డైలీ సీరియల్

అనంతం-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నగ్గూరాంని సంపినాడంట గరుడాశలఁవ్! సూత్తారే..
అడవి పుత్రులు రెచ్చిపోయారు.
విధ్వంసం మొదలైంది!
క్షణాలమీద గుడారాలు తగులబడిపోయాయి. గుడారాల్లోవున్న సామాన్లను కూడా విడిచిపెట్టలేదు. అడవి పుత్రులు-గుట్టవేసి కాల్చేశారు.
మంటలపైకి లేస్తున్నాయి..
మరణమృదంగం మ్రోగుతున్నది.
బాణాకర్రలతో, సాంప్రదాయక ఆయుధాలతో పోలీసు సిబ్బందిని ఎదుర్కొన్నారు అడవి పుత్రులు.. వాళ్ళని చితకబాదుతున్నారు.
పోలీసు అధికారులకు పరిస్థితి అర్ధమైపోయింది!
ఇక ఆలస్యంచేస్తే వాళ్ళు పోలీసుల్నికూడా విడిచిపెట్టరు!
‘‘ఫైర్’’అంటూ అప్పుడు వినిపించింది అధికారి ఆజ్ఞ!
అతని ఆజ్ఞ పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపింది.
అంతవరకూ విధ్వంసం జరుగుతున్నా అధికారి ఆదేశాలు అందనందువల్ల లాఠీఛార్జికి పరిమితమయ్యారు వాళ్ళు.
ఇప్పుడు ఆదేశాలు అందాయి!
ప్రతీకారవాంఛతో రగిలిపోతూ, అదే అవకాశంగా భావించి అడవిపుత్రుల గుండెలకు గురిచూసి కాల్పులు జరిపారు పోలీసు సిబ్బంది!
కళ్ళముందే బాణావతు నేలకు వొరిగిపోయాడు.
కాళీచరణ్ విగత జీవుడయ్యాడు.
నెత్తురు వరదలు కట్టింది.
జనం పరుగులూ..ఆర్తనాదాలూ..
అడవి తల్లి జడలు విరబోసుకొని ఏడుస్తున్నట్టుంది!
అడవి పుత్రులు చెల్లాచెదురై దూరంగా పారిపోయారు.
అక్కడ పోలీసులూ, శవాలూ మిగిలాయి.
లా అండ్ ఆర్డర్ రుూజ్ టెన్స్.. బట్ అండర్ కంట్రోల్!?
* * *
తుపాకి కాల్పులకు చెల్లాచెదురైన అడవిపుత్రులు వివిధ మార్గాలనుంచి నడిచి వెళ్ళి, నల్లకొండ వెనుక మళ్ళీ గుమికూడారు.
అదనపు పోలీసు బలగాలు వచ్చిపడ్డాయన్న వార్తకూడా అందింది!
వాళ్ళంతా బాగా ఆలోచించారు!
అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ గుడారాల దగ్గరికి వెళ్ళటం, పోలీసులతో తలపట్టం చాలా ప్రమాదం.
గుడారాల మీద జరిగిన దాడిలో ప్రధానపాత్ర వహించింది రెడ్డియానాయక్ తండావాళ్ళే అని పోలీసులు గ్రహించే ఉంటారు.
పైగా, వాళ్ళ దృష్టంతా ఆ తండామీదనే వుంది.
దాన్ని ఖాళీ చేయించాలన్నదే వాళ్ళ ధ్యేయం!
అందువల్ల తండా వాళ్ళు గుడారాల దగ్గరికి వెళ్ళటం ఎంత ప్రమాదమో, తండాకి వెళ్ళటం కూడా అంతే ప్రమాదం!
‘‘ఏఁవి శాద్ధాఁవూ?’’అని, రాగ్యా గోపీనాయక్‌ని అడిగాడు.
‘‘అడవి అతకార్లు సూసినా మనకి ప్రెఁవాదఁవే! యంటనే గొలుసుకొండల కాడికి ఎల్లిపోదాఁవు. ఆడ కూకొని ఆలోశిద్దాఁవు’’అని చెప్పాడు గోపీనాయక్.
‘‘శాందినీ పీనిగె ఆడ్నే వుంది. గుడారాల కాడ మా అయ్య, బాణావతు, నగ్గూరాం పీనిగెలుండయ్యి.. ఆట్నేఁవి సెయ్యాల?’’కన్నీళ్ళు తుడుచుకొని, రాగ్యా అడిగాడు.
‘‘ఆడికి బోతే మనల్ని కాల్సిపారేత్తారు.’’
‘‘పీనిగెల్ని గూడా ఇయ్యరా మనకి’’
‘‘సూద్దూఁ వేటి జరుగుద్దో! ముందుగాల మనఁవీడ్నించి బోవాల. పోలీసోళ్ళు ఎతుకుతుండొచ్చు. కనిపిత్తే సంపుతారు’’అన్నాడు గోపీనాయక్.
రాగ్యా, గోపీనాయక్ దారి చూపిస్తుంటే, వాళ్ళందరూ రహస్య మార్గాలగుండా బయల్దేరారు.
లాఠీఛార్జిలో గాయపడ్డవాళ్ళూ, తుపాకి తూటాల రవ్వలు తగిలిన వాళ్ళూ... కొంతమంది నడవలేని స్థితిలో వుంటే, వాళ్ళని భుజాల ఆసరా యిచ్చి అడవిపుత్రులు నడిపిస్తున్నారు.
గుట్టలు తుప్పలు పొదల మార్గంలో వాళ్ళు ఎవ్వరికంటా పడకండా జాగ్రత్తగా నడుస్తూ గొలుసు కొండల వైపుకు సాగిపోతోన్నారు.
అడివి పుత్రులకు అయోమయంగా ఉంది!
లోతట్టు దుర్గమారణ్యంలోకి వెళ్ళే ఆ రహస్య మార్గాలను గురించి రాగ్యాకీ, గోపీనాయక్‌కీ తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ తెలియదు.
ఎన్ని రహస్యాల్ని కడుపులో దాచుకుందో, అడవి తల్లి!
సంభ్రమాశ్చర్యాలతో దారులుచూస్తూ వాళ్ళు నడుస్తున్నారు.
‘‘గొలుసుకొండల కాడ పసరుపోసే ఆకులుంటయ్యా’’అని ఎవ్వరో గోపీనాయక్‌ని దార్లో అడిగారు.
‘‘అన్నీ ఉంటయ్యి’’అని ‘‘ఏంటికి’’అని గోపీ అడిగాడు.
‘‘రగతఁవ్ గట్టుకోవాల్నన్నా గాయాలు మానాల్నన్నా ఆకుపసర్లు పిండాలి. కట్లు గిట్టాలి.’’
‘‘అయ్యన్నీ ఉండయ్యిలే ఆడ’’అన్నాడు గోపీనాయక్.
వౌనంగా నడుస్తున్నారు వాళ్ళు.
దూరంగా ఏదో పక్షి వికృతంగా అరిచింది!
అందరూ తలలు పైకెత్తి, ఆకాశంలోకి చూసారు.
శవాల వాసన పసిగట్టి కాబోలు! రాబందుల గుంపు గుడారాలవైపుకు సాగిపోతోంది...
‘‘రాంబందులా’’ అడిగాడతను.
‘‘అయ్యేలే’’అన్నాడు రాగ్యా బాధగా.
అతనిక మాట్లడలేదు.
రాగ్యా, గోపీనాయక్ ముందు నడుస్తున్నారు. వాళ్ళ వెంటే మిగతా అడవి పుత్రులందరూ ఆపసోపాలు పడుతూ, బాధతో మూలుగుతూ, ఒకళ్ళ గాయాల నొకళ్ళుచూస్తూ ధైర్యంచెప్తూ ముందుకు సాగిపోతోన్నారు.
గంట గడిచింది. కొండల దగ్గరికి చేరారు.
రాగ్యా, గోపీనాయక్ తప్ప మిగతా వాళ్ళెవ్వరూ ఆ గొలుసు కొండల్ని గతంలో ఎప్పుడూ చూళ్ళేదు.
అక్కడి అడవి, వాతావరణం భీకరంగా వుంది!
ఆకాశాన్ని తాకుతున్నట్టున్న చెట్లు, కాండాల మధ్య స్థలంలేకుండా పెరిగిన బలమైన మానులూ, అక్కడక్కడా గుబురు పాదాలూ.. చీకట్లు ముసిరి అగమ్యగోచరంగా వుంది.
‘‘జల్మలో సూళేదు ఇసుఁవంటి అడివి’’ అన్నారెవ్వరో. ‘‘ఇదే మన తావరఁవ్! రుూడ దాంకున్నాఁవంటే భగఁవంతుడు గూడా పట్టుకోలేడు.. అందుకే తెచ్చానీడికి’’ అన్నాడు గోపీనాయక్.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు