దక్షిన తెలంగాణ

మెరుపు - దక్షిణ తెలంగాణ -- ఆఛార్య దేవోభవ! కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపు - దక్షిణ తెలంగాణ

ఆఛార్య దేవోభవ!

కథ

అమ్మ పెట్టిన అటుకులు తింటూ ఆడుకుంటున్న నన్ను నానమ్మ బలవంతంగా బడికి తోల్కవోయి కూసోబెట్టింది. ఆ రోజంతా ఏడుసుకుంటూ ఉండిపోయా. అపుడు సురువైంది నా ఏడుపూ ఎన్నడూ తీరని ఏడుపులా మిగిలింది రోజూ.
నానమ్మ ప్రతిదినం ఓ చిన్న ప్రయివేటు బడికి తీసుకెళ్లేది! అయినా నేను బాగా సతాయించేదాన్ని. అమ్మ చదువు ఎలా వంటబడతదో అని దిగులు పడేది. అలా మెల్ల మెల్లగా వెళ్లే నేను బడికి అలవాటయ్యాను. అయినా ఒక్కోసారి చాలా ఏడ్చేదాన్ని నా ఏడుపును భరించలేక పంతులు గారికి కోపం వచ్చి అపుడపుడు బెదిరించేవాడు. ఇక అమ్మేమో ఇంట్లో వంట చేసుకుంటూ పాచిపనులు చేస్తూ పెద్ద కుటుంబంలో ఒద్దికగా ఉంటూ నాన్నగారికి ఏ లోటు లేకుండా పనులన్నీ చేసి పెట్టేది.
పరిస్థితులకనుగుణంగా నానమ్మ మెల్లమెల్లగా బడికి అలవాటు చేయసాగింది. అతి పేదరికంలో ఉన్న మేము ఎవరు ఎవరికి ఎదురు చెప్పేవాళ్లం కాదు. మెల్ల మెల్లగా బడికిపోతున్న నాకు పంతులు గారికి భార్య చనిపోయిందని, ఒక కుమారుడని తెలిసింది. ఆ పంతులు రోజు వంట చేసుకోవటానికి కట్టెలు తెమ్మనేవాడు పిల్లల్ని. తేని పిల్లల్ని చాలా కొట్టేవాడు. ఆడపిల్లల్ని బోల్లు తోమువనేవాడు. వంట చేయమనేవాడు. లేకపోతే ఒల్లంతా వాతలచ్చేలా కొట్టేవాడు. అసలు ఇవన్ని చూస్తే బడికిపోనని మారాం చేసేదానిని. ఏడుస్తూ అయినా రోజూ వెళ్లేదాన్ని.
నేను కాస్త ఎర్రగా బొద్దుగా ముద్దుగా ఉండేదాన్ని పంతులుగారు పిప్పరమెంట్లు, బిస్కెట్‌లు ఆశచూపించి నన్ను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేవాడు, ఒల్లంతా తడిమేవాడు. కానీ అలా చేస్తూవుంటే నాకు నచ్చక ఇచ్చిన బిస్కేట్‌లు, పిప్పరమెంట్‌లు నేలకు కొట్టేదాన్ని. ఈ పనివల్ల చదువంటే భయంవేసేది. అ ఆలు రాయడం పుస్తకం పట్టడం అంటేనే భయం. ఒక్కోసారి తిరగబడేదాన్ని అలా చేస్తే తెల్లారి మళ్లీ బడికి రావాలి కదా అని ఊరుకునేదాన్ని. ఇలా కొంత కాలం గడిచింది.
చదువులో లెక్కల్లో పూర్తిగా వెనుకబడిపోయాను. అయినా ఇంట్లో సమస్యల వల్ల అమ్మ నాన్న నా చదువుపట్ల ఎక్కువ పట్టించుకునేవారు కారు. అసలు అప్పటి నుండి పంతులుగారంటే చిరాకు అసహ్యం. అతని దగ్గరికి వెళ్లాలంటే ఏదో తిరుగుబాటు చేయాలనే తపన ఎక్కువైంది. కానీ అంతటి పని చేయడానికి అన్నీ అడ్డంకులే. ఇలా ఆ బడిలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాను.
తిరిగి మళ్లీ నన్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు. దిన దినం నాకు అవే ఆలోచనలు అదే ఆవేదన ఎవ్వరికి చెప్పుకోను! ఆ బడి నుండి ఈ బడికి వచ్చాను. పదో తరగతికి చేరాను. ఇక్కడ శ్రద్ధతో చదువుకోవాలనుకున్నాను. ఆట పాటల్లో హుషారుగా ఉండే నేను నా ఆసక్తిని గమనించిన తెలుగు పంతులు గారు దగ్గరికి చేర్చుకుని ముందు చదువుపై శ్రద్ధ పెంచసాగాడు.
అందరితో కలివిడిగా ఉండే నేను ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త విన్నాను. ఈ తెలుగు పంతులుగారి భార్య పై చదువులకై ఊరెల్లిందని చాలా రోజుల వరకు రాదని వారికి ఒక కూతురని, మూడు సంవత్సరాల కూతురు ఉందని తెలిసింది.
చిన్నప్పుడు ఆ పంతులుగారి దగ్గర జరిగిన సంఘటనలు ఇక్కడ జరగవనీ అనుకున్నాను. అయినా పంతులుగారు కూడా చదువు తప్ప ఇతర విషయాలు ప్రస్తావించేవాడు కాదు.
అలా అలా తెలుగు అంటే ఇష్టం ఏర్పడింది. కథలు, పాటలు, పద్యాలు చాలా చక్కగా పాడేదానిని. నాకు మంచి ప్రోత్సాహమిస్తూనే ఉన్నారు. పంతులుగారి కూతురుని చూసుకోవడానికి ఎవ్వరు దొరకడం లేదని చెప్పి సాయంత్రం సమయంలో బడి పిల్లలందర్ని ఇంటికి పిలిచేవాడు అలాగే అందరం కలిసి వెళ్లేవాల్లం. మంచి మాటలతోని పిల్లల్ని చదువు విషయంలో ప్రోత్సహించేవాడు. అదే సమయంలో పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకకోసం ఆటల పోటీలు పెట్టారు.
ఆటల సామాగ్రి కోసం ఉపాధ్యాయులు ఉండే గదికి వెళ్లాను. లోపల పేపరు చదువుకుంటూ ఒక్కరే తెలుగు పంతులు గారు కనిపించారు. ఆ వెంటనే ఒక్కసారిగా దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుని ఒల్లంతా తడిమేసాడు. ఎంత వదిలించుకునే ప్రయత్నం చేసినా పంతులుగారి బలంకన్నా నా భయం నన్ను నిస్సహాయతకు గురి చేసింది. ఇలా రెండవసారి వికృత చేష్టలకు గురయ్యాను. ఈ విషయం నన్ను చాలా కృంగదీసింది. బయటికి చెప్పుకుందామంటే పరువుగల కుటుంబం ఏమి చేయలేను.
ప్రపంచానికి వెలుతురునిచ్చే పంతులుగారే పసిపిల్లలతో ఈ చేష్టలతో ఎంత మంది జీవితంలో ముల్లకంచెలను నాటుతారు. భావితరానికి అందే జాతి ముత్యాలను ఆదిలోనే అంతం చేసే వారిని నేనెలా అంతుచూడగలను. వయసేమో చిన్నది. చదువేమో వారి చేతుల్లో, ఆలోచనలలేమో ఎవ్వరికీ ఇలాంటి సమస్య రాకూడదనే ఆతురత! గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరః ఆచార్య దేవోభవ అనే మహోన్నతమైన స్థానం ఆచార్యులది ఇలాంటి నీతి లేని కొంత మందికి ఇది తప్పని ఎందుకు తెలియటం లేదు. వారిలో పారుతున్నది రక్తమా! లేక బురదనా! అని గట్టిగా అరవసాగాను.
ప్రక్కనే పడుకున్న నానమ్మ ‘ఏమైందిరా నానీ’ అంటూ నిద్రలేపింది! ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. చిన్ననాటి సంఘటనలే నన్ను నిద్రలోనూ కలవరింతలకు గురి చేస్తున్నాయనీ..రెండోసారి తెలుగు పంతులు గారితో జరిగిన ఘటన నిజం కాదనీ.. ఇదంతా కల అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.. నానమ్మ పిలుపు విని మేల్కొన్నాను. ‘ఏమీ లేదు నానమ్మ ఓ పీడకలొచ్చింది. అంతే’ అని చెప్పాను. ‘గ్లాసెడు మంచినీళ్లు త్రాగు’ అని నానమ్మ అనడంతో త్రాగి మళ్లీ నిద్రకుపక్రమించాను. ఆచార్యులందరూ చెడ్డవారు కాదు కదా.. అని మనసులోనే అనుకున్నా!.. అయినా కల తాలూకు భయం నన్నింకా వెంటాడటంతో నానమ్మ దగ్గరికి జరిగి గట్టిగా పట్టుకుని నిద్రలోకి జారిపోయాను!

- చిందం సునీత, కోరుట్ల
సెల్.నం.9701075502

పుస్తక సమీక్ష

అలతి అలతి
పదాలతో అరుణిమ!

పేజీలు: 127
వెల: రూ.200/-
ప్రతులకు:
భీమన్న సాహితీ పీఠం
బాన్స్‌వాడ,
నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9848048529

బాల్యం ఒక తెల్ల కాగితం వంటిది. ఆ కాగితంపై మొదట రాసిన అక్షరాలే వేదాక్షరాలవుతాయని భావించే యువ కవి సుప్పని సత్యనారాయణ ‘అరుణిమ’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు. అలతి అలతి పదాలతో అందమైన భావాలు పండించడానికి ప్రయత్నించడం ప్రశంసనీయం! కత్తికి పదునే ప్రాణం.. కవితకు భావమే ప్రాణం అని తెలిసిన ఆయన వస్తు ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శించినప్పటికీ..అభివ్యక్తిలో నవ్యత పాటించలేక పోయారు.. ఇందలి అరవై కవితలు ఆయన సామాజిక దృక్పథానికి అద్ధం పట్టే విధంగా రూపుదిద్దుకున్నాయి. అలుపెరుగని జీవన మధనంలోనే ఆనందం బస చేస్తుందనీ..కాలం కాదని కాలదన్నిప్పుడే.. ‘కలం’ కనే్నస్తుందన్న రహస్యం తెలిసిన కవి సత్యనారాయణ మోడు బారిన సమాజ వనంలో జన జాగృతికోసం.. కోయిలనై కూయాలని ఉంది అనడం ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
తెల్ల కాగితం కల్మషం లేని హృదయానికి నిలువుటద్దమనీ..అది అక్షర ప్రవాహానికి ఆశ్రయమిచ్చే అమ్మ అవుతుందనీ..దాన్ని చూడగానే ఆయన మనసు తల్లడిల్లపోతుందని చెప్పడం బాగుంది! ఆకాశమే సరిహద్దుగా గిరి గీసుకొని..శాఖోపశాఖలుగా మరులారబోసుకున్న తరు శరీరముకు అలుముకున్న లతలను చూసినప్పుడల్లా..నా అంతరంగంలో ఒక ఆలోచనా మెరుపు ఇలా వచ్చి..అలా వెళుతుందనీ అని ఓ కవితలో రాసిన పంక్తులు కవి యొక్క సృజనాత్మకత తెలిపేలా ఉన్నాయి! అలుపెరుగని జీవన మథనంలోనే ఆనందం బస చేస్తుందనీ..కాలం కాదని కాలదన్నినప్పుడే ‘కలం’ కనే్నస్తుందని కవి ఓ కవితలో తమ తాత్వికతను చాటుకున్నాయి. ‘ప్రకృతి నిరీక్షణ’ కవిత ఒకింత కవితాత్మకంగా మలచబడింది. వసంతం వచ్చిందంటే..ప్రకృతి మాత పెద్దముతె్తైదువ అయి..సర్వ ప్రాణులకు ఆశ్రయమిచ్చి లాలించే ‘అమ్మ’ అవుతుందని చెప్పిన తీరు బాగుంది. ప్రతీ మనిషీ సంపన్నుడే..! ప్రకృతికి ఉన్న ఈ పాటి నిరీక్షణ ఉంటే తమ జీవితం ధన్యం కాగలదని అనడం సముచితంగా ఉంది.
ఓ యువ కిషోరాల్లారా.. భారత మాత మెడలో కలువలం మనమే అంటూ..్భరతావని కలలను నెరవేరుద్దాం..అవినీతిని అంతమొందించి విజయబావుటాల నెగురవేద్దామని కవి యువతకు పిలుపునిచ్చారు. కవి స్వయంగా అధ్యాపకుడు కనుక ‘నల్లబల్ల’ను తరగతి గది ముఖానికే నుదిట తిలకంగా అభివర్ణించారు. తెల్లకాగితం చూడగానే నా మనసు తల్లడిల్లి పోతుందని ఓ కవితలో స్వయంగా ప్రకటించుకున్న కవి..అది అక్షర ప్రవాహానికి ఆశ్రయమిచ్చే ‘అమ్మ’ అవుతుందని చెప్పడం బాగుంది.
‘పురోగమనం’ కవితలో నిదురలో కూడా నా కళ్లు..కలల రథాలెక్కి విశ్వం మొత్తం స్వారీ చేస్తాయన్న ఫంక్తులు కవి యొక్క కలం బలాన్ని సూచించేలా రూపుదిద్దుకున్నాయి. క్షణ క్షణం దిన దినం బలిష్టమైన స్థిరస్థావరాలు చేసుకున్న..పునాదులపై నవ సమాజ నిర్మాణం చేసి..మసి బారని భవితవ్యాన్ని చూడాలని ఉందని ఓ కవితలో కాంక్షించడం స్వాగతించదగింది.
ప్రతీ జ్ఞాపిక సముదాయానికి.. నిలువెత్తు అక్షర రూపమే కవిత్వమని భావించే కవి సత్యనారాయణ..తెల్ల కాగితంపై కవిత్వంగా రూపుదిద్దుకునే ప్రతీ నల్లని సిరా చుక్క చీకటి ఛేదించాలని కాంక్షించారు. ‘నది నేర్పిన నడక’ కవిత ఎత్తుగడ బాగుంది. అలాగే కడలి కౌగిటిలో కలకాలం ఒదిగి సేదతీరడం తన జీవిత ధ్యేయం కాదనీ..చిరకాలం మానవ మనుగడ సజావుగా సాగేందుకు ‘నది నేర్పిన మంచి నడక’ అని కవి చక్కని ముగింపునిచ్చారు.
మనిషి పుట్టుకకు సార్థకత లభించాలంటే..ఆశల పల్లకీలనెక్కి విహంగ వీక్షణం చేయాలనీ..అందని జాబిల్లిని కౌగిలిలో బందీ చేసుకోవాలని సూచించారు. చరిత్ర గతులను మార్చే ఉద్యమాలైనా..చరిత్ర సృష్టించే మహా కార్యాలైనా..ముందుగా..నిశ్శబ్ధపు పునాదులపైనే..మొలకెత్తుతాయని ఓ కవితలో తేల్చి చెప్పారు. ‘దృశ్యకావ్యం’ కవిత రమణీయంగా మలచబడింది. ‘పల్లెతల్లి’ని ప్రాణంగా భావించే కవి సత్యనారాయణ..‘మమతానురాగాలకు, మాయని బాంధవ్యాలకు పర్యాయ పదం నాపల్లె’ అని పల్లెపై కవి తనకున్న మక్కువను చాటుకున్నారు. కవిగా తన అనుభవాలను, అనుభూతులను ‘అక్షర పక్షులు’ కవితలో వెల్లడించారు. నేతన్నల వ్యధలను అద్ధం పడుతూ మగ్గం బతుకులను అక్షర బద్ధం చేసే క్రమంలో..కవి ప్రయోగించిన తెలంగాణ మాండలిక పదాల మాటున గల భావాలు ఆర్ధ్రంగా రూపుదిద్దుకున్నాయి! ముఖచిత్రం బాగుంది.
ఇలా ఇందులోని చాలా కవితలు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. కవి సుప్పని సత్యనారాయణ కవిత్వంలో అభ్యుదయ భావాలతో పాటు జాతీయ భావాలు కూడా ఉన్నాయి! శిల్ప రీత్యా మరింత కృషి సలిపి..అభివ్యక్తిలో ఇంకా నవ్యత పాటిస్తే..సమర్ధ కవిగా రాణించే అవకాశం ఉంది. అయితే..ఈ గ్రంథానికి నిర్ణయించిన ధర కొంత ఎక్కువేనన్న భావన పాఠకుల్లో కలిగే అవకాశం ఉంది.

బోవెరా స్మారక సాహితీ పురస్కారాలు

కవితా సంపుటాలకు ఆహ్వానం
బోవెరా స్మారక రాష్టస్థ్రాయి సాహితీ పురస్కారాలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ భాషా సంరక్షణ సంఘం కన్వీనర్ ఎం.వి.నరసింహారెడ్డి, కో-కన్వీనర్ దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, సాహితీవేత్త డా. బోయినపల్లి వెంకట రామారావు స్మారకంగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తమ సంస్థ పక్షాన పదిమంది కవులకు పురస్కారాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. 2015 సంవత్సరంలో ప్రచురించబడిన తమ కవితా సంపుటాలను మూడు ప్రతుల చొప్పున కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల, జగిత్యాల-505 327, కరీంనగర్ జిల్లా చిరునామాకు డిసెంబర్ 25లోగా పంపాలని సూచించారు. వివరాలకు 9440525544 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. పురస్కారాలను జనవరి నెలలో జగిత్యాలలో జరిగే ప్రత్యేక సభలో ప్రదానం చేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

మనోగీతికలు

ఎలా ఉండాలి?
నీవు వేసిన పంపుసెట్టు కన్నీటిని కారుస్తూ అడిగింది...
నీ కన్నీటిని తుడవాలనుకున్నానని!
నీవు పడుకునే నులకమంచం అంటుంది...
నా తాడే నీ ఆలి తాళిని తెంపిందా? అని!
వాకిట్లో పడుకున్నప్పుడు చూసి మురిసిన చందమామ అడిగింది...
నీవు పండించే బంగారం ముందు
తాను కురిపించే వెండి వెనె్నల ఏ పాటిదని?
వచ్చీరాగానే వదలకుండ నిను అలుముకునే
ఆవులు అంటున్నాయి..
మా పాలతో పస్తులను ఆపకపోదుమా అని?
ఆలితో ఆదమరిచిన వేళ..
మల్లెపాదు అంటుంది
నా పూలను అమ్మి అయినా నీకు అండగా ఉండేదానినని!
ఇంతమందున్న నీవే పోతే!
రోజు నీ పాదాలను ముద్దాడే పొలం అడుగుతుంది...
కాలం కలిసి రాలేదని కాలం చేసావే? అని?
ఏ కాలమైనా నీకోసమే బ్రతికే నేను ఎలా ఉండాలని?

- పెనుగొండ సరసిజి, కరీంనగర్
సెల.నం.7386806499

రంగవల్లులు
ముంగిట ముచ్చటగా
కొలువుదీరే ముగ్గులతోనే కదా..
మన ఇంటికి వెలుగులు!
హరివిల్లును తలపించే
రంగవల్లులు...
మగువ హృది నుండి జాలువారే
భావాలకు ప్రతీకలు!
ముత్యాలను మరిపించే
వివిధ వర్ణాల్లో వాకిట
నిక్షిప్తమయ్యే గీతాలు..
వినిపిస్తాయి మనకు వౌనగీతికలు!
ముదిత మునివేళ్లనుండి
అందంగా రూపుదిద్దుకునే రేఖలు...
ఆమె మది నుండి ఎగిసిపడే
సృజనాత్మకతకు ప్రతిబింబాలు!!

- సల్వాజి వాణి, కరీంనగర్, సెల్.నం.9000282372

జీవన ప్రయాణం !
ప్రజాహితమే పరమావధిగా..
పది మంది మేలు కోరి జీవన ప్రయాణం
సాగించినప్పుడే..
జీవితానికి అర్థం..పరమార్థం!
జీవన గమనంలో..
మంచి చెడుల విచక్షణతో
మనుగడ సాగించినప్పుడే..
మన గమ్యం చేరుకోగలం!
మాయా లోకంలో పడి..
మానవ సంబంధాలను
మసక బారనీయకుండా
అడుగులేసినప్పుడే..
జీవన యానానికి సార్థకత లభ్యం!

- బొమ్మిదేవి రాజేశ్వరి
జ్యోతినగర్, గోదావరిఖని
సెల్.నం.9160908045

నా జెండా ఎజెండా
సూర్యోదయం నుండి
సంగీతం అందుకుంటున్న వాన్ని
కిరణాలలో సరిగమలు వెదుక్కుంటున్నవాన్ని
నాకు ఆనందం తెలియదు
అందం తెలియదని కొందరు
రాళ్లు విసురుకుంటారు
నా అక్షరాలే అందంగా వుంటాయి
నా పదాలు కోటి రాగాలు పలుకుతాయి
నా వాక్యం ఒక క్షణం తుమ్మెద రాగమయి
మరో క్షణం వెంట పడిన కందిరీగ మోతయి
మల్లెపూల సుగంధాన్ని ఎగిరేస్తున్న
నా కవిత్వం
బుసలు కొడుతున్న పాములా మారిపోతుంది!
నవరసాలలో అన్నీ రసాలు
నా కవిత్వానికున్నాయి
అందం ఆనందం నా అక్షరం పరమావధి
మామిడిపూత, మల్లెతోట, స్వచ్ఛమైన బాట
నా అక్షర లక్ష్యం
అందమైన నా అక్షరానికి ఓ సుగుణ ముందు
ఎప్పుడూ కలవంచదు
నా అక్షరం ప్రశ్నగా మారుతుంది
పిడికిలిగా ఎగురుతుంది
సుడిగాలిలా విజృంభిస్తుంది
నా అక్షరం
నవ్వుతూనే ముళ్లకంపలు నరుకుతుంది

- సిహెచ్.మధు, నిజామాబాద్, సెల్.నం.9949486122

జీవితం !
పుట్టుక నుండి చావు వరకు
భూమీద
మనం జరిపే
తాత్కాలిక ప్రయాణమే..
జీవితం!
ప్రణాళికాబద్ధంగా
నడిచినప్పుడే..
అవుతుంది మన జీవితం ధన్యం!
కష్టాలు, కన్నీళ్లు..
ఉండవు కలకాలం!
సుఖ, దుఃఖాలను...
సమంగా స్వీకరించే మనసుంటే
ఇక జీవితమంతా ఆనందమే!
జీవితాన్ని బంగారు మయం
చేసుకునే శక్తి, యుక్తీ..
మన చేతిలో ఉందని
గ్రహించాలి మనం!
అలా చేస్తే ఇంకేముంది?
మన జీవితమే ఓ నందనవనం!

- సింహాచలం కవితాప్రియ
జగిత్యాల
సెల్.నం.9908289830

రమణీయం!
ప్రభాత వేళ
సమస్త జీవరాసులకు
ఆధార భూతమైన..
సూర్యుడు తూర్పున
ఆకాశం నుండి తొంగిచూస్తూ..
కారు చీకట్లు తొలగించి
కాంతి పుంజాలను..
వెదజల్లుతుంటే..
పక్షుల కిలకిలా రావాలు
ఉషోదయానికి
తమ మధుర స్వరాలతో
స్వాగతం పలుకుతుంటే..
ఆడపడుచులు
కళ్లాపి చల్లి..రంగవల్లులతో
ముంగిళ్లను ముస్తాబు చేస్తుంటే
అన్నదాతలు
పంట పొలాలకు పయనమవుతుంటే..
ప్రకృతి దృశ్యం కమనీయం!
అత్యంత రమణీయం!!

- బొమ్మకంటి కిషన్
కరీంనగర్
సెల్.నం.9494680785

అమరుడాయె దీనబంధు
ఆ.వె. మనుజ జాతి నందు మమతానురాగాలు
దూరమాయె బ్రతుకు భారమాయె
కనుల నీరు దాచి కడదాక అంబేద్కర్
అలమటించి తాను అమరుడాయె

తే.గీ. ఎంత సుందర రూపమెంత తెలివి
ఎంత నిండు విగ్రహమది విద్యబలము
ఎంత యోచించి గాలించ వివరపడని
పేద జాతుల రారాజు భీమరావు

సీ.మా. ఇతడు దీనుల దాస్య కింకను కడతేర్చ
గజ్జగట్టాడిన సజ్జనుండు
ఇతడిల కులతత్వ ఘాతుక పీడల
తెగటార్చ వచ్చిన దీనబంధు
ఇతడుర్వి నెగిరాడు సిసలైన శాస్త్రాల
పట్టుదలన పొందె పరమయోగి
ఇతడు రాజ్యాంగమనెడి పసిశిశువును
ప్రియముతో కన్నటి ప్రేమమూర్తి
ఇతడేకదా నిజవిడుముల నెదురాడి
అట్టడుగుజనుల ఆద్యుడాయె

తే.గీ. అతడె భీమరావు అంబేద్కరుండుగా
కీర్తిబడసె ప్రజల మూర్తిగెదిగి
జీవితాంతమితడు శిరమొంచి బ్రతికెడి
భావ సంద్రమీది నావ నడిపె

ఆ.వె. ఎంతమంది తనను యెనె్నన్ని తూలినా
తొణక లేదు మిగిలి తూలలేదు
హీనతనము చీల్చి హిందుత్వ నేలపై
పడని బాధలేదు కడన తాను

తే.గీ. కూడు గూడు గుడ్డ కొరవై కడననిల్చె
పేద కులముల వోట్లతో పెనిగి గెలిచి
రాష్ట్ర భవితను దిగజార్చి రచ్చలెక్కి
మనెడు నేలనెట్లు మనిషి మనుట తగును.
ఆ.వె. క్రీస్తు నెరుగవోయి మస్తుగా రక్తాన్ని
సిలువ మ్రానునెక్కి చిలకరించె
బుద్ధు నెరుగవేమి బోధించె దమ్మను
ధర్మశాస్త్ర పరిధి దలయుడనుచు

ఆ.వె. అంటరాని కులపు ఆరాధ్య దైవమై
దళిత గుండెలందు దాగియున్న
భరత దళితకుల ప్రవరుడీ మన్యుడు
పొగడదగిన గొప్ప పుణ్యమూర్తి

తే.గీ. త్యాగధనులైన మూర్తుల స్వాగతాలు
యుగయుగాలుగా జగతిపై స్వాగతించి
తృప్తిజెందెరు వారిచ్చు తీర్పులన్ని
కథలు కథలుగా వినుచుండ్రు కాలమంత
(నేడు డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి)

- దుబ్బల దాసు
చరవాణి : 9885532923

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు..
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001.
merupumbn@andhrabhoomi.net