ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ప్రభుత్వమే రెచ్చగొడితే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికార పక్షం ఉదార స్వభావంతో వ్యవహరించాలి తప్ప ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయటం సమర్థనీయం కాదు. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత మొదటి వారం సమావేశాల్లో ప్రతిపక్షం కంటే అధికార పక్షమే కొంచెం అతిగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. లోక్‌సభలో మెజారిటీ లేని ప్రతిపక్షం అణిగి మణిగి వ్యవహరించినా రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు దూకుడుగా వ్యవహరించే అవకాశం ప్రతిపక్షానికి ఉన్నది. అయితే రాజ్యసభలో కూడా అధికార పక్షం దూకుడుగా వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మూలంగా వెనకకు తగ్గి ఉన్న ప్రతిపక్షాన్ని దెబ్బ తీసేందుకు అధికార పక్షం దూకుడుగా వ్యవహరించటం సమర్థనీయం కాదు. ప్రతిపక్షం కొంత మెతకవైఖరిని అవలంభించిన సమయంలోనే ప్రభుత్వం పనులను త్వరిత గతిన పూర్తి చేసుకునేందుకు అధికార పక్షం ప్రయత్నించాలి కానీ రాజ్యసభలో బి.జె.పి ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. పార్లమెంటు మలి విడత సమావేశాల్లో రాజ్యసభ మొదటి రెండు రోజులు ఉత్తరాఖండ్ రాజకీయాలకు బలైపోయాయి. లోక్‌సభ సజావుగా కొనసాగినా రాజ్యసభ మొదటి రెండు రోజులు మాత్రం ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించినందుకు నిరసనగా గొడవ చేయటంతో కొట్టుకుపోయాయి. అయితే మూడో రోజు నుండి రాజ్యసభను సజావుగా కొనసాగనివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంటే అధికార పక్షం మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించింది.
నామినేటెడ్ సభ్యుడు,బి.జె.పి సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యం స్వామి అడుగు పెట్టిన వేళావిషేమం ఏమిటో గానీ రెండు రోజుల రాజ్యసభ సమావేశాలు ఆయన సృష్టించిన గందరగోళానికి కొట్టుకుపోయాయి. సుబ్రమణ్యం స్వామి నోరు విప్పటం సభ గందరగోళంలోపడిపోవటంతోసమానంగా మారింది. ఆయన మాట తీరు ఎంత తిరకాసంటే ఎలాంటి అంశాన్నైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైకి విమర్శలు గుప్పించేందుకు ఉపయోగించుకోగలుగుతారు. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం రాజ్యాంగం చర్చను వస్తే ఆయన కాంగ్రెస్ సభ్యులను విమర్శిస్తూ మీకు భారత రాజ్యాంగం కంటే ఇటీలీ రాజ్యాంకం గురించి అధికంగా తెలుసంటూ సభను గందరగోళంలో పడవేసిన ఘటికుడు సుబ్రమణ్యం స్వామి.
ఆగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణాన్ని విచారించిన ఇటలీ హైకోర్టు పరిశీలించిన ముడుపుల పత్రాల్లో సోనియా గాంధీ పేరు ఉన్నదంటూ ఆంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్య మూలంగా రాజ్యసభ ఒక రోజు సమావేశం వృధా అయ్యింది. సుబ్రమణ్యం స్వామి రాజ్యసభలో అడుగుపెట్టిన తరువాత మొదటి రెండు రోజులే ఇంత గందరగోళంగా ఉండే ఇక సంవత్సరం పొడుగునా రాజ్యసభ సమావేశాలు ఎలా ఉంటాయోనంటూ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ వ్యక్తం చేసిన ఆందోళనకు అర్థం ఉన్నదని భావించకతప్పదు. సుబ్రమణ్యం స్వామి ప్రతి పదం పదునైన కత్తిలా దూసుకురావటం కాంగ్రెస్ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. బి.జె.పి రాజ్యసభకు ఇచ్చిన బహుమతి సుబ్రమణ్యం స్వామి అంటూ ఆజాద్ వ్యంగ్య వాఖ్యలు చేశారు. స్వామి ధాటిని రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జి.కురియన్ సైతం తట్టుకోలేకపోయారంటే ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత పదునుగా ఉంటాయి, ఎంతగా రెచ్చగొడతాయనేది ఊహించుకోవచ్చు. సుబ్రమణ్యం స్వామి ఇలాగే రెచ్చగొడితే చర్య తీసుకోవలసి వస్తుందని కురియన్ హెచ్చరించటం అధికార పక్షానికి కనువిప్పు కావాలి. సభలో తన భావాలు, అభిప్రాయాలను వెల్లడించే హక్కు, అధికారం ప్రతి సభ్యుడికి ఉంటుంది. సభ్యుల హక్కులు, అధికారాలను కాపాడవలసిన గురుతర బాధ్యత రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌పై ఉంటుంది. సభ్యులు కేవలం తమ హక్కులు, అధికారాల గురించి మాత్రమే మాట్లాడకుండా సభ పట్ల తమకున్న బాధ్యత గురించి కూడా ఆలోచించాలి. ప్రతి దానికి లేచి నిలబడి ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టటం అధికార పక్షం సభ్యుల హక్కు అనుకోవటం అదికార పక్షానికి ఎంత మాత్రం తగదు. అధికార పక్షాన్ని రెచ్చగొట్టటం ప్రతిపక్షం హక్కు. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకు సాగుతూ సభను నడిపించుకోవటం అధికార పక్షం బాధ్యత.
సుబ్రమణ్యం స్వామి రాజ్యసభలోఅడుగు పెట్టిన తరువాత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. మెజారిటీ ఉన్న ప్రతిపక్షాన్ని కాల్చుకు తినేందుకు సుబ్రమణ్యం స్వాని బి.జె.పి రాజ్యసభకు తెచ్చిందా? అనే అనుమానం కలుగుతోంది. ఆగస్టా వెస్టెలాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై అర్థవంతమైన చర్చ జరిపి ముడుపులు పుచ్చుకున్న వారిని కట,కటాల వెనకకు పంపించేందుకు కృషి జరగాలి తప్ప ఇలా ఒకరినొకరు రెచ్చగొట్టుకుని రాజకీయం పబ్బం గడుపుకునేందుకు గొడవ చేయటం సమర్థనీయం కాదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం సుబ్రమణ్యం స్వామిని శిఖండిగా అడ్డం పెట్టుకుని సోనియా గాంధీ, కాంగ్రెస్‌పై రాజకీయ దాడి చేసే బదులు అవినీతి పరులను బోనులో నిలబెట్టేందుకు చిత్తశుద్దితో ప్రయత్నించాలి. సుబ్రమణ్యం స్వామి మూలంగా అధికార పక్షానికి పార్లమెంటులో తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కలిగితే కలుగవచ్చు కానీ విస్తృత స్థాయిలో మాత్రం ఆయన మూలంగా నష్టమే తప్పలాభం ఉండదనే వాస్తవాన్ని కమనాధులు గ్రహించటం మంచిది. సుబ్రమణ్యం స్వామి కూడా తన తెలివిని నిర్మాణాత్మక పనులకు ఉపయోగించుకోవాలి తప్ప రాజ్యసభను రచ్చకీడ్చేందుకు దుర్వినియోగం చేయకూడదు.