుడాచలం.
కొంచెం తటపటాయించి, తర్వాత కూర్చున్నాడు.
రాగ్యాకి కూడా మందు గ్లాసు అందింది.
వాళ్ళ అభిమానానికి పొంగిపోతూ-
‘‘ఇంక నాకు అయ్యయినా, అడివైనా గరుడాచలఁవ్ సారే.’’ అన్నాడు వినయంగా రాగ్యా.
గుంభనంగా నవ్వుకున్నారు వాళ్ళంతా!
* * *
రాత్రి బాగా ప్రొద్దుపోయాక వచ్చాడు ఎమ్మెల్లే... పట్నంలోనే భోజనం గట్రా. అన్నీ అయ్యాయి. గుడారానికొచ్చి, ఓ గ్లాసు మజ్జిగ తాగి అలాగే పడుకున్నాడు.
బాగా మత్తులోవున్న స్థితిలోకూడా గరుడాచలం నిద్రపోకుండా ఎమ్మెల్లేకోసం ఎదురుచూసాడు.
రాగ్యా విషయం, చాంద్‌నీ విషయం మాట్లాడి ప్రాజెక్టు విషయంకూడా చర్చించాలనుకున్నాడు.
ప్రొద్దుపోయాక వచ్చాడు ఎమ్మెల్లే.
అలాంటి సమయంలో మాట్లాడటం మంచిదికాదని భావించి మాట్లాడలేదు.
తెల్లవారింది.
అడవి చెట్లమీద నుంచి పక్షుల కలకలా రావాలు, విప్పారే రెక్కల చప్పుళ్ళూ, గూటి పిట్టల కువకువలూ వినిపిస్తున్నాయి.
సూర్యుడు పైకి పాకేకొద్దీ చెట్ల నీడలు పొడవుగా సాగుతూ గుడారాల మీద పడుతున్నాయి.
ఇంకా ఎమ్మెల్లే నిద్రలేవలేదు.
రాగ్యా కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి తయారయ్యాడు!
గరుడాచలం ఇచ్చిన పాత చొక్కా లాగూ ధరించి, తలగుడ్డ అవతల పారేసి తల దువుకొని- రాగ్యా ఇప్పుడు ఎంతగా మారిపోయి కనిపిస్తున్నాడో!
అచ్చం కొత్తగా రియలెస్టేట్ వ్యాపారంలో దిగిన వాడిలా వున్నాడు!
రాగ్యాని చూసి ఫక్కున నవ్వాడు గరుడాచలం.
‘‘ఏంటికట్టా నగుతుండారూ’’ రాగ్యా అతన్ని అడిగాడు.
‘‘్భషకూడా మారిపోతే నాగరికుడి నౌతావు! రెడ్డియానాయక్ తండా రాగ్యా ఇతనే’ అన్నా ఎవ్వరూ నమ్మరు. ఈ డ్రెస్‌లో అంత బాగున్నావు’’ అన్నాడు గరుడాచలం.
రాగ్యా ఆనందం పట్టలేకపోయాడు.
‘‘అంతా తఁవరి దయ’’అన్నాడు వినయంగా.
ఎమ్మెల్లే నిద్రలేచాడని కబురొచ్చింది.
రాగ్యాని అక్కడే వుండమని చెప్పి ఎమ్మెల్లే దగ్గరికి వెళ్ళాడు గరుడాచలం.
ఎందుకోగానీ ఎమ్మెల్లే చాలా హడావుడి చేస్తున్నాడు!
‘‘ఏమిటి కథ?’’ గరుడాచలం అడిగాడు.
‘‘కథ విషయం తర్వాతగానీ ముందు నీ విషయం చెప్పు.’’
‘‘నా విషయమా?’’ ఆశ్చర్యపోయాడు గరుడాచలం.
‘‘అదే! కోడి ప్రాజెక్టు విషయం...’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు