డైలీ సీరియల్

విలువల లోగిలి-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఎవరికివారు తెలుసుకోవల్సిన విషయం.
ఇలా ఎన్నాళ్ళు జరిగినా మార్పు రాదు. ముందు వాళ్ళను దిగనివ్వాలి. తర్వాత మనం ఎక్కాలి. అదీ కాదనుకుంటే మరో మంచి మార్గం ఇద్దరు పట్టే ఖాళీ ఉంటుంది. కాబట్టి దిగేవాళ్ళు ఒక లైనులో దిగుతుంటే ఎక్కేవాళ్ళు మరో లైనులో ఎక్కాలి. అప్పుడు ఇద్దరికీ నష్టముండదు. అలా జరగదుగా. ఎంతసేపూ గుంపుగా తోసేసుకోవటమే. అందులో ఈ జనాలకు ఏం ఆనందముందో అర్థంకాదు.
‘ఇలాగని నువ్వు చెప్పచ్చుగా’ అంతరంగం ప్రశ్నకు ‘వినే వాళ్ళుంటే ఎన్నయినా చెప్పవచ్చు’ అనుకుంది మనసులోనే.
ఒకరికి ఒకరు తగులుకుంటేనే నిలబడ్డారు ప్రయాణికులంతా. ఇంతలో సీట్లో కూర్చున్నావిడ కాస్త ప్రక్కకు జరిగి ‘రామ్మా! అలా ఎంతసేపు నిలబడతావు? ఇలా వచ్చి నా ప్రక్కన కూర్చో’ అంది.
ఈరోజు ‘గుడివాడ’దాకా నిలుచోవటమే అనుకున్నా. ‘నువ్వెప్పుడు నిలబడ్డావని? ఎంత రక్షగా ఉన్నా నీకు సీటు గ్యారంటీ అని అందరూ నీ గురించి చెప్పుకుంటారుగా’’ మళ్ళీ నేనున్నానంటూ అంతరంగం.
అవును. అదీ నిజమే. తను అందరితో కలుపుగోలుగా ఉంటుంది. కొత్త వారితో కూడా సులభంగా కలిసిపోతుంది. అందుకే తనను అందరూ ఇష్టపడతారు. ప్రేమించాలి, ప్రేమించబడాలి అనేది తన సిద్ధాంతం. అమ్మ వాళ్ళు వారికి తెలియకుండానే తనకుతగ్గ పేరునుపెట్టారు అని ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటుంది విశ్వప్రియ.
కిటికీ ప్రక్కన సీటు తనకెంతో ఇష్టం. ఆవిడతో కబుర్లుచెబుతూ కదిలిపోతున్న చెట్లను, పచ్చటి పరుపుల్లా ఉన్న పంట పొలాలను, అప్పుడప్పుడు కనుల విందు చేస్తున్న పక్షులను, పడమటి కనుమలలోకి వాలిపోతున్న ఎర్రటి బింబంలా మారిన సూర్యుణ్ణి, ఆ సమయంలోనే రంగులు మార్చుతున్న ఆకాశాన్ని ఎంత చూసినా తనివితీరటం లేదామెకు. అలా చూస్తూనే సీటు ఇచ్చినావిడతో మాట్లాడుతూ తన కృతజ్ఞతనూ తెలియజేసుకుంటోంది. ఒకప్రక్క సూర్యుడు వెళ్ళిపోతుంటే మరోప్రక్క చంద్రుడు రావటం. రెండూ ఒకేసారి ఆకాశంలో కనిపించటం వింతే. ఆ వింత ఆరోజు చోటుచేసుకుంది.
ఈ సృష్టి ఎంత విచిత్రమో అని ఎన్నిసార్లు అనుకుంటుందో తనకే తెలియదు. అరె! ఒక మనిషిలా మరో మనిషి ఉండడు. ఒక ఆకులా మరో ఆకు ఉండదు. ఒక పువ్వులా మరో పువ్వు ఉండదు. ఒక జంతువులా మరో జంతువు ఉండదు. అణువణువును పరిశీలించి గీసిన చిత్రకారుడి బొమ్మలా ఈ ప్రపంచ పటం.
అంతేనా. ఒక తల్లి గర్భంలో శిశువు తన రూపాన్ని సంతరించుకోవటం. మనమధ్యే తిరుగుతూ తిరుగుతూ నవ్వుతూనే ఎవరో ఉన్నట్టుండి పిలిచినట్లు మృత్యువు ఆహ్వానిస్తే వెళ్ళిపోవటం అంతా వింతే. వీటికి కారణాలను ఏనాటికైనా కనుగొనగలమా? ఏమో! ఎన్నో కనుక్కుంటున్నాం. కానీ ఎన్నో మిగిలిపోతూనే ఉంటున్నాయి. ఇది ఎప్పటికీ సశేషమైన కథ లాంటిదేనేమో! ‘కథకాదు సీరియల్’ అంది అంతరాత్మ తన మాటను సరిచేస్తూ.
‘ఇది ఎప్పుడూ ఇంతే. తననూ, తన మాటలను సరిచేస్తూనే ఉంటుంది’ అనుకుంది. అంతరంగం గురించి ముద్దుగా.
‘‘ఏ ఊరు వెళ్ళాలి?’’ అడిగింది ప్రక్కన కూర్చున్నావిడ.
‘‘గుడివాడండీ’’
‘‘అవునా! మావాళ్ళు కూడా గుడివాడలోనే ఉన్నారు. ఏలూరు రోడ్డులో’’
‘‘అవునాండీ’’అంది విశ్వ.
‘‘మరి మీరెక్కడ ఉంటారు?’’
‘‘మద్దివారి వీధిలో.’’
ఉన్నట్టుండి ఎదురు సీటులో కూర్చున్నాయన ‘‘ఇంతకీ ఆ జంట ఎందుకు చచ్చిపోయి ఉంటారు?’’అని ప్రశ్నించాడు తోటి ప్రయాణికుణ్ణి.
‘‘ఏముందండీ ఇంట్లోవాళ్ళు తమ ప్రేమ పెళ్ళికి ఒప్పుకోరనే భయంతో ఇలా చచ్చిపోవటం మామూలు అయిపోయిందిగా’’అన్నాడు విషయాన్ని తేలికగా తీసిపారేస్తూ.
‘‘ఏం ప్రేమలో ఏమిటో చిన్నప్పటినుంచీ కంటికి రెప్పలా కాపాడిన తల్లితండ్రుల గురించి ఒక్క నిముషం కూడా ఆలోచించటం లేదు. ఎంత సేపూ ప్రేమ ప్రేమ అంటూ పరుగులు. విడిపోయి బ్రతకలేం అని ఆత్మహత్యలు చేసుకోవటమూ- యువత ఎటువైపు పోతోందో ఎవరికీ అర్థమై చావటంలేదు.’’
‘‘అలాగే ఉందండీ ప్రపంచం. చదువుకోమంటే ఆత్మహత్య, సినిమాకి వద్దంటే ఆత్మహత్య, ఇష్టమైన రాజకీయ నాయకులు చచ్చిపోతే ఆత్మహత్య, చిన్న సమస్య వస్తే ఆత్మహత్య, అసలు ఆత్మహత్యకు అర్థం లేకుండాపోతోంది సుమండీ.’’
‘‘అన్నిటికీ ఆత్మహత్యే పరిష్కారమయితే ఈ లోకంలో మనిషనేవాడే మిగలడు. ఏమంటారు?’’ అదేదో పెద్ద జోక్ అయినట్లు పగలబడి నవ్వుతూ.
అంత సీరియస్ విషయాన్ని వీళ్ళెలా తేలికగా తీసుకుంటున్నారో అర్థం కానట్లు వారివంక చూసింది విశ్వప్రియ.
‘‘నువ్వు చెప్పు అమ్మాయ్’’
‘‘పెద్దలు ఒప్పుకుంటే వాళ్ళెందుకు చనిపోతారు బాబాయ్‌గారూ.’’
‘‘వాళ్ళకు చెప్పారో లేదో నీకేం తెలుసు అమ్మాయ్’’.
‘‘ప్రేమించాం అని చెప్పగానే ఎదురుదాడి ప్రారంభమైపోతుంది. వాళ్ళను ఎలా విడదీయాలా అని చూసేవాళ్ళే. అందులో కులాలు, మతాలు, కక్ష్యలు, బీద, గొప్ప తారతమ్యాలు ఇలాఎన్నో చేరిపోతుంటాయి. ఒకటా, రెండా చెప్పుకోవటానికి.’’
‘‘నీ వయసువాళ్ళనా అంతలా వెనకేసుకొస్తున్నావ్?’’
‘‘నా వయసని కాదు. పెద్దలు వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందా లేదా అని గమనించాలి. వారు మంచివాళ్ళేనా అని చూసుకోవాలి. అదంతా సరిగ్గానే ఉన్నట్లనిపిస్తే ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపాలి. అలా పెద్దలు సహకరిస్తే ఇలా జంటలు ఆత్మహత్యలు చేసుకోరని నా ఉద్దేశం.’’
‘‘చిన్నదానివైనా బాగా చెప్పావు తల్లీ’’అని ఒప్పుకున్నాడాయన.
ప్రక్కనావిడ ప్రశంసిస్తున్నట్లు విశ్వప్రియ చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా వత్తి అభినందించింది.
కళ్ళతోనే వాటిని అందుకున్నట్లు తెలియజేసింది.
కబుర్లతో, కాలక్షేపంతో గుడివాడ తొందరగానే వచ్చేసింది. అందరికీ వీడ్కోలు పలికి దిగింది ఆమె.
‘‘జాగ్రత్తగా వెళ్ళుతల్లీ!’’అంది ప్రక్కనావిడ మనస్పూర్తిగా.
‘‘అలాగేనండీ. సర్దుకుని సీటు ఇచ్చినందుకు మరోసారి థాంక్సండీ.’’ అని చెప్పింది.
‘‘అయ్యో! అదేం భాగ్యం! అందరం టిక్కెట్టు కొనుక్కొని ఎక్కిన వాళ్ళమే. ఉన్నకాసేపు ఒకరికి ఒకరం అలా సహాయం చేసుకోకపోతే ఎలా?’’
‘‘దానికికూడా పెద్ద మనసు ఉండాలి.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206