డైలీ సీరియల్

అనంతం-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంట పనిలో తాముంటే జలనంలో కలిసి తప్పిపోతారని- పిల్లల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు.
పెద్దవాళ్ళవెంట పిల్లలుంటే రంగులరాట్నం వాడు మాటలతో వూరిస్తూ-
‘‘పిల్లలు తిరిగే రంగుల రాట్నం... దర్జాగా కూర్చోండి. గుండ్రంగా తిరగండి... రాండి పిల్లలూ.., రాండి! రంగుల రాట్నం ఎక్కండి’’ అంటూ పిల్లలకు సైగలు చేస్తున్నాడు.
వాళ్ళు పెద్దవాళ్ళని పీడించిమరీ రంగుల రాట్నం ఎక్కుతున్నారు. అడవి సంపద చేతులు మారుతున్నది!
ఒకచోట-
మూడుముక్కలాట జోరుగా సాగుతోంది!
పట్నం బిత్తరగాడొకడు పేకముక్కల్ని కలిపి, మూడే మూడు ముక్కల్ని క్రింద పరుస్తూ- తీసి కలుపుతూ...
‘‘కాయ్‌రాజా.. కాయ్! కాయ్ రాజా.. కాయ్!! జూదం ధనలక్ష్మి... ధైర్యం మహాలక్ష్మి..
జోకర్ మీద కాస్తే ఒకటికి పది రెట్లు! బొమ్మమీద కాసింది తప్పిందంటే గోవిందా!
పందెం గెలిస్తే ఒకటికి పది రెట్లు... ఓడిపోతే నష్టం తక్కువ! ఒక్కసారి గెలిస్తే పదిసార్లు ఓడినా దండగుండదు.
కాయ్ రాజా.. కాయ్!
తేనె సీసాకి పది సీసాల ధర. కిలో చింతపండుకి పది కిలోల ధర! స్పాట్ పేమెంట్... ఫటాఫట్... ధనాధన్...
దగాలేదు.. మోసం లేదు..
జోకర్ మీద కాయండి... లాభం పొందండి.
కాయ్ రాజా.. కాయ్ అంటూ విరామం లేకుండా వసపిట్టలా అరుస్తూనే ఉన్నాడు.
జనం గుమికూడారు!
‘‘జోకరంటే ఏంటిది?’’ అని ఎవ్వరో అడిగారు.
బిత్తరోడు క్రిందపరచిన మూడు పేకముక్కల్ని పైకి తీశాడు.
వాటిల్లోవున్న జోకరు బొమ్మ చూపించా-
‘‘జోకరంటే రుూ బొమ్మే!’’ అన్నాడు.
‘‘పందెఁవెట్టాగాయాలి.’’
‘‘మూడుముక్కలు క్రింద పరుస్తాను. వాటిల్లో ఒకటి జోకరు. దాని మీద పందెం కాస్తే గెల్చినట్టు... పందెం కాసింది జోకరు కాకపోతే ఓడినట్టు’’ అని,
‘‘కాయ్ రాజా కాయ్! దగా లేదు మోసం లేదు’’ అన్నాడు, పేకముక్కలు క్రింద పరుస్తూ.
అందరి కళ్ళూ పేకముక్కల మీదే ఉన్నాయి!
‘‘పట్నపోళ్ళంతా తిక్కల్నాయాళ్ళేడా ఉండరు’’ అన్నాడో అడవి పుత్రుడు, రహస్యంగా ప్రక్కవాడితో!
‘‘ఏంటికంట?’’
‘‘ముక్కల్ని సక్కంగా పరవటఁవ్ గూడా తెలవదు! బొమ్మ సూపిత్తా పర్సిండు.. మద్దెలోదే బొమ్మ.’’
అందరూ దానిమీద పందెం కాసారు.
తేనె సీసాలు, చింతపండు, కాయలూ, పండ్లూ పందెం పెట్టారు.
బిత్తరగాడు-
‘‘జై భవాని.. జై కనకదుర్గ.. జైజై కొండదేవరా..’’అంటూ, చివాల్న మధ్యలోవున్న పేకముక్కని పైకి తీసి చూపించాడు.
అది జోకరు కాదు!
ఒక్క క్షణంలో సంపదంతా కోల్పోయిన అడవి పుత్రులు కన్నీళ్ళ పర్యంతవౌతూ, జూదం ఆడినందుకు తమనుతామే నిందించుకొంటూ- బిక్కమొహాలతో అక్కడే నిలబడిపోయారు.
అంతలో గోపీనాయక్ వచ్చాడు!
‘‘కాయ్‌రాజా.. కాయ్’’అంటూ బిత్తరోడు మళ్ళీ మూడు పేక ముక్కలు క్రింద పరిచాడు. ‘‘దగాలేదు.. మోసం లేదు...కాయ్ రాజా..కాయ్’’ అన్నాడు మళ్ళీ!
గోపీనాయక్ కొంచెం ముందుకు జరిగాడు.
బిత్తరోడు గమనించేలోపే, మూడు పేకముక్కల్నీ వెల్లకిలా వేసాడు.
వాటిల్లో జోకరే లేదు!
హస్తలాఘవాన్ని కనిపెట్టారని తెలిసి బిత్తరోడు భయంతో వొణికిపోతూ- పోలీసుల వైపుకు పరుగులు తీశాడు.
అడవి పుత్రుల్ని గోపీనాయక్ మందలించి, అక్కడ్నించి పంపించాడు.
ఇంకొకచోట-
చాప మీద వనమూలికలు పెట్టి, వన మూలికల మధ్యలో ధన్వంతరి పటం పెట్టి, పటంమీద పసుపూ కుంకుమా చల్లి, మధ్యకి కోసంన రెండు నిమ్మకాయ బద్దల్ని పటం ముందుపెట్టి,-
అడవి పుత్రులకే వన మూలికలు అమ్ముతున్నాడొకడు!
‘‘రండి బాబూ.. రండి! వనమూలికలు కొనండి! మామూలు వన మూలికలు కావు- దేవతా వన మూలికలు! దక్షిణాఫ్రికా అడవుల్నించి మీకోసం తెప్పించిన స్పెషల్ వనమూలికలు!!’’
‘‘ఏఁవుండయ్య నీకాడ?’’ ఎవ్వరో అడిగారు.
‘‘ఇది తెల్ల గంజేరు! అడవిలో పాములుంటయ్యి! అందితే కాటేస్తయ్యి! తెల్లగంజేరు దగ్గరుంటే పాములు పరార్..!’’
‘‘మాకాడ శానా వుండయ్యి.’’
‘‘అదేబాబూ పొరపాటు! మీ దగ్గరున్న తెల్లగంజేరు వాసనకి అడవి పాములు పరారైతాయి గానీ, పట్నం పాములు పరారుకావు! సంత బేరానికి పట్నంపోతే మీదగ్గరుండాలి మా తెల్లగంజేరు.’’
‘‘ఇంకా ఏఁవుండయ్యి నీకాడ?’’
‘‘ఇది మార్తాండ మూలిక! ఇది కుంతీ మూలిక!’’
‘‘ఏంటి కయ్యి?’’
‘‘ఆడవాళ్ళదగ్గర మార్తాండ మూలిక, మగవాళ్ళదగ్గర కుంతీ మూలిక వుంటే సత్వర సంతానాభివృద్ధి జరుగుతుంది!
గంపెడు పిల్లల్ని కనండి!
ఇంటింటా మూలికలుంచి ఓటర్లని కంటే, రాబోయే రోజుల్లో అధికారం మీదే!’’
‘‘ఎంతకాడికి అమ్ముతుండావూ?’’
‘‘మార్తాండ మూలిక ఒక్కింటికి పది కిలోల చింతపండు’’
‘‘మొగోళ్ళ మూలికో...?’’
‘‘కుంతీ మూలిక ఇరవై కిలోల చింతపండు.’’
క్షణాలమీద మూలికలన్నీ అమ్మి, సొమ్ముచేసుకొని అతగాడు అదృశ్యమయ్యాడు.
అంతలో-
రెడ్డియానాయక్ తండావాళ్ళు మిడతల దండులా వచ్చిపడ్డారు!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు