ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘పీఠం’ కోసం ఇంత దిగజారుడా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి పీఠం కోసం శివసేన పార్టీ మహారాష్టన్రు రాజకీయ సంక్షోభంలో పడవేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మహారాష్ట్ర శాసనసభ పదవీ కాలం ఈనెల 8వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ ఏడో తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్టప్రతి పాలన విధించవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతూ సంకీర్ణ ధర్మాన్ని శివసేన తుంగలో తొక్కుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసిన భాజపాకు 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు లభించాయి. భాజపాకు వచ్చిన సీట్లలో మూడో వంత సీట్లు మాత్రమే శివసేనకు లభించాయి. అయినా తమకు మొదటి రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, మంత్రివర్గంలో సగం పదవులను కేటాయించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే తామీ డిమాండ్ చేస్తున్నామని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చెబుతున్నారు. భాజపా అధినాయకత్వం మాత్రం ఇలాంటి ఒప్పందమేదీ జరగలేదని చెబుతోంది. తక్కువ మంది శాసన సభ్యులు గెలిచిన పక్షానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని విజత గల ఏ రాజకీయ పార్టీ కూడా హామీ ఇవ్వదు, అలాంటి ఒప్పందం కుదుర్చుకోదు. యాభై ఆరుమంది శాసన సభ్యులున్న శివసేన తమకు సీఎం పదవితోపాటు సగం మంత్రి పదవులను కేటాయించాలని డిమాండ్ చేయటం గిల్లిగజ్జాలు పెట్టుకోవటం తప్ప మరోటి కాదు. ఈ డిమాండ్లకు స్పష్టమైన హేతుబద్ధత ఉండాలి. ఎక్కువ మంది శాసన సభ్యులను కలిగి ఉండాలి. ఇలాంటి డిమాండ్లు చేయడం రాజకీయ గూండాయిజమే అవుతుంది.
తొలిసారి శాసనసభకు ఎన్నికైన తన కుమారుడు ఆదిత్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకే ఉద్ధవ్ థాకరే ఇదంతా చేస్తున్నారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన తన కుమారుడికి సీఎం దక్కేలా అవసరమైతే కాంగ్రెస్, ఎన్‌సీపీలతో చేతులు కలిపేందుకు ఉద్ధవ్ సిద్ధపడడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ఠ. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆదిత్యను సీఎం అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఎన్నికల ఫలితాలకు ముందే తన కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడని ఉద్ధవ్ ప్రకటించటం దుష్ట రాజకీయానికి ప్రతీక. శివసేనకు చెందిన వారే ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆదిత్య థాకరే సైతం పలుమార్లు ప్రకటించి, సంకీర్ణ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడాయన 54 సీట్లు గెలిచిన ఎన్‌సిపి, 44 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఉత్సాహపడుతున్నారు. తన డిమాండ్‌కు భాజపా ఒప్పుకోకపోతే ఎన్.సి.పి, కాంగ్రెస్‌తో కలిసి ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయాలన్నది ఉద్ధవ్ ఆలోచన. కుమారుడికి పీఠం దక్కేలా చేసేందుకు భాజపాతో ఉన్న చిరకాల బంధాన్ని వదులుకొనేందుకు కూడా ఆయన తెగిస్తున్నారు. ఉద్ధవ్ ఆదేశాల మేరకు శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను కలిసి మొదటి దఫా చర్చలు జరిపారు. భాజపాపై వత్తిడి పెంచేందుకే సంజయ్ రౌత్ ఈ విధంగా వ్యవహరించారని చాలామంది మొదట భావించినా, అధికారం కోసం ఎన్.సి.పి, కాంగ్రెస్‌లతో శివసేన చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ తర్వాతి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్ధవ్ ఎన్సీపీ అధినేత పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి భాజపాకు షాక్ ఇచ్చారు. తమ డిమాండ్లను ఆమోదించకపోతే ప్రతిపక్షంతో చేతులు కలిపి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమన్న సంకేతాన్ని ఆయన భాజాపాకు పంపారు. ఆదిత్యను సీఎం చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నట్లు శివసేన వ్యవహరిస్తోంది. ఉద్ధవ్ డిమాండ్లను తీర్చేందుకు భాజపా అంగీకరించటం లేదు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మంత్రివర్గంలో కొన్ని ముఖ్యమైన శాఖలను కేటాయించేందుకు భాజపా సుముఖత చూపింది. కేవలం 56 సీట్లున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవితో పాటు సగం మంత్రి పదవులు కేటాయిస్తే గతంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎదురైన చేదు పరిణామాలు తప్పవని భాజపా భయపడుతోంది. గతంలో తక్కువ సీట్లున్న మాయావతిని యూపీ ముఖ్యమంత్రిని చేసి, ఆ తర్వాత భాజపా తగిన గుణపాఠాలు నేర్చుకొంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మాయావతి భాజపాను దెబ్బ తీసేందుకు ప్రయత్నించటం విదితమే.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత, రెండున్నర సంవత్సరాలకు ఆ పదవిని వదలుకునేందుకు శివసేన సిద్ధపడకపోతే భాజపా పప్పులో కాలేసినట్లే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉద్ధవ్ డిమాండ్లను తీర్చేందుకు అంగీకరించే అవకాశం లేదు. అధికారం కోసం కాంగ్రెస్, ఎన్‌సిపిలతో శివసేన చేతులు కలిపితే ఆ పార్టీ పరువు పోవటం ఖాయం. శివసేన అధికారం కోసం కాంగ్రెస్, ఎన్.సి.పిలతో కలిస్తే, భాజపాకు మొదట్లో కొంత నష్టం జరిగినా ఆ తరువాత కలిసి రావచ్చు. ఎన్‌సిపి లేదా కాంగ్రెస్ తమ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శివసేన సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవచ్చు. గతంలో ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మద్దతు ఇవ్వటం అందరికి తెలిసిందే. ఆ తరువాత కొన్ని నెలలకే ప్రధాన మంత్రి చంద్రశేఖర్ తనపై నిఘా పెట్టేందుకు ఇద్దరు కానిసస్టేబుళ్లను పంపించారంటూ రాజీవ్ మద్దతును ఉపసంహరించుకోవటం తెలిసిందే.
ఇప్పుడు కాంగ్రెస్, ఎన్‌సిపిలు శివసేనపై ఇలాంటి రాజకీయం చేసినా ఆశ్చర్యపోకూడదు. శివసేనను అధికారంలోకి తెచ్చిన తరువాత కొన్ని నెలలకే ప్రభుత్వాన్ని కూల్చివేయవచ్చు. మహారాష్ట్ర ఓటర్ల తీర్పు మేరకు కాంగ్రెస్,ఎన్‌సిపిలు ప్రతిపక్షంలో కూర్చోవాలి తప్ప శివసేనకు మద్దతు ఇవ్వటం ద్వారా దొడ్డి దారిన అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించకూడదు. ఓటర్లు భాజపా-శివసేన కూటమికి ఓట్లు వేశారు తప్ప విడివిడిగా ఓట్లు వేయలేదు. భాజపా నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా ఉండాలి తప్ప, శివసేన నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో భాజపా భాగస్వామి కావాలన్నది ఓటర్ల అభిమతం కాదు. ఎన్సీపీ శాసనసభ్యుడు అజిత్ పవార్ ఈ విషయాన్ని అంగీకరించటం గమనార్హం. కాంగ్రెస్, ఎన్‌సిపిలు ప్రతిపక్షంలో కూల్చోవాలన్నదే మహారాష్ట్ర ఓటర్ల తీర్పు. దానిని తాము గౌరవించాలి తప్ప ఇతరాత్రా వ్యవహరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, శరద్ పవార్ తొందరపడి శివసేనకు మద్దతు ఇస్తారని భావించలేము. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు కాంగ్రెస్, ఎన్‌సిపిలు ప్రతిపక్షానికి పరిమితం కావాలి. శివసేన నాయకత్వంలో ఏర్పడే మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం ద్వారా అవకాశవాద రాజకీయాలు చేయటం ఎంత మాత్రం మంచిది కాదు.
అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్న శివసేనకు నైతిక విషయాలేవీ కనిపించటం లేదు. పుత్రప్రేమ ఉద్ధవ్ థాకరే కళ్లు మూసివేసింది. అందుకే ఆయన భాజపాతో తెగేవరకు లాగుతున్నారు. ఎక్కువ సీట్లున్న పార్టీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టటం అత్యంత సహజం. శివసేన ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భాజపా నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామి కావటమే శివసేన కర్తవ్యం. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కూడా శివసేన ఇదే విధంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి పదవితోపాటు సగం మంత్రి పదవులను తమకు కేటాయించాలని పట్టుబట్టి, చివరి క్షణంలో శివసేన కాళ్లబేరానికి వచ్చింది. శివసేన ఇప్పుడు కూడా అలాగే కాళ్లబేరానికి వస్తుందా? లేక తెగేంతవరకు లాగుతుందా? *

-కె.కైలాష్ 98115 73262