డైలీ సీరియల్

అనంతం-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీదరించుకుంది..చెంబుతో కొట్టింది.. రాయితో కొట్టింది.. తీవ్రంగా అవమానించింది.
అంత జరిగినా మనసు ఆమెవైపే పరుగులు తీస్తున్నదంటే ఆమెపట్ల ప్రేమ ఉన్నట్టేకదా!
ఆమెనే జపిస్తూ, ఆమెనే తపిస్తూ, ఆమెనే ఆరాధిస్తూ, ఊహల్లోకూడా ఆమె రూపాన్ని మనోఫలకంమీద ప్రతిష్టించుకొని ఆరాధించింది ప్రేమే కదా?
తిరస్కరించిందామె!
ప్రేమ ద్వేషంగా మారింది.
పట్టుదల పెరిగింది.
అది కసిగా మారింది.
అదంతా-
ఆమెను పొందాలన్న అప్రమేయ ఉన్మాదమే తప్ప, చాంద్‌నీ జీవితాన్ని ధ్వంసం చెయ్యాలన్న ఆలోచన కాదుకదా!
జరగాలనుకున్నది జరగలేదు.
జరగకూడనిది జరిగింది.
ఇప్పుడేం చెయ్యాలి?
వాళ్ళంతా కలిసి చాంద్‌నీకోసం వెళ్ళారు. ఆమెను బలవంతంగా ఐనా పట్టుకొస్తారు. పట్టుబట్టలిచ్చి, కట్నకానుకలిచ్చి, బంగారం పెట్టి,-
‘దైవకార్యం’ అంటూ జోగిన్ని చేస్తారు!
దేవుడి పేరిట జరిగే వ్యభిచారానికి మరో స్ర్తిని సన్నద్ధంచేసి విటులకోసం బలిచేస్తారు.
అనుభవించి అవతలికి తోసేస్తారు.
జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి చేస్తారు.
నిజంగా ఇది దైవ కార్యమేనా?
దైవకార్యమే ఐతే-
ఒక్క గొప్పింటి పిల్లా జోగిని కాదేమిటి?
ఇంతకీ చాంద్‌నీ ఒప్పుకుంటుందా?
ఒప్పుకోదు! చాంద్‌నీ ఒప్పుకోదు!!
ఆత్మాభిమానం వున్న పిల్ల!
అడవి బిడ్డల అభిజాత్యానికి ప్రతీకగా నిలబడుతుందే తప్ప, ఆత్మాభిమానం చంపుకోదు.. నవ్వుతూ ప్రాణాలైనా విడుస్తుంది తప్ప ససేమిరా ఆత్మవంచన చేసుకోదు.
ఆమె ప్రమేయం లేకుండానే జీవితాన్ని శాసిస్తూ జోగిన్ని చేస్తే అభిమానం గల పిల్ల ఎందుకు ఒప్పుకుంటుంది?
తప్పకండా ఎదురు తిరుగుతుంది.
తాము వంచించబడ్డామని తెలియని అడవి పుత్రులు దాన్ని దైవకార్యమని భావిస్తున్నప్పుడు తేలిగ్గా విడిచిపెడతారా, ఆమెను?
బలవంతంగా ఐనా రొంపిలోకి దించుతారు.
దించకపోతే దేవుడు ఆగ్రహిస్తాడన్న భయం వాళ్ళనలా చేస్తుంది!
ఇప్పుడేం చెయ్యాలి?
చాంద్‌నీ నెలాకాపాడాలి?
కాపాడే శక్తి వుందా తనకు?
రాగ్యాకి క్షణం కూడా వృధాచెయ్యబుద్ధికాలేదు!
బండమీద నుంచి చివాల్నలేచాడు. క్రిందికి దిగి, వేగంగా నడుస్తూ రెడ్డియానాయక్ తండా వైపుకు సాగిపోతోన్నాడు.
దారిలో కూడా ఆలోచనల కందిరీగలు విడిచిపెట్టటం లేదు!
అమ్మో! చాంద్‌నీని ఒకవేళ జోగిన్నిచేస్తే?
అదో పుణ్యకార్యంలా తలస్నానం చేయిస్తారు. క్రొత్త బట్టిలు కడతారు. కోరిన తిండి పెడతారు. నీడనిస్తారు. బ్రతుకుతెరువుకు పెట్టుబడిగా శరీరాన్ని నిర్ణయించి-
ఆత్మని చంపి మనిషిని బ్రతికిస్తారు!
ఆమె శరీరాన్ని కాయతొల్చు పురుగుల్లా గుల్లచేసి, గుప్తరోగాల పుట్టని చేసి, అస్తిపంజరాన్ని చేసి, పూర్తిగా ధ్వంసమైందని నిర్ధారించుకొన్న తర్వాత గానీ,
ఇక శృంగారానికి పనికిరాదని ఆ సజీవ కళేబరాన్ని అవతలికి తోసెయ్యరు!
అంతటితో ఆమె శృంగార జీవితం ముగుస్తుంది.
చరమాంకం పరిసమాప్తవౌతుంది.
మళ్ళీ మరొక స్ర్తి జోగిని అవుతుంది.
ఆమె జీవితం కూడా అంతే!
ఆధ్యాత్మిక నేపథ్యంలో నిరంతరాయంగా జోగిన్లు తయారౌతూనే ఉంటారు!
‘దైవకార్యం’ జరుగుతూనే ఉంటుంది!
రసికులెంత ఋణపడి ఉండాలో!
చాంద్‌నీ జీవితం కూడా అలాగే ముగుస్తుంది?
వీల్లేదు.. అలా జరక్కూడదు.
చాంద్‌నీ జోగిని కాకూడదు!
ఆమెను రక్షించాలంటే ఏంచెయ్యాలి?
అంతే..!
ముందుగా ఆమెను తండానుంచి తప్పించాలి. ఎవ్వరికంటా పడకండా దూరంగా పంపించాలి.
దేవర అనుకొని కానిస్టేబులు కనకయ్య చెప్పింది నమ్మినవాళ్ళు చాంద్‌నీని పట్టుకొనేలోగా, ప్రమాదంనుంచి తప్పించాలి!
రాగ్యా పరుగు వేగం పెంచాడు.
తండావైపుకు దూసుకొనిపోతున్నాడు.
* * *
జాతరకి రమ్మని తండా పెద్దల్నించి యింకా కబురురాలేదు.
అక్కడి పరిస్థితినిబట్టి ఆడవాళ్ళు, పిల్లలు నల్లకొండ దగ్గరికి వెళ్ళాలో, లేదో నిర్ణయించాల్సిన వాళ్ళు యింతవరకూ అజాపజా లేరు.
కనీసం కబురు కూడా చెయ్యలేదు!
అక్కడ పరిస్థితి ఎలా వుందో?
సాయుధ పోలీసులు కవాతులు చేస్తున్నారనీ తండా ఖాళీ చేయించేందుకే ఆ సన్నాహాలనీ తండా పెద్దలు అనుమానిస్తూ వెళ్ళారు..
వాళ్ళ అనుమానం నిజమైందా?
అందుకే కబురు చెయ్యలేదా?
గొడవలేమైనా జరుగుతున్నాయేమో అన్న సందేహం కలిగింది, తండా ఆడవాళ్ళకి.
కబురుకోసం ఎదురుచూస్తూ ఆందోళన పడుతున్నారు.
చాంద్‌నీకి చాలా అసహనంగా వుంది!
జాతరకి వెళ్ళుంటే, రుూపాటికి ఆట, పాటలతో ఎంత సంతోషంగా గడిచేదో కాలం! ఆమె మనసంతా నల్లకొండ మీదే వుంది!
కబురు అందించే మనిషి వస్తున్నాడేమో అని దారులు చూస్తున్నది చాంద్‌నీ.
అంతలో-
అడ్డదారిన పడి ఉరుకుపరుగుల మీద తండావైపే వస్తూ గోపీనాయక్ కనిపించాడు దూరంగా.
వార్తాహరుడేమో అనుకుంది చాంద్‌నీ!
కొద్దిక్షణాల్లోనే గోపీనాయక్ దగ్గరికొచ్చాడు!
ముళ్ళపొదలు చీరుకుపోయి, చిరిగిన బట్టలు..
గసపోసుకొంటూ ఎగసిపడుతూన్న గుండె.. కళ్ళల్లో ఆందోళనా.. ఏదో జరిగింది అనుకున్నది చాంద్‌నీ! భయపడ్డది.
‘‘తొందరగా బయలెళ్ళు! తండా యిడిసిపెట్టి యాడికన్నా బోయి సుకంగా బతుకు.. ఛణంగూడా రుూడ ఉండొద్దు శాందినీ- ప్రెఁవాదఁవ్’’అని, చాంద్‌నీవైపు బాధగా చూసాడు గోపీనాయక్.
ఒక్క క్షణం ఆమెకు ఏమీ అర్థంకాలేదు. ‘‘ఏంటిది యిసఁయఁవ్’’ అని అడిగింది.
‘‘నిన్ను జోగిన్నిజేసి, గరుడాశలఁవ్ గాడితో కనె్నరికఁవెట్టిత్తారంట!
చాంద్‌నీ నిర్ఘాంతపోయింది!
అడవి తండాల్లో పలుకుబడి, మాట చలామణివున్న అతనే అలా అన్నాడంటే పరిస్థితి తీవ్రంగానే వున్నట్టు చాంద్‌నీ గ్రహించింది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు