డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అరణ్యంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. దానిని చుట్టుకొని ఎన్నో తీగలు, దాని కొమ్మలపైన ఎన్నో పక్షులు ఉండేవి. దాని కొమ్మ అన్ని వైపులా విస్తరించి బాటసారులకు చల్లని నీడనిచ్చేది. ఎన్నో ప్రాణులకు, పాములకు జీవజంతువులకు అది ఆశ్రయమైంది. దాని మొదలు యొక్క చుట్టుకొలత చాలా పెద్దదిగా ఉన్నది. ఆ మొదట్లో ఉన్న రంధ్రంలో కలుగు త్రవ్వుకొని ఒక ఎలుక సుఖంగా జీవిస్తూ ఉండేది. దాని పేరు పలితం. అది చాలా తెలివైనది. అలాగే ఆ మర్రి కొమ్మలపై పక్షి పిల్లలను తింటూ ‘లోమశం’ అనే పిల్లి సుఖంగా ఉండేది. ఆ అడవిలోనే నివసించే ఒక బోయవాడు ప్రతి రోజు సాయంత్రం మఱ్ఱిచెట్టు క్రింద బోను ఏర్పాటు చేసి, సన్నని దారాలతో అల్లిన వలను ఏర్పాటు చేసి, వెళ్ళిపోయి, మళ్ళీ తెల్లవారగానే వచ్చేవాడు. నిత్యమూ ఆ వలలో ఏవేవో జంతువులు పడుతూ ఉండేవి. వాటిని తీసుకొనిపోయి బోయవాడు తన జీవనాన్ని సాగించేవాడు.
ఒక రోజు దురదృష్టవశాత్తూ పిల్లి ఆ వలలో చిక్కుకుంది. తనకు శత్రువు అయిన పిల్లి వలలో చిక్కిపోవడం చూసి ఎలుకకు చాలా సంతోషం, ధైర్యం కలిగాయి. అది నిర్భయంగా కలుగులోంచి బయటకు వచ్చి దానిముందే నాట్యమాడసాగింది. అలా ఆహారం కోసం తిరుగుతున్న పలితం (ఎలుక) పిల్లి చిక్కిన వలమీద ఉన్న మాంసం ముక్కను చూసింది. వెంటనే అది వలపైకి ఎక్కి ఆ మాంసాన్ని తినేసింది.
తన శత్రువు వలలో పడటం చూసి మాంసం తింటూ ఆనందిస్తున్న ఎలుక మరో ప్రమాదకరమైన శత్రువు ముంగిస రావడం చూసింది. ఆ ముంగిస భూమిలోని కన్నంలో పడుకుని ఉంది. దానిపేరు హరిణం. అది ఎలుక వాసన పసిగట్టి తొందరగా అక్కడికి వచ్చింది. అది నేల మీద నుంచి తలపైకెత్తి ఎలుక కోసం నాలుక చాచింది. ఇంతలో ఎలుకకు కొమ్మమీద ఇంకొక శత్రువు గుడ్లగూబ రూపంలో కన్పించింది. దానిపేరు చంద్రకం. అది రాత్రిపూటే తిరుగుతుంది. దాని ముక్కు చాలా వాడిగా ఉంటుంది. ఇలా ఆ చిన్న ఎలుక ముంగిస, గుడ్లగూబల బారిన పడింది. అది వారిద్దరినీ చూచి చాలా భయపడి ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది.
‘‘నాకు ఎదుట మృత్యువు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏమి చేస్తే ఆపద నుండి బయటపడగలను? చుట్టూ ఆపదే కనిపించి భయం కలిగిస్తోంది.’’ ఎలుక అలాగ ఆపదలో ఉండి భయంతో మరల ఆలోచించసాగింది. ఇప్పుడు నా నెత్తిమీదికి ఆపద రానే వచ్చింది. ఇలా వినాశనంలో చిక్కుకున్న వారు చేయవలసిన పని ఏదోవిధంగా జీవితాన్ని దక్కించుకోవడం. అదే తక్షణ కర్తవ్యం. నేల మీదికి వెళితే ముంగిస తినేస్తుంది. ఇక్కడే ఉంటే గుడ్లగూబకు ఆహారమైపోతాను. వల తెంచుకుంటే పిల్లి మ్రింగేస్తుంది. కనుక నా వంటి తెలివైనవాడు ఇలా భయపడరాదు. మరణాన్ని స్వీకరించేదాక పోరాడాలి. కనుక యుక్తితో ప్రయత్నిస్తాను. ఎందుకంటే నీతిశాస్త్రం తెలిసినవాడు బుద్ధిమంతుడు, తెలివి కలవాడు ఎంత దారుణమైన ఆపద వచ్చినా మునిగిపోడు, క్రుంగిపోడు. ‘‘నాకు ఇప్పుడు ఈ పిల్లిని మించిన గతి ఇంకొకటి లేదు. కాని ఇది కూడా కష్టంలో ఉంది. పైగా నాకు శత్రువు. నేను దీనికి చేయవలసిన పని కూడా గొప్పది. ఇప్పుడు నన్ను ముగ్గురు శత్రువులు తినాలని చూస్తున్నారు. కనుక ఒక శత్రువుతో స్నేహం కలపడం మంచిది. ముందుగా పిల్లిని ఆశ్రయిస్తాను. నాకు ఇది పరమశత్రువైనా ప్రస్తుతం విషమపరిస్థితిలో ఉంది. దీనికి ఉపదేశిస్తాను. నా ఉపదేశంలోని స్వార్థాన్ని గ్రహించడానికి ఇది తెలివితక్కువది. పైగా ఆపదలో ఉంది. కనుక నాతో సంధి చేసుకోవచ్చును. అపండితుడైన మిత్రునికంటే పండితుడైన శత్రువు మేలు. అది తన్ను తాను రక్షించుకోవడం ఎందుకో దీనికి చెప్తాను. నా ఉపదేశంతో ఇది తెలివిగలది కావచ్చును. నా బ్రతుకు దీని మీద ఆధారపడి ఉంది’’
ఇలా ఆలోచించిన ఎలుకకు ప్రయోజనం యొక్క తత్త్వాన్ని, స్థితిని, సంధి, విగ్రహ, సంయమనాలు తెలుసు. కనుక అది మెల్లగా మృదువైన మాటలతో పిల్లితో ఇలా అన్నది. ‘‘మార్జాలమా! మంచి మనసుతో అడుగుతున్నాను. బాగున్నావా? నీ హితమే నేను కోరుతున్నాను. మన ఇద్దరికీ శ్రేయస్సు సమానమే కదా! కాని నీవు భయపడకు. సుఖంగా ఉంటావు. నన్ను నీవు చంపకపోతే నేను రక్షిస్తాను. నాకు ఒక ఉపాయం తోచింది. అది మనిద్దరికీ శ్రేయస్కరం. ఈ ముంగిస, గుడ్లగూబ పాపబుద్ధితో మన ప్రాణాలు హరించడానికి పొంచి ఉన్నాయి. కాని అవి నిన్ను చూసి నన్ను బెదిరించడం లేదు. కాని నాకు భయంతో వణుకు పుడ్తోంది. కాని నీ స్నేహం ఉంటే నాకు భయం ఉండదు. ఎందుకంటే సజ్జనులతో స్నేహం ఏడు మాటలతో ఏర్పడుతుంది. పండితుడివి అయిన నీవు నాకు స్నేహితుడివి అయ్యావు. నీతో కలిసి ఉంటే నాకు ఇక భయము ఉండదు.
ఓ మార్జాలమా! నేను లేకుండా నీవు పాశాన్ని త్రెంచుకోలేవు. నీవు నన్ను తినకుండా ఉంటానని ప్రమాణం చేస్తే నేను నీ పాశాలను కొరికివేస్తాను. చెట్టు పై భాగంలో నీవు ఉన్నావు. క్రింద భాగాన్ని నేను ఆశ్రయించుకొని ఉన్నాను. ఇద్దరం ఈ చెట్టుమీదే ఉంటున్నాం. ఎవరినీ నమ్మని వాడు ఎవరికీ నమ్మకాన్ని కలిగించలేనివాడు నిత్యమూ భయపడుతూ జీవిస్తారు. ధీరులు వారిని మెచ్చుకోరు. అందువలన మన ఇద్దరికీ స్నేహము పెరిగితే చాలా ప్రయోజనం ఉంటుంది. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నాకు చెయ్యి.’’
ఎలుక చెప్పిన ఈ హితకరమైన మాటలను వివేకి అయిన పిల్లి విన్నది. పిల్లి తెలివైనది. చక్కగా మాట్లాడగలదు. అది తన పరిస్థితిని సమీక్షించింది. మంచితనంతో ఎలుకను గౌరవించింది. అది ఎలుకతో ఇలా అంది. ‘‘సౌమ్యుడా! చాలా సంతోషం. నేను జీవించాలని కోరుకుంటున్నందుకు చాలా సంతోషం. ఏది చేస్తే మంచిదో అది చేయి. నేను ఆపదలో ఉన్నాను. అంతకంటే పెద్ద ఆపదలో నువ్వు ఉన్నావు. వెంటనే నాకోసం సహాయం చేయి. నీకు అవసరమైనప్పుడు నేను నీకు పనికి వచ్చేది చేస్తాను. నేను ఈ ఆపద నుండి బయటపడితే నీవు చేసిన పనికి ఉత్తరోత్తరా లాభం ఉంటుంది. నేను నా అభిమానాన్ని విడిచి నీ శరణు కోరుతున్నాను’’.
పిల్లి ఈ విధంగా వినయంతో స్నేహంగా మాట్లాడేసరికి ఎలుక అర్థవంతము, హితమూ అయిన మాట ఇలా చెప్పింది - ‘‘నీవు ఔదార్యంతో ఆడిన మాటలు నీ వంటి వారికి తగినవి.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి