డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి ఉత్తరదిక్కున ఒక మ్లేచ్ఛదేశం ఉండేది. ఆ దేశంలో మధ్యదేశీయుడైన వాడు, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడు ఒక గ్రామానికి భిక్షాటన కోసం వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి సమస్త వర్ణాల వివరాలు తెలుసు. పైగా అతను ఆడి తప్పనివాడు. బ్రాహ్మణ భక్తుడు. బ్రాహ్మణుడు అతని ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. దొంగ అతనికి సంవత్సరానికి సరిపడే ఆహార సామాగ్రి, బట్టలు, అతనికి సేవచేయడానికి ఒక వితంతు స్ర్తిని సమకూర్చాడు. బ్రాహ్మణుడు ఆ గృహంలో, దాసితో సుఖంగా ఉంటున్నాడు. దొంగ ఆ దాసీ కుటుంబానికి కూడా ధనసహాయం చేశాడు.
బ్రాహ్మణుడు ఆ వ్యాధుని ఇంటిలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆ ద్విజుని పేరు గౌతముడు. అతను చాలా కష్టపడి గురి చూసి బాణం వేయడం నేర్చుకుని, వేటగానితో రోజు తిరిగి హంసలను వేటాడసాగాడు. అలా అతను వేటాడటంలో నేర్పు సంపాదించాడు. అతనికి దయలేనందువల్ల వేటలోనే ఆనందాన్ని పొందేవాడు. ఇంకా దోపిడీ దొంగల సాంగత్యంతో వారిలాగే తయారయ్యాడు. ఆ దస్యుల గ్రామంలో సుఖంగా జీవిస్తూ, ఎన్నో మృగాలను వేటాడుతూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఆ గ్రామానికి ఇంకొక బ్రాహ్మణుడు వచ్చాడు అతను జటలను, నారబట్టలు, మృతచర్మం ధరించి ఉన్నాడు. అతడు స్వాధ్యాయపరుడు, పవిత్రుడు, వినయశీలి, నియమానుసారం ఆహారాన్ని స్వీకరించేవాడు. పైగా బ్రాహ్మణ భక్తుడు. విద్వాంసుడు, బ్రహ్మచారి. అతను గౌతముని గ్రామానికి చెందినవాడు. దేశసంచారం చేస్తూ అతను ఈ దస్యు గ్రామానికి వచ్చాడు. అతను శూద్రాన్నాన్ని భుజించడు కనుక బ్రాహ్మణ గృహాన్ని వెతుక్కుంటూ చివరకు గౌతముని గృహానికి వచ్చాడు. గౌతముడు అప్పుడే వేటనించి ఇంటికి వచ్చాడు చంపిన హంసలను భుజానవేసుకుని ఒళ్ళంతా రక్తంతో, చేతిలో ఆయుధంతో వచ్చిన గౌతముని చూచి, ఆ బ్రాహ్మణుడు సిగ్గుపడి ఇలా అన్నాడు- ‘‘గౌతమా! ఇది ఏమిటి? నీవు ఉత్తమ వంశంలో జన్మించావు. మధ్యదేశంలో ప్రసిద్ధుడివి. నీవు వేటగాడిగా ఎందుకు మారావు? నీ పూర్వులు అంతా సద్బ్రాహ్మణులు, వేద పారంగతులు... అలాంటి వంశంలో పుట్టిన నీవు ఇలా కుల భ్రష్ఠుడివి అయినావేమిటి? ఇప్పుడైనా మించి పోలేదు. నీ శీలాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, శాస్తజ్ఞ్రానాన్ని నీ బ్రాహ్మణ కులానికి తగినట్టు అలవర్చుకో. ఈ నివాసాన్ని వదిలి పెట్టు’’. మిత్రుడు ఇలా బోధించగా గౌతముడు ఇలా అన్నాడు- ‘‘ద్విజోత్తమా! నేను వేదవేత్తను కాను. పైగా దరిద్రుడను. ఇక్కడికి ధనం కోసమే వచ్చాను. నీ దర్శనం వల్ల కృతార్థుడనైనాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండు. రేపు వెళదాము’’. అతని మాటలు విని ఆ మిత్రుడు అక్కడ ఏమీ తాకకుండా, భోజనం చేయకుండా ఆ రాత్రి అక్కడ ఉన్నాడు.
రాత్రి గడచిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వెళ్లిపోయాడు. గౌతముడు సముద్ర తీరానికి వచ్చి అక్కడ కొందరు తీరవాసులతో కలసి సముద్రం దగ్గరకు వెళ్లాడు. వారంతా వ్యాపారులు వారు అక్కడ కొండ గుహలో కొంతసేపు విశ్రాంతి కోసం ఆగారు. ఇంతలో వారి మీదకు ఒక మదగజం వచ్చి వారిలో చాలామందిని త్రొక్కి చంపేసింది. గౌతముడు దాని బారినుండి ఎలాగో తప్పించుకుని ఉత్తర దిక్కుకు పరుగెత్తాడు. ఆ దేశం నుంచి కూడా తప్పించుకొని అతను అడవిలో తిరుగసాగాడు. తిరిగి తిరిగి మళ్ళీ సముద్రం వైపు వెళ్ళే దారిలోకి వచ్చాడు. అలా వెళ్ళి అతను ఒక సుందరమైన వనంలోకి ప్రవేశించాడు. అది యక్షకిన్నరులకు నివాసమైన ప్రదేశం. అక్కడ అనేక రకాలైన ఫల, పుష్పజాతుల వృక్షాలు ఉన్నాయి.
ఆ సుందర ప్రదేశంలో ఒకచోట గౌతముడు ఒక పెద్ద మఱ్ఱిచెట్టును చూశాడు. దాని మూలం గంధపు నీటితో తడిసి ఉంది. గౌతముడు ఆ చెట్టుక్రింద కూర్చున్నాడు. అక్కడే సుఖంగా నిద్రించాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అప్పుడు ఒక అద్భుతమైన పక్షి బ్రహ్మలోకాన్నుంచి తన నివాసానికి వచ్చింది. ఆ పక్షి పేరు నాడీజంఘడు. ఆ పక్షి బ్రహ్మదేవునికి ఆప్తమిత్రుడు. కశ్యపుని కుమారుడు. ఆ అసమాన పక్షి ఈ భూమండలం మీద రాజధర్ముడు అన్నపేరుతో ప్రఖ్యాతి చెందాడు. అతడు దేవకన్యాపుత్రుడు కావటం చేత అతని శరీరం కాంతివంతంగా ఉంటుంది. అతను దివ్య ఆభరాణాలతో తన శరీరాన్ని అలంకరించుకున్నాడు. ఆ పక్షిని చూచి గౌతముడు ఆశ్చర్య పోయాడు. అప్పటికే గౌతమునికి బాగా ఆకలిగా ఉంది. కనుక రాజధర్ముని చంపి తినాలని అనుకున్నాడు. అప్పుడు రాజధర్ముడు అతనితో ఇలా అన్నాడు- బ్రాహ్మణా! నీకు స్వాగతం! నా భాగ్యం వలన నీవు నా యింటికి వచ్చావు. సూర్యుడు అస్తమించాడు. ఈ సమయంలో నా యింటికి వచ్చిన అతిథివి. నా ఆతిధ్యాన్ని స్వీకరించు. ప్రొద్దున నీ త్రోవన నీవు వెళ్ళవచ్చు!’’. అతని మాటలను ఆశ్చర్యపడి గౌతముడు అతని వైపు కుతూహలంగా చూచాడు. అప్పుడు రాజధర్ముడు ఇలా అన్నాడు.- ‘‘ద్విజోత్తమా నేను కశ్యపుని పుత్రుడను, మా తల్లి దక్ష ప్రజాపతి పుత్రిక. నీవు మంచి అతిథివి. నీకు స్వాగతం’’ ఇలా పలికి అతను గౌతమునికి అతిథి సత్కారాలను చేసి, గంగలో ఉండే పెద్ద చేపలను తెచ్చి అతనికి వడ్డించాడు. గౌతముడు వాటిని ఆనందంగా తిన్నాడు. అతని శ్రమ పోగొట్టటానికి నాడీ జంఘుడు తన రెక్కలతో విసిరాడు. తర్వాత నాడీ జంఘుడు అతని వివరాలు అడిగితే ఆ విప్రుడు తన పేరు గౌతముడని తను బ్రహ్మణుడనని చెప్పాడు. తర్వాత నాడీజంఘుడు అతనికి ఆకులతో, పుష్పాలతో చక్కని శయ్య అమర్చాడు. గౌతముడు సుఖంగా పడుకున్నాడు. అప్పుడు నాడీ జంఘుడు గౌతముని రాకకు కారణమడిగాడు. గౌతముడు ఇలా చెప్పాడు- ‘‘మహాత్మా నేను డబ్బు సంపాదించటానికి సముద్ర తీరానికి బయలుదేరాను.’’
అప్పుడు కాశ్యపుడు ఇలా అన్నాడు. ‘‘ద్విజోత్తమా! ద్రవ్యం కోసం అంతదూరం పోనక్కర్లేదు. నీకు తప్పక ధనం లభిస్తుంది. ధనం నాలుగు రకాలుగా సిద్ధిస్తుందని బృహస్పతి చెప్పాడు. 1) వంశపారంపర్యంగా వచ్చేది 2) ప్రారబ్ధానుసారం లభించినది. 3) ధనార్ధసకామంగా చేసే కర్మల వల్ల వచ్చేది. 4) మిత్రుని సహాయంతో ప్రాప్తం అయ్యేది. నేను నీకు మిత్రుడిని అయ్యాను. కనుక నీవు ధనవంతుడివి కావటానికి నేను ప్రయత్నిస్తాను.’’ మరునాడు ఉదయం రాజధర్ముడు గౌతమునికి సహాయం చేయదలచి ‘‘ఈ త్రోవన వెళ్ళు నీకు ధనం లభిస్తుంది’’.
ఇక్కడికి మూడు యోజనాల దూరంలో రాక్షసరాజు విరూపాక్షుడు ఉంటాడు. అతను నాకు ఆప్తమిత్రుడు. అతను నీకు కావలసిన ధనం ఇస్తాడు. అతని మాటలు విని గౌతముడు బయలుదేరాడు. అతను చందనం, ఏలకులు, లవంగం తీగలు కల చెట్ల మధ్యలోంచి వెళ్తూ తియ్యని పండ్లను తింటూ వెళ్లాడు. చివరకు అతను మేరువజ్రం అనే నగరానికి చేరాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి