ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీ జోరు.. పాక్ బేజారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక- వంద రోజుల పాలనలో ఆశించిన దానికంటే ఎక్కువే పని చేసింది. ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ చట్టం చేయడం, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన 370వ అధికరణాన్ని రద్దు చేయడం వంటివి మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలు. బ్యాంకుల విలీనంతో ఆర్థిక రంగంలో పెను సంస్కరణలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లుకు రూపకల్పన, వాహనదారులకు క్రమశిక్షణ నేర్పించేందుకు ఉద్దేశించిన మోటారు వాహనాల సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం వంటివి మోదీ సర్కారు తీసుకున్న మంచి నిర్ణయాలు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమన్న వాదనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేయడంతో పాటు, కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబే అని వివిధ దేశాల నాయకులతో మోదీ చెప్పించగలడం మామూలు విషయం కాదు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్‌పై కాదు, ఆక్రమిత కశ్మీర్‌పైనే చర్చలు జరగాలన్న వాదనతో పాకిస్తాన్ పాలకులకు చెమటలు పట్టించటం మోదీ సాధించిన మరో ఘన విజయం. వంద రోజుల వ్యవధిలో తాము తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు సినిమా ముందున్నది అంటూ మోదీ చేసిన ప్రకటనను విశే్లషిస్తే- ఇకపై ఆయన ఎంతవేగంతో ముందుకు సాగాలనుకుంటున్నారో, ఎన్ని సంస్కరణలు చేయాలనుకుంటున్నారో అన్నది కొంతైనా అర్థం అవుతుంది. ట్రిపుల్ తలాక్ చట్టం, ఆర్టికల్ 370 రద్దు, కొత్త మోటారు వాహనాల చట్టం, బ్యాంకింగ్ సంస్కరణలు వంటి భారీ నిర్ణయాలు ట్రైలర్ అయితే ఇక అసలు నిర్ణయాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది ఊహించుకోవచ్చు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు మోదీ ప్రభుత్వం చట్టరూపం కల్పించింది. ఈ లక్ష్యసాధన కోసం ఆయన భాజపా సిద్ధాంతాలను సైతం కొంతమేరకు పక్కన పెట్టారు. రాజ్యసభలో మెజారిటీ కూడగట్టుకుని ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకునేందుకు అవినీతి ఆరోపణలు ఉన్న కొంతమంది సభ్యులను సైతం భాజపాలో చేర్చుకున్నారు. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించే సమయంలో చిన్న తప్పులు చేయడం సహజం కావచ్చు. అయితే ఆ లక్ష్యాన్ని సాధించాక, తప్పులను సరిదిద్దుకోవలసిన బాధ్యత నరేంద్ర మోదీపై ఉన్నది. ట్రిపుల్ తలాక్ బిల్లును నిజం చేసిన మోదీ అంతే వేగంతో జమ్మూ కశ్మీర్‌ను జాతీయ జీవన స్రవంతిలో చేర్చగలిగారు. ఆ యన రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లోనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తారని ఎవరూ ఊ హించలేదు.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలు అమోదముద్ర వేయటం గమనార్హం. మోదీ ప్రభుత్వం కశ్మీర్ లోయకు పెద్ద ఎత్తున సైనిక బలగాలను తరలిస్తుంటే ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకే అన్న భావన ప్రజల్లో కలిగింది. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయటం అందరి ఆలోచనలను, అంచనాలను తలకిందులు చేసింది. కశ్మీర్‌ను జాతీయ స్రవంతిలో కలపడం ద్వారా మోదీ దేశ ప్రజల మన్ననలను పొందితే, ఈ నిర్ణయాన్ని ప్రశ్నించటం ద్వారా కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కోల్పోయాయి. అనుభవమున్న విపక్ష నాయకులు సైతం ఈ విషయంలో పప్పులో కాలు వేశారు. కాంగ్రెస్ యువ నాయకులు ధైర్యంగా ముందుకు వచ్చి కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించటం చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. కశ్మీర్ సమస్యను మోదీ ఇంత ధైర్యంగా పరిష్కరిస్తారని చాలా మంది ఊహించలేకపోయారు. మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ కశ్మీర్‌పై తమ వ్యూహాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయడం ప్రశంసనీయం.
కశ్మీర్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా గత నెలన్నర కాలంలో అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. ఒక్క వ్యక్తి కూడా మరణించలేదు. భద్రతా దళాలు గతంలో ఇలాంటి మోహరింపు చర్యలకు దిగితే చాలు- జిహాదీలను బలపరిచే యువకులు రోడ్డెక్కి గొడవ చేసేవారు. భద్రతా దళాలతో తలపడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించటం, లద్దాక్‌ను విడదీయటం మామూలు విషయాలు కాదు. ప్రత్యేక హోదా తొలగించి, లద్దాక్‌ను వేరు చేసినందుకు కశ్మీర్‌లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగేలా పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ శతవిధాల ప్రయత్నించడం తెలిసిందే. అయినా కశ్మీర్‌లో పరిస్థితి సజావుగానే ఉందంటే- మోదీ ప్రభుత్వం భద్రతపై ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందనేది అర్థం అవుతుంది. పాకిస్తాన్ పాలకుల ఆట కట్టించటంలోనూ మో దీ ఘన విజయం సాధించారు. మోదీ ప్రభుత్వం కశ్మీర్ ప్రజలను గృహ నిర్భందంలో పెట్టినా- ప్రపంచ దేశాలు ఆయనకు వ్యతిరేకంగా స్పందించడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించటం గమనార్హం. ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్ విషయంలో మోదీ చెప్పేదే నమ్ముతున్నాయి తప్ప తమ ప్రభుత్వం చెప్పేది విశ్వసించడం లేదని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షెహెరియార్ ఖాన్ అఫ్రీదీ బాహాటంగా చెప్పారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌పై ఎదురు దాడి చేసేందుకు మోదీ రూపొందించిన వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది. కశ్మీర్ కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను విడిపించుకోవటం అసలు సమస్య అంటూ మోదీ ప్రారంభించిన ఎదురుదాడికి పాకిస్తాన్ పాలకులు, సైనికులు బెంబేలెత్తుతున్నారు.
పాకిస్తాన్‌తో ఇక మీదట ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చలు జరుపుతామంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న వాదన పాకిస్తాన్ రాజకీయాలను అల్లకల్లోలం చేస్తోంది. పాకిస్తాన్‌లోని ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌పై దాడికి దిగాయి. కశ్మీర్ మన చేతుల నుండి ఎలాగూ జారీ పోయింది, ఆక్రమిత కశ్మీర్‌ను కాపాడుకోవటంపై దృష్టి సారించాలంటూ పాకిస్తాన్ ప్రతిపక్షాలు ప్రధాన మత్రి ఇమ్రాన్ ఖాన్‌కు హితవు చెబుతున్నాయి.
కాగా, వంద రోజుల పాలనలో పలు ముఖ్యమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని అదుపుచేసే అంశంపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదు. దేశ ఆర్థిక రంగాన్ని త్వరలోనే ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న మోదీ దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదనే అంశాన్ని అంగీకరించేందుకు సుముఖత చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో ఆటోపరిశ్రమ, వస్తూత్పత్తి పరిశ్రమ, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ పరిశ్రమలు కుప్పకూలుతున్నాయి. ఒకవైపు ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతుంటే మరోవైపు నిరుద్యోగం బాగా పెరిగిపోతోంది. యువత ఉబర్, ఓలా కార్లలో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారే తప్ప స్వంత కార్లు కొనేందుకు ముందుకు రావటం లేదు, అందుకే ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్థిక మాం ద్యాన్ని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం ఫలితాలను ఇవ్వగలిగే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇలా చౌకబారు ప్రకటనలు చేయటం మంచిది కాదు. మోటారు వాహనాల చట్టంలో తెచ్చిన మార్పులు దేశానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్ట్ఫికెట్, రిజిస్ట్రేషన్ పత్రాలను తమ వెంట తీసుకువెళ్లేందుకు ఇష్టపడని వారిని క్రమశిక్షణలో పెట్టవలసిన అవసం ఎంతైనా ఉన్నది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయరాదు. *

-కె.కైలాష్ 98115 73262