డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వ సముద్ర తీరంలో ఒక ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు అతని రాజ్యంలో గొప్ప సంపదకలిగిన ఒక వైశయుడు ఉండేవాడు అతను చాలా ఉదారుడు. ఓర్పు కలవాడు ధర్మాచరణ చేసేవాడు. అతనికి చాలా మంది పుత్రులు కలరు. ఆ గృహంలో ఒక కాకి కూడా ఉండేది. అది ఆ పిల్లలు పారవేసిన ఎంగిలి మెతుకులు తింటూ అక్కడే ఉండేది. ఆ తిండితో అది పొగరెక్కి తనతో సమానమైనది, తన కంటే గొప్పది ఇంకో పక్షి లేదని అనుకుంటూ అహంకరించి ఇతర గొప్ప పక్షులనూ కూడా అవమానించేది.
ఒకనాడు ఆ సముద్ర తీరానికి గరుడునితో సమానంగా ఎగురుతూ కొన్ని హంసలు మానస సరోవరంలో నివసించేవి వచ్చాయి. ఆ హంసలను చూసి ఆ వైశ్య పిల్లలు కాకితో ఇలా అన్నారు.-‘‘ఓ పక్షీ ! అన్ని పక్షులలో నీవే శ్రేష్ఠమైన దానివి. ఈ హంసలు కూడా ఆకాశంలో చాలా దూరం ఎగురుతున్నాయి. నీకు కూడా అంత ఎత్తు ఎగిరే శక్తి ఉన్నా ఇంత వరకూ ఎక్కడికీ ఎగురలేదు’’. పిల్లలు చెప్పిన మాటలు విన్న మూర్ఖకాకి ఆమాటలు నిజమేనని నమ్మి, ఈ హంసల గొప్పదనం పరిక్షించాలని నిశ్చయించుకొంది. ఎంగిలి మెతుకులు తినే ఆ దుర్బుద్ధి గల కాకి ఆహంసలను ‘‘ఎగురుదాం రండి’’ అని పోటీకి పిలిచింది. బలిష్టంగా ఉండి ఎక్కువ దూరం ఎగుర గల హంసలు ఆ కాకి ప్రేలాపన విని పగలబడి నవ్వాయి.
ఆ హంసలు అప్పుడు కాకితో ఇలా అన్నాయి. ‘‘ఓ వాయసమా! పక్షులలో చాలా దూరం ఎగరటానికి మేము ప్రసిద్ధి చెందాము. మా నివాసమే అత్యంత పవిత్రమైన మానస సరోవరం, ఆ సరస్సు కైలాసం దగ్గర ఉంటుంది. అంటే మేము శివునికి సమీపంలో ఉండేవారం. అప్పుడప్పుడు ఈ భూమీద విహరిస్తూ ఉంటాము మా అవయావాల మీద చక్రచిహ్నాలు ఉంటాయి. అలాంటి మాతో పోటీకి రావాలని ఎలా తలుస్తున్నావు. నీవు కాకివి. నీకు మాతో పోటీ ఏమిటి’’ కాని వాటి మాటలను మూర్ఖ వాయసం వినకుండా పదే పదే తన గొప్పలు చెప్పుకుంటూ హంసలను నిందిస్తూ వాటిని చులకన చేసి మాట్లాడుతూ ఇలా సమాధానం చెప్పింది -
‘‘ఓ హంసా! నేను నూటొక్క రకాలుగా ఎగురుతాను. వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానితో యోజనం దూరం ఎగురలేను. వాటిలో కొన్ని - క్రిందికి పైకి ఎగరటము నాలుగు వైపులా ఎగరటం, వెనక వైపులా ఎగరటం అడ్డంగా ఎగరటం, అన్ని వైపులా ఎగరటం గిర గిరా తిరిగి క్రిందకిరావటం ఇలాగ నూటొక్క రకాల విధాల నేను ఎగురగలను. ఇప్పుడు మీరంతా చూస్తూ ఉండగా అన్ని రకాలుగా ఎగిరి మీకు చూపెట్టగలను. అప్పుడు నా గమనం, బలం మీకు అర్థమవుతాయి. ఏ గతిలో ఎగురాలో చెప్పండి’’ అని డాంబికంగా పలికింది.
అప్పుడు ఒక హంస ఇలా జవాబు చెప్పింది. ‘‘ఓ కాకీ నీవు నూటొక్క రకాలుగా ఎగరగలవు కాని నేను అన్ని పక్షులకూ తెలిసిన ఒకే ఒక గమనంతో ఎగురుతాను, నాకు ఇంకొక రకమైన గమనం తెలియదు నీకు ఏది నచ్చితే ఆ గమనం ఎగురు’’.
అప్పుడు అక్కడ చేరిన కాకులు పరిహాసంగా ఇలా అన్నాయి ‘‘ఈ హంస ఒకే ఒక గమనంతో నూరు రకాల గమనాన్ని ఎలా జయిస్తుంది? పైగా ఈ కాకి చాలా బలిష్ఠంగా ఉంది. వేగంగా ఎగరగలదు’’.
తర్వాత హంసలు కాకులు పోటీపడి ఎగిరాయి. ఒకే గమనంతో హంస, నూరు గమనాలతో కాకులు ఎగరటం మొదలు పెట్టాయి. ఇటు నుంచి చక్రాంగం హంస ఎగిరింది. అటునుంచి కాకి ఎగిరింది. వాని విచిత్ర గమనాలతో చూచేవారిని ఆశ్చర్యపరుచ దలచి కొత్త కొత్త విన్యాసాలను చేసి తనను తాను పొగడుకుంటున్నది. అవి చూసి తక్కిన కాకులు గట్టిగా కావుకావు మని అరిచాయి. అవి హంసలను చూసి హేళన చేశాయి. హంస మాత్రం ఏమీ పట్టించు కోకుండా ఒకే విధమైన గమనంతో సాగిపోతున్నది. రెండు గడియలలో కాకి ఓడిపోతున్నట్లనిపించింది. అయినా కాకులు హంసను హేళన చేస్తునే ఉన్నాయి. ‘‘ఆ ఎగురుతున్న హంస కాకి కంటే వెనకబడి ఉన్నది’’ అని అరిచాయి. వాటి మాటలు విన్ని హంస సముద్రం మీద పైపైకి పశ్చిమ దిక్కున ఎగుర సాగింది. అప్పుడు కాకి ఆయాసపడసాగింది. దానికి వాలటానికి ఆ సముద్ర మధ్యంలో ఎక్కడా ఒక చెట్టు కూడా కన్పించలేదు. దానికి భయం కలిగింది. అప్పుడు కాకి ఇలా అనుకున్నది బాగా అలసటగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడ వాలాలి? ఈ సముద్రం ఎన్నో భయంకరమైన జలజంతువులతో నిండి ఉంది. కనుక ఇంత దూరం సముద్రం మీద ఎగిరి ఆవలి ఒడ్డుకు ఎలా చేరగలను?’’
హంస రెండు గడియలు ఎగిరి కాకి కోసం చూస్తూ ముందరికి వెళ్ళ లేదు. చక్రాంగం కాకిని దాటి ముందుకు వెళ్ళింది. ‘‘కాకి కూడా ఎగురుతూ నా దగ్గరకు రావాలి’’ అని ఎదురు చూసింది. ఇంతలో హంస కాకితో ఇలా అంది ‘‘కాకీ! ఇప్పుడు నీవు ఏగతిలో ఎగురుతున్నావు? బాగా అలసిపోయావు’’ అని హంస దగ్గరకు వచ్చింది. దాని శరీరం శిథిలమై పోయింది. ఎంత ఎగిరినా ఆ నీటికి అంతు లేదు. అది క్రిందపడిపోతున్నది. అప్పుడు కాకి హంసతో ఇలా అన్నది ‘‘సోదరా హంసా! మేము కాకులం ఊరికే కాకా అని అరుస్తూ ఉంటాము. నేను నిన్ను శరణు వేడుతున్నాను. ఈ నీటినించి ఒడ్డుకు చేర్చు’’
ఇలా ప్రార్థిస్తూ కాకి ఆ మహాసముద్రంలోని నీటిని రెక్కలతో, ముక్కుతో తగులుతూ బాగా అలసిపోయి ఆ నీటిలో పడిపోయింది. దానికి చాలా బాధకలిగింది. అతి దీనంగా అది సముద్రంలో పడి మరణించబోతున్న కాకిని చూసి హంస ఇలా అన్నది -
‘‘కాకీ నీవు గర్వంతో నూటొక్క గతులతో ఎగురుతాను అని ఆత్మస్తుతి చేసుకుంటూ మమ్మల్ని హేళన చేస్తూ వచ్చావు. మరి అంత గొప్పగా ఎగర గలిగితే ఇలా సముద్రంలో పడిపోయావు ఎందుకు?’’
అప్పుడు సముద్రపు నీళ్ళలో పడి కొట్టుకుంటున్న కాకి దీనంగా ఇలా అంది.- ‘‘హంసా! వైశ్య బాలకులు పడవేసిన ఎంగిలి మెతుకులు తిని మదించిన నేను గరుత్మంతునితో సమానమని తలచి అహంకరించాను. నిన్ను ప్రాణాల కోసం శరణువేడుతున్నాను. నన్ను దయచేసి ఒడ్డుకు చేర్చు. ఇక ముందు ఎవ్వరినీ హేళన చేసి అవమానించను. ఈ ఆపద నుంచి నన్ను రక్షించు’’. అప్పుడు హంస దయతో వేగంగా వచ్చి కాళ్ళతో కాకిని లేవదీసి తన వీపుమీద ఎక్కించుకొని పూర్వం తాము పోటీ మొదలు పెట్టిన చోటికి తీసుకొని వెళ్ళింది. కాకిని అక్కడ దించి హంస వేగంగా తన ఇష్టంవచ్చిన చోటికి వెళ్ళింది. హంస చేతిలో అలా ఓడిపోయి కాకి బల పరక్రమాలు వదిలి శాంతంగా జీవించింది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి