డైలీ సీరియల్

అనంతం-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడతనికి వర్తమానం తప్ప - గతం, భవిష్యత్తు... రెండూ మనసులో నుంచి చెరిగిపోయాయి.
‘‘ఏం జాద్దాఁవూ’’అని, గోపీనాయక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు.
‘‘తండా కాడికి బో!’’ అన్నాడు గోపీనాయక్.
రాగ్యా తలాడించాడు.
వౌనంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
తర్వాత-
గుహలో అజ్ఞాతవాసం ప్రారంభించిన అడవిపుత్రుల్ని గురించి ఆలోచనలో పడ్డాడు గోపీనాయక్!
ఆకలిదే వాళ్ళ తక్షణ సమస్య!
అది ఒకనాటితో తీరిపోయేదికాదు.
ఆశ్రయం ఇచ్చి ఓదారిస్తే తీరిపోదు, ఆకలి సమస్య!
దానికో శాశ్వత పరిష్కారం కావాలి..
పండ్లూకాయలూ తింటూ ఎంత కాలం నెట్టుకురాగలరూ!?
అంతమంది అడవి పుత్రులకు ఆహారం అందించటం ఎలా?
గోపీనాయక్ తీవ్రంగా ఆలోచించాడు.
పోలీసులకీ, ఫారెస్టుగార్డులకీ తెలియకుండా, మిగతా తండాలనుంచి ఆహారం సేకరించాలి. కావిళ్ళతో తెచ్చి గుహకు చేర్చాలి.
అన్ని తండాలవాళ్ళూ సహకరిస్తే అదేమంత అసాధ్యమైన గొప్ప పనికాదు!
పరిస్థితులు చక్కబడి, పోలీసులు ప్రభుత్వం శాంతించేదాకా అడవి పుత్రులకు బైటికివెళ్ళే అవకాశం లేదు. కనిపిస్తే ఏంచేస్తారో!
అప్పటిదాకా వాళ్ళకి వేళకింత రాగి సంకటి దొరకాలంటే అంతకన్నా మార్గం లేదు!
గోపీనాయక్ అనుచరులను పిల్చాడు. వాళ్ళతో సుదీర్ఘంగా మాట్లాడాడు. సూచనలు, సలహాలూ ఇచ్చాడు. దైర్యం చెప్పాడు.
అనుచరులు పొదలను చాటుచేసుకొంటూ, ఎవ్వరికీ కనిపించకండా అడవి దారుల్లో నడుస్తూ తండాలకు వెళ్ళిపోయారు.
గోపీనాయక్‌ని మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి!
అన్యాయంగా చాంద్‌నీని పొట్టన పెట్టుకున్నారు కనుకనే నగ్గూరాం కనకయ్యని చంపాడు... నయవంచనతో తన జీవితాన్ని నాశనం చేసినందుకే గరుడాచలాన్ని చంపాడు రాగ్యా. ఉనికినీ, సంస్కృతినీ, అడవి పుత్రుల ఆచారాల్ని కట్టుబాట్లనీ ధ్వంసం చేసినందుకే వాళ్ళు నాగరికుల గుడారాల మీద దాడిచేశారు.
ఏది హింస? ఏదహింస?
హింస ముందా? ప్రతి హింస ముందా?
అడవి భూములకోసం, భూగర్భ సంపదలకోసం, ‘సిరిపుత్రుల’ ప్రయోజనాలకోసం- అడవి అందాల్ని చిదిమేసే దుష్టచర్యకి పాలకులు పాల్పడకపోతే, గిరిపుత్రులు నాగరికుల గుడారాల మీద దాడిచేసేవాళ్ళే కాదు.
దాన్ని- ‘‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం’’ అంటారా..
చంపేదైనా బ్రతికించేదైనా చట్టమే అంటే- బ్రతికనివ్వని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఐనా బ్రతకాలనుకోవటం-
మనిషి సహజ లక్షణం!
* * *
కాళ రాత్రిని కాలగర్భంలో కలిపి, మళ్ళీ సూర్యోదయమైంది!
చీకట్లను బుంగలతో క్రుమ్మరించుకొని, రాత్రంతా స్నానంచేసిన అడవి, పచ్చచీర కట్టుకొని ముస్తాబైంది!
తెల్లగా తెల్లవారింది...
ఎన్ని రంగుల సమ్మేళనమో- ఆ తెల్లదనం!?
మనుషుల్లో చలనం దేవుడెరుగు- వార్తల్లో సంచలనం!
సంచలనాత్మక మీడియా మిర్చిమసాలా కథనాల్లో-
‘‘అడవిలో తుపాకుల ధనా...్ధన్...!’’
‘‘తూటాలకు గిరిజనులు ఫటా..్ఫట్..!’’
అసెంబ్లీలో..
‘‘అధ్యక్షా! ఇది దారుణం’’అన్నది ప్రతిపక్షం.
‘‘ఆత్మరక్షణార్థం’’అన్నది అధికార పక్షం.
‘‘ఆత్మరక్షణ అబద్ధం అధ్యక్షా...’’
‘‘మీ కాలంలో జరగలేదా?’’
‘‘జరగలేదు.’’
‘‘మూడు తుపాకులు ఆరు శవాలుగా వర్ధిల్లింది మీ ప్రభుత్వం.’’
‘‘అబద్ధం అధ్యక్షా! మా పాలనలో జరిగింది స్వీయ రక్షణార్థం కానీ, ఆత్మరక్షణార్థం కాదు! ఆత్మ నిప్పుల్లో కాలదు. నీళ్ళల్లో తడవదు. దానికి మరణం లేదు. ఇక దాని రక్షణార్థం తుపాకులు కాల్చే అవసరం ఏమిటి అధ్యక్షా?’’
‘‘ప్లీజ్, కం టుది పాయింట్.’’
‘‘స్వీయ రక్షణార్థం మేము చేసిన ఎన్‌కౌంటర్లను ఆత్మరక్షణకోసం చేసినవని చెప్పి అధికారపక్షం వాళ్ళు సభని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది సభాహక్కులకు భంగకరం అధ్యక్షా...!’’
‘‘ప్లీజ్ లిజన్మీ..! హౌస్ కమిటీ వేద్దాం... స్వీయ రక్షణో, ఆత్మరక్షణో తేలుద్దాం! సభాహక్కులకు భంగం కలిగిందో- లేదో, విచారిద్దాం.’’
‘‘నిరసనగా వాకౌట్ అధ్యక్షా..!’’
అసలు విషయం బైటికి పొక్కలేదు...
గండం అలా గట్టెక్కింది!
అక్కడ-
‘రక్త బిందు సేద్యం’తో శవాల పంట పండిన అడవి. కళింగ యుద్ధ భూమిలా వుంది!
రక్తం అంటిన ఆయుధాలు- ఖండ ఖండాలుగా మానవ శరీర భాగాలూ- బూడిద కుప్పలూ- పీనుగులూ- పైన తిరిగే రాబందులూ-
శవాల మీద ఈగలూ- కమురువాసనా- క్షతగాత్రుల ఆర్తనాదాలొ- గూడుకట్టే శ్మశాన నిశ్శబ్దం..
అన్నీ ఉన్నాయి కానీ,-
హృదయం కరిగి, జ్వలించి పుటంపడి నిర్మలమై- రక్తాన్నం త్యజించిన మరో అశోకుడి కోసమే ఎదురుచూపులు!
అంతలో-
అదనపు పోలీసు బలగాలు మరికొన్ని వచ్చాయి!
యుద్ధానంతర చర్యలు మొదలై-
శవాలను వాహనంలోకి చేర్చారు.
క్షతగాత్రుల్ని మరో వాహనంలో ఎక్కించారు.
పొలి కట్టెలతో నేలంతా ఊడ్చి, శుభ్రం చేశారు.
రక్తం మరకల్ని కడిగారు.. క్రొత్త గుడారాలు లేచాయి.
గాడి పొయ్యిలు తయారయ్యాయి.
వంట మొదలైంది..
గుడారాల్లో మంతనాలు మొదలయ్యాయి!
‘‘లంచ్ రెడీసార్’’ ఎవ్వరో అన్నారు. భోజనాలు చేసి, విధి నిర్వహణకోసం బయల్దేరారు.
సాయుధ పోలీసు బలగాలు రెడ్డియానాయక్ తండావైపుకు తరలి వెళ్తున్నాయి!
* * *
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు