డైలీ సీరియల్

విలువల లోగిలి-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సరే అనుకో’’
‘‘ఊరికేలే సరదాగా అన్నా! నిన్ను ముద్దపప్పు అని ఎవరన్నా అన్నారంటే వాడు చచ్చాడన్నమాటే. కెరటంలా తరిమికొట్టవూ!’’
‘‘నా గురించి చాలా చెబుతున్నావే’’
‘‘మరి కనిపెట్టేసా’’
‘‘అచ్ఛా’’ అంది తమాషాగా.
అయిదు నిముషాలలో ఇంటిముందాగింది కారు
దిగటమే ఆలస్యం ‘అమ్మను చూసి ఇప్పుడే వచ్చేస్తా’ అంది.
‘‘ఎక్కడికి వెళుతున్నావ్? అమ్మ మనింట్లోనే ఉంది. ఇంతమంది ఉండి ఒక్కర్తిని ఒంటరిగా ఉండనిస్తామా ఏమిటి? అత్తయ్య నువ్వెళ్లిన రోజే గొడవ పెట్టి తీసుకువచ్చేసింది’’.
‘‘అవునా! అమ్మ నాకీ విషయం చెప్పలేదే! రోజూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నా!’’
‘‘మేమే చెప్పొద్దన్నాం. ఈ విషయం చెప్పి నీ ముఖంలో సంతోషపు చందమామని చూడాలని’’
‘‘చాలా వేషాలున్నాయి నీ దగ్గిర’’
‘‘ఆ!.. ఆ.. ఆగు. ప్లానింగ్ నాది, అమలుజరిపింది అత్తయ్య’’
‘‘ఇద్దరూ తోడుదొంగలు. నిన్ను కాదు ముందు పెద్దమ్మ పని చెప్పాలి’’.
‘‘అంతా మాటలే.. అక్కడికి వెళ్లాక ‘పెద్దమ్మా’ అంటూ ఆవిడ ఒళ్లో దూరిపోవటమే’’
‘‘ఎంత కుళ్ళు నీకు’’
‘‘మరుండదా ఏం? నా ఒళ్ళో వాలాల్సింది పోయి..’’
‘‘వాక్యాన్ని మింగెయ్యటం ఎందుకు?’’
‘‘అమ్మో! విశ్వ అంటే నాకు చాలా భయం’’ అన్నాడు భయం నటిస్తూ.
‘‘మరే ఊర్లో అందరూ అదే మాట చెప్పుకుంటున్నారు’’ అంది నవ్వుతూ.
చందూ కూడా ఆ మాటకు నవ్వాడు.
అలా నవ్వుకుంటూ వస్తున్న ఆ జంటను చూడటానికి తన రెండు కళ్ళూ చాలవనుకుంది సుగుణ.
‘‘అమ్మా!’’ అంటూ వెళ్లి సుగుణను చుట్టేసింది విశ్వ.
‘‘నిన్ను చూసి ఎన్నో యుగాలయినట్లుందే విశ్వా!’’ అందావిడ.
‘‘ఆ డైలాగు నాది’’ అనుకున్నాడు మనసులో చందూ.
కాసేపు తనివితీరా చూసుకున్నాక అప్పుడు అల్లుడు అక్కడే ఉన్నాడని గుర్తువచ్చిందావిడకు.
‘‘విశ్వా! లోపలికిరా!’’ అంటూ ఆవిడ కూడా లోపలికి వెళ్లిపోయింది.
చందూ ఎంత కలిసిపోయినా పూర్తిగా ఆవిడ బెరకును మాత్రం పోగొట్టలేకపోయాడు.
అల్లుడు ముందు కూర్చోకూడదు.. ఎదురుపడకూడదు అనే పాతతరం భావాలు లేకపోయినా కాస్త దూరంగానే మసలుతోంది. ఆ దూరానే్న తగ్గించే శక్తి విశ్వకొక్కదానికే ఉంది.
‘‘వచ్చేసావా విశ్వా!’’ అంటూ ఎదురువచ్చింది భువనేశ్వరి.
‘‘వచ్చేసా పెద్దమ్మా?’’ అంది ఆవిడ చేతులను పట్టుకుని ఊపుతూ.
‘‘కంగ్రాట్స్. వెళ్లిన పని అవగొట్టావంటగా’’
‘‘రిజల్ట్స్ పూర్తిగా తెలియాలిగా’’
‘‘నీ సంగతి ఎవరికి తెలియదు? అందరూ 40రోజుల్లో చేసే పని నువ్వొక్కరోజులో చేసేస్తావ్?’’
కాళ్ళు కడుక్కొని వచ్చింది విశ్వ.
‘‘అందరం నీకోసం ఎదుచూస్తున్నాం. పద టిఫిన్ చేద్దాం’’ అందావిడ. ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి పలకరించారు.
కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ కార్యక్రమాన్ని అవగొట్టారు. ఆలస్యమవుతుందని తెలిసినా తన కోసం వేచి వున్న వాళ్ళందరి అభిమానానికి అభివాదం చెయ్యకుండా ఉండలేకపోయింది.
విశ్వ వచ్చేసిందిగా ఇక వెళ్లిపోతానని సుగుణ గొడవ.
ఆవిడను ఆపటం ఎవరితరమూ కాలేదు. చివరకు విశ్వకు కూడా!
‘‘విశ్వా! నువ్వు కాసేపాగిరా! ఫర్వాలేదు! నేను వెళ్తాను’’
‘‘నీ బ్యాగ్ ఇక్కడే ఉంచెయ్యమ్మా. నేను వచ్చేటప్పుడు తెస్తాను’’
‘‘సరే!’’
‘‘సుగుణా! భోజనం కార్యక్రమం ఏమీ పెట్టుకోకు. నేను పంపిస్తాను’’ అంది భువన వెనుకనుంచీ.
‘‘వద్దు. వాళ్ళిద్దరినీ కూడా భోజనానికి అక్కడకు వచ్చెయ్యమను. ఎంతసేపు? చిటికెలో వండేస్తాను’’
‘‘రేపు అలా చెయ్యచ్చు. ఈ రోజేం వద్దు. నా మాట విను’’
కుదరదు అనబోతున్న సుగుణను విశ్వ కళ్ళతోనే ఆపేసింది.
‘‘సరే! నీ ఇష్టం భువనక్కా!’’ అని వెళ్లిపోయింది సుగుణ.
అమ్మ దగ్గరకు వెళ్లాలని ఉంది. ఇక్కడ చందూ దగ్గిరా ఉండాలని ఉంది. ఎలా? రెండు రూపాలు ధరించి ఇద్దరి దగ్గరికీ వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది?
పురాణాల్లో శ్రీకృష్ణుడు అలా అందరి దగ్గరా ఒకేసారి ప్రత్యక్షమయ్యేవాడట. తమకంత శక్తి ఎక్కడిది? మానవమాత్రులం.
చందూ దగ్గరకు వెళ్లింది విశ్వ. అతనికి చెప్పి అమ్మ దగ్గరకు వెళ్లాలని ఆమె ఉద్దేశ్యం.
గదిలోకి వచ్చిన విశ్వను చూస్తూ ‘అమ్మ దగ్గరికి వెళ్లిపోకపోయావా?’
అరె! తన మనసులోని మాటను చెప్పకుండానే ఎలా గ్రహించేస్తాడు ఈ చందూ?
‘‘నువ్వూ ఎదురుచూస్తున్నావ్‌గా చందూ! ఇద్దరం కలిసేవెళదాం’’-
‘‘వద్దు. అమ్మ దగ్గరకు నువ్వు వెళ్ళు. తర్వాత నేను వస్తాను’’
‘‘అదేం?’’
‘‘తెలియనట్లు అడుగుతావేం? మీ అమ్మగారు రావద్దని, తర్వాత రమ్మని చెప్పినా తప్పక నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నిన్న మొన్న పరిచయమైన నాకే ఇలా ఉంటే ఇక వారికెలా ఉంటుందో నేను ఊహించలేనా? వెళ్ళు. కాసేపటిలో నేనూ వస్తాను. ప్రక్కనేగా!’’
‘‘నిజంగానేనా?’’
‘‘ఇందులో అబద్ధం ఏముంటుంది విశ్వా?’’
‘‘సరే! వస్తాను. నువ్వు తొందరగా వచ్చెయ్యాలి. సరేనా. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను’’
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ