డైలీ సీరియల్

అనంతం-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంతేకాదు’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘ఇంకా ఏంచేస్తావు.’’
‘‘ఎంతవారైనా దోషుల్ని విడిచిపెట్టను.’’
‘‘కమిటీ దోషులెవ్వరో తేల్చకపోతే?’’
‘‘విడిచిపెడతాను’’అని నవ్వాడు ఎమ్మెల్లే.
అంతలో నల్లకొండ దగ్గర్నించి వార్తాహరుడొచ్చాడు.
‘‘ఏమిటి విషయం?’’ ఎమ్మెల్లే అడిగాడు.
‘‘చాంద్‌నీ కనిపించటం లేదు’’ అన్నాడు.
‘‘అంతా వెతికారా’’ గరుడాచలం అడిగాడు.
‘‘ఎక్కడా కనిపించలేదు. అడవిలోకి వెళ్ళిందని తెలిసింది.’’
‘‘రాగ్యా?’’
‘‘వాడూ కనిపించటం లేదు.’’
గరుడాచలం మొహం వాడిపోయింది!
‘‘వెతకండి! వాడుకూడా అడవికే వెళ్ళుంటాడు’’ అన్నాడు.
వార్తాహరుడు వెళ్ళిపోయిన తర్వాత-
‘‘చాంద్‌నీ కనిపించకపోతే ఏంచెయ్యాలి?’’అని ఎమ్మెల్లే గరుడాచలాన్ని అడిగాడు.
‘‘కూంబింగ్ పార్టీని, డాగ్ స్క్వాడ్నీ పంపిద్దాం.. వాళ్ళు అడవిని జల్లెడ పడతారు. ఎవ్వరూ తప్పించుకోలేరు’’ అన్నాడు గరుడాచలం.
‘‘కూంబింగ్ పార్టీ వుంది తీవ్రవాదులకోసం..’’అన్నాడు ఎమ్మెల్లే.
‘‘వాళ్ళని తీవ్రవాదులంటే సమస్య తీరిపోతుంది కదా.’’
ఎమ్మెల్లే ఒక్క క్షణం ఆలోచించాడు!
ఏ కోణంలో చూసినా గరుడాచలం ఇచ్చిన సలహా ఆమోదయోగ్యంగా తోచింది.
చూపులతోనే అతన్ని అభినందించాడు.
* * *
చాంద్‌నీకోసం వెళ్ళిన వాళ్ళింకా తిరిగిరాలేదు.
ఆమెని తెచ్చి జోగిన్ని చేసేదాకా తను శాంతించేది లేదని దేవర హఠమేసుక్కూర్చున్నాడు! సంబరాలు జరపొద్దన్నాడు. పూజలు, బలులు వొద్దన్నాడు.. ‘బలెన్నం’పెడితే తిననన్నాడు!
మధ్యమధ్యలో ‘‘తాండాలో అగ్గిబుట్టుద్ద’’ని బెదిరిస్తున్నాడు.
అక్కడ పరిస్థితి గందరగోళంగా వుంది!
అడవి పుత్రులకు ఏం చెయ్యాలో తోచటం లేదు.
నిజానికి వాళ్ళంతా కొండదేవర జాతరకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బలులిచ్చి దేవరకి మొక్కులు తీర్చుకొనే రోజు వచ్చిందని సంతోషంగా సర్వం సిద్ధంచేసుకొని వస్తే ఇలా అవాంతరం ఎదురుకావటం ఎంత బాధ!
సమయం గడుస్తున్నకొద్దీ వాళ్ళు మరింత అసహనానికి లోనౌతూన్నారు. వాగ్దానం చేసినవే కాకుండా అదనంగాకూడా కొన్ని మొక్కులు చెల్లిస్తామని, శాంతించమనీ దేవరని బ్రతిమాలారు.
మరింత బిగుసుకొనిపోయాడే తప్ప, మొర ఆలకించలేదు!
అడవి పుత్రుల్లా వేషాలు ధరించిన కొంతమంది కానిస్టేబుళ్ళు కొంత విరామం యిచ్చి, దేవర చుట్టూ చేరారు.
వాళ్ళల్లోనుంచి ఒకడు-
‘‘దేవరా! అర్సీఅర్సీ గొంతెండిపోయింది.. కూసిని కొబ్బెర నీలైనా దాగు.. శాందినీ కోసఁవ్ ఎల్లినోల్లు రాకుండా వుండరు.. దాన్ని తెత్తారు.. నువ్వున్నట్టే శాత్తాఁవుగానీ నీల్దాగు సాఁవీ’’అంటూ, తాగేందుకు సిద్ధంచేసిన కొబ్బరి బోండాని దేవర చేతిలో పెట్టాడు.
అప్పుడు అతను కన్నుగీటిన విషయం గ్రహించాడు దేవర!
అలా కన్నుగీటాడంటే, అందులో ఏదో మర్మం వుంది!
అప్పటికే చిందులు, రంకెలూ వేసి ఢీలాపడిపోయిన దేవర మఫ్టీ కానిస్టేబుళ్ళ వైపు కోపంగా చూస్తూ,
‘‘కొండకాడ కొలువుండ సాఁవి కొబ్బెర్నీల్లకు శాంతిచ్చడు.. శాందినీ రావాల.. జోగిన్ని సెయ్యాల.. ఆగ్గరఁవ్ సల్లారుద్దప్పుడు.. ఒరేయ్.. తండా యదవల్లారా! రుూపాలికి కొబ్బెర్నీలు దాగుతా! అట్టా ఇంకో రెండుసార్లు దాగేతలికి తేవాల, శాందినీని’’ అని,
మఫ్టీ కానిస్టేబులిచ్చిన బోండా నీళ్ళు గటగటా తాగాడు దేవర!
ఖాళీ బోండా అవతలికి విసిరేశాడు.
‘‘ఏదిరా.. శాందినీ? ఆలీసెఁవ్‌జేత్తే అగ్గి బుట్టుద్ది తాండాల్లో.. అంటూ, రెట్టించిన ఉత్సాహంతో అడవిపుత్రుల్ని తిట్టిపోస్తున్నాడు!
పోలీసు సిబ్బందికి తప్ప బోండాలో వాళ్ళు చీప్ లిక్కరు పోసి దేవరకి అందించిన విషయం యింకెవ్వరికీ తెలియదు!
కొంత సమయం గడిచింది.
‘‘అడుగో.. రాగ్యాగాడొస్తుండు’’అని పెద్దగా ఎవ్వరో అరిచారు.
దేవరతోసహా అందరూ అటువైపు చూసారు!
రాగ్యా వస్తున్నది నిజమే!
ఎవ్వరో స్ర్తిని భుజమీద వేసుకొని మోస్తూ, భారంగా అడుగులువేస్తూ రాగ్యా వచ్చాడు!
అందరూ సంభ్రమాశ్చర్యాలతో రాగ్యావైపే చూస్తున్నారు!
రాగ్యా జనాన్ని తప్పించుకొని దారిచేసుకొంటూ ముందుకువెళ్ళాడు. భుజమీద వున్న స్ర్తిని క్రిందికి దించి దేవరముందు నేలమీద వుంచాడు.
ఆమె చాంద్‌నీ!
శవంగా మారిన చాంద్‌నీ!
నగ్గూరాంలో చలనం వచ్చింది! కూతురి శవం దగ్గరికి వెళ్ళాడు. వడిలో తలపెట్టుకొని భోర్న ఏడుపు లంకించుకున్నాడు.
వాతావరణం ఉద్విగ్నభరితమైంది.
‘‘శాందినీని సంపినావా’’అని బాణావతు అడిగాడు.
‘‘రుూ జల్మకి నువ్వు మారవు’’అన్నాడు కాళీచరణ్.
రాగ్యా అవ్వేమీ పట్టించుకోలేదు!
దేవర దగ్గరికి వెళ్ళాడు.
‘‘అదుగో దేవరా. శాందినీ! దాన్నింక జోగిన్ని సెయ్యండి తానంజేపిచ్చండి. కొత్త గుడ్డల్తొడగండి. పూలెట్టండి.. పులులోలె మీనబడి దాని మానఁవ్ దోసియ్యండి.. దాని పీనిగెని అనుభగిచ్చండి’’ అన్నాడు.
దేవర భయం భయంగా రాగ్యావైపు చూసాడు!
రాగ్యా కళ్ళల్లో అలుముకున్న ఎర్ర జీరల్లో ఆవేశం వుంది. బాధ, ఆవేదన వుంది నమ్మక ద్రోహానికి విస్తుపోయిన దాఖలావుంది. తప్పు చేశానన్న న్యూనతాభావం వుంది.
అన్నింటికీ మించి ప్రతీకారేచ్ఛ వుంది!
దేవరకి ఏంచెయ్యాలో అర్ధంకాలేదు. దిక్కులు చూస్తున్నాడు.
‘‘వీడికి దేవర బూనింది అసల్తెఁవ్’’ అని, రాగ్యా అందరికీ వినిపించేలా పెద్దగా అన్నాడు.
‘‘నీకెట్టా తెల్సు?’’ అడిగారెవ్వరో.
‘‘వీడు కానిస్టేబులు కనకయ్యగాడు! గరుడాశలఁవ్ మాటలు నమ్మి అందరవూ గల్సి శబ్బరపనిసేశాఁవు..’’
‘‘ఏం శబ్బర పనీ..?’’
‘‘వీడికి దేవర బూనిండని నాటకఁవాడిపిచ్చింది మేఁవు! శాందినీని జోగిన్ని సెయ్యాలని సెప్పిచ్చింది మేఁవు.. ఇట్టాసెయ్యండని సెప్పిందా గరుడాశలఁవ్’’
‘‘నువ్వేంటికి సేశావీ శబ్బరపని?’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు