డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఎంత ఏడిస్తే ప్రయోజనం ఏమిటి?’’ బంధువులు ఈ మాటలు విని ఏడుస్తూ బాలుని అక్కడ వదిలి బయలు దేరారు.
అప్పుడు నక్క మరల వారిని ఆపింది. వారితో ఇలా అంది - ‘‘ఈ లోకం మిగుల దుఃఖదాయకం. ఇక్కడ సమస్త ప్రాణులు చివరకు నశిస్తాయి. కనుక బంధువులకు ఈ వియోగం తప్పదు. ఈ జగత్తు అంతా అసత్యమయం, అసంతృప్తికరం. ఏ మాత్రం హృదయం కల గ్రద్ద మాటలు విని పుత్రశోకంతో బాధపడుతూ కూడా మీరెందుకు వెనుదిరిగారు? సుఖం తర్వాత దుఃఖం తర్వాత సుఖం నిరంతరం కలుగుతుంటాయి. ఈ లోకంలో సుఖం కాని దుఃఖం కాని ఏదీ నిలకడగా ఉండదు. అందంగా ఉండి వంశానికి వనె్న తెచ్చేవాడిని ఇక్కడ వంటరిగా ఎలా వదిలి వెళ్తున్నారు? మీరు మనస్సుతో చూస్తే తను జీవించే ఉన్నాడు. ఇతను బ్రతుకుతాడు. ఈ విధంగా ఇతన్ని వదిలి మీరు వెళ్ళడం భావ్యం కాదు. ‘ఈ బాలుని వల్ల మేము సుఖిస్తాము’ అన్న భావనతో ఇక్కడే నిలవండి’’.
నక్క ఎల్లప్పుడూ శ్మశానంలోనే ఉంటుంది. తన పని నెరవేరటం కోసం అది చీకటి కోసం ఎదురుచూస్తోంది. అందువల్ల ధర్మరూపమైన తియ్యని మాటలు వారికి చెప్పి వారిని ఆపింది. వారు అక్కడ ఉండలేక వెళ్ళలేక చివరకు అక్కడ నిలిచిపోయారు.
గ్రద్ధకు వారు అక్కడ ఉండడము ఇష్టం లేదు. అందుకని వారిని పంపేయటానికి వారితో ఇలా అంది - ‘‘ఈ శ్మశానం ప్రేతాలతో నిండి ఉంది. ఇక్కడ యక్ష రాక్షసులు నివసిస్తారు. గుడ్లగూబలు తిరుగుతున్నవి. ఇక్కడ ఉండడము క్షేమ కరం కాదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ప్రకాశవంతంగా ఉన్నప్పుడే బాలుని ఇక్కడ వదిలి వెనక్కు మరలండి. చీకటి పడితే పిశాచాలు వికృత రూపాలతో ఇక్కడ సంచరిస్తాయి. మీరు ఇక్కడే ఉంటే అవి మిమ్మల్ని పీక్కు తింటాయి. కనుక వెళ్ళిపోండి.’’ అప్పుడు నక్క దాని మాటలు విని ఆ బంధువులతో ఇలా అంది - ‘‘మీకు ఏమీ భయం లేదు వెలుగు ఉన్నంతవరకు ఉండండి. పిల్లవాని కరవుదీరా చూచుకొనండి. ఈ పితృవనంలో మీకు ఎలాంటి భయము ఉండదు. మాంసం తినే గ్రద్ధ మాట నమ్మకండి.’’
గ్రద్ధ, సూర్యుడు అస్తమించాడు కనుక బంధువులను శ్మశానం వదలి పొమ్మంది. నక్క వద్దంది.
ఆ గ్రద్ద, నక్క తమ తమ స్వార్థ వాంఛలతో వారితో అలా పలికినవి. అందుకు శాస్త్రాలను ఆధారం చేసికొన్నాయి. వారిరువురి మాటలు వింటూ ఎటూతోచక బంధువులు అక్కడ నిలబడ్డారు. తమ పని చక్కబెట్టుకోవడంలో నైపుణ్యం కల ఆ రెండు వారిని తికమక పెట్టాయి. ఆ రెండింటికీ జ్ఞానం బాగా ఉండటంతో ఎవరి వాదన వారు సమర్థవంతంగా కొనసాగించాయి.
పగటిపూట అయితే గ్రద్దకు లాభం. అందుకని బంధువులను పొమ్మంది. రాత్రి సమయం నక్కకు లాభం. అందుకని వారిని పగలు ఉండమంది. ఈ విధంగా వాదోపవాదాలు జరుగుచుండగా పార్వతీదేవి ప్రేరణతో పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఎంతో దయగా వారిని వీక్షించి వారికి కావలసిన వరం కోరుకొమ్మన్నాడు. దుఃఖంతో ఉన్న బంధువులు స్వామికి ప్రణామం చేసి బాలునకు జీవన దానం చేయుమని వేడుకొన్నారు.
సర్వభూతహితం కోరే మహేశ్వరుడు ఆ బాలునకు నూరు సంవత్సరాల ఆయుర్దాయం అనుగ్రహించాడు. అందరూ ఈశ్వరునికి నమస్కరించి జీవించిన బాలునితో కూడి సంతోషంగా తమ గృహాలకు వెళ్ళిపోయారు. మరణించిన తమ బాలుడు తిరిగి జీవించడం వలన వారికి ఆశ్చర్యం కలిగింది. భగవంతుని అనుగ్రహం ఉంటే తప్పక సత్ఫలితం కలుగుతుంది.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి