ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వోటర్లూ.. ఒక్కసారి ఆలోచించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుత ప్రభుత్వ పని తీరును సమీక్షించటంతోపాటు, తాము అధికారంలోకి వస్తే అద్భుతాలు సాధిస్తామని చెబుతున్న నేతల గురించి లోతుగా ఆలోచించి ఓటర్లు తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల క్రితం దేశాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించిన నాయకులు ఏ మేరకు హామీలను నెరవేర్చారు? దేశాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు? ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారి అభ్యున్నతికి ఏ మేరకు కృషి చేశారు?.. అనే అంశాలను సమీక్షించి ఓటర్లు తుది నిర్ణయానికి రావలసి ఉంటుంది. ఈ నిర్ణయం మేరకు- దేశాన్ని నడిపించే బాధ్యతను ఎవరికి అప్పగించాలన్నది తేలాల్సి ఉంది. ఓటు వేయడం మామూలు విషయం కాదనే వాస్తవాన్ని జనం గ్రహించాలి.
బాధ్యత గల గృహస్థుడు తన ఇంటిని నిర్వహించేందుకు ఎంతో కష్టపడతాడనేది అందరికీ తెలిసిందే. తన ఆదాయాన్ని వివిధ ఖర్చులకు కేటాయించటంతోపాటు భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయటం, సొంత ఇంటిని నిర్మించుకోవడం, పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఏర్పాట్లు చేయడం ప్రతి కుటుంబ యజమాని కనీస బాధ్యతలు. దేశం కూడా ఇల్లు లాంటిదే. సరైన నాయకుడు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. మన ఇంటి గురించి ఎంతో కష్టపడే మనం- దేశాన్ని అర్హతలు లేనివారికి అప్పగించేందుకు అంగీకరిస్తామా? దేశ గతిని నిర్దేశించే ఓటును ప్రలోభాలకు బలి చేయడం భావ్యమా? ఒక రాజకీయ పార్టీ లేదా ఒక నాయకుడు ఎంపిక చేసే అసమర్థులను గెలిపించటం మంచిదా? సారా పోయించే వారిని గద్దెనెక్కించటం సరైన నిర్ణయం అవుతుందా?
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో- ‘ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును’ వినియోగించే ముందు ప్రతి ఓటరు పలు అంశాల గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. దేశాన్ని నడిపించే వారు ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన ఆలోచన, అవగాహన అవసరం. ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పార్టీల పూర్వపరాలు, నాయకత్వ పటిమ, దేశం పట్ల నేతలకున్న ప్రేమాభిమానాలు, చిత్తశుద్ధి, నిజాయితీ గురించి జనం నిశితంగా ఆలోచించాలి. రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులు ఏ మేరకు సమర్థులు? వారి విద్యార్హతలు ఏమిటి? నియోజకవర్గం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఎంత? నిబద్ధత ఏమిటి? గతంలో ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి సేవలు అందించారు? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారు? హామీలను అమలు చేయని పక్షంలో అందుకు దారితీసిన కారణాలేమిటి? పదవీ కాలంలో ఆ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? లేదా? వారు చేసిన సేవలను అంచనా వేసి మళ్లీ గెలిపించాలా? వద్దా? అనేది ఓటర్లు బేరీజు వేసుకోవాలి. రాజకీయ పార్టీల అధినాయకులు ఎంపిక చేసే అభ్యర్థులను సమర్థించాలా? వద్దా? అనేది కూడా ప్రతి ఓటరూ పరిశీలించాలి. పార్టీ అధిష్ఠాన వర్గం ఎంపిక చేసినంత మా త్రాన సదరు అభ్యర్థి సమర్థుడు, మంచివాడు అనే గ్యారంటీ లేదు.
ప్రజలు తమ పట్ల చూపుతున్న విశ్వాసం, ప్రేమాభిమానాలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. తమ ఇష్టానుసారం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. రాజకీయ పార్టీల అధినాయకులు కులతత్వం, ప్రాంతీయ తత్వానికి పెద్ద పీట వేస్తూ అసమర్థులకు టికెట్లు కేటాయిస్తున్నారు. తాము ఎవరిని నిలబెట్టినా ప్రజలు ఓట్లు వేస్తారనే అతి విశ్వాసంతో పార్టీలు వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. రాజకీయ పార్టీల పట్ల, వాటి అధినాయకుల పట్ల జనం అతిగా విశ్వాసాన్ని ప్రకటించటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అందుకే ఓటర్లు సమర్థురులైన వారినే గెలిపించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లడంతోపాటు రాజకీయ పార్టీలు, అధినాయకులు అదుపులో ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక పార్టీ అధినాయకుడు ఐదారు శాతం ఉన్న కులానికి ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించి, యాభై లేదా అంతకంటే ఎక్కువ శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాల వారికి కేవలం ఇరవై ఐదు సీట్లు కేటాయించటం తెలిసిందే. జనాభా ప్రాతిపదికపై టికెట్లు కేటాయించకపోయినా ఆయా వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. చాలా సంవత్సరాల నుండి ఇలా జరగటం లేదు.
రాజకీయ పార్టీల అధినాయకత్వం తమ ఇష్టానుసారం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దీంతో సమాజంలో అసమానతలు చోటు చేసుకుంటున్నాయి. చట్టసభల్లో అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సముచిత ప్రాధాన్యత లభించటం లేదు. దీని పర్యవసానంగా కొన్ని వర్గాలు, ప్రాంతాలు మాత్రమే అభివృద్ధికి నోచుకుంటున్నాయి. వడ్డించేవాడు మనవాడు కాబట్టి ఎక్కడ కూర్చున్నా అన్ని వంటకాలు అమితంగా లభిస్తాయన్నట్లు టిక్కెట్ల కేటాయింపుల్లో రెండు,మూడు కులాల వారికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది. కొన్ని సామాజిక వర్గాల వారే అధిక సంఖ్యలో ఎన్నికై అభివృద్ధి ఫలాలను తమ వర్గం వారికే అధికంగా పంచుతున్నారు. ఈ పక్షపాత ధోరణికి తెర పడాలంటే ఓటర్లు బాగా ఆలోచించి ఓటు హక్కును వినియోంచుకోవాలి. ఒక పార్టీ అధినాయకుడి పట్ల అధిక విశ్వాసం ప్రకటించటం, మద్దతు ఇవ్వటం వల్ల ఇలాంటి అనర్థాలు నెలకొంటున్నాయి. అందుకే అధినాయత్వం మంచిచెడ్డలతోపాటు అభ్యర్థి గుణగణాలను కూడా జనం ఆలోచించిన తరువాతనే ఓ టు వేయాలి. దీనినొక అలవాటుగా మార్చుకుంటే సమ సమాజ స్థాపనకు అవకాశం ఏర్పడుతుంది.
పార్లమెంటు లేదా శాసన సభల్లో కొన్ని కులాల వారికి ఇప్పటికీ ప్రాతినిధ్యం లభించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటుతున్నా సమాజంలోని అన్ని వర్గాల వారికి అధికార, సామాజిక, విద్యా పరమైన సాధికారిత లభించలేదు. చట్టసభల్లో మూడు లేదా నాలుగు కులాలు లేదా వర్గాల వారికి అత్యధిక శాతం ప్రాతినిధ్యం లభిస్తే మెజారిటీ వర్గాలైన వారికి అతి తక్కువ శాతం ప్రాతినిధ్యం లభిస్తోంది. కొన్ని వర్గాలు, కులాల వారికి అసలు ప్రాతినిధ్యమే లభించటం లేదు. రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులకు మూకుమ్మడిగా ఓట్లు వేసే అలవాటు మూలంగా ఇలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటు అనే పునాది గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్య సౌధం పది కాలాల పాటు సురక్షితంగా ఉంటుంది. మన నాయకులు ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ పాలన, ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు. ఓటర్లు అప్రమత్తంగా లేకపోవటం మూలంగానే ఇలా జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో పాలకులు పాలితుల సేవకులే తప్ప వారు గొప్పవారు కాదు. అయితే- ఓటర్లు కుల,మత,ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రలోభాలకు లొంగిపోవడంతో పాలకులు ప్రజలను తమ సేవకులుగా మార్చుకుంటున్నారు. పాలకులను తమ సేవకులుగా చూసే స్థాయికి ఓటర్లు ఎదగాలి. సేవకులు సక్రమంగా పని చేయకపోతే నిర్దాక్షిణ్యంగా వారిని తొలగించగలిగే స్థాయికి ఓటర్లు ఎదిగినప్పుడే పాలకులు అదుపులో ఉంటారు. ఓటర్లు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించిన తరువాతనే ఓటు వేయాలి తప్ప ప్రలోభాలకు తలవంచి ఓటు వేయకూడదు. ప్రజాస్వామ్యంలో తాము మహారాజులనే సత్యాన్ని ఓటర్లు విస్మరించరాదు.

-కె.కైలాష్ 98115 73262