ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అనుసంధాన భాషగా హిందీ ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నత్వంలో ఏకత్వం భారత దేశం ప్రత్యేకత. పలు భాషలు, సంస్కృతులు, విలువలకు నిలయం మన దేశం. అన్ని భాషలూ మనకు ముఖ్యమే. ఏ ప్రాంతం వారు ఏ భాష మాట్లాడినా వారందరినీ అనుసంధానం చేసేందుకు జాతీయ స్థాయిలో ఒక భాష ఎంతో అవసరం. అనుసంధాన భాషను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికం చేయడం ద్వారా భిన్న భాషల మధ్య ఐక్యతను సాధించి తద్వారా భారతీయతను మరింత పటిష్టం చేసుకోవచ్చు. హిందీని జాతీయ భాషగా గుర్తించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సూచన దక్షిణాది రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. తన సూచన వివాదాస్పదం కావటంతో అమిత్ షా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. హిందీని ప్రోత్సహించడం అంటే ఇతర భాషలను నిర్లక్ష్యం చేయడం కాదని, ప్రాధాన్యత తగ్గించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
హిందీని అందరూ నేర్చుకోవాలన్న అమిత్ షా మాటలను తమిళనాడు, కర్నాటక నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. హిందీని నేర్చుకునే ప్రసక్తే లేదంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు నాయకులు తెగేసి చెప్పారు. తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఓటు బ్యాంకు రాజకీయమన్నది అందరకీ తెలిసిందే. హిందీని జాతీయ భాషగా గుర్తించినంత మాత్రాన ప్రాంతీయ భాషలకు అన్యాయం జరుగుతుందని, అవి కనుమరుగైపోతాయని ఆందోళన చెందటం అర్థరహితం. మన దేశాన్ని వందల సంవత్సరాల పాటు పాలించి, మనల్ని బానిసలుగా చూసిన ఇంగ్లీష్‌కు పెద్దపీట వేసేందుకు కొందరు ఇష్టపడుతున్నారు. మన దేశానికి చెందిన హిందీని అనుసంధాన భాషగా గుర్తించేందుకు వారు సుముఖత చూపరు. ఇంగ్లీషుకు ఇచ్చినంత ప్రాధాన్యత మాతృభాషకు ఇవ్వడం లేదనేది పచ్చి నిజం. ఆంగ్లంపై మోజుతో మాతృభాషలను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది బానిస మనస్తత్వానికి అద్దం పడుతోంది.
మన దేశంలో మొత్తం 1369 భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ఇండో-ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషను మాట్లాడే వారు 78 శాతం మంది ఉంటే ద్రావిడ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడే వారు 19.64 శాతం మంది ప్రజలున్నారు. ఆస్ట్రా ఆసియాటిక్, సినోటిబెటన్, టాయి-కడాయి కుటుంబానికి చెందిన భాషను మాట్లాడే వారు 2.31 శాతం మంది ప్రజలున్నారు. దక్షిణ భారతంలో మాట్లాడే ద్రావిడ కుటుంబ భాష అత్యంత పురాతనమైంది. క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నుండి ప్రొటో ద్రావిడ భాషను మాట్లాడుతున్నారు. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం ప్రొటో ద్రావిడ భాష కొలామి-పర్జి, తెలుగు- కు యి, తమిళ-కన్నడ భాష గా విడిపోయింది. ఉత్తర భారత దేశానికి చెందినవి ఇండో- ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలు. పర్షియన్ పదం హింద్ నుండి హిందీ భాష పేరు పుట్టుకలోకి వచ్చింది. ఇండస్ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు మాట్లాడే భాష హిందీ భాష. పదకొండో శతాబ్దంలో భార త దేశంపై దండయాత్ర చేసిన పర్షియన్ భాష మాట్లాడే తురుష్కులు హిం దీ ప్రయోగం చేసినట్లు చరి త్ర చెబుతోంది.
దేశంలోని సుమారు 130 కోట్ల మంది ప్రజల్లో దాదాపు నలభై ఐదు కోట్ల మంది హిందీ భాష మాట్లాడుతారు. ఇరవై కోట్ల మంది ప్రజలున్న ఉత్తరప్రదేశ్‌తోపాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ,బిహార్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతారు. హిందీ భాషలో కూడా పలు మాండడలికాలు, యాసలు, వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ తదితర భాషలకు కూడా ఇండో-ఆర్యన్ భాషనే మూలం. ఇన్ని భాషలు మాట్లాడే ప్రజలున్న మన దేశంలో ఒకరితో మరొకరు మాట్లాడుతుకునేందుకు ఒక కామన్ భాష ఉండవలసిన అవసరం లేదా? ప్రాంతీయ భాషలను కాపాడుకుంటూనే అన్ని భాషలనూ అనుసంధానం చేసే మరో భారతీయ భాష ఉండటం తప్పా? తమిళం మాట్లాడే వ్యక్తి మలయాళం లేదా మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడేందుకు ఇంగ్లీష్‌నే ఎందుకు ఉపయోగించాలి? మన దేశానికి చెందిన మరో భాష అనుసంధాన భాషగా ఉపయోగపడితే తప్పేముంది? హిందీని జాతీయ భాషగా గుర్తించే బదులు అనుసంధాన భాషగా గుర్తించవచ్చు కదా?
భారతీయులను అనుసంధానం చేసేందుకు పరదేశీ భాష ఇంగ్లీష్‌ను ఆమోదిస్తాం కానీ మన దేశానికి చెందిన హిందీని జాతీయ భాషగా ఎందుకు గుర్తించం? ఇంగ్లీష్ భాషను తలకెక్కించుకోవటం మూలంగా ప్రాంతీయ భాషల మనుగడకు ప్రమాదం వస్తోందనే వాస్తవాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారు? చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం అందునా కానె్వంట్లు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు తమ మాతృ భాషలో కొద్దికొద్దిగానే మాట్లాడుతారు తప్ప, దానిపై ఎలాంటి పట్టు ఉండదు. తమ మాతృభాషలో ఈ కాలపుపిల్లలు చదవడం, రా యడం వంటివి చేయలేరు.
దక్షిణాది నాయకులకు హిందీ రాకపోవటంతో వారు జాతీయ రాజకీయాల్లో రా ణించలేకపోతున్నారనేది ఎంతమందికి తెలుసు? హిం దీ మాట్లాడగలిగే దక్షిణాది నాయకులు మాత్రమే ఉత్తరాదిలో రాజకీయం చేయగలుగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో రాణించలేని దక్షిణాది నేతలు ప్రధాని పదవిని దక్కించుకోలేకోతున్నారు. ఉత్తరాదిలోనూ రాజకీయంగా ఎదగాలంటే హిందీ తప్పక రావాలి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాషలో మాట్లాడలేకపోతే జాతీయ నాయకత్వం ఎలా లభిస్తుంది? గుజరాత్ ముఖ్యమంత్రిగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న నరేంద్ర మోదీ రెండు సార్లు ప్రధాని పదవిని చేపట్టటానికి హిందీ భాషపై ఆయనకు మంచి పట్టు ఉండడం కూడా ముఖ్య కారణమే. మోదీకి ఈరోజు నీరాజనాలు పట్టని హిందీ రాష్ట్రం లేదు. తెలంగాణ వాసి అయిన పీవీ నరసింహారావు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి, ప్రధాని పదవి చేపట్టటానికి హిందీ భాష రావటం కూడా కలిసివచ్చిన అంశం.
తమిళభాష అత్యంత ప్రాచీనమైంది కాబట్టి దాన్ని జాతీయ భాష చేయాలంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేస్తున్న వాదనలో పస లేదు. జాతీయ భాషగా లేదా అనుసంధాన భాషగా గుర్తించేందుకు ప్రాచీనతే కొలమానమైతే సంస్కృతాన్ని చేయవచ్చు. అయితే తమిళం లేదా సంస్కృతం మాట్లాడే వారెంతమంది? అనేది ముఖ్యం. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో హిందీ ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నందున దానిని జాతీయ భాషగా లేదా అనుసంధాన భాషగా చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. భారతీయులందరినీ కలిపేందుకు ఇంగ్లీష్ వంటి పరదేశీ భాషపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. హిందీని జాతీయ భాషగా గుర్తిస్తే ప్రాంతీయ భాషల మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదనడానికి చరిత్రే సాక్ష్యం. క్రీస్తు పూర్వం చంద్రగుప్త వౌర్యుడు తమిళనాడు, కేరళ మినహా దేశంలోని అన్ని ప్రాంతలను స్వాధీనం చేసుకుని మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినా వౌర్యుల భాష అందరి భాష కాలేదు.
మరాఠాలు తంజావూరును కూడా పాలించినా అక్కడ తమిళం పోయి మరాఠీ రాలేదు. విజయనగర సామ్రాజ్యం మధుర వరకు విస్తరించిన కన్నడ లేదా తెలుగు తమిళనాట ప్రాంతీయ భాష కాలేదు. ముస్లిం ప్రభువులు ఎంత కర్కశంగా పాలించినా వారి భాష మన భాష కాలేకపోయింది. నిజాం పాలనలో పాఠశాలలన్నీ ఉర్దూను నిర్బంధంగా బోధించినా తెలుగు భాష అంతరించి పోలేదు. గనుక హిందీని అనుసంధాన భాషగా చేసుకుంటే లాభమే తప్ప నష్టం ఉండదు. హిందీని బలవంతంగా రుద్దితే ప్రతిఘటించటం తప్పు కాదు. దేశ ప్రజల సౌలభ్యం కోసం ఒక భాషను ఉపయోగించుకోవటం నేరం కాదు. ప్రాంతీయ భాషలను పరిరక్షించుకుంటూనే హిందీని అనుసంధాన భాషగా అభివృద్ధి చేసుకోగలిగితే దేశమంతా ఒక తాటిపైకి వచ్చినట్లు కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మరింత బలపడుతుంది. ఇంగ్లీష్ లాంటి పరాయి భాషకు వత్తాసు పలికే బదులు హిందీ లాంటి స్వదేశీ భాషకు జైకొట్టటం ఎప్పటికైనా ఉత్తతమే.
*

-కె.కైలాష్ 98115 73262