ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీ బృందం ‘అశ్వమేధ యాగం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘కమల దళం’ ఆధునిక రాజకీయ అశ్వమేధ యాగం ప్రారంభించింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ తామే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో భాజపా అధినాయకత్వం ఇలా ప్రజాస్వామ్య యుగంలో అశ్వమేధ యా గానికి శ్రీకారం చుట్టింది. కర్నాటకలో కాంగ్రెస్-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలన్నది భాజపా అధినాయకత్వం వ్యూహంగా కనిపిస్తోంది. ఈ లక్ష్యసాధన కోసం రాజకీయాల్లో నిజాయితీకి, విలువలకు భాజపా తిలోదకాలిచ్చిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంతకాలం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకునే భాజపా ఇప్పుడు అధికారం కోసం ఎన్ని వ్యూహాలకైనా సిద్ధమంటోంది.
భాజపా అధినాయకత్వం దుందుడుకు రాజకీయాల మూలంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుంటోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, తెరాస పాలకుల నియంతృత్వ రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది భాజపా వ్యూహం. కర్నాటకలో కాంగ్రెస్-జేడీయూ కూటమికి చెం దిన పధ్నాలుగు మంది శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించి ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వాన్ని భాజపా సంక్షోభంలో పడవేసింది. శాసనసభ్యుల రాజీనామాల వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భాజపా ఎత్తులను చిత్తు చేసేందుకు అసెంబ్లీలో బలపరీక్షకు దిగుతున్నారు. జేడీయూ నేతలు దేవెగౌడ, కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు ఎన్ని ఎత్తులు వేసినా సంకీర్ణ ప్రభుత్వం పతనం కాకతప్పదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. కాంగ్రెస్ కనుమరుగు కాకముందే తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలనుకుంటున్న కర్నాటక కాంగ్రెస్ శాసన సభ్యులు భాజపా పంచన చేరిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కుమార స్వామి నాయకత్వంలోని జేడీయూ లోపాయికారిగా భాజపాతో మంతనాలు జరుపుతోందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు బదులు భాజపాతో చేతులు కలపటం ద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నది కుమార స్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ వ్యూహమని అంటున్నారు. ఇదే నిజమైతే కర్నాటకలో వచ్చే వారం ఎలాంటి రాజకీయమైనా తెరపైకి రావచ్చు.
కర్నాటకలో సంక్షోభం ముగిశాక, మధ్యప్రదేశ్‌పై పూర్తిస్థాయిలో భాజపా దృష్టి సారిస్తుందని ముందే ఊహించిన ఎంపీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవిని సుస్థిరం చేసుకునేందుకు పె ద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రా రంభించారు. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు ఇండిపెండెంట్ శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకుంటే కమల్‌నాథ్ ప్రభుత్వం పతనమైపోతుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం సీట్లు 231 కాగా, 230 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, ఒక ఎమ్మెల్యేను గవర్నర్ నామినేట్ చేస్తారు. ఎంపీ శాసనసభలో కాంగ్రెస్ బలం 114, బిఎస్పీకి ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక సభ్యుడు ఉన్నాడు. నలుగురు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న భాజపా బలం 108 కాగా, ఒక సీటు ఖాళీగా ఉన్నది. ఎస్పీ, బిఎస్పీలు భాజపాపై ఆగ్రహంతో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఈ రెండు పార్టీలూ కాంగ్రెస్‌కు దూరమయ్యాయి. నలుగురు స్వతంత్ర సభ్యులను తమ వైపుతిప్పుకునేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నలుగురు స్వతంత్ర సభ్యులతోపాటు ఇద్దరు బిఎస్పీ ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపా గూటిలోకి ఎప్పుడైనా చేరిపోయే ప్రమాదం నెలకొన్నది. అందుకే ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఇద్దరు స్వతంత్ర సభ్యులకు మంత్రి పదవుల ఆశలు చూపిస్తున్నారు.
భాజపా అధినాయకత్వం తన యాగాశ్వాన్ని ఒక్కొక్క రాష్ట్రం మీదుగా నడిపిస్తోంది తప్ప ఒకేసారి అన్ని రాష్ట్రాల మీదుగా నడిపించాలనే ఆలోచన చేయటం లేదు. అందుకే కర్నాటక రాజకీయ సంక్షోభం కొలిక్కి రాగానే మధ్యప్రదేశ్‌పై దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రాథమిక రాజకీయ కార్యకలాపాలను భాజపా చాపకింద నీరులా చేసుకుపోతోంది. రాజస్థాన్‌లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. అయితే రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చడం భాజపా నేతలకు కొంత కష్టతరమే. మధ్యప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్, భాజపాల మధ్య తేడా కేవలం ఐదుగురు సభ్యులే. రాజస్థాన్‌లో ఇది చాలా ఎక్కువ. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలంటే భాజపాకు దాదాపు ముప్పై మంది శాసన సభ్యుల మద్దతు అవసరముంటుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 112 మంది శాసన సభ్యులుంటే బీఎస్పీకి ఆరుగురు, బీటీపీకి ఇద్దరు, ఆర్‌ఎల్‌డీకి ఒక సభ్యుడున్నాడు. ప్రతిపక్షంగా ఉన్న భాజపాకు 74 మంది శాసన సభ్యులున్నారు. భాజపా మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌పీకి ఇద్దరు శాసన సభ్యులున్నారు. ఆరుగురు బీఎస్పీ, ఇద్దరు బీటీపీ, ఒక ఆర్‌ఎల్‌డీ సభ్యుడితోపాటు కాంగ్రెస్‌కు చెందిన ఇరవై ఒక్క మంది శాసన సభ్యులను భాజపా తన వైపు తి ప్పుకోవలసి ఉంటుంది. ఇది సులభమైన పని కాకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ రాజీనామా వ్యవహారం రాజస్థాన్‌లో సైతం కాంగ్రెస్ శాసనసభ్యులను ఆలోచనలో పడవేసింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌లో తాము ఎంత కాలం ఉండాలి? ఎందుకు ఉండాలనే ప్రశ్న ఆ పార్టీ శాసనసభ్యులను వేదిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్-జేడీయూ ప్రభుత్వం పతనమైన పక్షంలో ఆ ప్రభావం మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లపై పడే ప్రమాదం ఉన్నది. గోవాలో దాదాపు పది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఒకే రోజు పార్టీ ఫిరాయించి భాజపాలో చేరిపోవటం ఇతర రాష్ట్రాలలోని కాంగ్రెస్ శాసన సభ్యులను ఆలోచనలో పడవేసింది. తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకునేందుకు కాంగ్రెస్ శాసన సభ్యులు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్‌కు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ రాజకీయ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించుకుంటున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీని పట్టుకుని వేలాడుతారని తాము భావించటం లేదని భాజపా సీనియర్ నాయకులు చెబుతున్నారు. తమ పార్టీ తలుపులను బార్లా తెరిచిన మరుక్షణం కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం భాజపాలో చేరేందుకు సిద్దంగా ఉంటారని వారంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు బ్రహ్మాండమైన మెజారిటీ లభించటం, మరోవైపు రాహుల్ గాంధీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండానే కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవటంతో కాంగ్రెస్ ఎంపీలు, శాసనసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా నాయకుడు లేకుండా దీనావస్థను ఎదుర్కొంటోంది. పార్టీ వ్యవహారాలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల్లో చాలామంది భాజపా వైపుఆశగా చూస్తున్నారు. కాంగ్రెస్ సంక్షోభం గ్రామ స్థాయి వరకు చేరుకోవడం భాజపాకు కలసి వస్తోంది. రాహుల్ రాజీనామా మూలంగా కాంగ్రెస్ సంక్షోభంలో పడిపోవటాన్ని భాజపా అధినాయకత్వం తనకు అనుకూంలగా మార్చుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇప్పుడు భాజపా మినహా మరో జాతీయ పార్టీ లేదు. దేశవ్యాప్తంగా భాజపా ఒక్కటే సర్వాంతర్యామిగా మారింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది శాసన సభ్యుల్లో కనీసం పదిమంది వరకు భాజపా వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెదేపాకు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న భాజపా పది మంది శాసన సభ్యులను కలుపుకుపోయేందుకు ఏ మాత్రం వెనుకాడదు. కాగా, ఏపీలో భాజపా నిలదొక్కుకోవటం ఏ మాత్రం సులభం కాదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పట్ల ప్రజల హృదయాల్లో భాజపా అంటే ఆగ్రహం పేరుకొనిపోయింది. భాజపా అధినాయకత్వం దీనిని చెరిపివేయగలిగితే తప్ప ఏపీలో ఆ పార్టీ నిలదొక్కుకోలేదు.
ఇక తెలంగాణలో తెరాస నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా పటిష్టపడాలన్నది భాజపా వ్యూహం. ఇటీవల నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవటం ద్వారా సత్తా చాటుకున్న భాజపా నిజంగానే తెరాసను చీల్చగలుగుతుందా? అనేది అనుమానమే. తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు పార్టీని ఫిరాయించే ధైర్యం చేయకపోవచ్చు. 2013 శాసనసభ ఎన్నికలు సమీపించే సమయానికి తెరాసలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకోవటం ఖాయం. ఆ పరిస్థితులను భాజపా అధినాయకత్వం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. *

-కె.కైలాష్ 98115 73262