ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

భస్మాసుర హస్తాన్ని సమర్థించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ, ఆర్థికావసరాల కోసం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం అత్యంత ప్రమాదకరం, భయంకరమైనదనేది అమెరికా, ఐరోపాతో చైనా కూడా గ్రహించటం మంచిది. మన దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా నిర్వీర్యం చేసేందుకు పాకిస్తాన్ ప్రధానంగా ప్రయోగిస్తున్న ఆయుధం ఇస్లామిక్ ఉగ్రవాదం. చైనా కూడా పరోక్షంగా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. జైషె మహమ్మద్ అధినాయకుడు మసూద్ ఆజర్‌పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించేందుకు భారత దేశం చేసిన ప్రయత్నాన్ని చైనా వమ్ము చేయటం ఇందుకు తాజా ఉదాహరణ. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జైషె మహమ్మద్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు జరిపిన దాడికి సూత్రధారి మసూద్ అజర్. పఠాన్‌కోట్ దాడి వెనక మసూద్ అజర్ కుట్ర ఉన్నదని నిరూపించేందుకు వీలుగా అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత్ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 1267 కమిటీ ముందు పెట్టింది. మసూద్ అజర్‌ను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ భారత దేశం ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. భారత దేశం గత పిబ్రవరిలో ప్రతిపాదించిన ఈ తీర్మాన్ని అమెరికా,ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ బలపరిచాయి. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థను పది సంవత్సరాల క్రితం ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు.
భారత దేశం తన తీర్మానంలో ఈ అంశాన్ని ఊటంకిస్తూ పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేయించిన ఈ సంస్థ అధినేత మసూద్ అజర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పారిస్ నగరం, లండన్ మెట్రోపై ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడులు అమెరికా,ఐరోపా దేశాలను కుదిపివేయటం తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిపిన దాడికి ప్రతీకారంగా అమెరికా అల్‌ఖైదా నాయకులు, సభ్యులను వెతికి,వేటాడి హతమార్చింది. ఇప్పుడు తాజాగా బెల్జియం రాజధాని బ్రెస్సెల్స్‌పై ఐ.ఎస్.ఐ.ఎస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడులు అమెరికా, ఐరోపా దేశాలను భయకంపితులను చేశాయి. అందుకే ఈ అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ తదితర దేశాలన్ని భారత దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267 కమిటీ ముందు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచాయి. పెద్ద దేశాలన్నీ సమర్థించటంతో మసూద్ అజర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చటం ఖాయమని భారత దేశం భావిస్తున్న తరుణంలో చైనా అడ్డుపుల్ల వేసి తన దురుద్దేశ్యాన్ని చాటుకున్నది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 1267 కమిటి రెండు రోజుల క్రితం సమావేశమై మసూద్ అజర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు నిర్ణయించే సమయంలో అంటే ఆఖరు క్షణంలో చైనా అభ్యంతరం తెలిపింది. చైనా ఒక పకడ్బందీ వ్యూహంతో ఈ అడుగు వేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌తో చైనా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌లో అభివృద్ది చేస్తున్న ఒక ఓడరేవు నుండి తమ దేశానికి చమురు తరలించేందుకు, ఇతర పనుల కోసం చైనా ఒక పైపు లైను వేస్తోంది. ఇది ఆక్రమిత కాశ్మీర్ మీదుగా చైనాలోకి వెళుతోంది. దీనికితోడు పాకిస్తాన్‌తోపాటు ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో చైనా సైనికుల మొహరింపు జరుగుతోంది. చైనా ఈ ప్రయోజనాలను కాపాడుకునేందుకే పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోంది. భారత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషె మహమ్మద్ అధినేత అజర్ మసూద్ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు అడ్డు తగులుతోంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ ద్వారా అజర్ మసూద్‌పై నిషేధం విధించటం అంటే పాకిస్తాన్‌ను అభిశంసించినట్లు అవుతుంది. ఈ అభిశంసన నుండి తప్పించుకునేందుకు పాకిస్తాన్ తన చిరకాల మిత్రుడైన చైనా సహాయం తీసుకున్నది. శతృవు శతృవుతనకు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని అవలంబించే చైనా మొదటి నుండి పాకిస్తాన్‌కు అండగా ఉంటోంది. పాకిస్తాన్‌తోపాటు ఇప్పుడు చైనా కూడా మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రత్యంగా కాకున్నా పరోక్షంగా వాడుకుంటోంది. మసూద్ అజర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చటం ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద అటను కొంతైనా కట్టించాలని భారత దేశం భావించింది. మన దేశంపై ఉగ్రవాదుల దాడులను కొనసాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల్లో జైషె మహమ్మద్ అత్యంత ప్రధానమైంది. పాకిస్తాన్ గూడచార సంస్థ ఇంటర్‌సర్వీస్ ఇంటలిజెన్స్ చెప్పుచేతల్లో పని చేసే జైషె మహమ్మద్ సంస్థ, దాని అధినేత మసూద్ అజర్ పై ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటిస్తే భారత దేశంపై కొనసాగిస్తున్నర వెయ్యి సంవత్సరాల యుద్ధానికి దెబ్బ తగులుతుందనేది పాకిస్తాన్ అధినేతలకు బాగా తెలుసు. అందుకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267 కమిటీలో భారత దేశం ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా ద్వారా వీటో చేయించింది.
ఇస్లామిక్ ఉగ్రవాదం అనేది భస్మాసుర హస్తం లాంటిది. అది ఏదోఒక రోజు తనను పెంచి, ప్రోత్సహించిన వారినే భస్మీ పటలం చేస్తుందనేందుకు అమెరికా, ఐరోపా దేశాల్లో ఐ.ఎస్.ఐ.ఎస్ ఇటీవల చేయించిన దాడులే నిదర్శనం. ఈ వాస్తవాన్ని చైనా ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తమ అవసరాల కోసం వాడుకోవచ్చనుకున్న అమెరికా, ఐరోపా దేశాలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో చైనా కూడా ఎంత త్వరగా కళ్లు తెలిస్తే అంత మంచిది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఏదోఒక రోజు బీజింగ్‌లో తమ ప్రతాపం చూపిస్తారు. అప్పుడు కానీ చైనా అధినేతల కళ్లు తెరుచుకోవు.