డైలీ సీరియల్

విలువల లోగిలి-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పెద్దవారిని అగౌరవ పరచకూడదని వీటన్నిటినీ నేను సహిస్తున్నాను.’’
‘‘మా ఆయన అసలు రానే రారు. తను లేకపోతే షాపు నడవదంటారు. తనూ రోజూ క్యారేజీ తీసుకుని వెళ్ళిపోతారు.’’
‘‘అదేమిటి పెద్దవాళ్ళు మామయ్యగారు ఉండగా అలా ఎందుకు అంటారు?’’
‘‘ఏమో! చెప్పింది వినటమే. ప్రశ్నిస్తే కోపాలు వచ్చేస్తాయి. ఉండే ఆ రెండు మాటలు కూడా ఉండవు. ప్రయోజనం లేనప్పుడు ఎందుకని నేను వౌనంతోనే స్నేహం చేస్తున్నాను.’’
‘‘ఏమిటో?’’
‘‘పద. ప్రయాణం చేసి బాగా అలిసిపోయి ఉంటావు. కాసేపు నిద్రపోదువుగానీ.’’
‘‘నిద్రేం పోనుగానీ. నీకు ఖాళీ దొరికితే మాత్రం నా దగ్గిరకు వచ్చెయ్. సరేనా!’’
‘‘సరే! ఓ నా గురించి ఆలోచించి బుర్ర బద్దలుకొట్టుకోకు. ఉన్న నాలుగు రోజులు సంతోషంగా గడిపి వెళ్ళు’’అంది కూలర్ ఆన్ చేస్తూ.
ఊరుకోవటానికా తను వచ్చింది? చక్కబెట్టడానికి కదా!
ఈ ఇంట్లో ఏ కంప్లయింట్స్ లేని వ్యక్తి శాంతి మామగారు విశ్వనాథంగారు ఒక్కరే అన్నమాట.
మరి ఆయన ఆధ్వర్యంలో కుటుంబం ఇలా ఎందుకు తయారయ్యింది? అంతా అత్తగారి వల్లేనన్నమాట. ఆవిడ సరిగ్గా ఉంటే కుటుంబం అంతా బాగానే ఉండేది. మరి ముందు ఆవిడ సంగతి చూడాలి.
రేపు ఆదివారం. తనకు బాగా కలిసివచ్చింది. దీనిని బాగా ఉపయోగించుకోవాలి అనుకుంది మనసులో. ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉంటారుగా.
సాయంత్రం సుందరి, లీలావతి ఉన్నప్పుడు అడిగింది విశ్వ ‘రాత్రికి డాబా మీద పడుకుందామా’ అని.
ఏ కళనున్నారో వెంటనే ఇద్దరూ ఒప్పేసుకున్నారు.
అక్కడ మాట్లాడవల్సినవన్నీ రిహార్సిల్ చేసుకోవటం ప్రారంభించింది. మరి మామూలుగా మారే రకాలుకాదుగా. ఇప్పటికే తనను బాగా ఇష్టపడుతున్నారు.
‘నిన్నా? నీ డబ్బునా?’ వెంటనే అందుకుంది అంతరంగం.
అబ్బా! చంపకే! నేను ప్రేమతో వాళ్ళను జయించాలనుకుంటున్నాను. ‘ఇప్పుడు ప్రేమను గుర్తించేవాళ్ళు లేరు.’
‘‘నేను ఒప్పుకోను. ప్రేమకు కరగని మనిషి ఉండరు. అయినా నా ప్రయత్నం నన్ను చేయనీ. కాసేపు నువ్వు అడ్డురాకుండా నా పనిని నన్ను చేసుకోనీ. అదే నాకు పదివేలు.’’
‘సరే నీ ఇష్టం’ గమ్మున ఊరుకుంది అంతరంగం.
షాపుకట్టేసి వచ్చాక ఫణి రెండు పరుపులు తీసుకెళ్ళి డాబామీదవేసి వచ్చాడు. సుందరి వాటిమీద దుప్పట్లు పరిచి వచ్చింది.
‘‘పైన వెనె్నల ఎంత బాగుందో! చందమామ ముద్దొచ్చేస్తున్నాడు’’ అంది సుందరి క్రిందకు దిగాక.
‘‘అయితే భోజనాలు అక్కడే చేద్దామా? అన్నీ పట్టుకెళ్ళటానికి ఇబ్బంది లేదనుకుంటే’’ అని అనకుండా ఉండలేకపోయింది. వీళ్ళందరికీ ఆ అనుభూతి కూడా మిగల్చాలన్నదే ఆమె ఉద్దేశం.
ఫణికి విశ్వ బాగానచ్చింది. ఆమెతో మాట్లాడాలని, ఏంచెబితే అది వినాలని ఎంతో ఆరాటంగా ఉంది. అందుకే ఈ అవకాశాన్ని అతను జారవిడుచుకోదలుచుకోలేదు. తెలివిగలవాడు అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటాడు అన్నట్లు ‘‘ఓస్! అదెంత పని. మీరందరూ కూడా తేవక్కర్లేదు. అన్నీ నేనొక్కడినే పెట్టెయ్యగలను’’ అన్నాడు.
‘‘మరింకేం? అన్నీ నువ్వొక్కడివే అక్కర్లేదు. తలాఒకటి, లేదా రెండు పట్టుకెళితే చాలు. మిగిలినవి కావాలంటే నువ్వు తెద్దువుగానీ. పదండి. పదండి. వెనె్నట్లో భోజనాలకి’అంటూ అందరినీ ఉత్సాహపరిచింది.
భోజనాలు ప్రారంభించాక విశ్వ ‘‘మీరంతా మా శాంతను సొంత మనిషిలా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అది వాళ్ళింట్లోకంటే మీదగ్గరే బాగుందని చెబుతుంటే నాకెంతో ఆనందం అనిపించింది. ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకున్న ఊరును, తనవాళ్ళను, వారి ప్రేమను వదిలి ఇక్కడకు వచ్చినందుకు భర్త, వారి కుటుంబం అక్కున చేర్చుకుంటేనే కదా ఆమె సంతోషంగా ఉండగలిగేది. రేపు సుందరి మరో ఇంటికి వెళ్ళాల్సిందే.
అక్కడవాళ్ళు ఆమెను సరిగ్గా చూసుకోకుంటే మీరెంత బాధపడతారు? అవన్నీ ఆలోచించి మా శాంతను దగ్గిరకు తీసుకున్నందుకు స్నేహితురాలిగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంది. అంటే తమ గురించి ఏమీ చెప్పలేదన్నమాట అని వారంతా ఆనందించారు.
మధ్యమధ్యలో భోంచేస్తూనే, వారివారి భావాలను గమనిస్తూ నెమ్మదిగా, స్పష్టంగా, ప్రేమతో చెప్పిన విశ్వమాటలు నిజంగానే ఆలోచింపచేసాయి వారందరిని.
అన్నీ తెలిసినవే. విశ్వ ఏమీ క్రొత్త విషయం చెప్పలేదు. కానీ తెలియజేసిన విధానమే నూతన ప్రయోగం. వాళ్ళ బుద్ధులను ఎత్తిచూపకుండా వాళ్ళెలా ఆమెతో మసలుకోవాలో తెలియజేసింది.
తమ కోడల్ని తాము బాగా చూసుకోకపోయినా అది చెప్పకుండా, మంచిగా చూస్తారన్న భావన తన స్నేహితురాలికి కలిగించిందన్న విషయమే వారిని పశ్చాత్తాపానికి గురిచేసింది.
నిజంగానే శాంతిని తమ కూతురిలా చూసుకోవాలని అందరూ వారి మనసుల్లోనే నిశ్చయించుకున్నారు. అది వాళ్ళందరి కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించటంతో విశ్వ మనసు ఆనందంతో ఎగిసిపడింది. ఆ ఇంట్లో అది తన తొలి విజయం.
‘‘శాంతా! నీకు బజ్జీ ఇష్టంకదా! ఫణి వచ్చేప్పుడు తెచ్చాడు. ఇంకోటి వేసుకో’’అంటూ ఆప్యాయంగా వడ్డిస్తున్న అత్తగారిని చూసి ఇది కలా? నిజమా? విశ్వ ఉందని మామూలుగానే నటిస్తున్నారా అన్న సందేహంలో పడింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206