డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -122

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం దేవలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు సకల శాస్తప్రారంగతుడు. పరమ ధార్మికుడు. నిత్యం దేవతలను, బ్రాహ్మణులనూ పూజించేవాడు. అతనికి సువర్చల అనే కుమార్తె కలదు. ఆమె సకల శుభలక్షణాలు కలది. చాలా చక్కనిది. వివేకవతి. ఆమెకు యుక్తవయస్సు రాగానే తండ్రి ఇలా ఆలోచించాడు. ‘‘ఈ కన్యకు తగిన వరుడు ఎలా దొరుకుతాడు? అతను ఉత్తమ శ్రోత్రియుడు, విద్వాంసుడు, విప్రుడు, బ్రహ్మచారి, మహాతపస్వి అయి ఉండాలి’’. తండ్రి ఇలా వరుని గురించి ఆలోచిస్తూ ఉండగా కుమార్తె తండ్రిని ఇలా కోరింది.
‘‘తండ్రీ! నన్ను అంధుడై కూడా కళ్ళున్నవానికి ఇచ్చి వివాహం చెయ్యి’’.
అప్పుడు తండ్రి ఇలా అన్నాడు ‘‘పుత్రీ! నీవు కోరినది అసాధ్యమని నాకు అనిపిస్తున్నదని. అంధత్వమూ, చూపూ రెండూ ఒక్క చోటే ఎలా సాధ్యం? నీవు పిచ్చిదానిలాగ మాట్లాడుతున్నావు’’.
అప్పుడు సువర్చల ఇలా సమాధానం చెప్పింది. ‘‘నేను సత్యమే మాట్లాడుతున్నాను. అటువంటి వేదవేత్త భర్త అయితే నన్ను భరించగలడు. నువ్వు నన్ను ఎవ్వరికివ్వాలని అనుకుంటున్నావో ఆ బ్రాహ్మణులను ఇక్కడికి రప్పించు. వారిలో నేను ఒకరిని భర్తగా వరిస్తాను’’.
తండ్రి ఆమె కోరికను మన్నించి తన శిష్యులను అన్ని దిక్కులా పంపి, సువర్చలను వివాహం చేసుకుందుకు ఇష్టపడేవారిని, సద్వంశంలో పుట్టినవారు, వేదవేత్తలు, ఆరోగ్యవంతులు, గుణవంతులను పిలిపించాడు. కన్య గుణశీలాలు, దేవలమహర్షి గురించి తెలిసిన చాలా మంది బ్రాహ్మణులు సువర్చలకోసం వారి ఇంటికి వచ్చారు. మహర్షియైన సువర్చల తండ్రి వారందరికీ స్వాగతం పలికి, ఆసీనులను చేసి కుమార్తెతో ఇలా అన్నాడు.
‘‘కల్యాణీ! ఇక్కడికి వచ్చిన మునులంతా వేదవేదాంగ సంపన్నులు, శీలవంతులు, కులీనులు. నాకు చాలా ప్రియమైనవారు. వీరిలో ఏ మహావ్రతుని నీవు భర్తగా కోరుకంటూ అతనికి నిన్నిచ్చి కన్యాదానం చేస్తాను’’.
సువర్చల తండ్రి మాటలకు ‘సరే’నని విప్రసమూహానికి నమస్కరించి ఇలా అంది. ‘‘ఈ బ్రాహ్మణ సమూహంలో అంధుడు, అనంధుడు అయిన విప్రుడు ఉంటే అతను నాకు భర్త కాగలడు’’.
ఆమె మాటలు విన్న ఆ విప్రులు ఆమెను అజ్ఞానిగా భావించి, దేవలుని నిందించి వచ్చిన రీతిగానే వెళ్ళిపోయారు. సువర్చల కన్యగా తండ్రి ఇంటనే నిలిచిపోయింది. కొంతకాలం తర్వాత శే్వతకేతువు అనే ప్రసిద్ధి చెందిన ముని ఈ విషయం గురించి విని సువర్చల కోసం దేవలుని ఇంటికి వచ్చాడు. శే్వతకేతువు ఉత్తమ బ్రహ్మచారి. మహావిద్వాంసుడు, న్యాయవిశారదుడు, వేదవేత్త, ఆత్మతత్వవిభాగవేత్త. అతను ఉద్దాలకుని కుమారుడు. దేవలుడు అతన్ని అతిథిగా పూజించి కుమార్తెతో ఇలా అన్నాడు. ‘‘పుత్రీ! ఈ ఋషికుమారుడు వేదవేదాంగ పారగుడు. ఇతన్ని వరించి నీ జన్మ సార్థకం చేసుకో’’.
అప్పుడు ఆ కన్య ఋషిపుత్రుని వైపు కోపంగా చూసింది. అప్పుడు ఆ విప్రర్షి సువర్చలతో ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! ఆ వచ్చినవాడను నేనే. నేను అంధుడనే. ఎప్పుడూ అలాగే భావిస్తాను. అలాగే నేను ఏ సందేహాలు లేనివాడను కనుక విశాలనేత్రుడను కూడా. కనుక నన్ను వరించు. నిన్ను నేను సేవిస్తాను. పరమాత్మ శక్తితోనే జీవుడు నిత్యం చూస్తున్నాడు. స్పృశిస్తున్నాడు. వాసన చూస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. సర్వం తెలుసుకుంటున్నాడు. అటువంటి కన్ను (జ్ఞానం) లేనివాడు గ్రుడ్డి వాడి క్రింద లెక్క. నాకున్నది కనుక నేను అంధుడను కాను.
ఇంకా ఆ పరమాత్మయందే ఈ జగద్వ్య వహారమంతా నడుస్తోంది. ఈ జగత్తు కంటితో చూసినా, నోటితో మాట్లాడినా, చెవితో వినినా అంతా పరమాత్మ సంబంధమే. నాకు సంబంధం లేదు కనుక నేను అంధుడను కనుక నన్ను వరించు.
నేను లోకదృష్టిలో నిత్యనైమిత్తిక కర్మలను చేస్తూ ఆత్మదృష్టితో నేను అన్నింటా నిర్లిప్తుడిని. కార్యకారణ రూపుడైన ఆ పరమాత్మను భావిస్తూ శాంతంగా ఉంటాను. అవిద్యతో, కర్మలతో, మృత్యువును అతిక్రమిస్తూ, విద్యతో అమృతత్త్వాన్ని పొందుతూ, ప్రారబ్ధంతో వచ్చిన దేన్నైనా సమంగా భావిస్తూ, మాత్సర్యం లేకుండా ఉంటాను. కనుక కల్యాణీ! నన్ను వరించు. నీకు తగిన శుల్కమిచ్చి స్వీకరించ గలను. నిన్ను పోషించగలను’’.
అతని మాటలు విన్న సువర్చల ఆ విప్రోత్తముని వివాహం చేసుకునేందుకు అంగీకరించింది. ఆమె ఇలా అంది ‘‘నేను మనసా నిన్ను వరిస్తున్నాను. మా తండ్రిని అడిగి నన్ను స్వీకరించు’’.
అప్పుడు మునిశ్రేష్ఠుడైన దేవలుడు శే్వతకేతువును, ఉద్దాలకుని పూజించి తక్కిన మహర్షుల సమక్షంలో శే్వతకేతువుకు తన కుమార్తెనిచ్చి కన్యాదానం చేశాడు. వివాహకార్యం ముగిసిన పిదప శే్వతకేతువు భార్యతో ఇలా అన్నాడు. ‘‘శోభనా! వేదవిహితమైన కర్మలన్నింటినీ నాతో కలిసి చేయి. అన్ని పనుల్లో నాకు సహధర్మచారిణివి అని భావిస్తున్నాను. నీవు కూడా అదే భావనతో అన్ని పనులు చేయి. నేను చెప్పిన పనులు నీవు చేయి.
అదేవిధంగా నీవు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను. ఈ విధంగా మనం కర్మలను ఆచరిస్తే ఇతరులు మనల్ని ఆదర్శంగా తీసుకొని తమ కర్మలు చేస్తారు. ఎందుకంటే శ్రేష్ఠులు చేసిన పనిని ఇతరులు కూడా చేస్తారు. కనుక లోకసిద్ధి కోసం, ఆత్మసిద్ధి కోసం మనం ఇద్దరం ఈ పనులను చేయాలి’’.
భార్యతో ఈ విధంగా చెప్పి శే్వతకేతువు ఆమెతో కలిసి ఎన్నో యాగాలను చేసి, దేవతలను తృప్తి పరిచాడు. మంచిపుత్రులను కని పితరులను సంతృప్తి పరిచాడు. నిత్యమూ ఆత్మయోగాసక్తుడై, భార్యతో కలిసి జీవించాడు. వారిరువురూ లోకాంతరాలకు కూడా వెళ్లగలిగేవారు.
ఒకసారి సువర్చల భర్తను ఇలా అడిగింది. ‘‘ద్విజోత్తమా! నీవు ఎవరవు? నాకు చెప్పు?’’
దానికి శే్వతకేతువు ఇలా సమాధానమిచ్చాడు. ‘‘నేనెవరో నీకు ఖచ్చితంగా తెలుసు. ద్విజోత్తమా అని నన్ను సంబోధించి మరల నీవెవరవని ఎందుకు అడుగుతున్నావు?’’
ఆమె అప్పుడు అంది - ‘‘హృదయస్థుడైన ఆ మహాత్ముని అడుగుతున్నాను’’.
శే్వతకేతువు ఇలా అన్నాడు ‘‘కల్యాణీ! అతడు పలుకడు. ఆత్మకు నామగోత్రాలుంటాయని నీవు తలిస్తే అది తప్పు జ్ఞానం. గోత్రం ఉంటే దేహబంధముంటుంది. ఆత్మలో ‘నేను’ అన్న భావమిక్కడ స్థాపించబడింది. నీలో కూడా ఆ భావముంది. నీవూ నేనే. ఇదంతా నేనే. ఇందులో ఆ పరమార్థ తత్త్వమేదీ లేదు. మరి ఎందుకు అడుగుతున్నావు?’’
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి