డైలీ సీరియల్

అనంతం-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగ్యా వైపు చూస్తూ-
రాగ్యా దగ్గిరకి వెళ్ళాడు.
దేవర చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు.
‘‘పరిత్తితి గ్రెహిచ్చే అడుగుతుండాఁవు! సెప్పు సాఁవీ’’ అని, దేవరకి మళ్ళీ దణ్ణం పెట్టాడు నగ్గూరాం.
‘‘ఇనుకోండి రా...సెప్తుండాను.’’
అందరూ దేవరవైపు ఆసక్తిగా చూస్తున్నారు!
‘‘శలాకి పిల్ల! శందురుడి పేరుండ సక్కదనాల పిల్ల.’’
‘‘శాందినీ గాదు గదా’’అన్నాడు నగ్గూరాం.
‘‘అవున్రొరే.. నగ్గూరాంగా! శాందినీనే జోగిన్ని సెయ్యాల’’అని దేవర తేల్చి చెప్పాడు.
‘‘నా కూతుర్నా’’
‘‘అవున్రొఁరే.. ’’అన్నాడు దేవర.
అంతే-
‘‘దేవరా..!’’అంటూ నగ్గూరాం గావుకేక పెట్టి,-
తరంగ తరంగాలుగా మార్మ్రోగుతున్న ఆ ధ్వని అతని చెవుల్లోనే యింకి పోతోంటే- మొదలు నరికిన చెట్టులా నేలమీద కూలిపోయాడు నగ్గూరాం!
అందరి దృష్టీ నగ్గూరాం వైపుకు మళ్ళింది.
రాగ్యా హడావుడిగా దేవర దగ్గరికి వెళ్ళాడు. జేబులోనుంచి
విస్కీ సీసా బైటికి తీశాడు.. రహస్యంగా కనకయ్య చేతికి అందించాడు.
విస్కీ అంతగా గటగటా తాగి,
‘‘చాంద్‌నీకి కనె్నరికం ఎవరు పెట్టాలో ఇప్పుడు చెప్తాను’’అన్నాడు, ఖాళీసీసా రాగ్యాకిస్తూ.
దాన్ని ఎవ్వరికీ కనిపించకండా బొడ్లో దోపుకున్నాడు రాగ్యా.
గబగబా వెళ్ళి జనంలో నిల్చున్నాడు.
రాగ్యా ఆనందం అంతా యింతాకాదు!
అసలు కథ ఇప్పుడు మొదలౌతుంది!
చాంద్‌నీని జోగిన్ని చెయ్యగానే దానికి ననె్నరికం రాగ్యాపెట్టాలని దేవర చెప్తాడు... అది గరుడాచలం ఆర్డరు!
తండావాళ్ళు దేవర మాటకాదనరు!
అప్పుడు చాంద్‌నీ వశవౌతుంది. అనుభవిస్తాడు. తృప్తిగా అమర సుఖాలు పొందుతాడు. దాన్ని పట్నం తరలిస్తాడు. ‘ఇల్లు’అనబడే పంజరంలో బంధించి ఆనందాలు జుర్రుకుంటాడు.
చాంద్‌నీ జోలికి ఎవ్వరూ రారు.
పేరుకుమాత్రమే అది జోగిని కానీ, తనకు తప్ప దాని శరీరంమీద మరెవ్వరికీ అధికారం ఉండదు!
గత్యంతరం లేని పరిస్థితులు కల్పించి చాంద్‌నీని అలా తనకు అప్పగించేందుకే రుూ నాటకం ఆడిస్తున్నాడు గరుడాచలం!
మనసులోనే గరుడాచలానికి కృతజ్ఞతలు చెబుతూ, తలెత్తి దేవరవైపు చూపాడు రాగ్యా.
మళ్ళీ తను అందించిన విస్కీ తాగి, కనకయ్య రెట్టించిన ఉత్సాహంతో చిందులు వేస్తున్నాడు.
ఎవ్వరో మొహంమీద నీళ్ళు చల్లారు.
నగ్గూరాం తేరికొని లేచాడు.
ఖిన్న వదనంతో దిక్కులు చూస్తున్నాడు.
‘‘అరే...బాణావతుగా..!’’ పిల్చాడు దేవర.
‘‘ఏంటి సాఁవీ.’’
‘‘శాందినీని జోగిన్ని శాత్తండారు గదూ’’
‘‘శాత్తన్నాఁవు.’’
‘‘కనె్నరికఁవ్ బెట్టేదెవురు.’’
బాణావతు వౌనంగా నిల్చున్నాడు.
నగ్గూరాం గొంతులోనుంచి మాటలు పెగలటం లేదు.
‘‘నువ్వే సెప్పు సాఁవీ’’అన్నాడు కాళీచరణ్.
రాగ్యాకి నరాలు తెగే ఉత్కంఠగా వుంది! సంతోషాన్ని బలవంతంగా నిగ్రహించుకొంటూ దేవర వైపే చూస్తున్నాడు!
తన పేరు చెప్పటమే తరువాయి.
దేవర పూనకం నటిస్తున్న కానిస్టేబులు కనకయ్య చెప్పే ఒక్క మాటతో జీవితం అద్భుతంగా మార్తుంది! రాగ్యా ఎదురుచూస్తున్నాడు!
‘‘సెప్తున్నా.. సెప్తున్నా..’’అన్నాడు దేవర.
‘‘తొందరగా సెప్పు సాఁవీ’’ అన్నారెవరో.
‘‘సెప్తాడుండు! తొందరంటే ఎట్టా...’’ అన్నాడు రాగ్యా అసహనంగా.
‘‘సెప్తున్నా.. సెప్తున్నా..’’
‘‘ఏంటి సాఁవీ- సరిగ్గా యినిపిచ్చలా! రాగ్యాగాడన్నావా సాఁవీ’’అని ఆశగా అడిగాడు రాగ్యా.
‘‘శాందినీకి కనె్నరికఁవ్ బెట్టేవోడు- గరుడాశులఁవ్’’ అన్నాడు దేవర!
నిర్ఘాంతపోయాడు రాగ్యా.
మెదడు ఒక్క క్షణం స్తంభించిపోయింది.
కళ్ళముందు చీకట్లు క్రమ్మినట్లుంది!
‘‘రాగ్యా’’ అని చెప్పకుండా గరుడాచలం పేరు చెప్పాడేమిటి?
ద్రోహం గరుడాచలం చేశాడా? కనకయ్య చేశాడా?
గరుడాచలం ఆజ్ఞలేకుండా కనకయ్య స్వతంత్రించి అలా చెప్పడు!
అంటే-?
ఇదంతా చేసింది గరుడాచలమేనా? ఎంత నమ్మకద్రోహం!
కన్నీళ్ళ పర్యంతమయ్యాడు రాగ్యా!
అప్పటికీ ఆశ చావక-
‘‘దేవరా! పెద్దంగ జెప్పు! ఎవరు బెట్టాలి కనె్నరికఁవ్?’’అని అడగాడు రాగ్యా.
‘‘ఎన్నిసార్లు సెప్పాల్రా...శబ్బర్నాకొడక! గరుడాశలఁవ్’’అని గొంతు చించుకొని అరిచాడు దేవర.
ఆ ఆశకూడా చచ్చిపోయింది!
మరో ఆశ మొలకెత్తి-
‘దేవరా! అడివి పిల్లకి అడివి పిల్లోడే తొలిపాలి కనె్నరికఁవెట్టాలి గానీ పట్నపోడు బెడితే ఎట్టా?’’ అని అడిగాడు.
‘‘తొలి రేత్తిరి కనె్నరికఁవెట్టేవోడు శాందినీకి సీర, రెయిక బెట్టాల. బంగారఁ వియ్యాల డబ్బులియ్యాల! అయ్యన్నీ ఇయ్యనీకి అడివి పిల్లోళ్ళకాడ ఏఁవుంది గోసీ..’’అన్నాడు దేవర.
ఆ ఆశ కూడా చచ్చిపోయింది.
‘‘తొందరగా యళ్ళండి. శాందినీ నెత్తకరాండి. జోగిన్ని సెయ్యండి’’ అని దేవర ఆదేశ మయ్యింది!
కొంతమంది అడవిపుత్రులు చాంద్‌నీకోసం వెళ్ళారు.
రాగ్యాకి ఇక అక్కడ క్షణంకూడా ఉండబుద్ధికాలేదు. జనాన్ని తప్పించుకొంటూ దూరంగా వెళ్ళాడు.
అప్పటిదాకా వౌనంగా అంతా చూస్తూన్న గోపీనాయక్ తండావాళ్ళ నమ్మకాల్ని కాదనలేక, తన అభిప్రాయం చెప్పలేక నలిగిపోయాడు.
ఇక తప్పదని, చాంద్‌నీని రక్షించేందుకు తండావైపుకు ముందుగానే సాగిపోయిన విషయం ఎవ్వరూ గమనించలేదు.
* * *
నల్లకొండకి దూరంగా అడవిలో ఓ బండరాయి మీద కూర్చొని రాగ్యా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు!
ఇలా జరిగిందేమిటి?
నమ్మిన వాడ్ని వంచించటానికి గరుడాచలానికి మనసెలా ఒప్పింది?
నమ్మిన తన తప్పా? వంచించిన గరుడాచలం తప్పా?
చాంద్‌నీ పట్లగల వ్యామోహంతో చేసిన తప్పులకు అదే శిక్షా?
మనసావాచా కర్మణా అతను చాంద్‌నీని కోరుకున్నది నిజం..
ఆమే ప్రాణమై, జీవితమై, ఉచ్ఛ్వాస నిశ్వాసలై నియంత్రించింది నిజం!
అందులో ఆమె ప్రమేయం లేకపోవచ్చు.
వ్యసనాలు మరిగి వక్రమార్గం తొక్కినందుకే కదా, ఆమె అలా తిరస్కరించింది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు