డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శూన్య గృహంలో గార్ద్భ రూపాన్ని ధరించిన నన్ను గుర్తు పట్టి వచ్చి నిందిస్తున్నావు. నేను కావాలనుకొంటే ఏ రూపైనా ధరించగలను. నా భీకర రూపం చూస్తే నీవు పారిపోతావు. కాలమే అన్నిటికీ కారణము, కర్త కనుక నీవు గర్వించవద్దు పురందరా! నీ మనస్సు చిన్న పిల్లల మనస్సు లాగా ఉండిఏమీ ఎదగలేదు. కొంత నైష్ఠిక బుద్ధి అలవర్చుకో. దేవతలు, గంధర్వులు, పితరులు, నాగులు దైత్యులు, అందరూ నా ఆధీనంలో ఉండేవారు
శచీపతీ! నేను నా పతనాన్ని గురించి కొంచెం కూడా చింతించడలేదు. సర్వ శాసకుడైన ఆ పరమాత్మవశంలో ఉన్నానని భావిస్తున్నాను. ఒక్కొక్క సారి సుందరి విధవయై దుఃఖిస్తూ జీవిస్తుంది. నీవు ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నావు, నేను నీచ స్థితిలో ఉన్నాను. దీనికి కారణము నువ్వుకాదు నేను కాదు. ఇప్పుడు నీవు దేవరాజు పదవి పొంది నా మీదనే గర్జిస్తున్నావు. నాకు ప్రస్తుతం కాలం కలసి రాలేదు. కాలమే అన్ని అవస్థలనూ కలిగిస్తుంది - నీకైనా నాకైనా. కాలమే అన్నింటికి పక్వానికి తెస్తుంది’’.
బలి ఇంకా దేవరాజైన ఇంద్రునితో ఇలా అన్నాడు- ‘‘మీరంతా మహాత్ములనే ఆ ద్వాదశాదిత్యుల తేజస్సును నేను ఒక్కడినే ధరించాను. నేనే సూర్యుడినై నీటిని పైకి పంపేవాడను. నేనే మేఘమై వర్షించేవాడను. నేనే ముల్లోకాలను తపింపచేసేవాడిని నేనే మెరుపుగా ప్రకాశించేవాడిని. నేనే పాలకుడనై లోకాలను నియంత్రించేవాడిని. ఆనాటి వైభవం ఇప్పుడు లేదు. నా వైభవమంతా పోయింది. నీవు కాని ఇంకెవ్వరు కాని దీనికి కర్తలు కారు.
కాలం దాని ఇస్టానుసారం వంతులవారీగా ఈ లోకాలను భుజిస్తుంది. పండితులు మాసాన్ని, పక్షాన్ని కాలం యొక్క శరీర మంటారు.
అహారాత్రులు దాని వస్త్రాలు
ఋతువులు దాని ద్వారం
సంవత్సరం దాని ముఖం
ఈ కాలం సముద్రంలాగ గంభీరమైనది. దీనికి ఆద్యంతాలు లేవు. ఇదే క్షరం, అక్షరం కూడా. ఈ కాలాన్ని ఎదిరించి ఎవ్వరూ ఏమీ చేయలేరు. కొందరు ఈ కాలాన్ని అగ్ని అంటారు. కొందరు ప్రజాపతి అంటారు. సమస్త జగత్తు దేనికి లోంగి ఉంటుందో అదే కాలమని గ్రహించు. నీలాంటి ఇంద్రులు వేలకొలదిగా గడిచిపోయారు. ఇంద్రా! నిన్ను నీవు అత్యంత బలశాలిగా భావించు కుంటున్నావు. కాని నీ సమయం వచ్చినపుడు కాలం నిన్ను కూడా శాంతపరుస్తుంది.. ఈ రాజశ్రీ నిన్నుమించిన వారి దగ్గర నిల్చింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది. ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించకు నిన్ను కూడా నా వంటి వానిగా భావించి ఈ రాజశ్రీ ఇంకొకరి దగ్గరకు పోతుంది.’’ అప్పుడు ఆ బలి శరీరం నుండి కాంతిమతియై నిష్క్రమిస్తున్న లక్ష్మిని ఇంద్రుడు చూశాడు. బలిని ఇలా అడిగాడు - ‘‘బలీ! ఎంతో కాంతితో వెలిగిపోతూ నీ శరీరం నుండి బయటకు వచ్చిన ఈమె ఎవరు?’’ బలి ఇలా అన్నాడు - ‘‘వాసవా! ఆమె దేవతా స్తయ్రో గంధర్వ కాంతయో రాక్షసాంగనయో నాకు తెలియదు ఆమె ఎవరో ఆమెనే అడుగు’’.
ఇంద్రుడు - ‘‘ఓ రమణీ! ఎంతో కాంతి కలిగి బలి నుండి నిష్క్రమిస్తున్న నీవు ఎవరు? ఈ రాక్షసరాజును ఎందుకు వదిలిపోతున్నావు?’’
అప్పుడు ఆమె ఇంద్రునితో ఇలా అంది- ‘‘వాసవా! నా గురించి బలికి కాని అతని తండ్రికి కాని తెలియదు. నన్ను దుస్సహ అని, విదిత్స అని అంటారు. ఇంకా నన్ను భూతి, లక్ష్మి అని శ్రీ అని కూడా అంటారు నీకు కాని, దేవతలకు కాని నా గురించి ఏమీ తెలియదు.
ఇంద్రుడు - ‘‘ఇంతకాలం బలి శరీరంలో ఉండి ఇప్పుడు ఎందుకు బలిని వదిలి వెళ్ళి పోతున్నావు?’’
అప్పుడు శ్రీ ఇలా అంది - ‘‘బలిని విడిచి వెళ్ళడానికి కాలం సమీపించింది. కాలాన్ని ఎప్పుడూ అవహేళన చేయకు. నేను సత్యంలో, దానంలో, వ్రతంలో, తపస్సులో, పరాక్రమంలో, ధర్మంలో నిలుస్తాను. బలి వాటికన్నిటికీ విముఖుడైనాడు. పూర్వం అతను సత్యవాది, బ్రాహ్మణహితైషి, జితేంద్రియుడు. కాని ఇప్పుడు మూఢుడై ‘‘నాగురించి యాగాలు చేయండి’’ అంటున్నాడు. అందుకని అతన్ని వదిలి నీలో నివసిస్తున్నాను. నీవు జాగరూకతతో, తపస్సుతో, పరాక్రమంతో, నన్ను నిలుపుకోవాలి.’’
ఇంద్రుడు - ‘‘నీ మాటలను నీవు ఆదేశించినట్లుగా పాటిస్తున్నాను. నీవు ఎప్పుడూ నాలోనే ఉండే ఉపాయం ఏమిటి?’’
శ్రీ - ‘‘చెప్తాను విను వేదోక్తమైన విధానంతో నన్ను నాలుగు భాగాలుగా చెయ్యి.’’
ఇంద్రుడు - ‘‘తల్లీ ! నా శరీర బలాన్ని, మనోబలాన్ని అనుసరించి నిన్ను ధరిస్తాను, కాని నువ్వు, నన్ను విడువకూడదు. మానవ లోకంలో సకల ప్రాణులను పుట్టించి, ధరించేది భూమియే. కనుక నీ పాదభారాన్ని భూమి భరిస్తుంది.’’
శ్రీ - ‘‘ఇంద్రా ! నా ఒక పాదాన్ని భూమిపైన పెడుతున్నాను. రెండవ పాదం కోసం ఏర్పాటు చెయ్యి.
ఇంద్రుడు - ‘‘మానవలోకంలో నీళ్ళు అన్ని దిక్కులకు ప్రవహించగలవు. నీ రెండవ పాదాన్ని నీళ్ళు భరిస్తాయి. ఆ సామర్థ్యం వాటికుంది’’
శ్రీ అంది - ‘‘సరే ఇంద్రా! నా పాదాన్ని నీటిపై ఉంచుతున్నాను మూడవపాదాన్ని ఏర్పాటు చేయి.’’
ఇంద్రుడు - ‘‘వేదాలు, యజ్ఞాలు, దేవతలు అగ్నిలో ప్రతిష్ఠింపబడుతారు. నీ మూడవ పాదాన్ని వారిపై ఉంచుము.’’
శ్రీ ఇలా అంది - ‘‘దేవేంద్రా! నా పాదాన్ని అగ్ని యందుంచుతున్నాను. నాల్గవ పాదానికి ఏర్పాటు చేయి.’’ ఇంద్రుడు - ‘‘మానవ లోకంలో బ్రాహ్మణహితైషులు, సత్యవాదులు అయిన సత్పురుషులు ఉన్నారు. వారు నీ పాద భారాన్ని ధరింప సమర్థులు.’’శ్రీ - ‘‘నా నాల్గవ పాదాన్ని సజ్జనులపై నిలిపాను ఇంద్రా! అదే విధంగా సమస్త ప్రాణులలోను నన్ను నిలిపి రక్షించు.’’
ఇంద్రుడు - ‘‘సమస్త ప్రాణులందు నిన్ను నిలుపుతాను. ఎవరైనా నిన్ను ఎదిరిస్తే వారిని దండిస్తాను.’’ తర్వాత లక్ష్మి తనను విడిచి వెళ్ళిన పిమ్మట బలి ఇలా అన్నాడు - ‘‘సూర్యుడు తూర్పున ఉదయించినంత కాలం దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులను కూడా ప్రకాశింప చేస్తాడు. సూర్యుడు మధ్యాహ్న వేళలో మాత్రమే నిలిచి పశ్చిమ దిక్కుకు వెళ్ళినపుడు మరల దేవాసుర సంగ్రామం జరుగుతుంది. అప్పుడు దేవతలను ఓడిస్తా. సూర్యుడు బ్రహ్మలోకంలో నిలిచి సమస్త లోకాలను తపింప చేసినపుడు జరిగే యుద్ధంలో నిన్ను నేను గెలుస్తాను.’’
ఇంద్రుడిలా సమాధానమిచ్చాడు - ‘‘బ్రహ్మ నిన్ను చంపవద్దని నన్ను ఆదేశించాడు. లేకపోతే నా వజ్రాయుధం నీ తలనరికేది. నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళు. మధ్యాహ్నం మాత్రమే సూర్యుడు తపింపచేసే రోజు ఎన్నటికీ రాదు. బ్రహ్మ ముందే సూర్యునకు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమాన్ని అనుసరించే సూర్యుడు జనులను తపింపచేస్తూ తిరుగుతూ ఉంటాడు. అవే ఆరు నెలల దక్షిణాయనం, ఆరునెలలు ఉత్తరాయణము. సూర్యుడు ఈ రెండు మార్గాలలో ప్రయాణం చేస్తాడు.’’
ఇంద్రుడు బలితో ఇలా అనగా బలి దక్షిణ దిక్కుకూ ఇంద్రుడు ఉత్తర దిక్కుకూ వెళ్ళి పోయారు. వెళ్తూ ఇంద్రుడు బలితో ఇలా అన్నాడు - ‘‘నీవు విద్వాంసుడివి, జ్ఞానివి, తపస్వివి. కాక్ష్మిస్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకున్నావు. నీకు దేని మీదా ఆసక్తి లేదు. నీవు జితేంద్రియుడవు. నిన్ను రజోగుణం కాని తమోగుణం కాని స్పృశించలేవు. నిన్ను బంధించిన వరుణ పాశాలు తమంతట తామే విడిపోతాయి. వృద్ధురాలైన అత్త చేత కోడలు పరిచర్యలు చేయించుకొన్నప్పుడు, కొడుకు తండ్రికి పనులు చెప్పి చేయించినప్పుడు, కంచు పాత్రలలో సర్వజాతులు కలిసి భోజనం చేసినపుడు, నాల్గు వర్ణాలవారు హద్దులను అతిక్రమించినప్పుడు నీ పాశాలు ఒక్కొక్కటిగా విడిపోతాయి’’. ఈ విధంగా బలితో పలికి ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళి పోయాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి