డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు నీ హితం కోసం నేను ఏమి చేస్తానో చెబుతాను. ముందుగా నన్ను కాపాడు. ఎందుకంటే నాకు ఈ ముంగిసను చూస్తే చాలా భయం వేస్తున్నది. నేను నీ దగ్గరకు చేరుతాను. నన్ను రక్షించు, చంపకు. అప్పుడు నేను నిన్ను రక్షించగలుగుతాను. అలాగే ఆ కౄరమైన గుడ్లగూబ కూడా నన్ను తినాలని అనుకుంటున్నది. దాని నుండి కూడా నన్ను రక్షించు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పాశాలను కొరికివేస్తాను.’’
అర్థవంతంగా, సముచితంగా ఉన్న ఎలుక మాటలు విని లోమశం (పిల్లి) దాన్ని మెచ్చుకుంది. పిల్లి ఇలా అంది. ‘నీవు నాకు సఖుడవు. నీ అనుగ్రహంతో నేను జీవితాన్ని పొందగలను. మనం ఇద్దరం మైత్రీబంధాన్ని నెలకొల్పుదాము. నేను ఈ ఆపద నుండి బయటపడి నీకు సంతోషాన్నిచ్చే ఎన్నో కార్యాలను చేస్తాను. ఎన్నో ప్రత్యుపకారాలను చేసినా ముందుగా ఉపకారం చేసినవాడితో సమం కాడు. ఒకడు చేసినదానికి ప్రత్యుపకారం చేస్తే ఇంకొకడు ఏ కారణం లేకుండానే ఉపకారం చేస్తాడు.’’
ఈ విధంగా ఎలుక తన శత్రువైన పిల్లిని మభ్యపెట్టి దాని దగ్గరకు చేరింది. పిల్లికి దగ్గరగా పడుకుని ఉన్న ఎలుకను చూసి ముంగిస, గుడ్లగూబ ఎలుక మీద ఆశ వదులుకున్నాయి. తమను చూచి సంధి కుదుర్చుకున్న పిల్లి ఎలుకలను చూసి ఈ రెండూ నిరాశతో దూరంగా వెళ్ళిపోయాయి. పిల్లి దగ్గర ఉన్న ఎలుక మెల్లగా వలత్రాళ్ళు కొరుకుతూ కాలక్షేపం చేయసాగింది. వేటగాడి భయంతో ఎలుకను శీఘ్రంగా త్రాళ్లు తెంపుమని తొందరపెట్టసాగింది. కాని తెలివైన ఎలుక పిల్లితో ఇలా అన్నది ‘‘పిల్లీ! కంగారు పడకు. మనకు కాలం ఇప్పుడు కలిసి వచ్చింది. కాలం మించిపోలేదు. అకాలంలో ఆరంభించిన పని చేసేవానికి ప్రయోజనం చేకూర్చదు. సరియైన సమయంలో ఆరంభించిన పనే గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తుంది. అకాలంలో నిన్ను విడుదల చేస్తే నీ వల్ల నాకు ఆపద కలుగవచ్చు. అందుకని కాలం కోసం నిరీక్షించు. బోయవాడిని చూడగానే నీ త్రాళ్లు కొరుకుతాను. నీవు చెట్టుపైకి పో, నేను కలుగులోకి పోతాను.’’
ఆ మాటలు విన్న పిల్లి ఇలా అంది ‘‘మిత్రులకు సంతోషం కలిగించేవారు ఏ అధర్మం చేయరు. నిన్ను తొందరగా కష్టం నుంచి విడిపిస్తాను కదా! అలాగే నాకు హితమైన కార్యాన్ని నీవు కూడా చేయాలి. లేక మన పూర్వ వైరాన్ని తలచుకుంటున్నావా? అలాంటి భావన నాకే ఉంటే ఇప్పటికే నీ ఆయువు తీరిపోయేది. నేను తెలియక ఏదైనా పొరపాటు చేసినా అది మనసులో పెట్టుకోకు. నా పట్ల అనుగ్రహం కలిగి ఉండు.’’
చక్కగా, యుక్తంగా ఇలా మాట్లాడుతున్న పిల్లితో ఎలుక మళ్లీ ఇలా అంది. ‘‘లోమశా! నా హితాన్ని కోరే నీవు చెప్పిన మాటలు విన్నాను. నా ప్రయోజనం కూడా నాకు తెలుసు. భయపడినట్లున్న మిత్రుని పని, నిజంగా భయపడిన వాని పని రెండూ పాము నోటిలోంచి చేతిని తీసుకున్నట్లు జాగ్రత్తగా రక్షించుకోవాలి. అలా రక్షించుకోలేనివాడు అపద్య పదార్థం తిన్నవాడిలాగా ప్రయోజనాన్ని పొందలేడు. లోకంలో ఎవరూ ఎవరికీ మిత్రుడూ కాడు, శత్రువూ కాడు. మిత్రులు కాని, శత్రువులు కాని ప్రయోజనం బట్టి ఏర్పడుతారు. ప్రయోజనాలతోనే ప్రయోజనాలు కట్టుబడుతాయి. ఏనుగులను ఏనుగులతోనే పట్టుకుంటారు. పని పూర్తయ్యాక చేసిన వాడి గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకని పని పూర్తిగా చేయకుండా కొంచెం మిగిలేటట్లు చేయాలి. చండాలుడు వచ్చే సమయంలో త్రాళ్లు కొరికితే నీవు భయపడి పారిపోయే ప్రయత్నంలో ఉంటావు. కాని నా గురించి పట్టించుకోవు. అందుకే చాలా త్రాళ్లు కొరికి ఒకటి రెండు ఉంచేశాను’’.
ఆ రాత్రంతా అవి రెండూ ఈ విధంగా మాట్లాడుకుంటూ కాలం గడిపాయి. ఉదయానే్న బోయవాడు ఆయుధం పట్టుకొని రావడం చూశాయి. వాడు యమదూతలాగ వాటికి కన్పించాడు. వాడిని చూసి ముంగిస, గుడ్లగూబ కూడా భయపడ్డాయి. అవి చాలా బలమైనవి. కాని ఎలుక నీతి బలం ముందు వీటి బలం ఎందుకూ పనికిరాలేదు. అవి నిరాశ చేసుకొని తమ నివాసాలకు వెళ్లిపోయాయి. అప్పుడు వలత్రాడును ఎలుక కొరికి కలుగులోకి దూరిపోయింది. పిల్లి గబగబా చెట్టెక్కి పోయింది. వేటగాడు చుట్టూ చూసి ఏ జంతువూ వలలో లేకపోవడంతో నిరాశగా వెనక్కి వెళ్లిపోయాడు.
తరువాత పిల్లి కలుగులో ఉన్న ఎలుకతో ఇలా అంది. ‘‘ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయావు. నేను నీకు కృతజ్ఞురాలిని నీవు చేసిన సహాయానికి. అలాగే నేను కూడా నీకు మేలు చేసినదానిని. నన్ను అనుమానించడం లేదుకదా! నాతో సఖ్యంగా ఉండి మిత్రసౌఖ్యం అనుభవించే తరుణంలో నీవు నా దగ్గరకు ఎందుకు రావడం లేదు? ముందు స్నేహం చేసి దాన్ని కొనసాగించక పోతే అలాంటి నీచుడు ఆపదలలో మిత్రులను పొందలేడు. నేను నీ వలన ఉపకారం పొందాను. కనుక నాతో కలిసి సుఖపడడానికి నీవు అర్హుడవు. సకల సంపదలకు నీవే స్వామివి. గురువును శిష్యులు పూజించినట్లు నా బంధువులు, కుటుంబం నిన్ను పూజిస్తారు. నాకు ఆదేశాలనిచ్చే గురువువు నువ్వే. నన్ను తండ్రిలాగ శాసించు. నీ ఆజ్ఞ జవదాటను. నాకు గురువువు, మంత్రివి అన్నీ నువ్వే. మేము శారీరికంగా బలవంతులం. కాని నీ మంత్రబలం ముందు మా బలం ఎందుకూపనికిరాదు.’
పిల్లి ఇంత చక్కగా, శాంతంగా, స్నేహంగా పలికినా జ్ఞానం కల ఎలుక తనకు హితకరంగా ఇలా అంది. ‘‘లోమశా! నీవు చక్కగా వివరించి చెప్పిన విషయం అంతా విన్నాను. నేను చెప్పేది ఇప్పుడు విను. మిత్రులను తెలుసుకోవాలి. శత్రువులను కనిపెట్టాలి. శత్రురూపంలో మిత్రులుంటారు. ప్రయోజనాన్ని బట్టి మిత్రులూ శత్రువులూ ఏర్పడతారు. కొంతకాలం తర్వాత మిత్రుడు శత్రువు అవవచ్చు. శత్రువు మిత్రుడు కావచ్చు. ఇందులో స్వప్రయొజనమే ముఖ్యం. అలాగే నమ్మరాని వారిని నమ్మకూడదు. నమ్మదగిన వారిని కూడా అతిగా నమ్మకూడదు. తల్లి, తండ్రి, కొడుకులు, బంధువులు అంతా అవసరాన్ని బట్టి సన్నిహితులౌతారు. ఎంత ప్రియమైన వాడైనా చెడిపోయిన పుత్రుని తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. కనుక లోమశా! ఆపదలో ఇద్దరం సన్నిహితులమైనాము. ఆపద గడిచింది. కనుక మనం ఇద్దరం ఇలా ఉండడమే శ్రేయస్కరం. ఇక్కడే నీవు చపలత్వం చేత వలలో చిక్కిపోయావు కదా! చపలత్వం వల్లనే నిన్న వేసిన వలను తెలుసుకోలేకపోయావు. చపలుడు తనకే ఉపయోగపడడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి