డైలీ సీరియల్

మార్జాల మూషిక సంవాదము-110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఇతరులను ఏమి ఉపయోగపడతాడు? కనుక చపలుడు ఇతరుల పనులు చెడగొడతాడు. నీకు సహాయం చేశాను కనుక ఆప్తుడను అయ్యాను. ప్రతీదానికి ఏదో కారణముంటుంది. దానివలన హితులు కాని అహితులు కాని అవుతారు.
ఈ లోకమంతా ప్రయోజనాన్ని కోరుతుంది. ఎవరూ ఎవరికీ సహజంగా ఇష్టులు కారు. అన్నదమ్ముల మధ్య, దంపతుల మధ్య ఉండే స్నేహభావం ఇలాంటిదే. ఈ లోకంలో ఎక్కడా కారణం లేని ప్రీతి కనబడదు. కారణం వల్లనే ప్రీతి ఏర్పడుతుంది. మన ఇద్దరి మధ్య కూడా అలాంటి ప్రీతి ఏర్పడింది. మరో కారణంతో మొదటి కారణం పోతుంది. అందులోను నేను నీకు ఆహారాన్ని. నీవు సమర్థుడివి. కాని కాలం కలిసిరాక నాతో స్నేహం చేశావు. కనుక నా హితం నేను కోరుతాను. ఇంతకు ముందు నీవు నాకు శత్రువువు. ఇప్పుడు స్నేహితుడివి అయ్యావు. మళ్లీ కొంతకాలానికి శత్రువువు. నేను కూడా అంతే. మన మధ్య సహజ శత్రుత్వమే శాశ్వతం. అన్యోన్య సహాయం అయిపోయింది కనుక మన కలయిక ఉండదు’’.
ఎలుక ఇంకా ఇలా అంది ‘‘నీ ప్రయోజనం నీవు పొందావు. నాది నేను పొందాను. ఇక నాతో నీకు ఏమి పని? నన్ను మ్రింగడం తప్ప! మనం ఇద్దరం సమాన బలవంతులం కానప్పుడు మన మధ్య సంధి ఎలా పొసగుతుంది? నీవు ఉపాయంతో నన్ను తినాలని చూస్తున్నావు. కనుక నాతో సంధి కుదరదు. నీవు తినకపోయినా, నీతో కలిసి ఉంటే నీవారు నన్ను తినకుండా ఎలా ఉంటారు? దుష్టుడయిన శత్రువు ఆకలిగా ఉండి ఆహారం వెతుకుతూ ఉంటే తెలివైనవాడు వానిదగ్గరకు వెళతాడా? లోమశా! నేను నీతో కలవను. నా ధనం అంతా కావాలంటే ఇస్తాను. కాని నన్ను నేను అర్పించను. భార్యా, సంపదా ఇచ్చి అయినా తన్ను తాను రక్షించుకోవాలి. ఆలోచించి పనులు చేసేవారికి ఆపదలు కలుగవు’’ ఇలా ఎలుక గట్టిగా మాట్లాడగా పిల్లి సిగ్గుపడి ఇలా అంది.
‘‘నేను ఒట్టువేసి చెప్తున్నాను. నీవు నన్ను మిత్రద్రోహి అని నిందించావు. నా గురించి ఇంకో విధంగా ఆలోచించకు. నువ్వు నాకు ప్రాణదానాన్ని చేశావు. కనుక నాకు నీ పట్ల కృతజ్ఞత. నాకు మిత్రులపై ప్రేమ కలదు. నీవు కూడా నాపట్ల అదే భావంతో ఉండు. నువ్వు నన్ను అనుమానించకు’’.
ఎలుక చాలా గంభీరంగా ఇలా అంది. ‘‘నీ మాట విన్నాను. నీ మీద నాకు ప్రేమ ఉంది. కాని కార్యం ముగిసిన తర్వాత బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకుంటే ఉపాయంతో మెలగాలి. ఇతరులకు నమ్మకం కలిగించాలి. కాని ఇతరులను నమ్మకూడదు. అందువల్ల తన జీవితాన్ని తానే స్వయంగా రక్షించుకోవాలి. బ్రతికి ఉంటే ఏ సంపదలనైనా సమకూర్చుకోవచ్చు. ఓ మార్జాలమా! నన్ను నేను సర్వదా నీవంటి వారి నుండి రక్షించుకోవాలి. అలాగే నువ్వు కూడా పాపాలు చేసే ఛండాలుని నుండి కాపాడుకో’’ ఇలా చెప్పి ఎలుక కన్నంలోకి దూరిపోయింది. పిల్లి కొమ్మ మీద నుంచి పారిపోయింది. ఎలుక, పిల్లి ఈ విధంగా ఒకదానినొకటి ఆశ్రయించుకొని ఆపద నుండి బయటపడ్డాయి. కనుక కాలానుగుణంగా శత్రువుతో సంధిని మిత్రునితో వైరమూ చెయ్యాలి. ఇదే నీతిశాస్తజ్ఞ్రులు చెప్పిన ధర్మము.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి