డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -113

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వము హిమవత్పర్వతం మీద అనేక మహావృక్షాలు ఉండేవి. వాటిలో ఒక పెద్ద శాల్మలీ వృక్షం కూడా ఉన్నది. అది శాఖోపశాఖలుగా విస్తరించి ఎన్నో పక్షులకు, చిలుకలకు, గోరింకలకు, ఆవాసంగా ఉన్నది. దాని నీడలో ఎంతోమంది బాటసారులు విశ్రాంతి తీసుకునేవారు. దానికి ఎన్నో పూలు పళ్ళూ ఉండేవి. ఆ చెట్టుకు పెద్దబోదె ఉండేది. దాన్ని చూసి ఒకసారి నారదుడు దాని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘శాల్మలీ! నీవు ఎంత మనోహరంగా ఉన్నావు. నన్ను ఆశ్రయంచుకుని ఎన్ని జీవరాశులు జీవిస్తున్నాయ. అనేకమైన పక్షులు, మృగాలు, ఏనుగులు నీ నీడలో ఎంతో సంతోషంగా ఉన్నాయ. నీ విశాలమైన కొమ్మలను వాయుదేవుడు నాశనం చేయలేకపోయాడు. అతనికి నీయందు ఎంత అభిమానం! అతను నీ పుత్రుడా? నీకు ఈ వనంలో ఇంతటి రక్షణ ఇస్తున్నాడే, అతను పెద్ద పెద్దవృక్షాలను, పర్వత శిఖరాలను కూడా ఊపివేస్తాడు కదా! అతను పాతాళంలోని సరస్సులను కూడా ఎండగడ్తాడు. అలాటిది నిన్ను ఏమీ చేయటం లేదంటే నీ యందు అతనికున్న మైత్రీ భావమే కారణము. అందువల్లనే నీవు అనేక కొమ్మలతో, పూలతో చూసే వాళ్ళ మనస్సులను ఆహ్లాదాన్ని కలిగిస్తున్నావు. ఎంతమంది నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నీ నివాసం తపస్వులతో, బ్రాహ్మణులతో, సన్యాసులతో, నానా జాతులమృగాలతో మేరు పర్వతం లాగ శోభిస్తోంది’’.
నారదుడు ఆ వృక్షంతో ఇంకా ఇలా అన్నాడు. ‘‘వాయుదేవుడు నిన్ను మిత్రునిలాగానో, బంధువులాగానో భావించి నీకింత రక్షణ కల్పిస్తున్నాడు. నీవు పదిసార్లు అతనితో ‘‘నేను నీవాడను’’ అని ఉంటావు. అందుకే అతను నిన్నింత భద్రంగా చూస్తున్నాడు. లేకపోతే ఈ పర్వతం మీద వాయువు వలన చెడిపోని, విరిగిపోని వృక్షం ఒక్కటైనా ఉందా? ఎన్నో కారణాలు లేకపోతే వాయువు నినే్నందుకు ఇంతగా ఆదరణతో చూస్తాడు.’’
అప్పుడు బూరుగు చెట్టు ఇలా అంది - ‘‘మహర్షీ! వాయువు నాకు మిత్రుడు కాడు, బంధువు కాడు. అంతకంటే ఆప్తుడు కాడు. నా తేజస్సు, బలం వాయువు బలం కంటే ఎన్నో రెట్లు అధికం. వాయువు తన ప్రాణశక్తి నాలోని పదునెనిమిదవ అంశ కూడా లేదు. అతను తన బలంతో వృక్షాలను పర్వత శిఖరాలను కూలుస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను నా బలంతో అతని వేగాన్ని అడ్డుకుంటాను. ఈ విధంగా అతని వేగాన్ని నేను చాలా సార్లు అడ్డుకున్నాను. కనుక అతను నన్ను నాశనం చేయకుండా ఉంటున్నాడు. నేను అతనికి భయపడను.’’
బూరుగు మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు - ‘‘ఈ విషయంలో నీ దృష్టి విపరీతంగా ఉంది. వాయువుతో సమానమైన ప్రాణి ఈ లోకంలోనే లేదు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు కూడా వాయుదేవునికి సమానులు కారు. అలాంటప్పుడు నీలాంటి మాములు వృక్షం సంగతి ఏమిటి? ఈ భూమి మీద ఏ ప్రాణి ఏ పని చేసినా దానికి కావలసిన శక్తిని, జీవనాన్ని ఇచ్చేవాడు వాయుదేవుడే కదా! ఆయన ప్రాణ రూపంలో మనలో సంచరిస్తున్నప్పుడే ప్రాణులు జీవించి ఉన్నట్లు లెక్క. ఆయన సరిగా పని చేయకపోతే మనలో వికృతమైన మార్పులు వస్తాయ. సర్వ ప్రాణులకు ఆధారుడైన వాయుదేవుని నీవు సరిగా గౌరవించటం లేదు. ఓ శాల్మలీ! నీకు పెద్ద శక్తి లేదు. ఏదో గొప్పలు చెప్తున్నావు. నీ ప్రలాపాల గురించి నేను స్వయంగా వాయువుకు చెప్తాను. ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయ. తమిశ, మద్ది, దేవదారు, వెదురు చెట్లు ఉన్నాయ. కాని అవి ఎన్నడూ వాయువును కించపరచలేదు. వాటికి తమ బలం వాయుబలం రెండూ తెలుసు. అందువల్ల అవి వాయువు ఎదుట తలవంచి ఉంటాయ. నీవు మూర్ఖత్వంవల్ల వాయువు అనంత శక్తి తెలుసుకో లేకపోతున్నావు’’.
ఇలా బూరుగు వృక్షంతో అని నారదుడు వాయు దేవుని దగ్గరకువెళ్ళి అతనితో శాల్మలి మాటలు ఇలా చెప్పాడు. ‘‘హిమవత్పర్వతానికి చాలా పెద్ద పరివారం ఉంది. దాని నీడలో ఎన్నో పక్షులూ, మృగాలు, బాటసారులు తాపసులూ నిశ్చింతగా ఉంటున్నారు. కాని దానికి చాలా అహంకారం అది నిన్ను ఆక్షేపిస్తూ చాలా అవమానకరంగా మాట్లాడింది. సర్వప్రాణులలో నీవు శ్రేష్ఠుడవని నాకు తెలుసు.’’
నారదుని మాటలు విన్న వాయువుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. అతను బూరుగు చెట్టు దగ్గరకు వచ్చి కోపంతో ఇలా అన్నాడు - ‘‘శాల్మలీ! నీవు నిందిస్తూ నన్ను అన్న అన్ని మాటలూ నారదుడు నాకు చెప్పాడు. నేనే వాయువును. నా శక్తిని నీకు చూపుతాను. పూర్వం బ్రహ్మదేవుడు ఒకసారి నీ నీడలో విశ్రమించాడు. అందువలన నీకు ఈ రక్షణ కలిగింది. అంతేకాని నీ స్వశక్తి వలన కాదు. ఇంక నన్ను అవమానించకుండా నా శక్తి నీకు చూపిస్తాను.’’
వాయుదేవుని మాటలు విన్న శాల్మలీ వృక్షం సిగ్గుపడకుండా అతనే్న వెక్కిరిస్తూ ఇలా అంది. ‘‘ఏదీ నీ బలం నా మీద చూపించు. ఎలాంటిదో చూస్తాను. నువ్వు ఎంత బలం కలవాడివైనా నన్ను ఏమీ చేయలేవు. నేను నీకంటే బలవంతుడను. బుద్ధి బలం ఉన్నవారికి ఇతరులను చూస్తే భయం ఎందుకు. గాలీ! నీ కోపం నన్ను ఏం చేయగలదు?’’ బూరుగు మాటలువిన్న వాయువు ఇలా అన్నాడు ‘‘సరే నా బలం ఎలాంటిదో రేపు వచ్చి చూపిస్తా’’ ఇలా అని అతను వెళ్ళిపోయాడు.
ఇంతలో రాత్రి అయంది. బూరుగు, వాయువు వచ్చి తనను ఏమి చేస్తాడో ఊహించుకున్నది. ఇలా అనుకుంది ‘‘అనవసరంగా గొప్పలకు పోయ వాయువుతో అన్నీ అబద్ధాలు చెప్పాను. నేను ఎప్పటికీ వాయుదేవునితో సమానం కాదు. అతను చాలా బలవంతుడు. నేను తక్కిన వృక్షాల కంటే కూడా బలహీనుడను. కాని నేను బుద్ధిలో బలవంతుడను. కనుక నా తెలివి తేటలతో ఎలాగో ఒకలాగ ఈ కష్టం నించి బయటపడతాను’’.
బూరుగు చెట్టు ఇలా నిశ్చయంచుకొని తన పెద్ద పెద్ద శాఖలను, చిన్న స్కంధాలను స్వయంగా నేలరాల్చుకొన్నది. ప్రొద్దునే వాయువు అక్కడికి వచ్చాడు. అతను కోపంగా దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను కూలుస్తూ వచ్చాడు.
మునుపు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న బూరుగు కొమ్మలు, రెమ్మలు, పూలు నేలరాల్చి నిస్తేజంగా కనిపించింది. అప్పుడు అతను ఇలా అన్నాడు.
‘‘శాల్మలీ! నేను ఇదే పని చేయాలనుకున్నాను. ఇప్పుడు నువ్వే నీ కొమ్మలను రాల్చుకున్నావు. నీ అహంకారంతో నీవే ఆపద కొనితెచ్చుకున్నావు. నా బల పరాక్రమాలకు బలి అయ్యావు.’’ వాయువు మాటలు విని బూరుగు సిగ్గుపడి పశ్చాత్తాప పడింది. మనం కూడా బలవంతులతో బూరుగు లాగ శతృత్వం వహిస్తే మనం కూడా అలాగే అవమానాన్ని ఎదుర్కోవాలి.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి