ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

తిట్ల పురాణంలో అంతా ఘనాపాఠీలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకునేందుకు ఇస్తున్నంత ప్రాధాన్యం తమ విధానాలను వివరిస్తూ ప్రజల విశ్వాసం పొందేందుకు ఇవ్వడం లేదు. దాదాపుఅన్ని రాజకీయ పార్టీలకు చెందిన చిన్నాపెద్దా నాయకులంతా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ప్రత్యర్థులను అవహేళనకు గురిచేస్తూ, ఓట్లు దండుకునేందుకు ఎంతకైనా దిజగారుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చేకొద్దీ బురద చల్లుకునే కార్యక్రమం మరింత పుంజుకుంటోంది. ‘నీవుదొంగ అంటే నీవుదొంగ, నీవు అసమర్థుడవంటే నీవు అసమర్థుడవు, నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదం’టూ తిట్ల దండకం చదువుతున్నారు. ‘నువ్వు ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నావంటే.. నువ్వే అలా చేస్తున్నావు..’ అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో నేతలు చెప్పని అబద్ధం లేదు, చేయని తప్పుడు హామీ లేదు, తిట్టని తిట్టు లేదు. అన్ని పక్షాల నేతలూ నోటికి వచ్చింది వాగుతున్నారు. కాంగ్రెస్, భాజపా, తెదేపా, తెరాస, ఎస్పీ, బిఎస్పీ వంటి పార్టీల నాయకులు తిట్ల పురాణం విప్పితే అర్థం చేసుకోవచ్చు, అబద్ధాలు చెబితే జీర్ణించుకోవచ్చు. చివరకు వామపక్షాల నాయకులు సైతం ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు సిద్ధమైపోయారు, అసంబద్ధంగా మాట్లాడుతూ తమ ప్రతిష్టను తామే దిగజార్చుకుంటున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లాంటి నేతలు సైతం మతపరమైన విమర్శలకు దిగటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘హిందువులు హింసావాదులు కాదంటూ భాజపా చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. వాస్తవానికి మహాభారతం, రామాయణం నిండా హింస ఉన్నది.. వీటిలో యుద్ధాలు తప్ప ఏమున్నాయి?’ అంటూ సీతారాం ఏచూరి వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది. భాజపా, దాని అనుబంధ సంస్థలైన సంఘ్ పరివార్, విహెచ్‌పిలు ఏచూరిని ఏకిపారేశాయి. చివరకు ‘నెటిజనులు’ కూడా ఏచూరిని విమర్శలతో ముంచెత్తారు. వామపక్ష నాయకులు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై విమర్శలు చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ మతపరమైన ఆరోపణలు, విమర్శలకు దిగడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. హిందువులు హింసావాదులు కాదంటూ భోపాల్ నుండి పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన ప్రకటనను ఖండించేందుకు ఏచూరి రా మాయణ మహాభారతాలను ఉటంకించారు. పురాణాల్లో హింసాత్మక సంఘటనలు ఉన్నాయి గనుక హిందువులు హింసావాదులేనంటూ ఆయన పోలిక పెట్టారు. హిందువులు నిజంగా హింసావాదులైతే భారత దేశం మతం ప్రాతిపదికపై విడిపోయిన తరువాత- ఇంతమంది మైనారిటీలు హాయిగా జీవించే వారా? పాకిస్తాన్‌లోలా ఇక్కడ కూడా జరిగి ఉండాల్సింది కానీ అలా జరగలేదే? మ తం ఆధారంగా దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌లో హిందువుల జనాభా దాదాపు ఐదు శాతం ఉంటే ఇప్పుడది ఒకటిన్నర శాతమైంది. భారత్‌లో మైనారిటీల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇక్కడ మైనారిటీలకు ఉన్నన్ని హ క్కులు, రాయితీలు పాకిస్తాన్‌లో హిందువులకు లే వు. ఖురాన్‌లో హింస ఉన్నదని సీతారాం ఏచూరి బహిరంగ ప్రకటన చేయగలరా? హిందూ మతాన్ని విమర్శించినట్లు ఇస్లాంను విమర్శించగలరా? ఎన్నికల్లో ప్రయోజనం కోసం హిందూ మతంపై దుమ్మెత్తిపోయటం సమర్థనీయం కాదు.
భాజపా అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ విషయంలో చేసిన విమర్శలు కూడా సమంజసం కాదు. వాయనాడ్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీలు పాకిస్తాన్‌ను తలపిస్తున్నాయని షా ఆరోపించారు. కేరళ ఈ దేశంలో అంతర్భామే తప్ప పాకిస్తాన్‌లో లేదని అమిత్ షాకు తెలియదా? మైనారిటీల ఓట్లతో విజయం సాధించాలని రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారన్నది నిజం. అయితే, మైనారిటీలు అధికంగా ఉన్నంత మాత్రాన వాయనాడ్ పాకిస్తాన్‌ను తలపిస్తోందంటూ షా వ్యాఖ్యానించటం ఏ విధంగా సమర్థనీయం. అధికార పార్టీ అధినేత ఇలా బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదు. ఇతరులకు ఆదర్శం కావలసిన వ్యక్తి మతపరమైన విభేదాలకు దారి తీసేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా బాధ్యతారహితమైన ఆరోపణలకు మారుపేరుగా మారారు. ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారుడే దొంగ) అంటూ ప్రధాని న రేంద్ర మోదీపై రాహుల్ పదే పదే చేస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగిస్తున్నాయి. జా తీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల మాటలు, చేతలు ఉన్నత స్థాయిలో ఉండాలి తప్ప గల్లీ స్థాయికి దిగజారకూడదు. కానీ, వారు స్థాయిని మరచి దిగజారేందుకు సిద్ధపడడం సిగ్గుచేటు. ‘యూరీ’ దాడికి ప్రతీకారంగా ఆక్రమిత కశ్మీర్‌లో మన సైన్యం జరిపిన మెరుపుదాడికి, పుల్వామాలో సీఆరీపీఎఫ్ జవాన్లపై జరిపిన దాడికి బదులుగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై జరిపిన విమాన దాడికి రుజువులు అడిగిన కాంగ్రెస్ తమ హయాంలోనూ ఆరుసార్లు మెరుపు దాడులు చేశామంటోంది. త్రివిధ దళాలనేవి ప్రధాని మోదీ సొత్తు కాదు. అవి భారతదేశ సైన్యం. మెరుపుదాడులు, వైమానిక దాడులు చేసింది భారత సైన్యం తప్ప మోదీ సైన్యం కాదంటూ రాహుల్ రాజకీయం చేశారు. మోదీ కూడా తక్కువేం తినలేదు, సెల్‌ఫోన్‌పై గేమ్స్ ఆడుతూ రాహుల్ వాటినే మెరుపుదాడులని భావిస్తున్నట్టు ఎదురు దాడి చేశారు. ప్రతి నిమిషం సెల్‌ఫోన్‌లో ఆటలాడుకునే వ్యక్తికి మెరుపుదాడులేం అర్థమవుతాయంటూ మోదీ ఎద్దేవా చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో తన మిత్రుడు, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ప్రధాని మోదీ 30 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచి పెట్టారంటూ రాహుల్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానితోపాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఫ్రాన్స్ నుండి జలాంతర్గాములు కొనుగోలు చేసేటప్పుడు రాహుల్ గాంధీ లండన్ చిరునామాతో ప్రారంభించిన సంస్థకు అప్‌సెట్ కాంట్రాక్టు ఇచ్చారని మోదీ, జైట్లీ ఆరోపించారు.
ఇక మోదీకి- ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ల మధ్య జరిగే ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అందరికీ తెలిసిందే. మోదీ నీచుడు, మోసగాడు, విశ్వసించేందుకు వీలులేని వ్యక్తి, దగాకోరు అంటూ ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు లెక్కలేనన్నిసార్లు తిట్టిపోశారు. సొంత కుటుంబం లేని వ్యక్తికి ప్రేమాభిమానాల గురించి, సంసారం గురించి ఏం తెలుసునని చంద్రబాబు అత్యంత దిగజారుడు స్థాయిలో మోదీని విమర్శించారు. కుటుంబ విలువలు తెలియని వ్యక్తి దేశానికి ఏం సేవ చేస్తాడంటూ ఆయన పరుష పదజాలంతో దుయ్యబట్టారు. మమతా బెనర్జీ కూడా ఇదే భాషలో మోదీపై తిట్ల దండకం వినిపించారు. మోదీ ఈ నాయకులను వ్యక్తిగత స్థాయిలో తిట్టలేదు కానీ అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ తదితర నాయకులు వారి ప్రత్యర్థులపై చేస్తున్న ఆరోపణలు సభ్యత లేనివిగా ఉంటున్నాయి. ఐపీఎస్ అధికారి హేమంత కర్కరే తన శాపం వల్లనే ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైనట్టు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన ప్రకటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రత్యర్థులను దోషులుగా చిత్రీకరించటం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవటమే నేతల లక్ష్యం. తిట్ల పురాణంలో ఎవరు విజయం సాధిస్తే వారికే ఎక్కువ ఓట్లు పడతాయి. ఎన్నికలకు ముందు బురద చల్లుకున్న వారే ఫలితాలు వచ్చాక కలిసిపోతారు తప్ప ప్రచార సమయంలో తాము చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోరన్న విషయాన్ని ఓటర్లు గ్రహించాల్సి ఉంది. *

-కె.కైలాష్ 98115 73262