జాతీయ వార్తలు

ఢిల్లీలో బిజెపి ధమాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు మున్సిపాలిటీల్లో ఘనవిజయం

కేజ్రీవాల్‌కు కోలుకోలేని దెబ్బ మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ కొత్త వారితో బిజెపి ప్రయోగం సక్సెస్
ఇది ఈవీఎంల విజయమని ఆప్ ఆరోపణ ఢిల్లీ ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఢిల్లీ మళ్లీ బిజెపి చేతికి చిక్కింది. రెండున్నరేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ప్రభంజనంలో ఘోరంగా పరాజయాన్ని మూటకట్టుకున్న బిజెపి తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 272 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 184 వార్డులను గెలుచుకుని ఆప్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఉత్తర ఢిల్లీ మున్సిపాలిటీలో 64, తూర్పు ఢిల్లీలో 48, దక్షిణ ఢిల్లీలో 70 వార్డులను గెలుచుకుని మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించింది. ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోను జయకేతనం ఎగరేసిన ఆ పార్టీ ఇప్పుడున్న 138 సీట్ల బలాన్ని 184కు పెంచుకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాలకు గాను 67 స్థానాలను గెలుచుకుని దేశంలోనే సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీపార్టీ ఏ దశలో కూడా బిజెపికి పోటీ ఇవ్వలేకపోయింది మూడు మున్సిపాలిటీల్లో కలిపి ఆ పార్టీ సాధించింది కేవలం 49 సీట్లు మాత్రమే. ఇక కాంగ్రెస్ పార్టీ పరాజయ పరంపర ఢిల్లీ స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగింది. ఈ ఫలితాలలో కాంగ్రెస్‌కు దక్కింది కేవలం 30 వార్డులు మాత్రమే.
ఢిల్లీలో 272 వార్డులుండగా, ఇద్దరు అభ్యర్థులు మృతి చెందడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తూర్పు ఢిల్లీలోని 63, ఉత్తర ఢిల్లీలోని 103, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌లో 104 వార్డులకు ఈ నెల 23న ఎన్నికలు జరగ్గా, బుధవారం ఫలితాలను ప్రకటించారు. తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌లోని 63 స్థానాలకు గాను బిజెపి 48, ఆప్ 10, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకున్నాయి. ఉత్తర ఢిల్లీలోని 103 స్థానాలకు గాను బిజెపి 64, ఆప్ 21, కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకున్నాయి. దక్షిణ ఢిల్లీలోని 104 వార్డులకు గాను బిజెపి 70, ఆప్ 16, కాంగ్రెస్ 12 స్థానాలను గెలుచుకున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది సేపటికే బిజెపి అధిక్యత స్పష్టమవుతూ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే అన్ని కార్పొరేషన్లలోను ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈ స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ ప్రజావ్యతిరేకత తలెత్తకుండా బిజెపి ముందు నుంచే జాగ్రత్త పడింది. ఏ స్థానంలోనూ సిట్టింగ్ కార్పొరేటర్‌కు టిక్కెట్ ఇవ్వలేదు. అన్ని స్థానాల్లోనూ కొత్త వారినే అభ్యర్థులుగా నిలబెట్టి బిజెపి ఘన విజయం సాధించింది. ఇప్పుడు మూడు మున్సిపాలిటీల్లోనూ కొత్త వారితో బిజెపి పాలన సాగించనుంది.
బిజెపి తన ఘన విజయాన్ని చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల చేతిలో హతమైన 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు అంకితమిస్తూ, విజయోత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆప్ ఈ ఘోర పరాజయాన్ని ఇవిఎంల టాంపరింగ్‌పైకి నెట్టేయడానికి ప్రయత్నించినప్పటికీ బిజెపి ఆ వాదనతో ఏకీభవించ లేదు. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత విస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు లలిత్ మాకెన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో ప్రజలు బిజెపి పై అపారమైన విశ్వాసం చూపించారని ఇందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
ఇది ఈవీఎంల గెలుపు: ఆప్ ఆరోపణ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేయటం వల్లే బిజెపి గెలిచిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ‘‘ఈవిఎంల టాంపరింగ్ అనేది చేదు నిజం. మా వాదనలపై కొందరు జోక్‌లు చేయవచ్చు. కానీ మా ఆరోపణలపై వ్యంగ్యంగా మాట్లాడటమే ఆందోళనగా ఉంది. అయినా నిజం మాట్లాడటానికి మేం వెనుకాడేది లేదు.’’ అని సిసోడియా స్పష్టం చేశారు. అయితే ఈవీఎంలపై నెపం నెట్టాలన్న ఆమ్ ఆద్మీపార్టీ వైఖరికి ఆ పార్టీకే చెందిన కొందరు నేతలు దూరంగా ఉన్నారు. కాగా ఎన్నికల్లో దారుణ పరాభవానికి బాధ్యత వహిస్తూ చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల్లో చూపించిన అద్భుత ప్రదర్శన ఒక్కసారిగా చతికిలపడిపోవటం ఆప్ జీర్ణించుకోలేకపోతోంది. ఢిల్లీ సీనియర్ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ దేశంలో ఈవీఎంల ప్రభంజనం కొనసాగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా ఇదే రకంగా జరిగిందని, ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద దెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బిజెపి కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు.

చిత్రం... విజయ సంకేతాన్ని చూపుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు,
ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు మనోజ్ తివారి, ఢిల్లీ ఇన్‌చార్జి శ్యామ్ జాజు