ధనం మూలం

ఇల్లే స్వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబానీ ఐనా పూరిగుడిసెలో ఉండే సామాన్యుడైనా తన కంటూ ఈ భూమి మీద ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపై ఎక్కువ ఆదాయం వస్తుందా? బంగారంపై పెట్టుబడిలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందా? అనే లెక్కలు ఎలా ఉన్నా.. ఇల్లు ఇచ్చే భరోసా మరేది ఇవ్వదు. ఈ అనంత విశ్వంలో తన కంటూ ఒక అడ్రస్ ఉండాలని, తన స్వంతం అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటిపై పెట్టుబడి లాభసాటిగా ఉంటుందా? ఉండదా? అని ఆర్థిక నిపుణులు చెప్పే లెక్కలు వేరు. జీవితం వేరు.
డబ్బు ఒక చోట స్థిరంగా ఉండదు. ఈ రోజు పేదవాడు స్వయంకృషితో ఎదిగి సంపన్నుడిగా మారవచ్చు. సంపన్నుడు సరైన వ్యూహం లేక నిర్లక్ష్యంగా వ్యవహరించే నిరుపేదగా మారవచ్చు. కానీ జీవితం చివరి దశలో ఉండడానికి ఒక గూడు కూడా లేని దశను అనుభవించడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సామాన్యులకే ఇలా ఉంటే ఎంతో మంది అసామాన్యులను తయారు చేసిన వారికి చివరి దశలో సొంత గూడు లేకుంటే ఎలా ఉంటుంది.
అచ్చం కళైజ్ఞ ఆవేదనలా ఉంటుంది. అతను ఎవరో మనకు తెలియక పోవచ్చు కానీ రజనీకాంత్, కమల్ హాసన్ తెలుసు కదా? ఈ సూపర్ స్టార్‌లను తయారు చేసిన బిగ్‌బాస్ కళైజ్ఞ.
అలాంటి కళైజ్ఞ తొమ్మిది పదుల వయసులో బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందిని సినిమా రంగానికి పరిచయం చేశాను. సూపర్ స్టార్లను చేశాను. చివరి దశలో సొంత ఇల్లు లేకపోవడం బాధగా ఉంది. జీవిత చరమాంకంలో సొంత ఇంటిలో ప్రశాంతంగా గడపాలని ఉంది ఎవరైనా సహకరిస్తారా? అని నోరు తెరిచి అడిగారు.
సినిమా జీవితం ఒక రకంగా జూదం లాంటిదే. జీవితం ఒకసారి రంగుల రాట్నంలా కనిపిస్తుంది. మరో చీకట్లోకి నెట్టివేస్తుంది. అలాంటప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు.
స్టూడియోలు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడం, వందల ఎకరాలు కొనడం అందరి వల్ల కాకపోవచ్చు. కానీ కనీసం సొంత ఇల్లు అనేది ముఖ్యం. సొంత ఇల్లు అనేది ఉంటే తన ఇంట్లో తాను పస్తులతోనైనా గడపవచ్చు.
సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి... చివరి దశలో సొంత ఇల్లు కూడా లేక పరాయి పంచన, స్టూడియోల్లో ఒక మూలన జీవితాన్ని ముగించిన సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క సినిమా రంగమే కాదు అనేక రంగాల్లో ఇలా జీవితాన్ని ముగించిన వారు ఉన్నారు. ఐతే సినిమా వారిలా ఇతర రంగాల వారు పాపులర్ కాదు కాబట్టి వారి గురించి తెలియదు. ఏ రంగంలో ఉన్నా... ఉద్యోగంలో ఉన్నా సొంత ఇంటిని సమకూర్చుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇల్లు ఇచ్చినంత భద్రత మరేమీ ఇవ్వదు.
* * *
రజనీకాంత్ ఈ పేరు వింటేనే కోట్లాది మంది అభిమానులు పులకించి పోతారు. ఉత్తరాది , దక్షిణాది అనే కాదు చివరకు జపాన్, చైనాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్.
అతన్ని సూపర్ స్టార్ అని తొలిసారి పిలిచింది ఎవరో తెలుసా? అతని పరిస్థితి ఏమిటో తెలుసా? రజనీకాంత్‌కు కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. అతన్ని సూపర్ స్టార్‌ను చేసిన కళైజ్ఞంకు మాత్రం సొంత ఇల్లు కూడా లేదు. చివరి దశలో దయతలిచి రజనీకాంత్ ఆదుకోవడంతో ఓ ఇంటివాడయ్యారు కళైజ్ఞ.
ఇటీవల వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాలో ఇంటికి మించిన భద్రత ఎక్కడా దొరకదు అని అని హీరోయిన్‌ను ఉద్దేశించి హీరో పలికే డైలాగు అందరికీ నచ్చింది. ఆడ పిల్లలకే కాదు సూపర్ స్టార్‌లకు, సూపర్ స్టార్‌లను తయారు చేసిన వారికి ఎవరికైనా ఇంటికి మించిన భద్రత, భరోసా ఎక్కడా ఉండదు.
తమిళనాడుకు చెందిన కళైజ్ఞం వందకు పైగా సినిమాలకు పని చేశారు. దర్శకత్వం వహించారు. సినిమాలను నిర్మించారు. కథ రాశారు. స్కిృప్ట్ రాశారు. తొమ్మిది పదులు దాటిన వయసులో ఎంతో చేశాను కానీ చివరకు సొంత ఇల్లు కూడా లేకపోవడం దిగులుగా ఉంది. ఎంతో మందిని పెద్దవారిని చేశాను. వారిలో ఎవరో ఒకరు చేయూత ఇవ్వకపోతారా? అని ఆశగా ఎదురు చూస్తున్నాను అని ఒక సినిమా ఫంక్షన్‌లో బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్, కమల్‌హాసన్, జయచిత్ర, మాధవి, స్వప్న వంటి హేమాహేమీలను పరిచయం చేసిన వారు. సొంత గూటి కోసం ఎవరు ఒకరు సహకరించక పోతారా? అని ఆశగా ఎదురు చూసే పరిస్థితి రావడం దయనీయం.
కళైజ్ఞ అంటే చిన్న చితక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన వారు కాదు ఆయన సూపర్ స్టార్‌లను ప్రేక్షకులకు పరిచయం చేసిన బిగ్‌బాస్ ఆయన. రజనీ స్టైల్ అంటే అభిమానులు పడి చస్తారు. అమితాబ్ తరువాత దేశమంతా అంతటి అభిమానులను సంపాదించుకున్న నటుడు.
* * *
అప్పటి వరకు సహాయ పాత్రలు వేస్తున్న రజనీకాంత్‌ను . సోలో హీరోగా తొలిసారి భైరవి అనే సినిమాతో కళైజ్ఞ పరిచయం చేశారు. తమిళంలో విజయవంతమైన సినిమాను తమిళంలో రజనీకాంత్ హీరోగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దేవర్ ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇవ్వడంతో కళైజ్ఞ ఈ సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. రజనీ హీరో అంటే నడిచే అవకాశం లేదు. పెట్టుబడి పోతుంది. హీరోను మార్చాలి అని దేవర పట్టుపట్టారు. కానీ రజనీపై పూర్తి నమ్మకంతో ఉన్మ కళైజ్ఞ వెనకడుగు వేయలేదు. దేవర ఆర్థిక సహాయం చేయకపోయినా ఎలాగోలా డబ్బులు సమకూర్చుకుని సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాకు సంబంధించి భారీ కటౌట్ ఏర్పాటు చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ అని రాశారు. ఆ సినిమా అనుకున్నట్టుగా హిట్ కావడంతో రజనీకాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక బాలనటునిగా ఏడాది వయసు నుంచే నటిస్తున్న కమల్‌హాసన్ అనంతరం కొంత కాలం సినిమాకు దూరమయ్యారు. అందరు బాల నటులకు ఎదురయ్యే సమస్యనే ఇది. కమల్‌కు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కళైజ్ఞ కురత్తి మాగన్ అనే సినిమా తీస్తూ, నృత్యం చేసే యువకుడి పాత్ర కోసం కమల్‌ను కలిస్తే, నేను బాలనటునిగానే ప్రేక్షకులకు పరిచయం. యుక్తవయసు పాత్రలో నన్ను ప్రేక్షకులు చూడలేరు అని కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకోలేదు. కానీ కళైజ్ఞ పట్టుపట్టి కమల్ నటించేట్టు చేశారు. ఆ తరువాత కమల్ హాసన్‌కు ఎదురు లేకుండా పోయింది.
తన దుస్థితిని రెండేళ్ల క్రితం కళైజ్ఞ బహిరంగంగా చెప్పాక, రజనీకాంత్ స్పందించి ఇటీవల దాదాపు కోటి రూపాయల త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కళైజ్ఞకు రజనీకాంత్ బహుమతిగా ఇచ్చారు. వేటూరి సుందర రామమూర్తి కూడా ఇదే విధంగా సొంత ఇంటి కోసం ఆవేదన చెందారు.

-బి.మురళి