డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రాంశ అయన కాళరాత్రిని అల్లె త్రాటిని చేశాడు. శివునికి విష్ణువు ఆత్మయే కనుక ఆ రాక్షసులు ధనుస్సు, అల్లెత్రాటి స్పర్శను సహించలేకపోయారు. ఈశ్వరుడు ఆ బాణంతో తన క్రోధాగ్నిని ఉంచాడు. ధూమ్రవర్ణుడై, చర్మాంబరధరుడై, పదివేల సూర్యులతో సమానతేజస్వియై నీలలోహితుడు తేజస్వుల జ్వాలలతో ఆవరించబడి జ్వలించాడు.
ఎంత కఠినమైన లక్ష్యాన్నయనా ఛేదించగల హరుడు, ధర్మాన్ని ఆశ్రయంచేవారికి హితుడు. అతనికి ఉపయోగపడే రథాది సాధనాలు శత్రువులను ధ్వంసం చేయడంలో సమర్థాలు, భయంకర రూపం మనోజవం కలవి. ఇవన్నీ అతని చుట్టూ ఉన్నాయ.
మహేశ్వరుడు కవచం ధరించి, విల్లు చేతిలోకి తీసుకొని రథాన్ని చూశాడు. విష్ణు అగ్ని చంద్రుల శక్తి వల్ల ఏర్పడిన బాణాన్ని తీసుకొని యొద్ధానికి సిద్ధమైనాడు. అప్పుడు దేవతలు వాయుదేవుని మహాదేవునికి వింజామర విసిరేవానిగా నియమించారు. శంకరుడు భీకర ఆకారంతో భూమిని కంపింపచేస్తూ రథం ఎక్కాడు. అలా ఎక్కుతున్న సర్వేశ్వరుని దేవతలు, బ్రహ్మర్షులు, గంధర్వులు, దేవగణాలు, అప్సరసలు స్తుతించారు. వారంతా స్తుతిస్తూ అప్సరసలు నాట్యం చేస్తూ ఉండగా శంకరుడు ఖడ్గాన్ని ధనుస్సును బాణాన్ని పట్టుకొని ‘నాకు సారధి ఎవరు?’ అని దేవతలను అడిగాడు.
అప్పుడు దేవతలు ‘‘మహాదేవా! నీకు ఎవరిని నియమిస్తే వారే నీకు సారధి అవుతారు’’ అని అన్నారు. అప్పుడు శివుడు వారితో ఇలా అన్నాడు. ‘మీరే ఆలోచించి నాకు తగిన వారిని సారధిగా తీసుకొని రండి’ శివుని మాటలు విన్న దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు. ‘‘దేవా! దైత్యుల వినాశన కోసం నీవు చెప్పినట్లు చేశాము. వృషభధ్వజుడు మాకు ప్రసన్నుడైనాడు. శ్రేష్ఠమైన రదసారధిగా ఎవరిని పంపాలో తెలియటం లేదు. యుద్ధం శంకరుడు చేయును. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక శ్రేష్ఠుడైన సారధిని వెతకాలి. పితామహా! నీ కంటే శ్రేష్ఠుడైన సారధి ఇంకెవరు? నీవే దేవతలందరిలో శ్రేష్ఠుడివి. ఈ లోకంలో వేగంగా పరిగెత్తే వేదాలనే గుర్రాలను నియంత్రించగల శక్తి నీకే ఉంది. ఏ లోటు లేకుండా సారధ్యం చేసి మమ్ము ఉద్ధరించు. కనుక మా ప్రార్థన మన్నించి రథం ఎక్కి అశ్వాలను నియంత్రించు. నీవే మాకు గతి. నీవే మా రక్షకునివి.’ ఈ విధంగా దేవతలచే ప్రార్థింపబడి బ్రహ్మరథ సారధ్యం వహించడానికి ఒప్పుకొని సారధిగా తయారయ్యాడు.
సృష్టికర్త అయన పితామహుడు తన జటాభారాన్ని వేశాడు. ముడి మృగచర్మ వస్త్రాన్ని బిగించాడు. కమండలాన్ని పక్కన పెట్టి చెన్నకోల చేత బట్టి రదం అధిరోహించాడు. అతను రథం ఎక్కగానే, వాయువేగంతో పరుగెత్తే గుర్రాలు తలలు వాల్చి భూమిని తాకాయ. తేజస్వి అయన లోక పితామహుడు రథం ఎక్కి పగ్గాలను చెన్నకోలను పట్టాడు. అప్పుడు అతను శంకరుని రథం ఎక్కుమన్నాడు. శంకరుడు ధనుస్సు, బాణాన్ని పట్టుకొని రథం ఎక్కాడు. అతను దేవతలతో ఇలా అన్నాడు ‘‘నేను అసురులను చంపనని మీరు తలచి భయపడవద్దు. ఈ బాణంతో వారంతా హతులవడం మీరే చూస్తారు.’’
అప్పుడు పరమశివుడు సకల దేవగణాలతో కలిసి దైత్యులపై యుద్ధానికి బయలుదేరాడు. రథంలో ఉన్న సర్వేశ్వరుని కొందరు పూజిస్తున్నారు. అప్సరసలు నృత్యంతో అతన్ని ఆనందపరుస్తున్నారు. బ్రహ్మర్షులు దేవతలు శకరునికి జయం కలగాలని ప్రార్థిస్తున్నారు. గంధర్వుల వివిధ వాద్యాలను వాయస్తూ అద్భుతంగా గానం చేస్తున్నారు. శంకరుడు బ్రహ్మ దేవునితో ఇలా అన్నాడు. ‘దేవా! దైత్యుల వైపు రథం తోలు. యుద్ధంలో శత్రువులను సంహరిస్తున్న నా బాహుబలం చూడు.’
అప్పుడు బ్రహ్మ మనోవేగ వాయువేగాలతో పరుగెత్తే అశ్వాలను దైత్యుల వైపు తోలాడు. శంకరుడు త్రిపురాల వైపు వెళ్తూ ఉండగా అతని వాహనం అయన నందీశ్వరుడు దిక్కులు పిక్కలిల్లేటట్లు పెద్దగా రంకె వేశాడు. ఆ రంకె ధ్వనికే కొందరు దైత్యులు మృతి చెందారు. శూలధారి అయన శంకరుడు ఆగ్రహంలో ఉన్నాడు. ఆయన ఆగ్రహ రూపం చూసి సమస్త ప్రాణులు గజగజ వణికాయ. మూడు లోకాలు, భూమి కంపించాయ. ఆయన బాణం సంధించగానే బాణం రూపంలో ఉన్న చంద్రుడు, అగ్ని విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు క్షోభించారు. భయంకరమైన అపశకునాలు కన్పించాయ. ధనుస్సును కదిలించగానే భూమి క్రుంగింది. అప్పుడు విష్ణువు బాణ భాగం నించి బయటకు వచ్చి వృషభ రూపంలో ఆ మహా రథాన్ని ఎత్తాడు. మహాబలుడైన శివుడు భీకరంగా గర్జించాడు. అప్పుడాయన వృషభ శిరస్సు మీద గుర్రపు వీపు మీద నిల్చొని ఉన్నాడు. అలా నిలబడి అతను దైత్యుల పురాలను చూశాడు. అప్పుడు ఆయన వృషభంగిట్టను రెండుగా చీల్చాడు. అశ్వాల స్తనాలను కోసి వేశాడు. అప్పటి నుంచి గోవులకు గిట్టలు రెండుగా చీలి ఉంటాయ. గుర్రాలకు స్తనాలు లేవు.
అంతట శంకరుడు ధనుస్సు ఎక్కుబెట్టి నారి సంధించి దానిలో పాశుపాతాస్త్రం కలిపి మనసులో ‘ఈమూడు పురాలు ఏకం కావాలి’ అని సంకల్పించాడు. అప్పుడు త్రిపురాలు ఏకమయ్యాయ. అది చూసి ఋషులు, దేవతలు, సిద్ధులు అందరూ హర్షనాదం చేశాడు. అనంతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న మహేశ్వరుడు అపుడు అసురులను సంహరిస్తుండగా పురత్రయం అతని ఎదుట ప్రకటం అయంది. లోకేశ్వరుడు దివ్యమైన బాణాన్ని ఆ ధనుస్సును బాగా లాగి త్రిపురాలను గురి చూసి వదిలాడు. పడిపోతున్న పురాల నించి ఆర్తనాదం విన్పించింది. ఇలా అసుర గణాలను దహించి పడమటి సముద్రంలో పడవేశాడు. త్రిపురాలను దహించి వేశాడు. దానవులను దహించి వేశాడు.
అప్పుడు దేవతలు, మహర్షులు, శివక్రోధాగ్నితో లోకాలను దహించవద్దని ప్రార్థించాడు. జయ శంకరుని అనేక విధాలుగా స్తుతించి, అతని క్రోధాన్ని శాంతింపచేశారు. ఈ విధంగా మహాదేవుని శాంతింపచేసి, అతని అజ్ఞ పొంది తమ నివాసాలకు వెళ్ళిపోయారు.ఈ విధంగా లోకాలను సృష్టించిన హరుడు ఈ లోకాలను దైత్యుల బారి నుండి కాపాడి లోక రక్షకుడు అయ్యాడు.

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి