డైలీ సీరియల్

అనంతం-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవును! చాంద్‌నీ చచ్చిపోయింది. తేనెపట్టు పట్టుకొని తేనెటీగల చేత కుట్టించుకొని మరీ ప్రాణాలు విడిచింది..’’
‘‘రాగ్యా ఏం చేస్తున్నాడు’’ అని అడిగాడు గరుడాచలం.
‘‘దాని శవాన్ని అడవిలోనుంచి తెచ్చింది వాడే! మనం ఆడించిన నాటకం మొత్తం అడవిపుత్రులకు చెప్పాడు..’’
‘‘చెప్తే...?’’
‘‘కూతురు చావుకు కారణం కనకయ్య అని తెలిసి, నగ్గూరాం వేట కొడవలితో కనకయ్యని నరికి చంపాడు.’’
‘‘మై గాడ్’’అని అరిచాడు గరుడాచలం.
‘‘అంతేకాదు! వాళ్ళంతా గుడారాలమీదికి దాడికి వస్తున్నారు. ఆవేశంగా ఉన్నారు... ఏంచేస్తారో.’’
అప్పుడు ఓ పోలీసు అధికారి లోపలికొచ్చాడు!
‘‘ఎనీ ప్రాబ్లెమ్?’’ ఎమ్మెల్లే అడిగాడా అధికారిని
‘‘అడవి పుత్రులొస్తున్నారు. పోలీస్ సిబ్బందిని అలెర్ట్‌చేశాం. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు.’’
‘‘తగినంత మంది పోలీసులున్నారా’’ గరుడాచలం అడిగాడు.
‘‘అడిషనల్ ఫోర్స్ ఏ క్షణంలో ఐనా రావచ్చు! ఉన్నవాళ్ళతోనే అప్పటిదాకా లా అండ్ ఆర్డర్ కాపాడాలి.’’
‘‘వాళ్ళెంతమందున్నారు.’’
‘‘చాలామంది! అన్ని తండాలవాళ్ళూ ఒకటయ్యారు.’’
‘‘వాళ్ళ దగ్గర తుపాకులున్నాయా’’
‘‘లేవు.’’
‘‘ఐతే, అడిషనల్ ఫోర్సు కూడా అనవసరం! గాల్లోకి కాకండా నేరుగా వాళ్ళ గుండెలకు గురిచూసి కాల్పులు జరపండి! చస్తారు..చచ్చిన వాళ్ళు చావగా మిగిలినవాళ్ళు పారిపోతారు... మరో ‘ఇంద్రవెల్లి’ కావాలిది.’’
‘‘సాధ్యంకాదు’’ అన్నాడు పోలీసు అధికారి.
‘‘ఏం? ఎందుక్కాదూ?’’
‘‘వాళ్ళచేతుల్లో సాంప్రదాయక ఆయుధాలే వున్నా, చాలా ఎక్కువమంది ఉన్నారు, సంఖ్యలో!’’
‘‘ఐతే..?’’
‘‘అంతమంది ఉన్నప్పుడు ఫైర్ ఓపెన్ చేస్తే పరిస్థితి చెయ్యిదాటిపోతుంది.’’
ఎమ్మెల్లే అసహనానికి లోనయ్యాడు.
‘‘నువ్వు పోలీసు అధికారివేనా?’’ అని అడిగాడు కోపంగా.
‘‘సందేహం ఎందుకొచ్చింది’’ అధికారి అడిగాడు.
‘‘నీ పిరికితనం చూసి.’’
‘‘పోలీసు అధికారి ఎలా ఉండాలంటారూ.’’
‘‘తుపాకితోనే రాజ్యాన్ని కాపాడాలి! వాళ్ళు మన గుడారాల మీద దాడికి తెగించారంటే ప్రభుత్వంమీద యుద్ధం ప్రకటించినట్టే! క్షమించకూడదు.’’
‘‘క్షమించటం కాదు సార్! బలం చాలాపోవటం.’’
‘‘అదే పిరికితనం! వాళ్ళు మనమీద దాడి చెయ్యటం బడబాగ్ని మీద శలభాల దాడి లాంటిది! కాల్చి చంపండి. మాడి మసైపోతారు’’ అని పెద్దగా నవ్వి-
‘‘అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ అందించి నిలబెట్టేది ఆయుధం! ఆధునిక ఆయుధం లేని వాడు యోధుడైనా పరాజితుడు కావాల్సిందే! అమాయకులైన అడవి పుత్రులకు భయపడితే ఎలా?
ఈటెలు బరిశెలు వేట కొడవళ్ళతో వాళ్ళు తుపాకుల నెంతవరకు ప్రతిఘటించగలరూ?
సందేహించొద్దు! కాల్పులు జరపండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది.. వంద ఎంక్వయిరీలు జరగనివ్వండి! మీడియా గొడవ చెయ్యనివ్వండి! ప్రపంచం వ్రేలెత్తి చూపనివ్వండి! అన్నిటినీ ఎదుర్కొని మిమ్మల్ని కాపాట్టమేకాదు, ప్రమోషన్లు ఇప్పించే బాధ్యతకూడా నాదే’’ అన్నాడు ఎమ్మెల్లే.
గరుడాచలానికి ధైర్యం చిక్కింది.
‘‘యూ ఆర్ కరెక్ట్’’అన్నాడు ఎమ్మెల్లేతో.
పోలీసు అధికారి బైటికి వెళ్ళిపోయాడు.
‘‘ఇప్పుడేం జరుగుతుందో తెలుసా?’’అని, గరుడాచలాన్ని ఎమ్మెల్లే అడిగాడు.
‘‘చెప్పు’’ అన్నాడు గరుడాచలం.
‘‘గుడారాల మీద దాడి అంటే అడవిపుత్రులు తమ గొయ్యి తాము త్రవ్వుకోవటమే..’’
‘‘ఎలా’’
‘‘ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర అనొచ్చు! బలమైన కేసులు పెట్టొచ్చు! చచ్చిన వాళ్ళు కాల్పుల్లో చస్తే, మిగిలినవాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక చస్తారు.’’
‘‘కుట్ర అంటే అదనపు లాభం ఏమిటి?’’
‘‘కుట్రకి కేంద్రమైన రెడ్డియానాయక్ తండా మీద దాడి జరుగుతుంది! సాయుధ పోలీసు బలగాలు కుట్రని భగ్నం చేస్తాయి..’’
‘‘అర్ధమైంది’’ అన్నాడు నవ్వుతూ గరుడాచలం.
‘‘అడవి భూముల్ని బహుళజాతి కంపెనీలకు అందించే ప్రయత్నంలో ఇలాంటి కుట్ర కేసులు బాగా ఉపయోగపడతాయి.
తండాల్లో పోలీసు దళాలు బీభత్సం సృష్టించొచ్చు! హక్కుల మాట ఎత్తితే కాల్చి చంపొచ్చు’’ అన్నాడు ఎమ్మెల్లే.
ఇందాక ఎమ్మెల్లేతో మాట్లాడిన పోలీసు అధికారి ఇంకా కొంతమంది అధికారులను వెంట పెట్టుకొని మళ్ళీ వొచ్చాడు.
‘‘ఏమైంది’’ అని అడిగాడు ఎమ్మెల్లే.
‘‘మా వాళ్ళకి కొన్ని సందేహాలున్నాయి.’’
‘‘చెప్పండి.’’
‘‘తుపాకుల కన్నా ప్రమాదకరమైన ఆయుధం వాళ్ళ దగ్గరుంది’’
‘‘ఏమిటది’’
‘‘తెగింపు’’
‘‘అంత తెగువరులా వాళ్ళు’’
‘‘మఫ్టీ పోలీసుల మధ్య వున్న కానిస్టేబులు కనకయ్యని నరికి చంపారంటే తెలియటం లేదూ.’’
బైట్నించి కోలాహలం వినిపించింది.
‘‘జాగ్రత్త’’అని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్లేని, గరుడాచలాన్నీ హెచ్చరించి పోలీసు సిబ్బంది బైటికి వెళ్ళిపోయారు.
గరుడాచలం మనసు పరిపరి విధాలుగా పోతోన్నది! పోలీసు అధికారి అలా చెప్పకుండా ఉండుంటే అంత భయం అనిపించేది కాదేమో గానీ, అతను కనకయ్యని అడవి పుత్రులు నరికి చంపిన విషయాన్ని వర్ణించిమరీ చెప్పాడు!
గరుడాచలానికి లోలోపలే భయంగా వుంది!
అది గమనించాడు ఎమ్మెల్లే!
‘‘్భయపడుతున్నావు కదూ?’’అని, గరుడాచలాన్ని అడిగాడు.
అతను మాట్లాడలేదు!
‘‘అదీ చూద్దాం! కూతురు చనిపోయిందన్న కోపంలో అడవి పుత్రులతో కలిసి నగ్గూరాం కనకయ్యని చంపుంటాడే తప్ప, వాళ్ళంతా పోరట యోధులుకారు.. అమాయకులు.. మనమీద దాడి చేస్తారని నేను భావించటం లేదు’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘మరా కోలాహలం ఏమిటంటావూ’’
‘‘వెళ్ళి చూస్తాను!’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘నేను ఒంటరినౌతాను’’అన్నాడు గరుడాచలం.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు