డైలీ సీరియల్

విలువల లోగిలి-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరి పెరట్లో లైటు ఎవరు తీస్తారు?’’
‘‘నేనే. మరిచిపోయి వచ్చేసా. అంతా నీవల్లే. లేకపోతే ఒకరితో ఒక మాట కూడా అనిపించుకోను’’అంది బుంగమూతి పెడుతూ.
‘‘తెలుసులేవోయ్. అందుకే నేను గుర్తుచేసింది సరేనా?’’
‘‘కోసి తీసుకువస్తాను’’ అంది బొప్పాయిని చేతిలోకి తీసుకుని.
ఒక ప్లేటు, తొక్కు తీసుకునేది, చాకు తీసుకురా. ఇక్కడే చేసేద్దాం. అయినా ఇప్పుడేగా టిఫిన్ చేసాం.’’
‘‘ప్రూట్ మంచిదేగా. భోజనం చేసేలోపు ఇది తినచ్చు.’’
చందూ తొక్కుతీసాడు. విశ్వ ముక్కలు కోసింది.
అలా ఇద్దరూ తలా ఒక పని కలిసి చేసుకోవటం అంటే విశ్వకి ఇష్టం. అలాంటివాడే తనకు దొరకటం తన అదృష్టం అనుకుంది మనసులో.
విశ్వతో ఉంటే సమయం ఎలా గడిచిపోతుందో తనకే తెలియదు. అమాయకంగా, స్వచ్ఛంగా ఉండే ఆమె మాటలు తనలో ఎంతో ఉత్తేజాన్ని నింపుతాయి. దానితో ఎప్పుడూ తనదగ్గిరే ఉండాలనిపిస్తుంది.
ముగ్గురికి మూడు ప్లేట్లలో సర్థి అమ్మకి ఒకటి ఇచ్చి వచ్చింది.
చందూకి ఒకటిచ్చి తనూ తీసుకుంది.
‘‘బొప్పాయి భలే టేస్టీగా ఉందోయ్. బయటివి తిన్నా ఇంత బాగోవు. ఏం కలిపేవేమిటి?’’ అన్నాడు విశ్వవైపు కొంటెగా చూస్తూ.
‘‘తెలియదా? మమకారం’’ అదే రీతిలో సమాధానమిస్తూ.
‘‘అందుకే ఈ తీపితనం.’’
‘‘చాలు చాలు.’’
‘‘అంటే ఇంకొన్ని కావాలంటే కూడా పెట్టవా ఏమిటి? అమ్మతో చెబుతానుండు.’’
‘‘బాబూ! చాలు అన్నది మాటలు, వాటిలో ఉన్న పొగడ్తలు. నువ్వడగాలే కానీ నా ప్లేటులో ఉన్నవన్నీ ఇచ్చేస్తాను.’’
‘‘వద్దులే. ఊరికే సరదాగా అన్నాను.’’
‘‘నేను డబ్బులిస్తావనుకున్నాను.’’
‘‘తీసుకో. నేనే నీవాడినయినప్పుడు నాదంతా నీదేగా’’ అన్నాడు ఆమెనే ఆప్యాయంగా చూస్తూ.
‘‘నేనూ అన్నది సరదాకేలే. నువ్వు నాప్రక్కన ఉంటే చాలు. ఆ డబ్బులేకపోయినా ఫరవాలేదు.’’
‘‘డబ్బు లేకపోతే జీవితమే లేదంటారందరూ.’’
‘‘అది కొంతవరకూ నిజమే. కానీ డబ్బే జీవితం కాదుగా.’’
‘‘దీన్ని అర్థంచేసుకుంటే లోకంలో సగం హత్యలు, దొంగతనాలు, దోపిడీలు తగ్గిపోతాయి.’’
‘‘అర్ధంచేసుకోరూ’’అంది స్వర్ణకమలం సినిమాలో భానుప్రియలా.
‘‘పద, అమ్మదగ్గిర కెళ్దాం’’అని విశ్వ అనగానే ఇద్దరూ ఆవిడ చెంత చేరారు.
‘‘అమ్మా! నాకూ పని చెప్పండి’’అన్నాడు ప్రక్కనే కూర్చుంటూ.
‘‘పనేం లేదు చెప్పటానికి. నాలుగు రోజులయిందిగా ఒక్కసారి ఇల్లంతా తుడిచాను బాగా దుమ్ము పట్టిందని. అందుకనే మిమ్మల్ని కాసేపాగి రమ్మని చెప్పింది.’’
‘‘మనిద్దరినీ విడిచిపెట్టి అనకాపల్లి వెళ్ళి అమ్మాయి ఏం సాధించుకు వచ్చిందో చెప్పిందామ్మా.’’
‘‘ఆఁ! చెప్పింది బాబూ. అది ఎక్కడికి వెళ్ళినా ఏదీ సాధించకుండా రాదు.’’
‘‘ఇంకేం అమ్మ వత్తాసు నీకు బాగానే ఉంది.’’
‘‘కాక నీకా?’’అంది అమ్మ ప్రక్కన చేరుతూ.
‘‘నువ్వు చెప్పమ్మా’’అన్నాడు తనూ ఇంకోప్రక్క చేరి.
‘‘ఇద్దరికీ’’అందావిడ నవ్వుతూ.
వాళ్ళిద్దరూ కూడా నవ్వుకున్నారు. వాళ్ళను చూసి బయట చంద్రుడు కూడా!
***
పనె్నండు గంటల సమయంలో పోస్ట్‌మాన్ బెల్ కొట్టాడు. ‘విశ్వమ్మా! ఉత్తరం!’’ అన్నాడు.
‘‘నాకెవరు ఉత్తరం రాస్తారు?’’అనుకుంటూ అందుకుంది దాన్ని.
‘‘మంచినీళ్ళు ఏమన్నా కావాలాండీ?’’ అడిగింది అతన్ని.
‘‘ఇప్పుడే తాగాను. వద్దమ్మా!’’అంటూ వెళ్ళిపోయాడతను.
ఆత్రంగా ఉత్తరాన్ని విప్పింది విశ్వ.
ఆమె కనులు అక్షరాల వెంట పరుగులు ప్రారంభించాయి. ప్రియాతి ప్రియమైన విశ్వా!
ఏమిటిది ఉత్తరం రాస్తోంది అనుకుంటున్నావా?
నిజమేనా! ఈ ఆనందాన్ని నీతోనే పంచుకోవాలనిపించింది. నువ్వు వెళ్ళిన దగ్గరనుంచీ నేను ప్రతి నిముషం ఆశ్చర్యంలోనే బ్రతుకుతున్నానంటే నమ్ము. వీళ్ళంతా అంతలా ఎలా మారారే?
చివరకు మా పనిమనిషి కూడా మీ స్నేహితురాలి మాటలు భలేగా మాట్లాడుతారమ్మా. నాకయితే ఆ అమ్మతో వెళ్ళిపోవాలనిపించింది అంది.
అత్తయ్య అయితే సుందరికంటే ననే్న బాగా చూసుకుంటోంది. వీటన్నిటికంటే నన్ను ఆశ్చర్యపరిచింది ఫణి ప్రవర్తన. ఎంత మంచిగా ఉంటున్నాడో. మా మరిది లక్ష్మణుడు అని చెప్పేంత, ఇంతలో అంత మార్పా? ఏం మంత్రం వేసావ్?
సుందరి కాలేజీనుంచీ వచ్చిన దగ్గరనుంచీ వదినా! వదినా! అంటూ నా చుట్టూనే! అది చేస్తా, ఇది చేస్తా అని నన్నసలు చెయ్యనియ్యటం లేదు. అందరం కలిసి చేసుకుందాం అని నేనే పంచుకుంటున్నాను. చివరకు ఇలాగయ్యింది నీ శాంతి.
ఇక మావారి గురించి చెప్పలేదేమిటి అనుకుంటున్నావ్ కదూ! నిజంగానే. ఎందుకీ పెళ్ళిచేసుకున్నానా అని బాధపడని క్షణం లేదు ఒకప్పుడు. ఇప్పుడయితే ఒక్క క్షణంకూడా వృధాపోనివ్వకూడదనిపిస్తుంది. తను నన్ను అంతబాగా చూసుకుంటున్నారు.
అసలు సంగతి చెప్పలేదుకదూ. అత్తయ్య బ్యాచ్ అంతా ఇప్పుడు మంచివాళ్ళయిపోయారు. కోడళ్ళను ఎంత బాగా చూసుకుంటున్నామో చెప్పుకుంటున్నారు కలిస్తే. అసలు ఏ ఇంట్లో గొడవలే లేవు. ఉన్నదంతా ప్రేమలే.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206