ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఫలితాల తరువాత ఏం జరగబోతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేడవ లోకసభ ఎన్నికల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఎల్ల్లుండి అంటే 23వ తేదీ ఏం జరగబోతోంది? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా, ఎగ్జిట్ పోల్స్ ఎంతో విశ్వాసంతో చెబుతున్నట్లు బి.జె.పికి మరోసారి భారీ మెజారిటీ లభించి ఎన్.డి.ఏ ఆధికారంలోకి రాబోతోందా? నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారా? లేక ఎగ్జిట్ పోల్స్ తప్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు చెబుతున్నట్లు హంగ్ పార్లమెంటు ఏర్పడి ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందా? బి.జె.పి నాయకత్వంలో మరోసారి ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని నరేంద్ర మోదీ, అమిత్ షా గట్టిగా విశ్వసిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన 132 అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోవటంలో తాము విజయం సాధించామని అమిత్ షా చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి ఐదు సంవత్సరాల పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందచేశామన్నది బి.జె.పి నాయకుల వాదన. దేశానికి అత్యంత గట్టి నాయకుడిని అందజేయటంతోపాటు ప్రపంచ దేశాల్లో భారతదేశం పరువు, ప్రతిష్టను ఇనుమడింపజేశాము, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పి కట్టడి చేయటంలో విజయం సాధించామన్నది బి.జె.పి నాయకుల వాదన. బి.జె.పి నాయకులు ఏం చెబుతున్నా దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని, పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వటంలో బి.జె.పి విజయం సాధించిందనటంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం ఉండనక్కర లేదు. డొక్లాంలో చైనాను నిలువరించటంతోపాటు, పుల్వామా సంఘటన అనంతరం బాలాకోట్‌పైన విమాన దాడి చేయటం, ఆ తరువాత పాకిస్తాన్‌కు చిక్కిన విమానదళం పైలట్‌ను సురక్షితంగా విడిపించుకోవటంలో మోదీ ప్రదర్శించిన ధైర్య, సాహసాలు ప్రశంసనీయం. అభివృద్ధి పథకాల ఫలితాలను ఆఖరు లబ్ధిదారుని వద్దకు తీసుకుపోయేందుకు మోదీ ప్రభుత్వం చేసిన కృషి కూడా శ్లాఘనీయమే. ప్రజలు వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేసి ఉంటే నరేంద్ర మోదీ, అమిత్ షా చెబుతున్నట్లు బి.జె.పికి మరోసారి మెజారిటీ లభించటంతోపాటు రెండోసారి ఎన్.డి.ఏ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పడితే అది అత్యంత సుస్థిరమైన ప్రభుత్వంగా మారుతుంది. నరేంద్ర మోదీ అత్యంత పటిష్టమైన నాయకుడు కావటం వలన పలు అభివృద్ధి పథకాలు యుద్ధ ప్రాతిపదికపై అమలవుతాయి. దేశంలో పెను మార్పులు వస్తాయి, అవినీతిని అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు అమలవుతాయి. దీనితోపాటు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు మారుమోగుతుంది. చైనా, పాకిస్తాన్‌లు ఆలోచనలో పడిపోతాయి.
ఎన్.డి.ఏ ప్రభుత్వానికి బదులు హంగ్ పార్లమెంటు ఏర్పడి ప్రతిపక్షం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పక్షంలో దేశంలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడటం ఖాయం. మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూసేందుకు ప్రతిపక్షం నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏ.పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ, లక్నో, కోల్‌కత్తాల మధ్య తిరుగుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడకుండా చూసేందుకు అవసరమైతే ఇతర ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన మంత్రి పదవిని వదిలిపెట్టేందుకు సిద్ధమని మొదట ప్రకటించిన కాంగ్రెస్ ఆ తరువాత ఒక్క రోజులోనే మాట మార్చింది. కేంద్రంలో సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై ఐదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలంటే ప్రతిపక్షంలోని ఏకైక పెద్ద పార్టీ కాంగ్రెస్‌కు ప్రధాన మంత్రి పదవి ఇవ్వాలని వాదిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ వాదనతో బి.ఎస్.పి అధ్యక్షురాలు మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అంగీకరిస్తారా? అనేది అసలు ప్రశ్న. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చాపకింద నీరులా తెర వెనక రాజకీయం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి అధినాయకుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వై.ఎస్.పి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటును ఆమోదిస్తారా? కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నందున చంద్రశేఖరరావు, జగన్‌మోహన్ రెడ్డి ఈ కూటమితో కలుస్తారా? అనేది ఆలోచించవలసిన విషయం. ఇదిలా ఉంటే కేంద్రంలో ప్రతిపక్ష సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు అత్యంత కీలక పాత్ర నిర్వహించనున్నారు. ప్రతిపక్షంలోని ఐకైక పెద్ద పార్టీ నాయకత్వంలో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వం మాత్రమే ఐదు సంవత్సరాల పాటు స్థిరంగా ఉంటుందన్న వాదన నిజమే అయినా మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ మద్దతు లేకుండా ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదు. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ తుమ్మినా, దగ్గినా దాని ప్రభావం కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై పడుతుంది. రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంత కాలం మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీల పెత్తందారీతనాన్ని భరించగలుగుతారనేది ప్రశ్న. మమతా బెనర్జీ, మాయావతికి రాహుల్ గాంధీ నాయకత్వంపై ఏ మాత్రం విశ్వాసం లేదు. వీరిద్దరి దృష్టిలో రాహుల్ గాంధీ నాయకుడే కాదు, అతను ప్రధాన మంత్రి పదవికి ఎంత మాత్రం అర్హుడు కాదన్నది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో మాయావతి, మమతా బెనర్జీలు అతని నాయకత్వాన్ని ఎంత కాలం భరిస్తారు, అతని నాయకత్వాన్ని భరించేందుకు వీరు తీసుకునే మూల్యం ఏమిటి? దాని వలన ఎదురయ్యే పరిణామాలు ఏమిటనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది. మాయావతి, మమతా బెనర్జీలు ప్రధాన మంత్రి పదవి చేపట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కలిసి వస్తే ఇప్పుడే ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు ఇద్దరు మహిళా నాయకులు గట్టిగా ప్రయత్నిస్తారు. ఇదే జరిగితే ప్రధాన మంత్రి పదవి కోసం ప్రతిపక్ష నాయకుల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. ఈ పదవీ పోరాటంలో ఎవరు మంకు పట్టుపట్టినా ప్రతిపక్షం నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం కంపు కంపుగా తయారవుతుంది. చిన్న పార్టీల నాయకత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే అది ఒకటి, రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగదు. గతంలో చంద్రశేఖర్, చరణసింగ్, హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలే నిదర్శనం. చంద్రశేఖర ప్రభుత్వం 1990 నవంబర్ 10 నుండి 1991 జూన్ 21 వరకు మాత్రమే కొనసాగింది. చరణ్‌సింగ్ ప్రభుత్వం 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 తేదీ వరకు పని చేసింది. ఇక దేవెగౌడ ప్రభుత్వం 1996 జూన్ ఒకటో తేదీ నుండి 1997 ఏప్రిల్ 21 వరకు అధికారంలో ఉండింది. ఈ ప్రభుత్వాలు ఎవరి మూలంగా పడిపోయాయనేది అందరికి తెలిసిందే. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం వరుసగా పది సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది. అయితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు మిత్రపక్షాలు ఈ స్థాయిలో మూల్యం తీసుకున్నాయనేది ఆందరికి తెలిసిందే. యు.పి.ఏ హయాంలో జరిగినన్ని అవినీతి పనులు మరే ఇతర ప్రభుత్వం హయాంలో జరగలేదనేది జగమెరిగిన సత్యం.
నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు ఏకమవుతున్న నాయకులు ఎన్నికలకు ముందు ఒకరినొకరు తిట్టిపోసుకున్న వారే. దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్ల కోసం జరిగిన పోరాటంలో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ను తన దరిదాపులలోకి కూడా రానివ్వలేదు. తమకు నాలుగైదు సీట్లు ఇచ్చినా కూటమిలో చేరుతామని రాహుల్ గాంధీ మొరపెట్టుకున్నా మాయావతి, అఖిలేష్ యాదవ్ పట్టించుకోలేదు కదా కనీసం చర్చించేందుకు కూడా ఇష్టపడలేదు. మోదీని వ్యతిరేకించేందుకు వారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. ప్రతిపక్షాల నాయకులందరిని ఒక తాటిపైకి తెచ్చేందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న చంద్రబాబునాయుడు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు అంగీకరించకపోవటం అందరికి తెలిసిందే. తెలంగాణాలో కాంగ్రెస్‌తో కలిసి ఓటమిని చవి చూసిన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి ఎంత మాత్రం తగడని ప్రకటించిన శరద్ పవార్, మమతా బెనర్జీ, మాయావతులు మోదీని వ్యతిరేకించేందుకు చేతులు కలుపుతున్నారు. రాజకీయ స్వార్థం ఆధారంగా ఏకమవుతున్న ఈ ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే దేశం పరిస్థితి ఏమిటి?

-కె.కైలాష్ 98115 73262