డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -119

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్షస రాజుకు గౌతముడు, తన మిత్రుడు నాడీజంఘుడు పంపగా వచ్చాడని తెలిసింది. అతను సేవకులను పంపి గౌతముని సాదరంగా ఆహ్వానించాడు. వారు వేగంగా వెళ్ళి అతనిని రాజభవనంలోకి తెచ్చారు. అతను అక్కడ విరూపాక్షుడు చేసిన సత్కారాలను పొందాడు. రాజు అతని గోత్రాన్ని, శాఖను, బ్రహ్మచర్య సమయంలో చేయవలసిన వేదాధ్యయన గురించి ప్రశ్నించగా గౌతముడు తన కులం గురించి తప్ప ఇంక దేనికి సమాధానం చెప్పలేక పోయాడు. బ్రహ్మతేజం లేక, వేదాధ్యయనం లేక కేవలం జన్మచేత ద్విజుడు అయిన గౌతముని నివాసం గురించి రాజు ఇలా అడిగాడు. ‘‘విప్రుడా నీ ఊరు ఏది? నీ భార్య ఏ వంశంనుంచి వచ్చింది? భయపడకుండా నిజం చెప్పు’’.
గౌతముడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాజా! నేను మధ్యదేశంలో పుట్టాను. ప్రస్తుతం నా నివాసం శబరుల నగరం. నా భార్య శూద్ర జాతిలో పుట్టింది. మొదట ఆమె ఇంకొకని భార్య. ఇప్పుడు నా భార్య. నేను నిజమే చెప్పాను’’.
అతని మాటలు విన్న రాక్షసరాజు ఇలా ఆలోచించాడు - ‘‘ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు పుణ్యం కలుగుతుంది? ఇతడు కేవలం జన్మచే మాత్రమే బ్రాహ్మణుడు. ఆ మహాత్మునికి మిత్రుడు. అతను పంపాడు కనుక అతనికి ఇష్టమైనది చేస్తాను. కశ్యప పుత్రుడు నాకు సోదరుడు. బంధువు. కనుక ఏదో ఒకటి చేయాలి. రేపు కార్తీక పౌర్ణమి. వేయిమంది వేదవేత్తలైన బ్రాహ్మణులు నాయింట భోజనం చేస్తారు. వారితో పాటు ఇతను కూడా భోజనం చేస్తాడు. కొంత ధనమిచ్చి పంపిస్తాను.’’
తర్వాత అక్కడికి వేయి మంది బ్రాహ్మణ వేద పండితులు వచ్చారు. వారందరినీ విరూపాక్షుడు ఆహ్వానించి, వారిని ఉచిత ఆసనాలమీద కూర్చుండబెట్టి శాస్త్రానుసారంగా పూజించాడు. వారిలో విశ్వదేవులను, పితరులను, అగ్నిని భావనచేసి వారికి గంధం, మాలలు, వస్త్రాలు సమర్పించాడు. తర్వాత వారికి పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం పెట్టించాడు. అతను ఈ కార్తీక పౌర్ణమి రాత్రి బ్రాహ్మణులకు రత్నాలను దానం చేస్తాడు. వారు భోజనం చేసిన తర్వాత వారి ఎదుట బంగారం, మణులు, ముత్యాలు, రత్నాలు మొదలైన రాసులను ఉంచాడు. వారికెంత కావాలంటే అంత సంపదని తీసుకోమన్నాడు. వారు తిన్న బంగారు కంచాలను కూడా దక్షిణలుగా తీసుకోమన్నాడు.
అతని మాటలతో ఆ బ్రాహ్మణులు ఆనందించి తమకు కావలసినంత రత్నాలను, బంగారాన్ని తీసుకున్నారు. రాజు తర్వాత అన్ని దేశాలనుంచి వచ్చిన రాక్షసులను హింసాకార్యాలను మానుమని ఆదేశించాడు. ‘‘ఈ రోజు మీకు రాక్షసుల వల్ల హాని జరుగదు’’ అని పండితులకు చెప్పి వారిని పంపించాడు.
గౌతముడు బంగారాన్ని అతి కష్టంమీద మోసుకుంటూ మఱ్ఱి చెట్టుక్రిందకు తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో ఉన్నాడు. అప్పుడు అతని దగ్గరకు రాజధర్ముడు వచ్చి స్వాగతం పలికి అతన్ని పూజించి, భోజనం పెట్టాడు. ఆ పక్షిరాజు తన రెక్కలతో విసిరి అతని మార్గాయాసం పోగొట్టాడు. గౌతముడు పడుకుని ఇలా ఆలోచించాడు. ‘‘బంగారం మీద మోజుతో చాలా తెచ్చాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. దారిలో తినడానికి ఏదైనా ఉంటే గాని ప్రాణం నిలవదు. ఏం చేయాలి? ఈ పక్షిరాజు నా ప్రక్కనే పడుకున్నాడు. ఇతన్ని చంపి తీసుకుని వెళితే దారిలో కావలసినంత ఆహారము లభించినట్లే.’’
పక్షిరాజు తన మిత్రుడు వెచ్చగా పడుకోవాలని కొంచె దూరంలో మంటలు వేశాడు. ఆ నిప్పు గాలి వీచటం చేత పెద్ద మంట అయింది. మిత్రుని మీద నమ్మకంతో పక్షిరాజు గౌతముని ప్రక్కనే నిదురించాడు. కాని కృతఘు్నడైన గౌతముడు బాగా మండుతున్న కొరివితో రాజధర్ముని కొట్టిచంపాడు. అలా చంపుతున్నప్పుడు అతను మాంసం దొరికినందుకు సంతోషించాడే తప్ప మిత్రహత్య ఎంత ఘోర పాపమో ఆలోచించలేదు. వాడు ఆ పక్షి రెక్కలు, ఈకలు తీసేసి, దాన్ని మంటలో కాల్చి, ఆ మాంసాన్ని, సువర్ణాన్ని మోసుకుంటూ అక్కడినుంచి బయలుదేరాడు.
పక్షిరాజు ఈ విధంగా చంపబడటం వల్ల అతను రాక్షసరాజు ఇంటికి వెళ్ళలేదు. తన మిత్రుడు రెండు దినాలుగా రాకపోవడంతో విరూపాక్షుడు దిగులుపడి తన కుమారునితో ఇలా అన్నాడు- ‘‘కుమారా! ఈ రోజు కూడా పక్షీంద్రుడు నాకు కన్పించలేదు. ప్రతిదినం అతను వెళ్ళి బ్రహ్మదేవుణ్ణీ, నన్నూ కలుస్తాడు. కాని అతను నన్ను కలిసి రెండు రోజులైంది. అందుచేత నాకు అతను ఏమయ్యాడా అని భయం కలుగుతున్నది. అతని గురించి కనుక్కో. ఆ బ్రాహ్మణ గౌతముడు వేదాధ్యయనం చేయలేదు. బ్రహ్మ వర్చస్సు లేదు. హింసా ప్రవృత్తి కలవాడు. అతడే నా మిత్రుని వధించాడేమో అని సందేహంగా ఉంది. అతని వాలకం చూస్తే దయాహీనుడు, దుష్టుడు, అధముడుగా కన్పిస్తున్నాడు. నీవు వెంటనే నా మిత్రుని ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొనిరా!’’
తండ్రి మాటలు విని విరూపాక్షుని కుమారుడు సేవకులతో సహా మఱ్ఱి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అతనికి రాజధర్ముని అస్థిపంజరం కన్పించింది. అతను దానిని చూస్తూ ఏడుస్తూ గౌతముని పట్టుకోవడానికి బయలుదేరి, వెతుకుతూ కొద్ది దూరంలోనే అతన్ని పట్టుకున్నాడు. అతని దగ్గర రాజధర్ముని శవం దొరికింది. వారు అతన్ని, రాజధర్ముని శవాన్ని తీసుకొని విరూపునికి చూపారు. రాజధర్ముని శరీరం చూసి రాక్షసరాజు పెద్దగా ఏడ్చాడు. నగరం అంతా శోకసముద్రంలో మునిగి పోయింది. అప్పుడు రాక్షసరాజు తన పుత్రునికి ఇలా ఆజ్ఞాపించాడు - ‘‘ఈ పాపాత్ముని వధించు. ఈ రాక్షసులందరూ వీని మాంసాన్ని యధేచ్ఛగా ఉపయోగించండి. ఇతను పాపకర్ముడు. పాపాత్ముడు, కనుక ఇతన్ని చంపి వేయడమే మంచిపని’’.
రాజు ఇలా చెప్పినా ఆ రాక్షసులు పాపాత్ముడైన గౌతముని మాంసం తినడానికి ఇష్టపడలేదు.
‘‘ఈ నరాధముని దస్యులకు ఇవ్వండి, మాకు వద్దు’’ అని వారు అన్నారు. రాజు సరేనని వానిని దస్యులకు ఇవ్వమని చెప్పాడు. వారు గౌతముని శూలాలతో పొడిచి ముక్కలు చేసి, ఆ మాంసాన్ని దుస్యులకు ఇచ్చివేశారు. కాని దస్యులు కూడా ఆ పాపాత్ముని మాంసాన్ని తినడానికి ఇష్టపడలేదు. మాంసాన్ని తినే క్రూరమృగాలు కూడా వాని మాంసాన్ని ముట్టలేదు.
బ్రహ్మహత్య చేసిన వానికి, దొంగకు, మద్యపానం చేసే వానికి ప్రాయశ్చిత్త విధానం శాస్త్రాలతో ఉంది. కాని కృతఘు్ననికి ఏ ప్రాయశ్చిత్తం లేదు. మిత్రద్రోహి, కౄరుడు, కృతఘు్నడు, నరాధముడు అయిన మానవుని మాంసం జంతువులే కాదు, పురుగులు కూడా తినవు.
తరువాత ఆ రాక్షసరాజు తన మిత్రుని కోసం శ్రేష్ఠమైన చితిని సిద్ధం చేయించాడు. దానిని రత్నాలతో, చందనంతో పుస్పాలతో అలంకరింపచేశాడు. అప్పుడు దానిపై తన మిత్రుని ఉంచి దగ్ధం చేశాడు. శాస్త్రోక్తంగా విధులను నిర్వహించాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి