ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రభస లేని రాజకీయాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా కొలువుదీరిన పదిహేడవ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బాధ్యతతో వ్యవహరించకపోతే ప్రజల విశ్వాసాన్ని వారు మరింత కోల్పోవటంతోపాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచిన వారవుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు సొంతంగా 303 సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు తొంబయి కోట్ల మంది ఓటర్లు నరేంద్ర మోదీకి బ్రహ్నరథం పట్టి భారీ మెజారిటీని కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును ప్రతిపక్షం శిరసావహించటంతోపాటు అన్ని విధాలా గౌరవించాలి. ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాజకీయ ద్వేషంతో విమర్శించటం, ఆరోపణలతో ముంచెత్తుతూ ప్రతి రోజూ పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసే విధ్వంసక రాజకీయాలను విపక్షం వారు చేయకూడదు.
ప్రతిపక్షాలు కనీసం ఆరు నెలల పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిశితంగా పరిశీలించాలి. ఆయన వేసే ప్రతి అడుగునూ జాగ్రత్తగా పరిశీలించాలి. భాజపా తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తోందనే అంశంపై దృష్టి సారించాలి. వ్యవసాయ రంగానికి ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? వాటి వలన కర్షకలోకానికి ఎలాంటి ప్రయోజనం ఉంటోంది? రైతులకు నిజంగానే మేలు జరుగుతోందా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలి. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందా? లేదా ? అనేది చూడాలి. వాస్తవానికి గత ప ది సంవత్సరాల నుండి దేశంలో ఉపాధి అవకాశాలు అంతగా పెరగలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీడీపీ పెరుగుదల విషయంలో కూడా యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు ఇచ్చాయని ఇటీవల ఒక అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడు ఆరోపించటం తెలిసిందే. దేశంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయని, యువతకు ఆశించిన స్థాయిలో ఉపాధి లభించటం లేదనేది చివరకు ప్రభుత్వం సైతం పరోక్షంగా అంగీకరించింది. నరేంద్ర మోదీ ఈ అంశంపై దృష్టి సారించి ప్రభుత్వానికి తగు సిఫారసులు ఇచ్చేందుకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షం ఈ అంశాలన్నింటిపైనా దృష్టి సారించాలి.
మోదీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించటంలో ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆరోపించటం తెలిసిందే. ప్రతిపక్షం ఇప్పుడీ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి కల్పనకు దారి తీస్తున్నాయా? లేదా? అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతిపక్షాలు వెనువెంటనే మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎవరూ పట్టించుకోరు. ఎన్నికల్లో ఓటమి చెందామన్న కక్షతో ప్రతిపక్షం విమర్శిస్తోందనే ఆరోపణలు వస్తాయి. ప్రతిపక్షం వెంటనే ప్రభుత్వంపై ఆరోపణలు కురిపించినా, విమర్శలు చేసినా ప్రజలు కూడా హర్షించరు. అందుకే ప్రతిపక్షం కొంత సమయం పాటు ఓపికతో వ్యవహరించటం మంచిది.
ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన ప్రతిపక్షం వెంటనే ప్రభుత్వంపై విరుచుకుపడే బదులు, తమ ఓటమికి దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేసుకుని వాటిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిపక్షం ఎన్నికల ప్రచారంలో బాధ్యతారహితంగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. ప్రతి రోజూ మోదీని వ్యక్తిగత విమర్శలకు గురి చేసే బదులు- గత అయిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపించటంతోపాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది హేతుబద్ధంగా ప్రజలకు వివరించి ఉంటే వారికి ఇంతకంటే మంచి ఫలితాలు వచ్చేవి. నరేంద్ర మోదీని వ్యక్తిగత విమర్శలకు గురి చేయటంతోపాటు తప్పుడు ఆరోపణలు చేయటం వల్లనే ప్రతిపక్షానికి ఘోర పరాజయం ఎదురైంది. ప్రతిపక్షం ఆలోచనారహిత రాజకీయాల మూలంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు సైతం నష్టం వాటిల్లింది. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం ఇప్పటికైనా గ్రహించటం మంచిది.
లోక్‌సభలో ఇప్పుడు పటిష్టమైన ప్రతిపక్షం లేకుండాపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలువరించిగలిగే ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు నిజంగా కష్టకాలమే. గత లోక్‌సభలో అధికార పార్టీని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలువరిస్తూ తప్పులను ఎత్తిచూపించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా, వీరప్ప మొయిలీ, సీపీఎం నాయకుడు మహమ్మద్ సలీం లాంటి నాయకులు ఓడిపోయారు. చివరకు కాంగ్రెస్‌కు చెందిన సుస్మితా దేవ్ వంటి ‘అరిచే గ్యాంగ్’ సైతం నామరూపాలు లేకుండాపోయింది. ఈసారి లోక్‌సభలో ప్రతిపక్షం నుండి సీనియర్ నాయకులు లేకుండాపోయారు. ప్రతిపక్షం సంఖ్య బాగా కుదించుకుపోవటంతో మోదీ ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలువరిస్తూ, తప్పులు ఎత్తిచూపించేవారే కనిపించటం లేదు. అమేథీలో ఓడిపోయినా కేరళలోని వాయనాడ్ నుండి భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో బలమైన ప్రతిపక్ష నేతగా రాణించగలరా? అనేది అనుమానమే. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు నిరాకరిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడుగా పని చేసేందుకు ఇష్టపడతారా? గత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం చేపట్టేందుకు రాహుల్ నిరాకరించటం తెలిసిందే. అయన ఈసారైనా కాంగ్రెస్ పక్షానికి లోక్‌సభలో నాయకత్వం వహించి ప్రభుత్వంపై సహేతుక విమర్శలు చేసేందుకు తనను తాను సిద్ధం చేసుకోవాలి.
భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రతిపక్షాన్ని బేఖాతరు చేసి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షంలో సీనియర్ నాయకుల లేకపోవడాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షం వీటిన్నంటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలి. ప్రతిపక్షంలో ఉన్న చిన్న చిన్న పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. ఏపీలో ఇరవై రెండు సీట్లు గెలుచుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వంపై పోరుకు సమాయత్తం కాదు. ఆశించినన్ని సీట్లు లభించకపోవటంతో నిరాశా నిస్పృహల్లో ఉన్న తెరాస పార్టీ సైతం తటస్థ వైఖరిని ఆవలంబించవచ్చు. మరోసారి ఐదు సీట్లకే పరిమితమైన సమాజ్‌వాదీ పార్టీ కూడా నరేంద్ర మోదీపై పోరుకు సుముఖం కాకపోవచ్చు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి మోదీని మట్టికరిపించాలని కలలు కన్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కేవలం మూడు సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో 52 ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్, 22 సీట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్, 23 స్థానాలు గెలిచిన డీఎంకే , పది సీట్లు గెలిచిన బహుజన్ సమాజ్ పార్టీలు లోక్‌సభలో బాధ్యతాయుత రాజకీయం చేయాలి. ప్రతి చిన్న విషయానికీ స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చి గొడవ చేయటం వలన ఇప్పటికే అడుగంటిన ప్రతిపక్షం పరువు ఇకపై పూర్తిగా ఊడ్చుకుపోతుంది. ప్రతిపక్షం సమన్వయంతో పని చేయటం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలువరించేందుకు ప్రయత్నించాలి.
రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర సమస్యలను లోక్‌సభ దృష్టికి తీసుకురాకూడదు. దీనివల్ల రాష్ట్ర సమస్యలు పరిష్కారం కాకపోవటం అటుంచితే దేశ సమస్యలు కూడా పరిష్కారం కావు. విలువైన సభా సమయం వృథా అవుతుంది తప్ప ఆశించిన ఫలితాలు రావు. లోక్‌సభ దేశ సమస్యలు, జాతీయ స్థాయి అంశాలకు ఉద్దేశించించింది గనుక ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో జాతీయ స్థాయిలో పని చేయాలి తప్ప ఢిల్లీని రాష్ట్ర స్థాయికి దిగజార్చకూడదు. రాష్ట్ర సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించినా అవి అత్యంత ముఖ్యమైనవై ఉండాలి. దేశం దృష్టికి తీసుకురావలసిన అవసరం ఉండాలి. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి పోడియం వద్దకు దూసుకు వచ్చి గొడవ చేయటాన్ని ప్రజలు సహించరు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తదితర నాయకులు ఢిల్లీలో జాతీయ స్థాయి రాజకీయాలు చేయాలి. అప్పుడే వారు రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. జాతికి ఇప్పుడు దేశ స్థాయి నాయకుల అవసరం ఎంతో ఉన్నది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి ఎన్నో నెలలు గడిచినా- ఆయన జాతీయ స్థాయికి ఎదగలేకపోయాడు. నరేంద్ర మోదీని నిలువరించేందుకు, ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థను పరిరక్షించేందుకు దేశ స్థాయి నాయకుల అవసరం ఉన్నది. ఈ లేమిని పూరించపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుంది. ప్రతిపక్షాలు ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో వ్యవహరించటం మంచిది.
*

-కె.కైలాష్ 98115 73262