డైలీ సీరియల్

గృధ్ర గోమాయు సంవాదము-116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం నైమిశారణ్య ప్రాంతంలో ఒక గృహస్థుడు ఉండేవాడు. అతనికి ఒక్కడే పుత్రుడు. దురదృష్టవశాత్తు ఆ బాలుడు చిన్న వయసులోనే మరణించాడు. అతని బంధువులంతా రోదిస్తూ ఆ శిశువు శవాన్ని తీసుకుని శ్మశానానికి వచ్చారు. వారు అక్కడ ఆ మృత పిల్లవాని చేష్టలు మాటలు గుర్తు తెచ్చుకొని మరల దుఃఖించసాగారు. వారికి ఆ మృతుని శరీరం అక్కడ వదలి వెళ్ళడానికి కాళ్ళు రాక అక్కడే ఉన్నారు.
ఆ సమయంలో వారి ఏడ్పులు విని ఒక గ్రద్ధ అక్కడికి వచ్చి వారితో ఇలా అంది - ‘‘ఓ మానవులారా! ఆ మృతుని ఇక్కడ వదిలివెళ్ళండి. ఇలా మరణించిన వారిని చాలా మందిని ఇక్కడే వదిలివెళ్ళారు. ఈ లోకంలో చావుపుట్టుకలు ఒకదాని వెంట ఇంకొకటి జరుగుతాయి. తమ ఆయువు తీరగానే ప్రతీప్రాణి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళవలసిందే. ఈ శ్మశానం నక్కలతో, రాబందులతో మానవ అస్థికలతో నిండి ఉంది. ఇక్కడ ఎంతసేపు నిలిచినా ఏమీ ప్రయోజనం లేదు. మనకు ప్రియమైనవాడైనా శత్రువైనా చివరకు ఇక్కడి రావలసిందే. చనిపోయిన వాడు మరల జీవించడు. కనుక బాలుని మీద మమకారం విడిచి పెట్టి వెనక్కి తిరుగండి’’. అప్పుడు ఆ బంధువులు నిరాశతో అక్కడి నుండి బయలుదేరారు.
ఇంతలో ఒక నల్లని నక్క అక్కడికి వచ్చి వారందరినీ ఆపి ఇలా అంది - ‘‘అయ్యో ఈ మనుష్యులు ఎంత కఠినులు. మూర్ఖులారా! ఇంకా ప్రొద్దు పోలేదు. పిల్లవాని మీద మమకారం వదలకండి. ఆ బాలుడు ఎప్పుడైనా బ్రతికి లేవవచ్చు. ఎందుకు నిర్దాక్షిణ్యంగా ఈ బాలుని ఒంటరిగా శ్మశానంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. పశు పక్షులకు తమ పిల్లల మీద అంత ప్రేమ ఉంటుందే మరి మీకు ఆ మాత్రం ప్రేమలేదా? పిల్లలు మనలను పెద్దవారయి పోషించినా, పోషించకపోయినా ఎంతో ప్రేమగా వారిని పెంచుతాము. ఇంకొంచెం సేపు వేచి చూడండి. ఏ అద్భుతమైనా జరిగి బాలుడు బ్రతుకవచ్చు. ఈ బాలుడు ఎంతో చక్కగా ఉన్నాడు. ఇలాంటి బాలుని ఎలా వదిలి వెళ్ళగలుగుతున్నారు’’?
నక్క మాటలు విని బంధువులు తిరిగి మృతబాలుని దగ్గరకు వచ్చారు. అప్పుడు వారితో గ్రద్ధ ఇలా అంది- ‘‘మళ్ళీ వెనక్కు వచ్చారా! అతను పంచేంద్రియశూన్యుడు. కట్టెలాగ బిగుసుకు పోయాడు. ఈ కట్టెకోసం దుఃఖిస్తారెందుకు? శరీరం పోతే అదృష్టం దురదృష్టం కూడా పోతాయి. అందుకే ఇతను మీకు దుఃఖాన్ని మాత్రమే మిగిల్చాడు. కనుక శోకాన్ని ధైన్యాన్ని వదలండి. పుత్రుని మీద మమకారాన్ని విడిచిపెట్టండి. ప్రాణి తాను చేసిన మంచి, చెడ్డ పనుల ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. ధనవంతుడైనా దరిద్రుడైనా, పండితుడైనా, మూఢుడైనా అందరూ ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వీడి పోవలసిందే. పోయిన వారు మరల బ్రతుకరు. కనుక వారి కోసం శోకించడం ఎందుకు? అందరినీ ఏదో ఒక సమయంలో మృత్యువు తన ఒడిలోకి తీసుకుంటుంది.’’
అప్పుడు నక్క ఇలా అంది- ‘‘ ఈ గ్రద్ధది అల్పబుద్ధి అందుకే పిల్లవాడి మీద మీకు ప్రేమ లేకుండా చేస్తున్నది. దీని మాటలతో ప్రభావితులై మీరు బాలుని వదిలి వెళుతున్నారు కదా దూడలకోసం ఆవులకుండే దుఃఖం కూడా మీకు లేదే. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం పొర్లుకు వస్తోంది. ఇష్టసిద్ధికై నిరంతరం ప్రయత్నం చేయవలసిందే. అప్పుడు దైవానుగ్రహం వలన అది ఫలిస్తుంది. దైవాను గ్రహం మానవ ప్రయత్నం వల్లనే సిద్ధిస్తుంది. ఈ బాలుడు మీ శరీరంలోంచి వచ్చిన వాడు మీ వంశానికి కర్త. అటువంటి వానిని ఇలా ఒంటరిగా ఎలా వదిలి వెళ్తారు? సూర్యుడు అస్తమించి సంధ్యాసమయం వచ్చే వరకు ఇక్కడ ఉండండి. ఆ తర్వాత ఏం చేయ్యాలో ఆలోచించండి.’’
అప్పుడు గ్రద్ధ ఇలా అంది - ‘‘నేను పుట్టి ఇప్పటికి వేయి సంవత్సరాలైంది. ఇంతకాలంలో చచ్చిన స్ర్తికాని, పురుషుడు కాని మళ్ళీ బ్రతకటం నేను చూడలేదు. కొందరు పురిట్లోనే చచ్చిపోతారు. కొందరు బాల్యంలో పోతారు. ఇంకొందరు వనంలో పోతార. ఈ స్థావర జంగమ ప్రకృతిలో ముఖ్యమైనది అయువే. ఎంతోమంది శోకిస్తూ ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. ఈ బాలుడు ఇప్పుడు తేజోహీనుడు. కట్టెలా అయిపోయాడు. మీరెంత ఏడ్చినా అతను లేచి వస్తాడా? ఈ శవం మిమ్మల్ని కళ్ళు విప్పి చూడదు. నోరువిప్పి మాట్లాడదు. మరెందుకు ఈ ప్రయాస? నా మాటలు కఠినంగా మీకు అన్పించవచ్చు. కాని అవి సత్యాలు’’. గ్రద్ధ మాటవిని బంధువులు ఇంటివైపు మరలారు.
అప్పుడు శీఘ్రంగా నక్కవారి వద్దకు వెళ్ళి ఇలా అంది. ‘‘పితరులకు పిండ ప్రదానం చేయవలసిన ఈ కుమారునికి వదిలి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఎవరైనా మహాత్ముడు మీ భాగ్యం వలన ఇక్కడికి వచ్చి ఈ బాలుని బ్రతికించ వచ్చు. ఏ దేవత అయినా మీ మీద కరుణ చూపించవచ్చు.’’ నక్కమాటలు విని రోదిస్తున్న బంధువులు మరల బాలుని దగ్గరకు వచ్చి నిలబడ్డారు.
వారిని చూసి గ్రద్ధ ఇలా అంది. ‘‘దైవ ఆజ్ఞ చేత అతను దీర్ఘ నిద్ర పోయాడు. ఇక లేవడు. మహాధనవంతులు, మేధావులు కూడా యమపురికి వెళ్తారు. బంధువులు పోయిన వారిని ఇక్కడ వదిలి ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోతారు. ఇది జీవన ధర్మం. ఇతడు ఇక జీవిస్తాడు అన్న నమ్మకం ఏమీ లేదు. వేలకొలది నక్కలు తమ శరీరాలను వదిలినా ఈ బాలుని జీవింపచేయలేవు. ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు - వీరిలో ఏవరైనా వరమిస్తే ఇతను జీవిస్తాడు. లేకపోతే జీవించడు. కంటితో చూడలేని వాడు ఎట్టి చలనం లేని వాడు అయిన ఇతడు మరణించి ఉన్నాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి