ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఆశలన్నీ ప్రియాంక పైనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంకా వాద్రా ఎట్టకేలకు గత్యంతరం లేక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ కష్టాలు తీరుతాయా? జాతీయ స్థాయిలో తన మనుగడను నిలుపుకొంటుందా? అనే ప్రశ్నలకు రాబోయే పరిణామాలే సమాధానం ఇస్తాయి. ప్రియాంక రంగప్రవేశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఫల్యానికి అద్దం పడుతోంది. పార్టీని పునరుజ్జీవింపజేయడం ఆయనకు అసాధ్యం కావడంతో తన చెల్లెలైన ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
నిజానికి కాంగ్రెస్ నాయకులు రెండు, మూడేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక రావాలని కోరుతున్నారు. ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలోనే- ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకను తీసుకురావాలని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి సూచించారు. ఈ విషయమై ఆయన ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించి సోనియాకు అందజేశారు. కాగా, సోనియా మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే రాహుల్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆమె అప్పట్లో ఆందోళన చెందారు. తన రాజకీయ వారసుడు రాహుల్ అని ఆమె పార్టీ నేతలకు అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే, రాజకీయంగా ఆశించినంత స్థాయిలో రాహుల్ ఎదగకపోవటం, తృణమూల్ కాంగ్రెస్ సహా కొన్ని మిత్రపక్షాలు ఆయన నాయకత్వంలో పని చేసేందుకు ససేమిరా అనడంతో ఇప్పుడు ప్రియాంక వైపు కాంగ్రెస్ నేతల దృష్టి మళ్లింది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీని కాపాడుకునేందుకే ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చారనే వాదన నిజం కాదు. ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించటం వెనక అధినాయకుల లోతైన ఆలోచన ఉన్నది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంటే ప్రధాని పదవిని ఎవరు చెపట్టాలనేది పెద్దప్రశ్న. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేందుకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంగీకరించటం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రియాంకను విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించాలన్నది సోనియా సహా కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచన. ఈ కోణంలోనే ఆమెను ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చారు. ప్రియాంకను ఒప్పించేందుకు రాహుల్ అమెరికా వెళ్లవలసి వచ్చింది. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకను ఆమోదించేందుకు మిత్రపక్షాలు అంగీకరిస్తాయా? అనేది కీలక ప్రశ్న. మాయావతి, మమత ప్రధాని పదవిని ఆశిస్తూ వ్యూహాత్మక రాజకీయంతో ముందుకు సాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎ స్పీ అధినేత్రి మాయావతి కూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ను గాలికి వదిలేశారు. రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలను వదిలివేసి మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. అత్యంత ప్రభావవంతమైన జాట్ కులానికి చెందిన అజిత్ సింగ్ నాయకత్వంలోని ఆర్.ఎల్.డిని కూడా తమతో కలుపుకొని మాయావతి, అఖిలేశ్‌లు కాంగ్రెస్‌ను ఏకాకి చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత మమత ఇటీవల కోల్‌కతలో భారీ ర్యాలీ నిర్వహించి భాజపాయేతర మిత్రపక్షాలన్నింటినీ స్వయంగా ఆహ్వానించి కాంగ్రెస్‌కు మాత్రం మొక్కుబడిగా లేఖ రాసి అవమానానికి గురి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పట్ల మమత చులకన భావం చూపారు. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమిని పదిలం చేసుకునేందుకు మమత, మాయావతి పావులు కదుపుతున్నారు. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రధాని పదవికి పోటీ పడేందుకు ఈ ఇద్దరు మహిళా నేతలు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను చేపట్టిన ప్రియాంక సత్తా చాటుకొంటారా? అనేది ప్రశ్న. వాస్తవానికి ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. గత పది పదిహేనేళ్లుగా పార్టీలో తెరవెనక రాజకీయం చేస్తున్నారు. సోదరుడు రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, తల్లి సోనియా గెలిచిన రాయ్‌బరేలీ నియోజకవర్గాల బాధ్యతలను ఆమె చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. పార్టీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం వహిస్తున్నారు.
మొదట్లో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ నిరాకరించగా ప్రియాంక జోక్యం చేసుకుని ఆయనను ఒప్పించగలిగారు. ఇంతకాలం తెర వెనక పనిచేసిన ఆమె ఇకపై రాజకీయాలను ప్రత్యక్షంగా కొనసాగిస్తారు. ఇంతకాలం తెర వెనక రాజకీయం కొనసాగిస్తూ ఆమె సాధించిన ఫలితాలను విశే్లషిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె ఏం సాధించగలుగుతారనే విషయం అవగతమవుతుంది. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నా, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే. యూపీఏ పదేళ్ల పాలనలోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో ఆశించిన ప్రగతి జరగలేదు. ఆ ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలు అంతంత మాత్రమేనంటే గతంలో సాధించిన ప్రగతి ఏమిటి? అనే అనుమానం ఎవరికైనా కలగక తప్పదు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక రావటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే నాయకురాలు వచ్చిందని వారంతా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ సీట్లలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ ఐదు, భాజపా మిత్రపక్షమైన అప్నాదళ్ ఒక్క సీటు గెలిచాయి. మిగతా సీట్లన్నింటినీ భాజపా తన ఖాతాలో వేసుకొంది. ప్రియాంక వల్ల రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ప్రశ్న. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లు గెలిచింది. యూపీలో మెజారిటీ సీట్లను గెలుచుకొంటే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవికి పోటీ పడలేదు.
ప్రస్తుత రాజకీయాల్లో ప్రియాంక వోటర్ల హృదయాలను గెలుచుకొని అద్భుతం సాధించగలరా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని ప్రియాంక రూపంలో ప్రయోగించింది. ఈ బ్రహ్మాస్త్రం విఫలమైతే కాంగ్రెస్‌కు మనుగడ ఉండదు. రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్‌కు ఆశించినంత జనాదరణ రాలేదు. ప్రియాంక సైతం ఆశించిన ఫలితాలను సాధించలేకపోతే కాంగ్రెస్‌కు గడ్డుకాలమే. కాంగ్రెస్ ఇప్పుడు విజయమో.. వీర స్వర్గమో అనే పరిస్థితికి చేరుకున్నది. ఆ పార్టీ భవిష్యత్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికలే నిర్దేశిస్తాయి.
*

-కె.కైలాష్ 98115 73262