డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -120

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే సమయంలో దక్షకన్య సురభి అక్కడికి వచ్చి, చితిపై నిలిచి తన నోటినుంచి శ్రేష్ఠమైన పాలను రాజధర్మునిపై పడేటట్లు చేసింది. దాని వలన ఒక శ్రేష్ఠం బ్రతికి, ఎగిరి విరూపాక్షుని దగ్గరకు వచ్చింది. అప్పుడే ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. అతను విరూపాక్షునితో ఇలా అన్నాడు -
‘‘నీవల్ల రాజధర్ముడు జీవితుడు కావటం చాలా అదృష్టం’’.
అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు పూర్వం రాజధర్మునికి ఇచ్చిన శాపం గురించి తెలిపాడు. ‘‘పూర్వం ఒకప్పుడు రాజధర్ముడు బ్రహ్మదేవుని సభకు రాలేకపోయాడు. దాంతో కోపం వచ్చి బ్రహ్మ అతన్ని ఇలా శపించాడు - ‘మూఢుడు, దుష్టాత్ముడు అయిన ఈ బకుడు నా సభకు రాలేదు. కనుక త్వరలోనే వధించబడతాడు’.
అతని శాపం వల్లనే ఇతన్ని గౌతముడు వధించాడు. మరల ఆ బ్రహ్మదేవుడే అమృతాన్ని కురిపించి అతన్ని బ్రతికించాడు. అప్పుడు రాజధర్ముడు ఇంద్రునికి నమస్కరించి ఇలా అన్నాడు ‘‘దేవాధిపా! మీకు నా మీద దయఉంటే నా మిత్రుడు అయిన గౌతమునిపై అమృతం చిలికి అతన్ని బ్రతికించండి’’.
ఇంద్రుడు రాజధర్ముని ఆలింగనం చేసికొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజధర్ముడు జీవించిన గౌతమునికి ఎంతో ధనం ఇచ్చి పంపి, తన నివాసానికి చేరుకున్నాడు. అతను పూర్వంలాగానే మరల బ్రహ్మసభకు వెళ్లాడు. బ్రహ్మ అతన్ని ఆదరించాడు.
పాపకర్ముడు అయిన గౌతముడు తిరిగి శబరపల్లెకు చేరుకుని వెనుకటి లాగానే భార్య అయిన శబరకాంతతో జీవిస్తూ, పుత్రులను కన్నాడు. అప్పుడు దేవతాగణాలు అతనికి ఇలా శాపం ఇచ్చాయి - ‘‘ఈ పాపాత్ముడు, కృతఘు్నడు తనను భర్తగా స్వీకరించిన శూద్ర స్ర్తినుండి చాలా సంతానాన్ని పొందుతాడు. తను చేసిన అకృత్యాల ఫలితంగా ఘోర నరకంలో పడుతాడు.’’
కృతఘు్నల జీవితం చివరకు ఎలా ముగుస్తుందో ఈ కథ వలన తెలుస్తుంది.
బ్రహ్మదత్త పూజనీ సంవాదము
కాంపిల్య నగరంలో బ్రహ్మదత్తుని అంతఃపురంలో ఒక పక్షి చాలాకాలంగా ఉండేది. దాని పేరు పూజని. అది అన్ని భాషలను అర్థం చేసుకోగలదు. అది పక్షి జాతిలో పుట్టినా అన్ని తత్త్వాలను అవగతం చేసుకొని కొంతకాలానికి అది మంచి రంగు గల పిల్లకు జన్మనిచ్చింది. అదే రోజున బ్రహ్మదత్తుని రాణి గర్భాన ఒక కొడుకు పుట్టాడు. అక్కడ నివసిస్తున్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా పూజని రోజూ సముద్రతీరానికి పోయి ఆ పిల్లల కోసం రెండు పండ్లు తెచ్చి ఇచ్చేది. వారిద్దరికీ అంటే తన పిల్లకి, రాజకుమారునికీ చెరొక పండు ఇచ్చేది. ఆ ఫలాలు అమృతం లాగ రుచిగా ఉండి తేజస్సు, బలం వృద్ధి చేసేవి. ఆ పండు తినడం చేత రాజకుమారుడు బాగా పెరిగాడు.
ఒక రోజు దాది అతన్ని ఎత్తుకొని త్రిప్పుతోంది. ఆ సమయంలో ఆ బాలుడు ఆ పక్షి పిల్లను చూచాడు. దానితో అతను ఉత్సాహంగా ఆటలాడసాగాడు. ఆ బాలుడు ఆ పిల్లను ఎత్తుకొని పోయి ఎవరూ లేనిచోట దాన్ని చంపి, మరల తాను దాది ఒడిలోనికి చేరాడు. కొంతసేపటికి పూజని పండ్లను తీసుకొని వచ్చి నేలపై చచ్చి పడి ఉన్న తన పిల్లను చూచింది. మరణించిన తన పిల్లను చూచి భోరుభోరుమని విలపించింది. దుఃఖిస్తూ ఇలా అన్నది.
‘క్షత్రియులకు స్నేహం, ప్రేమ ఉండవు. మంచితనము ఉండదు. వారి అవసరానికే ఇతరులను దగ్గరకు తీస్తారు. కనుక వారిని నమ్మరాదు. హాని చేసి తర్వాత అనునయిస్తారు. ఇది వారికలవాటే. ఈ రాజు బ్రహ్మదత్తుడు కృతఘు్నడు, కౄరుడు. విశ్వాస ఘాతకుడు. ఇప్పుడు వీరు చేసిన పనికి తప్పక ప్రతీకారం చేస్తాను. పాతకాలు మూడు రకాలు :
తనతో పుట్టి పెరిగినవానిని చంపటం,
తనతో కలిసి భోజనం చేసినవానిని చంపటం,
శరణుకోరిన వారిని చంపటం.
ఈ విధంగా అని పూజని పక్షి ఆ రాజకుమారుని కళ్ళను కాళ్లతో పొడిచి, పీకి ఆకాశంలో నిలిచి ఇలా అన్నది. ‘‘ఇష్టాపూర్వకంగా పాపం చేస్తే దాని ఫలం ఆ పాపిని వెంటనే చేరుతుంది. కాని తాను చేసింది ప్రతిక్రియ మాత్రం అయితే ఆ కర్త అంతకు ముందు చేసిన శుభాశుభ కర్మలు నశించవు. ఒకవేళ పాపకృత్యాన్ని చేసినా దాని ఫలం కర్తను చేరకపోతే అతని పుత్రులో, పౌత్రులో, ఆ వంశంలో వారు అనుభవించాల్సి వస్తుంది.’’
పూజని వలన కళ్ళు పోగొట్టుకున్న కుమారుని చూసి బ్రహ్మదత్తడు అది చేసిన పని తన కుమారుడు చేసిన పనికి ప్రతిఫలంగా భావించి పూజనితో ఇలా అన్నాడు. ‘‘మేము నీకు అపకారం చేశాము. నీవు ప్రతీకారం తీర్చుకున్నావు. రెండూ సరిపోయాయి. పూజనీ! ఇక ఆగ్రహించకు. మా దగ్గరే ఉండు. ఎక్కడికీ వెళ్లకు’’.
రాజు మాటలకు పూజని ఇలా సమాధానం ఇచ్చింది. ‘‘ఒకసారి తప్పుచేసినవాడు మరల ఆ స్థానానే్న ఆశ్రయించి ఉండడం శ్రేయస్కరం కాదు. అక్కడి నుండి వెళ్లిపోవడమే మంచిది. దెబ్బతిన్నవాడు ఎవరు ఎన్ని స్వాంతన వచనాలు పలికినా వారిని నమ్మకూడదు. వారి నుండి దూరంగా వెళ్లిపోవాలి. శతృత్వం ఎప్పుడూ తగ్గదు. శత్రుత్వం కొన్ని తరాలు నడుస్తుంది. అపకారం చేసినవారిని నమ్మకపోవటమే సుఖము. విశ్వాసఘాతకులను ఎన్నడూ విశ్వసించకూడదు. అందరినీ నమ్మించగలగాలే కాని తాను ఎవ్వరినీ నమ్మకూడదు.
బంధువులలో తల్లిదండ్రులు అందరికన్నా ఎక్కువ. భార్య అంటే రూపుకట్టిన వార్ధక్యం; పుత్రుడు తన అంశయే; సోదరుడు శత్రువు. తన పని అయేదాకా ఉంటాడు. పరస్పరం శత్రుత్వం ఉన్న వారిమధ్య సంధిపొసగదు. నేను ఒక కారణంగా నీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు అది పోయింది. అపకారాన్ని పొందిన వాడిని దానమానాలతో గౌరవించినా నమ్మడు. స్వాభిమాని అయినవాడు తాను పరాభవం పొందిన స్థానాన్ని వెంటనే విడిచిపెట్టాలి. నీ దగ్గర మన్నన పొందుతూ చాలాకాలం ఉన్నాను. ఇప్పుడు శత్రుత్వం ఏర్పడింది. వెంటనే వెళ్ళిపోవడమే సుఖకరం. కనుక నేను వెళ్ళిపోతాను’’. పక్షి మాటలు విన్న బ్రహ్మదత్తుడు దానిని అనునయిస్తూ ఇలా అన్నాడు. ‘‘ఒకరు చేసిన హానికి ప్రతీకారం చేసినవాడు తాను తప్పు చేసినట్లు కాదు. ప్రతీకారం చేసినవాడు కూడా ఈ చర్య వలన తను చేసిన తప్పు నుంచి విముక్తుడౌతాడు. కనుక పూజనీ! నీవు ఎక్కడికీ పోరాదు. ఇక్కడే ఉండు’’.
అప్పుడు పూజని ఇలా అంది - ‘‘అపకారం చేసినవానికి అపకారాన్ని అనుభవించిన వానికీ మళ్లీ సఖ్యత కుదరదు. వారి మనస్సులలో ద్వేషం రగులుతూనే ఉంటుంది’’
బ్రహ్మదత్తుడు ఆ మాటలకు ఇలా జవాబిచ్చాడు ‘‘లేదు. అలా అవదు. వారిద్దరి మధ్య మరల సంధి పొసగుతుంది. ప్రతీకారంతోనే వైరం నశిస్తుంది’’.
పూజని ఇలా అంది ‘‘వైరం ఒకసారి ఏర్పడితే ఇక ఎప్పటికీ పోదు. కనుక వారిద్దరూ దూరంగా ఉండడమే ఇరువురికీ మేలు’’.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి