ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కుర్చీ కోసం కుతంత్రం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాడిని తనే్నవాడికి తలదనే్నవాడు’ ఎదురైనప్పుడే రాజకీయం రంజుగా ఉంటుంది. మహారాష్టలో అధికారం కోసం కొనసాగుతున్న రాజకీయ చదరంగంలో ఒకరినొకరు ఓడించుకునేందుకు భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతలు నైతిక విలువలను గాలికొదిలేశారు. పదవులే పరమావధిగా జరుగుతున్న మహారాష్ట్ర పరిణామాలు రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జరిపిన ‘రాజకీయ మెరుపుదాడి’లో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలకు దిమ్మతిరిగిపోయేలా గట్టి దెబ్బ తగిలింది. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ప్రయత్నాన్ని భాజపా వమ్ము చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని గంటల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని సమాయత్తమవుతున్న ఉద్ధవ్ థాకరేకు ఆఖరి క్షణంలో అధికార పీఠం చేజారిపోయింది.
ముఖ్యమంత్రి పదవి కోసం చిరకాల మిత్రపక్షమైన భాజపాను పక్కన పెట్టి సిద్ధాంతపరంగా బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఉద్ధవ్ సిద్ధపడడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. రాష్ట్ర రాజకీయాల్లో మరాఠాల ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీతో ఆయన చేతులు కలిపారు. వ్రతం చెడినా ఫలితం దక్కాలి. కానీ ఉద్ధవ్ ఎంతగా దిగిజారినా ముఖ్యమంత్రి పదవి మాత్రం చేతికందినట్లే వచ్చి దూరమైపోయింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగినప్పటి నుండి ఆయన అవకాశవాద రాజకీయాలే చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు భాజపా-శివసేన నాయకత్వంలోని కూటమికి మెజారిటీ సీట్లు ఇవ్వగా, ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్, ఎన్‌సీపీలతో శివసేన జోడీ కట్టింది. ఇది నిజంగా భాజపాకు శివసేన వెన్నుపోటు పొడిచినట్టే అవుతుంది.
ప్రేమ వ్యవహారంలో, యుద్ధంలో ఏదైనా చేయవచ్చుననే వాదన ఒకటున్నది. శివసేన అధికారం కోసం కాంగ్రెస్, ఎన్‌సీపీలతో చేతులు కలపగా, భాజపా తన పంతం నెగ్గించుకునేందుకు ఎన్‌సీపీ నాయకుడైన అజిత్ పవార్‌ను తనవైపు తిప్పుకుంది. ఫలితంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చీలిక అనివార్యమవుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఎన్‌సీపీని ముక్కలు చేయడంతో పాటు, ఉదయం ఐదున్నర గంటలకు మహారాష్టల్రో రాష్టప్రతి పాలనను తొలగించి, ఎనిమిది గంటల ప్రాంతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమించేలా చర్యలు తీసుకొని భాజపా ‘రాజకీయ మెరుపుదాడి’కి పాల్పడింది. కశ్మీర్‌లోని పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ వాహనాలపై చేసిన దాడికి ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌లోని బాలాకోట్ వద్ద ఉగ్రవాదుల శిబిరంపై విమా న దాడి చేయించడం తెలిసిందే.
ముఖ్యమంత్రి పదవి కో సం తమ కూటమికి వెన్నుపోటు పొడిచి, ఎన్‌సీపీ- కాంగ్రెస్‌లతో చెలిమికి సిద్ధపడిన శివసేనపై మోదీ మెరుపుదాడి చేయించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలసి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పత్రాలను సమర్పించవలసి ఉంది. అయితే, వారికి గవర్నర్‌ను కలిసే అవకాశం ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికపై ఫడ్నవీస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా భాజపా నాయకత్వం చురుగ్గా పావులు కదిపింది. భాజపా చేసిన ఈ దుందుడుకు చర్యను ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. ఫడ్నవీస్‌ను సీఎం పదవి నుంచి తొలగించి, తమకు అవకాశం ఇవ్వాలని శివసేన-ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతలు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.
శివసేనతో కాంగ్రెస్, ఎన్‌సీపీలు చేతులు కలపడం ఎంతవరకు సమర్థనీయం? శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడడం రాజకీయంగా సమంజసమైతే- అజిత్ పవార్‌తో చేతులు కలిపి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా అంతే సమంజసం అవుతుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు చేసింది తప్పయితే ఇప్పుడు భాజపా చేసింది కూడా తప్పే అవుతుంది. అయితే రాజకీయ దిగజారుడుతనంతో మొదటి తప్పు ఎవరు చేశారనేది ముఖ్యం. మహారాష్ట్ర ప్రజలు భాజపా-శివసేన నాయత్వంలోని కూటమికి మాత్రమే అధికారం దక్కాలని తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం సంకీర్ణ ధర్మాన్ని ఉల్లంఘించి కాంగ్రెస్, ఎన్‌సీపీలతో శివసేన చేతులు కలిపి ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇదేవిధంగా కాంగ్రెస్,ఎన్‌సీపీలు మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాలన్నది రాష్ట్రప్రజల అభీష్టం. తాము ప్రతిపక్షంలో కూర్చోవాలన్నది ప్రజల అభీష్టమనే వాస్తవాన్ని ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్ పత్రికాముఖంగా అంగీకరించారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాబట్టి తాము దానికే కట్టుబడి ఉంటామని ఆయన పలుమార్లు ప్రకటించటం తెలిసిందే. ప్రజల మనోభావాలను ఇంత బాగా అర్థం చేసుకున్న శరద్ పవార్ అధికారం కోసం శివసేనతోఎందుకు చేతులు కలిపారు? తాచెడిన కోతి వనమంతా చెరిచినట్లు శరద్ పవార్ తాను చెడిపోవటంతోపాటు సోనియా గాం ధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ను చెడగొట్టారు. సిద్ధాంతపరంగా తమకు బద్ధ శత్రువైన శివసేన నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సోనియా గాంధీకి ఎంత మాత్రం ఇష్టం లేదనేది పచ్చి నిజం. శివసేనకు మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదనను ఆమె మొదట్లోనే తిరస్కరించారు. అయితే శివసేన, శరద్ పవార్ చేసిన ‘మరాఠా’ రాజకీయానికి సోనియా తలవంచక తప్పలేదని చెప్పాలి. సోనియా ఏ మాత్రం వెనకడుగు వేసినా కాంగ్రెస్‌కు చెందిన 44 మంది శాసనసభ్యులలో దాదాపు ఇరవై ఐదు మంది మరాఠా శాసన సభ్యులు శివసేనతో చేతులు కలిపేవారు. మహారాష్టల్రో కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకు ఆమె శివసేనతో ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించారు. ఈమేరకు శరద్ పవార్ ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీని ఒప్పించడం అందరికీ తెలిసిందే.
భాజపా-శివసేన కూటమికి ప్రజలు ఓట్లు వేశారనే సత్యాన్ని గ్రహించిన శరద్ పవార్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు, భాజపా తన అధికారాన్ని నిలుపుకునేందుకు తెల్లవారు జామున మెరుపుదాడి చేస్తే తప్పేమిటి? శివసేన నాయకత్వంలో పని చేయడం ఇష్టం లేని అజిత్ పవార్ భాజపాతో చేతులు కలిపితే తప్పేమిటి? అజిత్ పవార్ చేసింది వెన్నుపోటైతే, మరి శివసేన నేతలు భాజపాకు చేసిందేమిటి? ‘వెన్నుపోటుకు వెన్నుపోటు’ ద్వారా సమాధానం ఇవ్వడం రాజకీయంగా ఎంత మాత్రం తప్పుకాదు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎన్‌సీపీలోనే కాకుండా శరద్ పవార్ కుటుంబంలో సైతం చీలిక వచ్చింది. అయితే అజిత్ పవార్ చేసింది ఆయన సొంత ఆలోచనతో కూడిన వ్యూహం కాదు.
37 సంవత్సరాల క్రితం శరద్ పవార్ ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన రాజకీయ ఎత్తుగడను ఇప్పుడు అజిత్ పవార్ ప్రయోగించారు. వసంత్‌దాదా పాటిల్ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శరద్ పవార్ ముఖ్యమంత్రి పదవి కోసం 90 సీట్లున్న జనతా పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన సంఘటన అప్పట్లో దేశ రాజకీయాలను కుదిపివేసింది. 1978లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. జనతా పార్టీకి 90 సీట్లు రాగా కాంగ్రెస్‌లోని రెండు చీలిక వర్గాలైన కాంగ్రెస్, ఇందిరాకాంగ్రెస్‌కు కలిపి 130 సీట్లు లభించాయి. వసంత్‌దాదా పాటిల్ ఇతర చిన్న పార్టీల మద్దతుతో అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శరద్ పవార్ ముఖ్యమంత్రి పదవి కోసం జనతా పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. అజిత్ పవార్ ఇప్పుడు ఎన్‌సీపీని చీల్చడం ద్వారా శివసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారు. భాజపాతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి పదవి సంపాదించుకున్నారు.
1978లో శరద్ పవార్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్లేటు ఫిరాయిస్తే ఇప్పుడు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని ముక్కలు చేశారు. ఇలా మహారాష్టల్రో రాజకీయ కుతంత్రం పునరావృతం కావడంతో పాటు ‘చెరపకురా చెడేవు’ అన్న నానుడి మరోసారి రుజువైంది.
*

-కె.కైలాష్ 98115 73262