ఆంధ్రప్రదేశ్‌

భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు రూ.4కోట్ల వ్యయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు తెలిపారు. అమ్మవారి భవానీ దీక్ష మండపంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు దీక్షల విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదురోజులు జరిగే దీక్షల విరమణకు వచ్చే భక్తులకు అమ్మవారి సన్నిధిలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. 31న ఉదయం 7గంటలకు భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని నరసింగరావు చెప్పారు. శంకరమఠంలో అన్నదానం, కనకదుర్గనగర్‌లో 20 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
జి.మాడుగుల, డిసెంబర్ 21: పోలీసు ఇన్‌పార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మడతకొండ గ్రామానికి చెందిన వంతాల సత్యారావు (50) అనే గిరిజనుడిని మావోయిస్టులు దారుణంగా హతమార్చి పోలీస్ ఇన్‌ఫార్మర్‌లుగా వ్యవహరించే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. సాయుధులైన 20 మంది మావోయిస్టులు రాత్రి 11 గంటల సమయంలో మడతకొండ గ్రామంలోని సత్యారావు ఇంటికి వెళ్లి నిద్రపోతున్న అతడిని లేపి మాట్లాడాల్సిన పని ఉందంటూ, బలవంతంగా కోడిమామిడి గ్రామానికి తీసుకెళ్లిగొడ్డలితో నరికి హత్యచేసారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
గుంటూరు, డిసెంబర్ 21: విద్యారంగంలో సమూల మార్పుల కోసం పోరాటాలు చేస్తామని ఎబివిపి జాతీయ కార్యదర్శి పి సురేష్ అన్నారు. గుంటూరులో మూడురోజులుగా జరుగుతున్న ఎబివిపి 33వ రాష్ట్ర మహాసభలు ముగిసిన సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు. విద్యను కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడటమే ఎబివిపి ఏకైక లక్ష్యమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులిస్తే వ్యతిరేకిస్తామన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సురేష్ డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయాలని, ప్రొఫెసర్ నీరజారెడ్డి కమిషన్ సిఫార్సులను అనుసరించి కామన్ ఫీజు విధానాన్ని రూపొందించాలని కూడా కోరారు. మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం తిరుమలరెడ్డి, కార్యదర్శిగా ఎం మల్లిఖార్జున, కోశాధికారిగా కె సాంబశివరావు, ఉపాధ్యక్షులుగా పి ఫణికుమార్, వై రామిరెడ్డి ఎన్నికయ్యారు.

ఏజెన్సీలో ఏనుగుల అలజడి
కురుపాం, డిసెంబర్ 21: విజయనగరం జిల్లా ఏజెన్సీలో గజరాజలు మళ్లీ అలజడి సృష్టించాయి. కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ గుండాం సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించి గిరిజనులకు చెందిన ఏడిళ్లు, 30 అరటిచెట్లు, చర్చి, మొక్కజొన్న తోటలను ద్వంశం చేశాయి. రాత్రి 11 గంటలకు శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఏనుగులు వచ్చినట్టుగా గ్రామస్థులు చెబుతున్నారు. అయిదేళ్ల క్రిందట కురుపాం, గుమ్మలక్ష్మిపురం మండలాల్లో ఏనుగులు స్వైరవిహారం చేసి 11 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి విదితమే. మళ్లీ ఇవి అలజడి సృష్టించడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

సెల్‌టవర్ ఎక్కిన కాల్‌మనీ బాధితుడు
గుంటూరు, డిసెంబర్ 21: తండ్రి చేసిన అప్పును ఏళ్ల తరబడి లక్షలాది రూపాయలు తీర్చుకుంటూ వస్తున్నప్పటికీ కాల్‌మనీ వ్యాపారి 25లక్షల రూపాయల విలువైన ఇల్లు రాయించుకోవటంతో మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల జోక్యంతో చివరికి దిగివచ్చాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ సంఘటన సోమవారం జరిగింది. 2007లో ఉండవల్లి గ్రామానికి చెందిన పాతూరి సుబ్బారావు వడ్డీ వ్యాపారి అల్లు అంకమ్మరెడ్డి వద్ద 60 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన అంకమ్మరెడ్డి తనతోపాటు వడ్డీ వ్యాపారం చేసే బాణావత్ నాగేశ్వరరావు నాయక్ పేరున సుబ్బారావు ఇంటిని తనఖా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న సుబ్బారావు తనయుడు పాతూరి సత్యంబాబు 2007 నుంచి క్రమం తప్పకుండా వడ్డీతో పాటు అసలు మొత్తం జమచేస్తూ వస్తున్నాడు. కొద్దికాలం క్రితం 4లక్షల రూపాయలు ఒకేసారి చెల్లించాడు. అయినప్పటికీ ఇద్దరు వడ్డీ వ్యాపారులూ రాజధాని ప్రాంతంలో సుబ్బారావు కుటుంబం ఉంటున్న ఇంటిపై కనే్నశారు. ఇంటిని యజమాని సుబ్బారావు ద్వారా తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంటి పన్నుకు సంబంధించిన రశీదులపై తమ పేరును చేర్పించారు. మనస్తాపం చెందిన సుబ్బారావు తనయుడు సత్యంబాబు సెల్‌టవర్ ఎక్కాడు. తాడేపల్లి తాహశీల్దార్ ఎంపి వెంకటేశ్వర్లు, సిఐ హరికృష్ణ, ఎస్‌ఐ వీరేంద్ర హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అప్పటికప్పుడు బాణావత్ నాగేశ్వరరావు నాయక్‌ను పిలిపించి ఇంటిని స్వాధీనం చేసుకోబోమని హామీ తీసుకున్నారు. దీంతో శాంతించిన సత్యంబాబు పోలీసుల హామీ మేరకు కిందికి దిగటంతో ఊపిరి పీల్చుకున్నారు.