డైలీ సీరియల్

అనంతం-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగ్యా వేగంగా పరుగులు తీస్తున్నాడు!
అలవాటైన దారే అయినా ఇప్పుడా అడవి దారిలో పరుగులు తియ్యటం అతనికి చాలా కష్టంగా వుంది!
ఎదురు రాళ్ళు తగుల్తున్నాయి!
తూలి పడబోతూ, అంతలోనే తమాయించుకొంటూ నీరసంతో బూజరగా వున్న కంటి చూపుని ప్రయత్నంమీద నిలుపుకొంటూ, ధ్యేయంవైపు సాగిపోతోన్నాడు రాగ్యా!
త్వరగా తండాకి చేరుకోవాలి.
వాళ్ళను రక్షించాలి.
ఎవ్వరైనా తనను చూస్తే ఎంత ప్రమాదం!
గరుడాచలాన్ని హత్యచేసినందుకు ‘నల్లకొండ కుట్ర’ కేసు పెడతారు! లాఠీలతో కుళ్ళపొడిచి ఎందుకూ పనికిరాకుండా చేస్తారు.
జీవితాంతం జైల్లో ఉంచేందుకు ఏఏ సెక్షన్లున్నాయో- ఆ సెక్షన్లన్నీ పెట్టి కేసు బనాయిస్తారు.
అనామకుడైన ఓ అడవి పుత్రుడు భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తే సహిస్తారా?!
కొంత దూరం పరుగెత్తి, అలుపు తీర్చుకుంటూ ఒకచోట ఆగాడు రాగ్యా!
అదో చిన్న మైదానంలా ఉంది!
చెట్లు గుట్టలు పొదలూ లేవు.
సూర్యకిరణాలు తాకి శరీరం చురుక్కుమన్నది!
క్షణం విరామం తర్వాత మళ్ళీ పరుగులు లంకించుకున్నాడు.
తండా ఎంతో దూరంలో లేదు.
కనుచూపుమేరలో ఉన్న నాగజెముడు తుప్పలు దాటితే, అక్కడ్నించి మహాఐతే రెండు నిమిషాల పరుగు దూరం!
ఎవ్వరో ఆపినట్టే రాగ్యా ఎందుకో ఒకచోట ఆగాడు!
ఎదరగా ఓ చెట్టుకొమ్మకి వ్రేలాడుతోంది తేనెపట్టు.
అతనికి చాంద్‌నీ గుర్తొచ్చింది!
ఈగలు..
తేనెటీగలు..
పట్టునిండా లుకలుక లాడుతూ ఈగలు..
చాంద్‌నీకి మల్లేనే ఆ తేనె పట్టును కౌగిలించుకుంటే ఎలావుంటుందీ!
అవ్వి తన శరీరంలోకి ములుకులు దించితే హాయిగా ఉంటుందా?
తేనె పట్టువైపుకు రెండడుగులు వేశాడు.
మంత్రించినట్టే ఆగిపోయాడు!
పాప పంకిలం కాకుండా చాంద్‌నీ శరీరాన్ని పదిలంగా పవిత్రంగా మృత్యువు ఒడికి చేర్చి సేదతీర్చి ఆదరించిన ఆ తేనెటీగలు విషతుల్యమైన తన శరీరంలో ములుకులు దించేందుకు సిద్ధపడవేమో!
పరితప్త హృదయంలో చెలరేగే అంతరంగ కల్లోలాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతూ క్షణక్షణం మనోవేదనతో కృంగిపోతూ, కర్మఫలం అనుభవించమని శపిస్తాయే తప్ప ఆదరించి అక్కున చేర్చుకుంటాయా?
రాగద్వేషాలకు అతీతమైన పుణ్య లోకాలకి వెళ్ళిన చాంద్‌నీ ఒకవేళ ఆ తేనెటీగల్ని సమాధానపరచినా, చనిపోయే అవకాశం ఇప్పుడు లేదుకదా తనకు!
తండాకి వెళ్ళాలి.
అక్కడివాళ్ళను రక్షించాలి.
రక్షించాలంటే తను బ్రతికే ఉండాలి.
బ్రతుకే కాదు, కోరిన మరణంకూడా పొందేందుకు అవకాశం లేని నికృష్టపు జీవితం తనది!
ఏం చెయ్యాలి?
పాప పరిహారార్ధం మిగిలిన ఒకేఒక్క మార్గం అడవి పుత్రుల్ని రక్షించటం!
తేనె పట్టుమీదనుంచి దృష్టిమరల్చి, దూరంగావున్న తండావైపు చూశాడు రాగ్యా!
గుడిశెలు కనిపిస్తున్నాయి.
బయల్దేరాడు..
గుడిశల సముదాయాన్ని చేరుకొంటున్నాడు..
అంతలోనే ఏదో సందేహం!
ఇప్పుడు-
అక్కడికి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు. ప్రమాదం గురించి హెచ్చరిస్తాడు. రక్షిస్తానంటాడు. తన వెంట రమ్మంటాడు..
అదంతా వాళ్ళు నమ్ముతారా?
తనవెంట గొలుసుకొండల దగ్గరికి వస్తారా?
నమ్మరు. తన మాటల్ని చచ్చినా నమ్మరు..
అది వాళ్ళ తప్పేమీకాదు.
మంచివాడు చెప్పే అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా ఎవ్వరూ చెడ్డవాడు చెప్పే నిజాన్ని నమ్మరు!
అప్పుడేం చెయ్యాలి?
వాళ్ళనెలా నమ్మించాలి?
కన్నీళ్ళతో వాళ్ళ పాదాలు కడిగి, చేసిన తప్పలు ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటే క్షమించి నమ్ముతారా?
ఇంకా అడవి పుత్రుడిగానే చూస్తే నమ్ముతారేమోగానీ, నాగరికుల సహవాసంతో కల్మష భరితమైన నా కన్నీళ్ళనెలా నమ్ముతారూ?
అయినా తప్పదు..
వెళ్ళాలి..
వాళ్ళని రక్షించాలి.
డోలాయమానంనుంచి రాగ్యా స్థిరచిత్తంలోకొచ్చాడు.
పరుగెత్తుతూనే తండా చేరుకున్నాడు!
అక్కడ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది!
లక్ష్మీబాయి నేలలల్లుకొని ఏడుస్తుంటే, ఎవరెవ్వరో ఆమెను ఓదారుస్తున్నారు. ఆమె మరింత పెద్దగా ఏడుస్తూ, భర్త జ్ఞాపకాలను తల్చుకొంటూ, గుండెలు బాదుకొంటున్నది.
తండాఅంతా విషాద మేఘాలు క్రమ్మి, కన్నీటి జడివాన కురుస్తున్నట్టుంది!
ఎప్పుడూ ‘‘వరి బువ్వ... వరిబువ్వ’’అని ఏడ్చే వాల్యా ఇప్పుడు ‘‘అయ్య...అయ్య’’ అని ఏడుస్తున్నాడు.
నగ్గూరాం ఇంట్లో దీపంపెట్టే దిక్కే లేకుండా పోయింది.
తండ్రి మరణంతో విషాదానికి పురుడుపోస్తున్నట్టున్న తన ఇంటివైపు ఒక్క క్షణం చూశాడు రాగ్యా.
భరించలేక పోయాడు.
గబగబా నడుస్తూ లక్ష్మీబాయి దగ్గరికి వెళ్ళాడు.
‘‘రాజ్యాగాడొచ్చిండు’’ అన్నారెవ్వరో.
అందరూ తలలెత్తి రాగ్యావైపు చూశారు!
విస్మయం, అసహ్యం, కోపం... అన్నీ కనిపించాయి వాళ్ళచూపుల్లో!
‘‘బతికే ఉండావా’’ రాగ్యాని లక్ష్మీబాయి అడిగింది.
‘‘మడిసిని మిగిలుండాను’’ అన్నాడు రాగ్యా విరక్తిగా.
‘‘ఏంటికొచ్చావ్’’
‘‘గోపీనాయక్ మిమ్ముల్ని పిల్సకరమ్మండు’’
‘‘యాడుండాడు’’
‘‘రగస్యె తావరాఁవ్లో ఉంటాడు! అందరూ ఆడ్నే ఉండారు! తండామీన పోలీసోళ్లు దాడి శాత్తారంట. కనిపిత్తే కాల్సేత్తారేవో!’’
‘‘అందుకు దాంకున్నారా’’ అని లక్ష్మీబాయి అడిగింది.
రాగ్యా ఏదో చెప్పబోయాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు