డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షి మాటలు విని అతను ఆ విథంగానే చేశాడు. అలా చేయడంవల్ల అతని ప్రాణం లేచివచ్చింది. పక్షిచేత ఈ విధంగా సత్కరింపబడేసరికి బోయవానికి కళ్ళవెంట ఆనందంతో నీళ్ళు వచ్చాయి. అతను పక్షితో ఇలా అన్నాడు. ‘‘ఆకలి నన్ను పీడిస్తోంది. నీవు ఏదైనా ఆహారం ఇస్తే తింటాను’’.
అప్పుడు పక్షి ఇలా అంది. ‘‘నా దగ్గర సంపద లేదు. ఏ రోజుకారోజు దొరికిన దానితో జీవించే వాళ్ళము. మేము వనవాసులం. మహర్షుల ఆశ్రమాలలాగ మా దగ్గర భోజనానికై కూడ బెట్టినదేదీ లేదు’’ ఆ మాట విని అతను బాధపడ్డాడు. తన వృత్తిని నిందించుకున్నాడు. ఇంతలో పక్షిమరల ఇలా అంది. ‘‘క్షణమాగు. నిన్ను తృప్తి పరుస్తాను’’ అలా అని ఆ ఎండుటాకుల మంటను పెద్దది చేసి అతనితో అలా అంది - ‘‘ఋషుల ద్వారా, దేవతల ద్వారా, పితరుల ద్వారా నేను విన్నది నేర్చుకున్న అతిథి పూజ గొప్పతనము. కనుక ఈ పూజలో నాది తిరుగులేని బుద్ధి. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఆ పక్షి నవ్వుతూ, అగ్నికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అగ్నిలోకి దూకింది. అలా ప్రవేశిస్తున్న పక్షిని చూసి బోయవాడు ‘‘అయ్యో నేనెంత క్రూరమైన పని చేసాను. నేను చేసిన క్రూరకర్మలు అన్నింటిలోను ఇది అత్యంత క్రూరకర్మ’’ అని ఎంతో విలపించసాగాడు. ఆకలితో అలమటిస్తూ కూడా బోయవాడు అగ్నిలో పడ్డ కపోతాన్ని చూసి ఇల్లా దుఃఖించాడు- ‘‘అయ్యో నేను ఎంత క్రూరుణ్ణి, బుద్ధిహీనుణ్ణిని. నా జన్మ అంతా ఇలాగే గడిచింది. నేనెప్పుడూ పాపం చేస్తూనే ఉన్నాను. నేను దుర్భుద్ధి కలిగి నమ్మదగని వాడిని. క్రౌర్యానే్న నా జీవనవిధానంగా చేసుకుని పక్షులను, జంతువులను వేటాడి, చంపి జీవిస్తున్నాను. ఆ పావురం ఎంత గొప్ప మనస్సు కలది. తను దహించబడుతూ నా క్రౌర్యానికి సరియైన ప్రతీకారం చేసి ధర్మ మార్గమేదో చూపెట్టింది. ఇక నుంచి నేను ఆ మార్గానే్న అనుసరిస్తాను. ఈ రోజు నుండి అన్ని భోగాలు వదిలిపెట్టి శరీరాన్ని కృశింపచేసి, ఉపవాసాలతో పరలోక హిత కరమైన పనులే చేస్తాను.
ఈ కపోతం తన శరీరం అగ్నిలో అర్పించి అతిథిపూజ ఎలా చేయాలో ఆచరించి చూపింది. కనుక నేను కూడా ఆ ధర్మమే ఆచరిస్తాను. ధర్మమే ఉత్తమగతి. ఆ పుణ్యకపోతం ఆచరించినదే ఉత్తమధర్మం. అదీ నాకు ఇష్టం’’ బోయవాడు ఈ విధంగా ఆలోచించి, కఠోర వ్రతాన్ని ఆశ్రయించి మహాప్రస్థానం వైపు ప్రయాణం మొదలు పెట్టాడు. అప్పుడే తన కర్రను, వలను, పంజరాన్ని, అందులో బంధించిన కపోతిని విడిచి పెట్టి వేశాడు.
బోయవాడు వెళ్ళి పోగానే కపోతి భర్తను తలుచుకుని దుఃఖిస్తూ ఇలా అంది. ‘‘నాథా నే నెప్పుడూ నీ పట్ల అప్రియంగా ప్రవర్తించలేదు. స్ర్తికి ఎంతమంది పిల్లలు ఉన్నా భర్త లేకపోతే జీవితమంతా శోకమే. బంధువులు కూడా ఆమెను దరిచేరనీయరు. నీవు నన్ను ఎంతప్రేమగా చూసు కున్నావు. ఎంతో స్నేహంతో సెలయేళ్ళ దగ్గర, చెట్టుకొమ్మల్లో నన్ను ఎంతో సుఖపెట్టావు.’’
ఇంకా ‘‘గతంలో నీతో కలిసి పొందిన సుఖంలో ఏ కొంచెము ఇప్పుడు లేదు. తండ్రి, సోదరుడు, వీరంతా మితంగానే సుఖం యిస్తారు. అమితంగా సుఖపెట్టేది భర్త ఒక్కడే. అటువంటి భర్త పోతే ఏ స్ర్తి దుఃఖించదు? స్ర్తికి భర్తను మించిన రక్షణ లేదు. ధనాన్నంతా పరిత్యజించి అయినా స్ర్తికి భర్తయే శరణ్యం’’ ఇలా దుఃఖిస్తూ కపోతి ఆ మండుతున్న అగ్నిలోకి దూకింది. అప్పుడు ఆమె తన భర్తను చూసింది. ఆ కపోతం రంగు రంగుల ఆభరణాలు ధరించి విమానంలో కూర్చుని ఉంది. మహాత్ముల పూజలందు కుంటున్నది. దాని చుట్టూ ఇంకా ఎన్నో విమానాలు ఉన్నాయి. ఆ కపోతం తన భార్యతో సహా ఒక చక్కటి విమానం ఎక్కి స్వర్గంలోకానికి వెళ్ళింది. అక్కడ ఆనందగా నివసించింది.
బోయవాడు విమానంలో వెళ్తున్న కపోత మిథునాన్ని చూసి వారి సద్గతి గురించి ఆలోచించాడు. ‘‘నేను కూడా ఇలాటి తనస్సునే చేసి ఉత్తమ గతిని పొందుతాను’’ అని ఇలా నిశ్చయించుకుని అతను మహాప్రస్థానం వైపు మళ్ళాడు.
అతడు అప్పటి దాక చేసిన క్రూరకర్మలను వదిలి పెట్టాడు. గాలినే ఆహారంగా భోంచేస్తున్నాడు. అన్ని మమకారాలను, ఆకాంక్షలను వదిలి పెట్టాడు. అంతలో ఒకనాడు అతనొక సరస్సు చూశాడు. అక్కడ చక్కటి నిర్మలమైన నీరు ఉంది. సరస్సు నిండా పద్మాలు కలవు. ఎన్నో పక్షి సమూహాలు అక్కడ ఉన్నాయి.
ఉపవాసం చేత కృశించిపోతున్న బోయవాడు దానిని చూడలేకనే అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం క్రూరజంతువులకు నివాస స్థానం. అక్కడ అతను ముళ్ళలో చిక్కుకున్నాడు. ఆ ముళ్ళు అతని శరీరాన్ని చీరాయి. అయినా అతడు నెత్తురు కార్చుతూ అక్కడే తిరిగాడు. ఇంతో పెనుగాలి వచ్చి అరణ్యంలో దావాగ్ని చెలరేగింది. ఆ మంటలు అరణ్యం అంతా వ్యాపించి, పక్షులు మృగాలు ఆ మంటల్లో పడిదహించుకుపోయాయి. అప్పుడు బోయవాడు ఆనందంతో ఆ మంటల వైపు పరుగెత్తాడు. అతను అందులో పడి అగ్ని దగ్ధుడై పునీతుడయ్యాడు. అతను స్వర్గంలోకంలో ప్రకాశిస్తున్న తనను చూడగలిగాడు. అతను ఆ యక్షగంధర్వుల మధ్య ఇంద్రునిలా వెలిగిపోతున్నాడు. ఈ విధంగా కపోతం, పాతివ్రత్యంతో కపోతి పుణ్యకర్మలతో బోయవాడు స్వర్గాన్ని చేరారు.
ఈ విధంగా ఏ కాంత అయినా భర్తను అనుసరిస్తే ఆమె స్వర్గానికి చేరుకుంటుంది. కనుక అతిథికి సత్కారం చేయడం, ఆదరించడం గొప్ప ధర్మం. ఈ ధర్మం వలన, గోహత్య వలన కలిగిన పాపం నుంచి కూడా నిష్కృతి లభిస్తుంది.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి