డైలీ సీరియల్

విలువల లోగిలి-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పిల్లలు ఇంత బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తిస్తారు?’’ అన్నదే విశ్వను అనుక్షణం తొలిచే ప్రశ్న.
అంత దయార్ద్ర హృదయాలున్న తల్లిదండ్రులను పరాయి పంచకు ఎలా పంపించాలనిపిస్తుంది?
తమకు వున్నా లేకున్నా పిల్లల కడుపు నింపుతారు తల్లిదండ్రులు. మరి వీళ్ళేమో వారే భారమనుకుంటున్నారు?
రేపు వాళ్ళ పిల్లలుకూడా వీళ్లను అలా వదిలేస్తే అని ఒక్కసారి కూడా ఆలోచించరా?
అమ్మా నాన్నలను దూరంగా నెట్టేసి తమ పిల్లలను మాత్రం అపురూపంగా చూసుకునేవాళ్ళను తను ఎంతో మందిని చూస్తోంది. వీళ్ళను కూడా ఆ తల్లిదండ్రులు అదే ప్రేమను పంచారని ఎందుకు గుర్తించరు? వాళ్ళు మాకెందుకు అని వదిలేస్తే వీళ్ళింతవాళ్ళవుతారా?
అసలిలాంటి పిల్లలను, ఆదరించని కొడుకులను చూసి కొత్తగా పెళ్ళయిన వారు అసలు మాకు పిల్లలే వద్దనుకుంటే అపుడు పరిస్థితి ఏమిటి? సృష్టి ఎలా జరుగుతుంది?
వాళ్ళందరినీ చూస్తుంటే మనసు కలిచివేసినట్లుంటుంది. కడుపులోంచి బాధ తన్నుకొస్తుంది. వీళ్ళందరి బాధను క్షణంలో రూపుమాపగల శక్తి తనకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.
వీళ్ళను ముందు ఆ బాధనుంచీ కాసేపు దూరం చెయ్యాలని నిర్వాహకులతో సంప్రదించి ‘మ్యూజికల్ ఛైర్స్’ గేమ్ ఆడించింది. గెలిచినవారికి మెత్తటి చేతి రుమాలును, రేడియో కమ్ టేప్ రికార్డిర్‌ను అందించింది.
అంతకుముందే తను వాళ్ళకి డి.వి.డి ప్రజెంట్ చేసానని వాళ్ళలోవాళ్ళు గుర్తుతెచ్చుకొని మరీ తనకు చెబుతున్న వాళ్ళను ఆప్యాయంగా దరిచేర్చుకోవటం తప్ప ఏం చెయ్యగలదు?
అలా అలా రకరకాల ఆటలతో వాళ్ళని సంతోషపెట్టింది. బహుమతులివ్వడంలో అందరూ పాలుపంచుకున్నారు.
కొందరయితే గ్రేస్‌తో చిన్న పిల్లల్లా అయిపోయి ఆటలాడుకున్నారు.
సుగుణ, భీమేశ్వరి, సూర్యచంద్ర విడివిడిగా అందరితో కబుర్లు పంచుకున్నారు.
ఓ రెండు గంటలు అలా గడిపాక వెళతామని బయలుదేరారు. ‘‘మా పిల్లల్ని చూసిన ఆనందం మాకు కలిగిందని’’వారంతా చెబుతుంటే అందరికీ ఎంతో తృప్తిగా అనిపించింది, ముఖ్యంగా సూర్యచంద్రకు.
ఇది ఏ సినిమాకో, షికారుకో వెళితేవచ్చే అనుభూతి కాదు.
మనసులతో ఆలోచించేవారికే అర్థమయ్యే సంగతి. ఒక్కోసారి అసలు వృద్ధాశ్రమాలే లేకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరొకసారి తిండికి, బట్టకి లోటు లేకుండా ఇక్కడైనా ప్రశాంతంగా వారు ఉండగలుగుతున్నారని అనిపిస్తుంది.
ఎంత ఓదార్పు అందించినా వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇచ్చిన ఆనందాన్ని తామివ్వలేంకదా!
వారి బాధను నివారించే మందులాంటివాళ్ళమే! శాశ్వతంగా వారిని ఆ బాధనుంచీ విముక్తి కలిగించాలంటే కొడుకుల్లోనే మార్పు తీసుకురాగలగాలి.
అదెలా?
రచనలవల్లా?
కౌన్సిలింగ్ వల్లా?
కారు ముందుకు దూసుకుపోతున్నా ఆమె మనసు మాత్రం వృద్ధాశ్రమం వైపు, అందులో బాధితుల వైపు వెనక్కే పయనిస్తోంది.
ఇలా ఎందుకు జరుగుతోంది?
దీనిని ఆపలేమా?
ఎన్నో ప్రశ్నలు- సమాధానం లేని ప్రశ్నలు.
‘లేదు.. లేదు.. వీటన్నింటినీ నేను తేలిగ్గా వదలను’ అనుకున్నాక కానీ మనసు స్థిమితపడలేదు.
‘‘విశ్వా! దిగు! మన ఇల్లు వచ్చేసింది’’ అని చందూ చెప్పాక గానీ ఆమె ఆ ఆలోచనలనుంచీ బయటపడలేదు.
టిఫిన్ తిని, టీ త్రాగాక ‘‘తాము ఈ రోజంతా సంతోషంగా గడిపామని ఆ పుణ్యం మీదేనని’’ విశ్వకి, చందూకి, సుగణకి చెప్పి మరీ వీడ్కోలు తీసుకున్నారు భీమేశ్వరీ, జార్జ్.
వాళ్ళని గేటు దాకా వెళ్లి సాగనంపి వచ్చారు అందరూ.
గ్రేస్‌నయితే వాళ్ళెవరికీ వదలాలనిపించలేదు.
ఇంట్లోకి వచ్చాక కూడా గ్రేస్ కబుర్లతోనే చాలాసేపు కాలం గడిపారు.
భోజనాలయ్యక తీరుబడిగా అమ్మతో, నాన్నతో మాట్లాడటం ప్రారంభించాడు.
‘‘అమ్మా! ఇది నువ్వు లేకుండా నేను జరుపుకున్న మొదటి పుట్టినరోజు తెలుసా?’’
‘‘ఏం చేద్దాం నాన్నా!’’
‘‘నన్నుకాదు అడగాల్సింది అది నాన్నను అడగాల్సిన ప్రశ్న’’
‘‘నామీద అంత కోపం వద్దురా’’ అన్నాడాయన కలగజేసుకుంటూ.
‘‘మా అలకలు మీ మీద పని చేయవుగా’’
‘‘అసలు నీకు నేనిచ్చే పుట్టినరోజు కానుక ఏమిటో తెలుసా?’
‘‘మీరే లేనప్పుడు మీ కానుకలు నాకేం అక్కర్లేదు’’
‘‘నేనే నీకు కానుక అయితే..?’’
‘‘ఏమిటీ?’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘నేను, అమ్మ వచ్చేస్తున్నాం అని చెప్పటమే నేను నీకిచ్చే పుట్టిన రోజు బహుమతి’’ అని ఆయన అనటంతో ‘‘్థ్యంక్యూ! థ్యాంక్యూ నాన్నా’’ అంటూ అరిచేసి ‘‘విశ్వా! ఓ విశ్వా! ఎక్కడున్నావ్! రా! తొందరగా!’’
‘‘ఏమయింది?’’ అంటూ పరుగెత్తుకొచ్చింది విశ్వ.
లేచి ఆమెను గిరగిరా త్రిప్పుతూ ‘‘అమ్మా, నాన్న వచ్చేస్తున్నారట’’ అన్నాడు ఆనందంగా.
‘‘నేను చెప్పానా? లేదా?’’
‘‘ఇంత తొందరగా జరుగుతుందనుకోలేదు’’
‘‘మీ ఇద్దరేనా మాట్లాడుకునేది. మాతో మాట్లాడరా’’అంది అమృత.
‘‘అత్తయ్యా! ఇంతకీ మీరు ఎప్పుడు వచ్చేది?’’
‘‘మళ్లీ నెల ఈ రోజుకు మీ ఇద్దరి దగ్గర ఉంటాం’’
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్యా!’’’
‘‘నాకు కూడా! అసలు చందూ మీద ఎంత బెంగగా ఉందో? బెంగతో జ్వరం వచ్చేస్తుందేమోనని మొన్నటిదాకా భయపడ్డాను తెలుసా? మీ మామయ్య ఈ వార్తచెప్పగానే బెంగ, గింగ ఎగిరిపోయింది’’ అందావిడ.
‘‘నామాట విన్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మామయ్యా!’’ అంది విశ్వ.
‘‘కూతురు లాంటి కోడలికి దూరంగా ఎలాగ ఉండగలను చెప్పు? అందుకే వచ్చేస్తున్నాం’’ అన్నాడాయన నవ్వుతూ.
‘‘నా ప్రేమ కంటే నీ ప్రేమ ఎక్కువయిపోయింది విశ్వా’’ అందావిడ ఉడుక్కుంటూ.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206