డైలీ సీరియల్

అనంతం-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుకు దూకి, తుపాకి బైనెట్‌తో మేకపిల్లని బలంగా పొడిచాడు!
అంతే బలంగా బైటికి లాగిన బైనెట్‌తోపాటు మాంస ఖండాలు, నెత్తుటిధారా పిచికారి చిమ్మినట్టే వెలువడ్డాయి!
గర్వంగా దానివైపు చూసాడు పోలీసు ఉద్యోగి.
‘మనిషి ఇంత దగాచేస్తాడా’అన్నట్టు ఆశ్చర్యంగా కానిస్టేబులువైపు చూస్తూ, క్రిందపడి ప్రాణాలు విడిచిందా మేక పిల్ల.
గుడిశెల్లో గాలింపు పూర్తయ్యింది.
ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని బైటికొచ్చారు.
అవసరాలకోసం అడవి పుత్రులు సీసాల్లో దాచుకున్న కిరసనాయిల్ని వాళ్ళ గుడిశెల మీదే చల్లి నిప్పంటించారు!
కణకణా మండుతూ గుడిశెలు కాలిపోతోన్నాయి.
వెదురుబొంగులూ, దూలాలూ మంటల్లో కాలిపోతూ ఫెటేల్.. ఫెటేల్మని ప్రేలుళ్ళు వినిపిస్తున్నాయి.
దట్టంగా పొగలు లేచి, మేఘాల్లా తేలిపోతోన్నాయి.
తండా ఆనవాలే లేదు.
క్షణాల్లో అక్కడ బూడిద కుప్ప మిగిలింది!
‘‘వ్హాట్ నెక్స్ట్..’’
‘‘అడవి పుత్రులకోసం అనే్వషణ’’ అన్నాడో అధికారి తన క్రిందిస్థాయి అధికారితో!
* * *
రాగ్యా వెంట రహస్య మార్గాలగుండా నడుస్తూ లోతట్టు అడవిలోకి వెళ్తున్నారు వాళ్ళంతా.
తండా విడిచిపెట్టి వచ్చిన కొద్దిసేపటికే పోలీసు పటాలం గుడిశెల్ని చుట్టుముట్టటం, బీభత్సం జరుపటం- శబ్దాలనుబట్టి, దూరంనుంచే రాగ్యా ఊహించాడు!
అక్కడ ఎవ్వరూలేరని తెలిసి పోలీసులు కోపంతో మరింత రెచ్చిపోతారు. చెయ్యాల్సిందంతా చేసి అనే్వషణ ప్రారంభిస్తారు.
గొలుసుకొండల దగ్గరికివెళ్ళే రహస్య మార్గాలు వాళ్ళకి తెలియవు. అయినా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు రాగ్యా.
‘‘ఆ సప్పుళ్ళేంటియి?’’ రాగ్యాని దారిలో వాల్యా అడిగాడు.
అంతకుముందు జరిగిన సంఘటన మరచిపోయి వాల్యా తనతో మాట్లాడటం రాగ్యాకి చాలా సంతోషమనిపించింది!
‘‘బాజాల సప్పుళ్ళు’’అన్నాడు, పోలీసులు గుడిశెల్ని తగులబెట్టారని చెప్పటానికి ఇష్టంలేక.
‘‘యాడ్నించి’’ వాల్యా మళ్ళీ అడిగాడు.
‘‘దేవర కాడ్నించి’’
వాల్యాకేదో సందేహం కలిగింది!
‘‘శాందినీ అప్ప ఉందా ఆడ’’అని అడిగాడు.
రాగ్యా ఉలిక్కిపడ్డాడు.. వౌనంగా తల దించుకొని నడుస్తూ కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
లక్ష్మీబాయికి పరిస్థితి అర్ధమైంది!
‘‘శాందినీ అప్ప యాడుందో యతకటానికే ఎల్తుండాఁవు’’అని చెప్పి కొడుకు తలమీద చేత్తో నిమిరింది.
వాల్యా ఇక మాట్లాడకుండా వేగంగా నడుస్తున్నాడు.
‘‘శాందినీ గురిచ్చి వాల్యా అంటే ఎందుకేడ్సినావూ’’అని, వాల్యా వినకుండా లోగొంతుతో లక్ష్మీబాయి రాగ్యాని అడిగింది.
రాగ్యాకి దుఃఖం ఆగలేదు.. లక్ష్మీబాయి అనునయంగా తనతో అలా మాట్లాట్టం ఊహించని పరిణామం!
అందుకే దుఃఖం వెల్లువెత్తి పొంగుకొచ్చింది.
‘‘నేను శండాలపోడ్ని’’అన్నాడు గాద్గదిక స్వరంతో రాగ్యా.
లక్ష్మీబాయి వౌనంగా వింటూ నడుస్తున్నది.
రాగ్యా జరిగిందంతా చెబుతూ నడుస్తున్నాడు.
గొలుసుకొండలు దూరంగా కనిపిస్తున్నాయి!
‘‘ఆడికే మనఁవ్ బోయేది’’అంటూ, చూపుడువ్రేలుతో దూరంగా చూపించాడు రాగ్యా.
అందరూ అటువైపు చూశారు.
‘‘ఎంత కాలఁవిట్టా దాంకుంటాఁవూ’’ లక్ష్మీబాయి అడిగింది.
‘‘కాలఁవే సెప్పాల’’ అన్నాడు రాగ్యా పెదవి విరుస్తూ.
గొలుసుకొండల దగ్గరికి వెళ్ళాడు.
కుంటుతూనే గోపీనాయక్ ఎదురువచ్చాడు. అందర్నీ గుహలోకి తీసుకొని వెళ్ళి ‘‘హమ్మయ్య’’అని ఊపిరి పీల్చుకున్నాడు.
అందరూ స్థిమితంగా పైకి కనిపించినా లోలోపలే వాళ్ళంతా బాధతో కుమిలిపోతున్నారని గోపీనాయక్ గ్రహించాడు!
రాగ్యాని కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళి,
‘‘ఇంక సెయ్యాల్సిందేంటి’’ అని అడిగాడు.
‘‘బువ్వలెట్టాగా’’అని రాగ్యా అడిగాడు.
‘‘అరేనె్మంట్ సేశా’’ చెప్పాడు గోపీనాయక్.
‘‘ఈడ్నే వొండిపిత్తావా.’’
‘‘అది ప్రెవాదఁవ్’’
‘‘ఏఁటికని’’
‘‘పొయ్యిల పొగకి మనల్ని, మన తావరాన్నీ కనిపెడ్తారు’’
‘‘మరి?’’
‘‘తాండాల కాడ్నించి అందరికీ బువ్వొచ్చుద్ది.’’
ఇక, ఆ విషయం వొదిలిపెట్టి వౌనంగా ఆలోచిస్తున్నారు!
బైట పట్టం లేదుకానీ, వాళ్ళుకూడా అంతరంగ కల్లోలానికి గురౌతూ, ఆవేదన పడుతూ లోలోపలే కుమిలిపోతున్నారు!
అవతల ఏం జరుగుతున్నదో తెలియటం లేదు.
ఎవర్నయినా పంపించి విషయాలు తెలుసుకొనే అవకాశం లేదు.
గోళ్ళు గిల్లుకొంటూ క్రియాశూన్యంగా ఎలా కూర్చోవాలి?
పోలీసు కాల్పులు జరగ్గానే అడవిపుత్రులంతా చెల్లాచెదురైపోయారు. గొలుసుకొండలకి చేరిన వాళ్ళుచేరగా యింకా చాలామంది జాడే తెలియదు.
వాళ్ళేమయ్యారు? ఎక్కడికి వెళ్ళుంటారు?
గుడారాల దగ్గర జరిగిన కాల్పుల్లో నగ్గూరాం, కాళీచరణ్, బాణావతు తూటాలు తగిలి చనిపోయారు.. గరుడాచలాన్ని వేటకొడవలితో నరికి చంపాడు నగ్గూరాం.
వాళ్ళ శవాలను ఏం చేస్తారూ?
లాఠీఛార్జ్‌లో గాయపడ్డ వాళ్ళను ఆస్పత్రికి పంపించి వైద్యం చేయిస్తారా?
వాళ్ళకేమీ ప్రమాదంలేదు కదా!
తండా అంతా కాల్చి బూడిద చేశారు పోలీసులు.
రెడ్డియానాయక్ తండా వాళ్ళనిక అక్కడికి వెళ్ళనివ్వరా?
అడవి బిడ్డలు అడవిలో ఉండక ఎక్కడుండాలి?
వాళ్ళ మెదళ్ళను తొలుస్తున్నది అన్న సమాధానం లేని ప్రశ్నలే!
గుహలో ఓ మూలగా పడుకొని లక్ష్మీబాయి ఏడుస్తున్నది. ఆమెప్రక్కనే పడుకొని వాల్యా నిద్రపోతున్నాడు.
సోమ్లానాయక్‌కి మేకపిల్ల గుర్తొచ్చింది. నిద్ర చెదిరిపోయింది. గబగబా రాగ్యాదగ్గరికొచ్చాడు.
‘‘నా మేకపిల్ల యాఁవయ్యిందో, ఏఁవో! పాపం, సిన్న పిల్ల.... మతిమర్సి ఆడ్నే వొదిలొచ్చాగానీ- తెత్తే బాగుండేది! ఎట్టుందో ఏఁవో’’ అన్నాడు లోతు కళ్ళల్లో కన్నీళ్ళు నిలుపుకొంటూ.
‘‘మడుసులకే దిక్కులేదు.. నిమ్మళంగుండు’’ అన్నాడు రాగ్యా.
సోమ్లా దిగులుగా తొలగిపోయాడు దూరంగా.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు