డైలీ సీరియల్

అనంతం-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తొందరేమొచ్చింది’’
‘‘వచ్చింది’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘రాగ్యా ఇక నాతోనే వుంటాడు. అడవికి కలిసి వెళ్తాం. కోడి జాడలకోసం అనే్వషించి, సమగ్రమైన రిపోర్టు తయారుచేస్తాను.’’
‘‘ఏ ఏ బౌండరీల్లో రక్షిత ప్రాంతం నిర్మించాలో బాగా ఆలోచించి నిర్ణయించండి’’అని, అదోలా నవ్వాడు ఎమ్మెల్లే.
అతని భావం గరుడాచలానికి అర్ధమైంది!
‘‘స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి! నాకెటూ కలివికోడి మీద పరిశోధన చెయ్యాల్సిన అవసరం వుంది. దాని పేరుతో అడివిని ఆక్రమించే అవసరం మీకుంది.’’
‘‘ముఖ్యమంత్రిగారు ఫోన్‌చేసారు’’ చెప్పాడు ఎమ్మెల్లే.
‘‘ఏమిటట?’’
‘‘త్వరగా అడవి భూములు కావాలని బహుళజాతి కంపెనీలవాళ్ళు వత్తిడి తెస్తున్నారుట.’’
‘‘మరో విషయం’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఏమిటది?’’ ఎమ్మెల్లే అడిగాడు.
‘‘చాంద్‌దీ విషయం ఏం చేద్దాం? ఎప్పుడు చేద్దాం?’’
‘‘పథకం తయారైంది’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘కొద్దిరోజుల్లో కొండదేవర జాతర జరగబోతున్నది.’’
‘‘తెలుసు.’’
‘‘ఈలోగా దాన్ని జోగ్గిన్నిచేస్తే?’’
‘‘కుదరదు! జాతరప్పుడే అవకాశం వుంటుంది. తొందరపడితే బెడిసి కొడుతుంది.’’
‘‘పథకం ఏమిటి’’ గరుడాచలం అడిగాడు.
‘‘ముందుగా మన ఒప్పందం గుర్తుందా చెప్పు.’’
‘‘చాలా జరిగాయి... ఏ ఒప్పందం.’’
‘‘జోగిన్ని చేసే బాధ్యత నాది- రాగ్యాని ఒప్పించే బాధ్యత నీది అన్నాను కదా.’’
‘‘గుర్తుంది.’’
‘‘రాగ్యాతో మాట్లాడావా.’’
‘‘మాట్లాడను! చెప్పింది చేసే మరబొమ్మలా వాడ్ని మారుస్తాను.’’
‘‘ఇక, పథకం ఏమిటోచెప్తా- విను’’అన్నాడు ఎమ్మెల్లే. గరుడాచలం చెవిలో ఏదో చెప్పాడు.
ఐదు నిమిషాల్లో చెప్పటం పూర్తయ్యింది.
గరుడాచలం మొహం సంతోషంతో విప్పారింది.
‘‘ఇక నువ్వు వెళ్ళి. ప్రాజెక్టు విషయం చూడు’’అని చెప్పి గరుడాచలాన్ని పంపించివేశాడు ఎమ్మెల్లే.
గరుడాచలం చాలా హుషారుగా గుడారంలోకి వెళ్ళాడు.
రాగ్యాని దగ్గర కూర్చోపెట్టుకొని-
‘‘శిష్యా! జ్ఞానానికీ, అజ్ఞానానికీ తేడా ఏమిటి’’అని అడిగాడు.
‘‘తెలవదు’’ అన్నాడు రాగ్యా.
‘‘నెమలి వాహనంమీద ముల్లోకాలు చుట్టొచ్చిన కుమారస్వామి కుదేలైపోయి- అమ్మా, నాన్నలచుట్టూ తిరిగి దణ్ణంపెట్టిన వినాయకుడు నాయకుడయ్యాడెందుచేత.’’
‘‘తెలవదు.’’
‘‘ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారానికి శూక్ష్మంగా ఓ సూత్రముంటుంది! దాన్ని పట్టుకోగలగాలి. అప్పుడు పరిష్కారవౌతుంది.
ఆ శూక్ష్మాన్ని గ్రహించినవాడు జ్ఞాని... గ్రహించనివాడు అజ్ఞాని! జ్ఞానికీ అజ్ఞానికీ తేడాకూడా శూక్ష్మంగానే ఉంటుంది!
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా శిష్యరికంలో గొప్ప జ్ఞానివి కావాలంతే’’ అన్నాడు గరుడాచలం.
‘‘గేనిగా మారాల్నంటే ఏంసెయ్యాలి?’’అని, చాలా వినయంగా రాగ్యా అడిగాడు.
‘‘జ్ఞానబోధ చెయ్యనా.’’
‘‘తఁవరిట్టఁవ్’’అన్నాడు రాగ్యా.
‘‘చాంద్‌నీదే నీకు పెద్ద సమస్య, అవునా?’’
‘‘అవున్సారూ... అదే!’’
‘‘పెళ్ళి అనే శూక్ష్మసూత్రంతో నీ పెద్ద సమస్య పరిష్కారవౌతుంది- అవునా?’’
‘‘అవున్సారూ.’’
‘‘పెళ్ళి చేసుకొని ఏం చేస్తావ్.’’
రాగ్యా వౌనంగా తలదించుకున్నాడు.
‘‘ఇల్లు అనే పంజరంలో బంధిస్తావు- అవునా’’
‘‘అవున్సారూ.’’
‘‘దాని శరీరంతో సుఖిస్తావు- అవునా’’
‘‘అవున్సారూ’’
‘‘పిల్లల్ని కంటావు. వాళ్ళ బరువు బాధ్యతలు మోస్తావు...’’
‘‘అవున్సారూ.’’
‘‘పెళ్ళిచేసుకోకుండా శరీరాన్ని వాడుకోమని చాందినీ అంటే ఏమంటావు? వొద్దంటావా?’’
‘‘అనను.’’
‘‘బాధ్యతలు లేకుండా- అంటే, పెళ్ళిచేసుకోకుండా దాన్తోనే సుఖించటం అనేదే శూక్ష్మసూత్రం! పెళ్ళి, సంసారం, పిల్లలు, వాళ్ళ బరువు బాధ్యతలతో బ్రతికినంతకాలం బాధలు పడకుండా నీకో మార్గం చెప్తాను...’’
‘‘శాందినీ నాకు దక్కుద్దాసారూ?’’
‘‘అవును.’’.
‘‘తఁవరిట్టఁవే నా ఇట్టవ్ సారూ’’ అన్నాడు రాగ్యా.
గరుడాచలం కొంతసేపు వౌనంగా కూర్చున్నాడు!
‘‘ముందుగా చెయ్యాల్సిన పని వుంది! దాని తర్వాతనే చాంద్‌నీ విషయం పరిష్కారవౌతుంది’’ అన్నాడు రాగ్యావైపు చూస్తూ.
‘‘ఏంటిదది సారూ?’’ రాగ్యా అడిగాడు.
‘‘నల్లకొండ దగ్గర్లో వుంది మీ తండా ఒక్కటే కదూ.’’
‘‘అవును.’’
‘‘అంటే- ఈ ప్రాంతంలో జన సంచారం తక్కువ...’’
‘‘అవును’’
‘‘నల్లకొండ నిండా గుహలున్నాయి కదూ.’’
‘‘ఉండయ్యి’’
‘‘కొండ సమీపంలో నీటి కొలనుంది....’’
‘‘ఉంది.’’
‘‘ఈ ప్రాంతాల్లోనే కలివి కోళ్ళు ఉండి తీరాలి.’’
‘‘ఎట్టాగంటున్నారూ?’’ రాగ్యా అడిగాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు